వేధింపులను సహించం...అక్రమ కేసులకు భయపడం
కలసికట్టుగా ప్రజాసమస్యలపై పోరాడుదాం
వైఎస్సార్ సీపీ రాష్ట్ర, జిల్లా నేతల ఉద్ఘాటన
పార్టీలో 600 మంది చేరిక
వందలాది మందితో సాగిన బైక్ ర్యాలీ
అమలాపురం టౌన్/పి.గన్నవరం (పి.గన్నవరం) : చంద్రబాబు నాయుడు ప్రభుత్వం జిల్లాల్లో పోలీసులను అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేస్తోందని.. వైఎస్సార్ సీపీ నాయకులను, కార్యర్తలను టార్గెట్ చేసి పాల్పడుతున్న వేధింపులను ఇక సహించబోమని, అక్రమ కేసులకు భయపడబోమని పార్టీ రాష్ట్ర, జిల్లా నేతలు హెచ్చరించారు. పి.గన్నవరంలో నియోజకవర్గ కో ఆర్డినేటర్ కొండేటి చిట్టిబాబు అధ్యక్షతన వైఎస్సార్ సీపీ బహిరంగ సభ జరిగింది. నియోజకవర్గం నుంచి యువజన నాయకులు ఉలిశెట్టి బాబి, పిల్లి శ్రీనివాస్‌ల ఆధ్వర్యంలో 600 మంది వైఎస్సార్ సీపీలో చేరడం.. ఉవ్వెత్తున లేచిన కెరటంలా అంబాజీపేట నుంచి పి.గన్నవరం దాకా సాగిన యువకుల బైక్ ర్యాలీతో నియోజకవర్గ పార్టీకి కొత్త ఊపు, ఉత్సాహం చోటుచేసుకుంది. బహిరంగ సభకు జిల్లా పార్టీ అధ్యక్షుడు కురసాల కన్నబాబు, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా, పార్టీ సీజీసీ సభ్యుడు కుడుపూడి చిట్టబ్బాయి వంటి నేతలు పాల్గొని తమతమ ప్రసంగాలతో పార్టీ కార్యకర్తలతో కొత్త ఉత్సాహాన్ని నింపారు. పార్టీ అద్యక్షుడు కన్నబాబు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు, అతని తనయుడు మంత్రి లోకేష్ పనితీరే మనకు రేపు అవకాశాలు కల్పిస్తున్నట్టుగా సంకేతాలు స్పష్టంగా ఉన్నాయని పేర్కొన్నారు. జిల్లాలో ప్రజా సమస్యలపై పోరాడుతున్న పార్టీ నాయకులు, కార్యకర్తలపై అధికార పార్టీ పోలీసులను అడ్డుపెట్టుకుని రౌడీ షీటర్లు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ వంటి అక్రమ కేసులు పెట్టి వేధిస్తోందన్నారు. జిల్లాలో పోలీసు కేసుల పరంగా ఏ కార్యకర్తకు అన్యాయం జరిగినా మొత్తం జిల్లా పార్టీ అండగా నిలిచి వారికి మానసిక భరోసా ఇస్తుందని హామీ ఇచ్చారు. సోషల్ మీడియాను అణగదొక్కేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, తనకు అనుకూలమైన మీడియాతో మన పార్టీపై బురద జల్లే ప్రయత్నం చేస్తోందని కన్నబాబు అన్నారు. వీటిని వ్యూహత్మకంగా ఎదుర్కొనేందుకు జిల్లాలో ప్రతి కార్యకర్త ఒక మీడియాగా మారాలని పిలుపునిచ్చారు.
రాష్ట్ర యువజన విభజన అధ్యక్షుడు రాజా మాట్లాడుతూ 2014 ఎన్నికల్లో మాదిరిగా ఈ సారీ ఎన్నికల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు అతి విశ్వాసం, అతి నమ్మకానికి పోవద్దని హితవు పలికారు. ఈ సారి ఎన్నికల్లో జగన్‌ను ముఖ్యమంత్రి చేయడమే ధ్యేయంగా మనం సంఘటితంగా పనిచేయాలని సూచించారు. పార్టీ సీజీసీ సభ్యుడు కుడుపూడి చిట్టబ్బాయి మాట్లాడుతూ పార్టీ కార్యకర్తలకు అండగా నిలిచేది వైఎస్సార్ సీపీ మాత్రమే ఆయన స్పష్టం చేశారు. రాజమహేంద్రవరం గ్రేటర్ పార్టీ కన్వీనర్ మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్, మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరీదేవి మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వంలో అవినీతి, అక్రమాలు విపరీతంగా పెరిగాయని, ఇదే విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లి వివరించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు వలవల బాబ్జి, రాష్ట్ర ప్రచార కార్యదర్శి రావూరి వెంకటేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శులు మిండుగుదిటి మోహన్, చెల్లుబోయిన శ్రీనివాసరావు, కర్రి పాపారాయుడు, కర్రి నాగిరెడ్డి, కొల్లి నిర్మలాకుమారి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అడ్డగళ్ల వెంకట సాయిరామ్ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో వైఎస్ జగన్‌ను ముఖ్యమంత్రి చేయడమే లక్ష్యంగా అందరం కలిసికట్టుగా పనిచేద్దామని పిలుపునిచ్చారు. ముమ్మిడివరం, మండపేట నియోజకవర్గ పార్టీ కో ఆర్డినేటర్ పితాని బాలకృష్ణ, వేగుళ్ల పట్టాభిరామయ్య, జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు మట్టపర్తి మురళీకృష్ణ, జిల్లా పంచాయతీ రాజ్ విభాగం అధ్యక్షుడు హరినాథ్‌బాబు, జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి దొమ్మేటి వెంకట శివరామన్, రాష్ట్ర నాయకులు దొమ్మేటి సాయికృష్ణ, కొర్లపాటి కోటబాబు, పేరి శ్రీనివాస్, జక్కంపూడి వాసు, గుత్తుల నాగబాబు, మెల్లం మహలక్ష్మి ప్రసాద్, నల్లి డేవిడ్ తదితరులు సభలో ప్రసంగించారు.
పార్టీలో చేరికలు, మోటర్ సైకిళ్ల ర్యాలీలు
నియోజకవర్గానికి చెందిన దాదాపు 600 మంది టీడీపీ, కాంగ్రెస్ తదితర పార్టీల నాయకులు, కార్యకర్తలు జిల్లా అధ్యక్షుడు కన్నబాబు, రాష్ట్ర నాయకులు రాజా, చిట్టబ్బాయిల సమక్షంలో కో ఆర్డినేటర్ కొండేటి చిట్టిబాబు ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి పార్టీ నాయకులు కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అంతకుముందు అంబాజీపేట సెంటర్ నుంచి మాచవరం, ముంగండ, పోతవరం మీదుగా పి.గన్నవరం వరకూ భారీ మోటారు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. పార్టీ జెండాల రెపరెపల మధ్య జై జగన్ అనే నినాదాలు హోరెత్తాయి.