వీడని ముంపు | Godavari River Floods At Tribal Area And Konaseema Villages In East Godavari | Sakshi
Sakshi News home page

వీడని ముంపు

Published Tue, Sep 10 2019 7:52 AM | Last Updated on Tue, Sep 10 2019 7:52 AM

Godavari River Floods At Tribal Area And Konaseema Villages In East Godavari - Sakshi

వరద నీటిలో మునిగిన దేవీపట్నం ప్రధాన వీధులు

రెండు నెలల్లో వరుస వరదలు...జిల్లా యంత్రాంగం ముందస్తు చర్యలు తీసుకుంటున్నా పైన కురిసిన వర్షాల కారణంగా వరద నీరు వీధుల్లోకి,ఇళ్లల్లోకి రావడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. జిల్లాలో ఏజెన్సీ ప్రాంతం, కోనసీమ మండలాల్లో ఈ ముంపు ముప్పు వెంటాడుతోంది.

సాక్షి, రాజమహేంద్రవరం : వరద గోదావరి ఉగ్రరూపంతో మన్యంలో గిరిజనులు, కోనసీమలోని లంకవాసులు చిగురుటాకుల్లా వణికిపోతున్నారు. ఈ సీజన్‌లో మూడోసారి వరదలు రావడంతో జిల్లావాసులకు కంటిపై కునుకులేకుండా చేస్తోంది. ఎగువన కురుస్తున్నభారీ వర్షాలకుతోడు నదులు పొంగి ప్రవహిస్తుండటంతో జిల్లాపై ప్రభావం చూపిస్తున్నాయి. వరుస వరదలతో ముంపులో ఉన్న గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. పోలవరం నిర్వాసితులకు పునరావాసం కల్పించకుండా అనాలోచితంగా నిర్మించిన కాఫర్‌ డ్యామ్‌ రంపచోడవరం ఏజెన్సీలోని దేవీపట్నం పరిసర గ్రామాలను వరదతో ముంచేసింది. రెండు రోజులుగా వరద నీటిలో నానుతున్న మన్యం వాసుల్లో ఆందోళన నెలకొంది. సోమవారం సాయంత్రానికి ఎగువన భద్రాచలం వద్ద వరద తగ్గుముఖం పట్టినా మంగళవారం మధ్యాహ్నం వరకూ జిల్లాలో ఇప్పుడున్న పరిస్థితే కొనసాగుతుందని ఇరిగేషన్‌ అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాను వరద ముంపు మరో 24 గంటల వరకూ వీడేలా లేదు.

ఉదయం నుంచి ఉగ్రరూపం దాల్చిన వరద గోదావరి సాయంత్రం శాంతించి స్వల్పంగా తగ్గుతూ వస్తోంది. దేవీపట్నం పరిసర 36 గ్రామాలు ఇప్పటికీ వరద ముంపులోనే ఉన్నాయి. భద్రాచలం వద్ద 51.2 అడుగుల వద్దకు చేరిన నీటి మట్టం సోమవారం సాయంత్రం నుంచి స్వల్పంగా తగ్గుముఖం పట్టి 47.90 అడుగులకు చేరింది. ధవళేశ్వరం వద్ద రాత్రి ఏడు గంటలకు 15.20 అడుగులకు నీటి మట్టం చేరుకోగా రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. మంగళవారం మధ్యాహ్నానికి ఉపసంహరించే అవకాశం ఉంది. ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజీ వద్ద నుంచి 14లక్షల 81వేల 674 క్యూసెక్కులు మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఈ సీజన్‌లో ఇప్పటి వరకూ 2479 టీఎంసీల మిగులు జలాలు వృథాగా కడలిపాలయ్యాయి. సోమవారం ఒక్క రోజు  సముద్రంలోకి వృథాగా పోయిన  128 టీఎంసీల నీటితో ఒక ఖరీఫ్‌ లేదా, ఒక రబీ పంటను జిల్లాలో సాగుచేసుకోవచ్చు. ఇది పోలవరం ప్రాజెక్టు నిల్వ సామర్థ్యంతో సమానం.

ఏజెన్సీలో...
దేవీపట్నం ప్రధాన రహదారి నీట మునిగింది. చినరమణయ్యపేట–దేవీపట్నం, దండంగి–పురుషోత్తపట్నం రోడ్లు ముంపులో ఉండటంతో పూర్తిగా రాకపోకలు స్తంభించాయి. పోసమ్మగండి వద్ద అమ్మవారి మండపాన్ని తాకుతూ వరద గోదావరి ప్రవహిస్తుంది. అమ్మవారి విగ్రహం పూర్తిగా మునిగిపోయింది. దేవీపట్నం పరిసర ప్రాంతాల్లో 1200 ఇళ్లు వరద నీటిలో చిక్కుకోవడంతో 2500 కుటుంబాలు ముంపులో ఉన్నాయి. ఈ గ్రామాల్లో 22 పాఠశాలలు మూతపడ్డాయి. రెవెన్యూ అధికారులు భోజనా లు వెలుగు సిబ్బంది ద్వారా వరద బాధితులకు పంపిణీ చేశారు. సెక్టోరియల్‌ అధికారులు పరిస్ధితిని సమీక్షిస్తూ వరద బాధితులకు మంచినీటి ప్యాకెట్లు, ఆహార పదార్ధాలు పంపిణీ చేశారు. రంపచోడవరం మండలం బొర్నగూడెం వసతిగృహానికి రావాలని నిర్వాసితులను అధికారులు కోరగా బాధితులు అంత దూరం రాలేమని దేవీపట్నం శివాలయం, హైస్కూల్, వీరవరం మండల కార్యాలయం వద్ద కొందరు ఉండిపోయారు.

మూలపాడు, అగ్రహారం, పెనికలపాడు, కచ్చులూరు. ఏనుగులగూడెం, గానుగులగొంది తదితర గ్రామాల గిరిజనులు కొండలపై సురక్షితంగా తలదాచుకున్నారు. చింతూరు వద్ద శబరి నదికి గోదావరి బ్యాక్‌ వాటర్‌ రావడంతో  చింతూరు–వీఆర్‌ పురం, ఆంధ్రా–ఒడిశాల మధ్య రహదారులు నీట మునిగి రాకపోకలు నిలిచిపోయాయి. విలీన మండలాల్లో 17 గ్రామాలు జలదిగ్భంధంలో ఉన్నాయి. శబరి వద్ద నీటిమట్టం 38 అడుగులు వద్ద నిలకడగా ఉంది. వరద నీరు రోడ్డుపైకి రావడంతో కూనవరం–భద్రాచలం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. 

లంకల్లో పంటలకు దెబ్బమీద దెబ్బ...
వరదలు లంక రైతులను తీవ్రంగా దెబ్బతీశాయి. ఒక్క కొత్తపేట నియోజకవర్గంలో సుమారు 2,500 ఎకరాల లంక భూముల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఊబలంక, రావులపాలెం, కొమరాజులంక, వశిష్ట గోదావరి చేరి ఉన్న ఎల్‌ పోలవరం, పొడగట్లపల్లి, గోపాలపురం గ్రామాల్లో అరటి, కంద, కూరపాదులకు తీరని నష్టం కలిగింది. ఆలమూరు మండలం బడుగువానిలంక చుట్టూ వరదనీరు చేరింది. మడికి, మూలస్థాన అగ్రహారం, జొన్నాడ, చొప్పెల్ల గ్రామాల పరిధిలోని సుమారు 500 ఎకరాల్లోని లంకభూముల్లో ఉద్యాన పంటలు నీటమునిగి రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆత్రేయపురం మండలం పిచ్చుకలంక, వద్దిపర్రు, రాజవరం, ఆత్రేయపురం, వెలిచేరు, వాడపల్లి, వానపల్లి శివారు నారాయణలంక, సత్తెమలంక, నక్కావారిపేట, మందపల్లి, వాడపాలెం, కేదార్లంకల్లో సుమారు 500 ఎకరాల్లో  అరటి, కంద, పసుపు, బొప్పాయి పంటలు నీటమునిగాయి. కపిలేశ్వరపురం మండలం అద్దంకివారిలంక శివారు పల్లపులంక, నారాయణ లంకలలోని పొలాలు మునిగిపోగా కేదారిలంక ఇటుక బట్టీలు నీటమునిగాయి.

కె .గంగవరం మండలం కోటిపల్లి మత్స్యకార కాలనీ నీటమునిగి సుమారు 50 ఇళ్లు ముంపులో చిక్కుకున్నాయి. కోటిపల్లి–ముక్తేశ్వరం పంటు ప్రయాణాన్ని నిలిపివేయగా, కోటిపల్లి నుంచి మసకపల్లి, బ్రహ్మపురి వరకు ఏటిగట్టు లంకభూముల్లో ఉన్న బొప్పాయి, అరటి, కొబ్బరి తోటల నీటమునిగాయి. పి.గన్నవరం నియోజకవర్గ పరిధిలోని ఊడిమూడిలంక, జి.పెదపూడిలంక, అరిగెలవారిలంక, బూరుగులంక గ్రామాల ప్రజలు పడవలపై రాకపోకలు సాగిస్తున్నారు. మానేపల్లి శివారు శివాయిలంక, పల్లెపాలెం, ఏనుగుపల్లిలంక, మొండెపులంక, అప్పనపల్లి, బి.దొడ్డవరం, పెదపట్నంలంక, పెదపట్నం గ్రామాలతోపాటు పాశర్లపూడి, పాశర్లపూడిలంక గ్రామాల్లో ప్రజలు వరదతో ఇబ్బంది పడుతున్నారు. అయినవిల్లిలంక, వీరవల్లిపాలెం, పొట్టిలంక, కొండుకుదురులంక, శానపల్లిలంక, తొత్తరమూడి కె.పెదలంక, చింతనలంక, మడుపల్లెలంక ప్రాంతాల ప్రజలు వరదతో అవస్థలు పడుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement