
అయినవిల్లి మండలం ముక్తేశ్వరం – అయినవిల్లిలంక మధ్య వెదురుబీడిం వద్ద కాజ్‌వేపై రహదారి మునగడంతో నాటు పడవలపై బాధితుల రాకపోకలు
మూడు రోజులుగా ఏజెన్సీ, కోనసీమ ప్రాంతాల్లోని ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేసిన గోదావరి వరద మంగళవారానికి కొంత శాంతించింది. నిన్నటి వరకూ వరద ఉధృతి తగ్గకపోవడంతో ఆందోళన చెందిన బాధితులకు అధికార యంత్రాంగం అందించిన చేయూత భరోసానిచ్చింది.
సాక్షి, అమలాపురం : ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు ఉగ్రరూపం దాల్చి ఊళ్లను ముంచెత్తిన వరద గోదావరి తగ్గుముఖం పట్టింది. మూడు రోజులుగా ఉధృతంగా ప్రవహించి దేవీపట్నం, విలీన మండలాల్లోని దాదాపు 56 గ్రామాలను వరద నీరు చుట్టుముట్టింది. మూడు నదీపాయలతో 50కి పైగా లంక గ్రామాలతో ఉన్న కోనసీమ వరద ఉధృతికి గత మూడు రోజులుగా అతలాకుతలమవుతోంది. మంగళవారం సాయంత్రానికి భద్రాచలం వద్ద నీటిమట్టం మూడు అడుగుల మేర తగ్గడంతో జిల్లా ఏజెన్సీ ప్రజలు వరదల భయం నుంచి కాస్త ఉపశమనం పొందుతున్నారు. కోనసీమ దిగువన అంటే సముద్ర తీరంలో ఉండడంతో ఎగువన వరద నీరంతా చివరకు ఈ సీమ నుంచే సముద్రంలో కలిసే పరిస్థితి ఉండడంతో ఈ ప్రాంతంలోని 48 లంక గ్రామాలు వరద ఉధృతితో మంగళవారం రాత్రి వరకూ చిగురుటాకుల్లా అల్లాడిపోతూనే ఉన్నాయి. ప్రజలు వదర భయంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఏటిగట్లపై పాడి పశువులతో పాటు వచ్చి వాటికి కాపలాగా కంటి మీద కునుకు లేకుండా గడుపుతున్నారు.
⇔ మామిడికుదురు మండలం అప్పనపల్లి కాజ్‌వే, అయినవిల్లి మండలం తొగరపాయ ఎదురుబిడిం వద్ద కాజ్‌వేలు వదర నీటితో పొంగిపొర్లుతున్నాయి. రాకపోకలలు నిలిచిపోయాయి.
⇔ పి.గన్నవరం మండలం జి.పెదపూడిలంక, ఊడిమూడి లంక, ముమ్మిడివరం మండలం సలాదివారిపాలెం, కమిని తదితర 17 లంక గ్రామాల ప్రజలు వేరే దారి లేక పడవలపైనే ప్రమాదం అంచున ప్రయాణాలు చేస్తున్నారు.
⇔ ధవళేశ్వరం బ్యారేజి నుంచి మంగళవారం మధ్యాహ్నం తర్వాత 2 గంటలకు 14,59,000 క్యూసెక్కుల వరద నీరును సముద్రంలోకి వదిలితే... అదే రాత్రి 7 గంటలకు కాస్త శాంతించడంతో 11,39000 క్యూసెక్కులు నీటిని విడుదల చేశారు.
⇔ కోనసీమలో బుధవారం కూడా వరద పరవళ్లు తప్పవు. ఎందుకంటే ఎగువ వరద నీటి ప్రవాహం మంగళవారం రాత్రి నుంచి తెల్లారే దాకా కూడా దిగువకు వచ్చే అవకాశం ఉంటుంది. దీంతో వరద ప్రభావం బుధవారం కూడా అలాగే ఉండే అవకాశం ఉంది. గురు, శుక్రవారాల్లో వదర నీరు తగ్గుతూ మరో మూడు రోజుల తరువాతగానీ సాధారణ పరిస్థితికి రాదు.
వరద నుంచి బయటపడుతున్న 56 ఏజెన్సీ గ్రామాలు
వరదలకు ఏజెన్సీలోని దేవీపట్నం, చింతూరు మండలాల్లో తీవ్రత ఎక్కువగా కనిపించింది. దేవీపట్నం మండలం తొయ్యేరు, పూడిపల్లి, పెనికలపాడు, మంటూరు తదితర గ్రామాలను గోదావరి ముంచెత్తడంతో ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకున్నారు. మండలంలో 36 గ్రామాలు వరద తాకిడికి గురయ్యాయి. గండిపోశమ్మ ఆలయం వద్ద వరద నీరు ముంచెత్తడంతో అమ్మవారి ఆలయ ప్రాంగణం మొత్తం వరద నీటిలో మునిగింది. పూర్తిగా నీట మునిగిన అమ్మవారి విగ్రహం ఇంకా బయటపడ లేదు. అయితే మంగళవారం సాయంత్రం నుంచి తగ్గుముఖం పట్టడంతో బుధవారం నాటికి దేవీపట్నం వీధుల్లో వరద నీరు తగ్గే అవకాశం ఉంది. ఇక చింతూరు మండలంలోని 20 గ్రామాలను వదర నీరు చుట్టు్టముట్టింది. మంగళవారం తగ్గుముఖంగా అయిదు గ్రామాల నుంచి గోదావరి జలాలు వెనక్కి మళ్లడంతో ప్రజలు ఊపిరి పీల్చుకునేలా చేసింది. మిగిలిన 15 గ్రామాలు ఇంకా వరద నీటి దిగ్భంధంలోనే ఉన్నాయి. బుధవారం ఉదయానికి ఈ గ్రామాలను చుట్టుముట్టిన నీరు తగ్గే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
మంత్రుల బృందం సందర్శన, పర్యవేక్షణ
రాష్ట్ర మంత్రులు ఆళ్ల నాని, కురసాల కన్నబాబు, తానేటి వనిత, పినిపే విశ్వరూప్‌తోపాటు జిల్లా ఎంపీలు భరత్, అనురాధ, గీత, రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ జక్కంపూడి రాజా, పలువురు ఎమ్మెల్యేలు మంగళవారం జిల్లా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి వరద పరిస్థితులను స్వయంగా సమీక్షించారు. జిల్లా కలెక్టర్ మురళీధర్‌రెడ్డి కూడా మంత్రుల బృందంతో ఉండి జిల్లా వరద పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమీక్షించారు.
కొనసాగుతున్న నిఘా
గోదావరి వరద కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ జిల్లా అధికార యంత్రాంగం మాత్రం అప్రమత్తతతోనే వరద ప్రభావిత గ్రామాల్లోనే ఉండి పరిస్థితులను సమీక్షిస్తూ ఉన్నతాధికారులకు నివేదికలు, సమాచారం ఇస్తున్నారు. మండల ప్రత్యేక అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలతోపాటు పోలీసు, అగ్ని మాపక, విద్యుత్తు తదితర శాఖల అధికారులు, వీఆర్వోలు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ ప్రజలకు తగు సూచనలిస్తున్నారు.
పి.గన్నవరం మండలం కె.ఏనుగుపల్లిలో నీట మునిగిన అంగన్‌వాడీ భవనం
గండి పోశమ్మఆలయం వద్ద వరద గోదావరి

ధవళేశ్వరం బ్రిడ్జిపై వరదను పరిశీలిస్తున్న మంత్రులు ఆళ్ల నాని, విశ్వరూప్ తదితరులు