Mamidikuduru
-
ఐదేళ్లు ప్రేమించుకున్నారు.. పెళ్లి చేసుకుందామని యువతిని అడిగితే..
సాక్షి, మామిడికుదురు (తూర్పుగోదావరి): వారిద్దరిదీ ఒకే గ్రామం. ఒకే కులం. ఐదేళ్ల నుంచి ఎంతో గాఢంగా ప్రేమించుకుంటున్నారు. చివరకు అతడిని పెళ్లి చేసుకునేందుకు యువతి అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో ఆ యువకుడు శుక్రవారం వైనతేయ వారధిపై నుంచి గోదావరి నదిలో దూకి గల్లంతయ్యాడు. ఈ సంఘటన పూర్వాపరాలివీ.. మొగలికుదురు గ్రామానికి చెందిన బిళ్ల సూర్యప్రతాప్ (22) విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. తన గ్రామానికే చెందిన యువతిని కొంత కాలంగా ప్రేమిస్తున్నాడు. ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండే వారని స్థానికులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా ఆ యువతికి వేరే యువకుడితో పెళ్లి కుదిరింది. ప్రతాప్‌ను పెళ్లి చేసుకోవాలని అతడి కుటుంబ సభ్యులు కోరినప్పటికీ ఆ యువతి కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. పైగా నగరం పోలీస్ స్టేషన్లో యువతి తండ్రి ఫిర్యాదు కూడా చేశారు. సూర్యప్రతాప్తో తన కుమార్తె చేసిన చాటింగ్, అతడితో కలిసి ఉన్న ఫొటోలు డిలీట్ చేయాలని, తన కుమార్తె జోలికి రాకుండా చూడాలని కోరాడు. దీనిపై గురువారం రాత్రి పోలీసులు ప్రతాప్‌కు కౌన్సిలింగ్ ఇచ్చారు. అతడి సెల్‌ఫోన్ తీసుకుని ఫొటోలు, మెసేజ్‌లు డిలీట్ చేశారు. ఈ నేపథ్యంలో ఆ యువతి ప్రేమ పేరుతో తనను మోసం చేసిందని, తన చావుకు ఆమె, ఆమె తండ్రి కారణమని సెల్లో మెసేజ్ చేసిన సూర్యప్రతాప్ పాశర్లపూడి బ్రిడ్జిపై సెల్‌ఫోన్ పెట్టి వైనతేయ గోదావరి నదిలో దూకేశాడు. అతడి ఆచూకీ కోసం నగరం ఎస్సై షేక్ జానీబాషా ఆధ్వర్యంలో పోలీసులు గాలింపు చేపట్టినా ప్రయోజనం లేకుండా పోయింది. వరద కారణంగా గోదావరి చాలా ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో సూర్యప్రతాప్ ఆచూకీ తెలియరాలేదు. యువకుడి తండ్రి బిళ్ల గణపతిరావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (Tirupati: ప్రయాణికులకు పది ప్రత్యేక రైళ్లు) -
పుంగనూరు గిత్తలా.. మజాకా!
మామిడికుదురు: పుంగనూరు జాతికి చెందిన కవల గిత్తలను కొనేందుకు పలు ప్రాంతాల నుంచి రైతులు క్యూ కడుతున్నారు. ఒక్కో గిత్తను రూ.లక్షకు కొనేందుకు కూడా వారు వెనుకాడటం లేదు. తూర్పుగోదావరి జిల్లా పాశర్లపూడికి చెందిన రైతు అడబాల నాగేశ్వరరావుకు చెందిన దేశవాళీ ఆవు మొదటి ఈతలో పుంగనూరు జాతికి చెందిన కవల గిత్తలకు జన్మనిచ్చింది. అచ్చమైన తెలుపు వర్ణంలో ఉండటంతో వాటికి ఎనలేని డిమాండ్ వచ్చింది. మూడు నెలల వయస్సున్న ఒక్కో కవల కోడె దూడ ధర రూ.లక్ష పలుకుతోంది. ఆ కవల గిత్తలను కొనేందుకు వివిధ ప్రాంతాల నుంచి రైతులు ఇక్కడకు వస్తున్నారు. చెన్నై, భీమవరం, రాజమహేంద్రవరం, సఖినేటిపల్లి, బెండమూర్లంక తదితర ప్రాంతాల నుంచి రైతులు క్యూ కట్టారు. కానీ వాటిని అమ్మేందుకు రైతు నాగేశ్వరరావు విముఖత చూపుతున్నారు. పుంగనూరు గిత్తల వీర్యానికి మార్కెట్లో భారీ డిమాండ్ ఉన్న నేపథ్యంలోనే వాటిని కొనేందుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. -
పచ్చని కాపురంలో ‘అతడు’ రేపిన చిచ్చు
మామిడికుదురు: ఎంతో అన్యోన్యంగా సాగిపోతున్న ఆ కుటుంబంలో వివాహేతర సంబంధం చిచ్చు రేపింది. పచ్చని సంసారంలో చిచ్చు పెట్టి నలుగురి ఆత్మహత్యకు కారణమైంది. అభంశుభం తెలియని ఇద్దరు చిన్నారులు సహా ఆ దంపతులను సామూహిక ఆత్మహత్యకు పాల్పడేలా ప్రేరేపించింది. చించినాడ బ్రిడ్జిపై నుంచి శుక్రవారం రాత్రి వశిష్ట గోదావరి నదిలో దూకినట్టుగా భావించిన నలుగురిలో ఆదివారం ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో ఇద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. తీవ్ర కలకలం రేపిన ఈ సంఘటనలో మొగలికుదురుకు చెందిన కంచి సతీశ్ (32)తో పాటు అతని కుమార్తె ఇందు శ్రీదుర్గ (2) మృతదేహాలను వశిష్ట నదిలో గుర్తించారు. సతీశ్ భార్య సంధ్య (22)తో పాటు వారి కుమారుడు జస్వన్ (4) మృతదేహాల కోసం గాలిస్తున్నారు. మొగలికుదురులో తాపీ పని చేసుకుంటూ జీవించే సతీష్ మరికాస్త సంపాదించుకొని తమ బతుకురాత మార్చుకోవాలని కలలుగన్నాడు. ఈ క్రమంలో మెరుగైన ఉపాధి కోసం సౌదీ వెళ్లాడు. ఆ సమయంలో అతడి భార్య సంధ్యకు సఖినేటిపల్లి మండలం కేశవదాసుపాలేనికి చెందిన యువకుడితో వివాహేతర సంబంధం ఏర్పడటం ఆ కుటుంబంలో చిచ్చు రేపింది. దీనిపై పెద్దల సమక్షంలో పంచాయితీ అయ్యింది. కుల పెద్దల సమక్షంలో రాజీ యత్నాలు జరిగాయి. ఈ నేపథ్యంలో కుటుంబ పెద్దలు పిల్లలు జస్వన్, శ్రీదుర్గలను మొగలికుదురులోనే ఉంచి, సంధ్యను ఆమె పుట్టిల్లయిన పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటకు పంపించినట్టు చెబుతున్నారు. విషయం తెలిసి మనస్తాపం చెందిన సతీష్ పది రోజుల కిందట సౌదీ నుంచి స్వగ్రామం వచ్చాడు. మద్యానికి బానిసైన అతడిని కుటుంబ పెద్దలు ఓదార్చారు. పిల్లలతో సహా కేశవదాసుపాలెంలోని అక్క ఇంటికి పంపించారని చెబుతున్నారు. ఈ విషయంపై తన భార్య సంధ్యను కలిసి మాట్లాడాలని సతీశ్ నిర్ణయించుకున్నాడు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు రూరల్ మండలం వెలివలలోని పినమామ ఇంటి వద్ద ఆమె ఉంటోందని తెలుసుకుని.. కేశవదాసుపాలెం నుంచి ఇద్దరు పిల్లలతో కలిసి అక్కడికి వెళ్లాడు. అక్కడ రెండు రోజులు ఉన్నాడు. అనంతరం శుక్రవారం రాత్రి దంపతులిద్దరూ పిల్లలతో కలిసి చించినాడ వంతెన పైకి చేరుకున్నారు. అప్పటికే సిద్ధం చేసుకున్న సూసైడ్ నోట్‌ను, పిల్లల దుస్తులను, బైక్‌ను వంతెనపై వదిలేసి, గోదావరిలో దూకేశారని భావిస్తున్నారు. కుటుంబంలో వరుసగా జరిగిన పరిణామాలు అవమానకరంగా ఉండటం, సమాజంలో తలెత్తుకునే పరిస్థితి లేకపోవడంతో ఆత్మహత్యకు పాల్పడ్డారని కుటుంబసభ్యులు చెబుతున్నారు. ఎంతో సౌమ్యంగా ఉండే సతీశ్ కుటుంబంతో సహా ఆత్మహత్యకు పాల్పడడాన్ని ఆ కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేక పోతున్నారు. అతడి తండ్రి భగవాన్‌దాసు, తల్లి లక్ష్మి, బంధువులు గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. -
భార్య పుట్టింటికెళ్తే.. భర్త గోదావరిలో దూకి..
భార్య తన పక్కన లేకపోయేసరికి ఆ భర్త కంగారు పడ్డాడు. ఆమె కోసం తీవ్రంగా గాలించాడు. గోదావరి చెంత ఆమె చెప్పులు కనిపించేసరికి నదిలోకి దూకేసిందనుకున్నాడు. తాను కూడా వెంటనే ఆమె కోసం ఆవేశంగా ఆ నదిలోకి దూకేశాడు. అయితే అంతా అనుకున్నట్టే భార్య ఆమె పుట్టింటి వద్ద ప్రత్యక్షమైంది. భర్త మాత్రం గోదావరిలో గల్లంతయ్యాడు. సాక్షి, మామిడికుదురు: భార్య గోదావరి నదిలో దూకేసిందన్న బాధతో భర్త కూడా అదే గోదావరి నదిలో దూకి గల్లంతైన సంఘటన పెదపట్నం గ్రామంలో సోమవారం జరిగింది. చివరకు భార్య పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో బంధువుల ఇంట క్షేమంగా ఉందన్న సమాచారంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. గ్రామంలో తాపీ పనిచేసుకుంటూ జీవించే యర్రంశెట్టి వెంకటరవికుమార్(28) అనే యువకుడు పాశర్లపూడి బ్రిడ్జిపై నుంచి గోదావరిలో దూకి గల్లంతయ్యాడు. చదవండి: ('రమ్యశ్రీని కొట్టి చంపేశారు..') పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. భార్యాభర్తలిద్దరూ ఆదివారం రాత్రి 11 గంటల వరకు టీవీ చూశారు. రాత్రి వారి మధ్య ఏం జరిగిందో ఏమో తెల్లవారుజామున రెండు గంటలకు భర్త నిద్ర లేచి చూసే సరికి భార్య పుష్పశివ కనిపించలేదు. భార్య ఆచూకీ కోసం ఊరంతా గాలించాడు. మెడలో ఉండాల్సిన మంగళసూత్రాలు ఇంట్లో ఉండడం, గోదావరి నది ఒడ్డున భార్య వేసుకునే చెప్పు లు కనిపించడంతో భార్య నదిలో దూకేసిందని భావించాడు. వెంటనే చెప్పులు తీసుకుని ఇంటికి వచ్చి చెప్పులు తల్లికి చూపించి అవి తన భార్యవని నిర్ధారించుకుని, వెంటనే బైక్ తీసుకుని సుమారు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న పాశర్లపూడి బ్రిడ్జి వద్దకు వెళ్లాడు. అక్కడ బైక్ ఉంచి అమాంతంగా గోదావరి నదిలో దూకేశాడు. స్థానిక మత్య్సకారులు దీనిని గమనించారు. చదవండి: (జీవితం మీద విరక్తితోనే చనిపోతున్నా..) పాశర్లపూడిలో వైనతేయ నది వద్ద గాలింపు చర్యలను పర్యవేక్షిస్తున్న రాజోలు ఎస్సై కృష్ణమాచారి వెంకటరవికుమార్, పుష్పశివకు మూడేళ్ల కిత్రం వివాహమైంది. వారికి 11 నెలల బాబు ఉన్నాడు. జనవరి 20న తిరుపతి వెళ్లి బాబు పుట్టి వెంట్రుకలు మొక్కు తీర్చాలని టికెట్లు కూడా బుక్ చేయించుకున్నారు. ఇంతలోనే ఈ విషాదం జరగడంతో అతడి∙కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. పుష్పశివ గతంలో కూడా ఇలానే అదృశ్యమైందని స్థానికులు పేర్కొన్నారు. ఇప్పుడు కూడా అదే విధంగా బంధువుల ఇంటికి వెళ్లి ఉంటుందని భావించారు. అంతా అనుకున్నట్టే భార్య ప్రత్యక్ష కావడం, భర్త గల్లంతు కావడం ఆ కుటుంబంలో అంతులేని విషాదాన్ని నింపింది. ఈ ఘటనపై రాజోలు ఎస్సై డి.కృష్ణమాచారి ఆధ్వర్యంలో నగరం ఏఎస్సై టి.ప్రసాదరావు కేసు దర్యాప్తు చేపట్టారు. గల్లంతైన యువకుడి కోసం వైనతేయ నదిలో గాలింపు చేపట్టారు. -
పులస @ రూ.21 వేలు
సాక్షి, మామిడికుదురు: భారతదేశంలో కేవలం గోదావరి జిల్లాల్లో మాత్రమే దొరికే అరుదైన పులస కోసం ప్రతి ఒక్కరూ ఎంతో ఆశగా ఎదురు చూస్తుంటారు. మాంసాహారులు లొట్టలేసుకుని తినే ఈ పులస స్టేటస్‌కు సింబల్‌గా నిలుస్తోంది. ఎంతో రుచికరమైన పులస చేప ఆదివారం వైనతేయ గోదావరి నదిలో పాశర్లపూడికి చెందిన మత్స్యకారుల వలకు చిక్కింది. భారీ డిమాండు ఉన్న ఈ పులస రెండున్నర కిలోల బరువుంది. దీనిని పాశర్లపూడి గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ నేత, నగరం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొమ్ముల కొండలరావు రూ.21 వేలు చెల్లించి సొంతం చేసుకున్నారు. (ఈ–పంట తరహాలో ఈ–ఫిష్) -
జాతీయ రహదారిపై త్రాచు పాము హల్చల్..
-
జాతీయ రహదారిపై త్రాచు పాము హల్చల్..
సాక్షి, తూర్పుగోదావరి : జిల్లాలోని మామిడికుదురు మండలం పాశర్లపూడి సెంటర్లో ఓ పాము హల్చల్ చేసింది. జాతీయ రహదారి 216పై వచ్చిన త్రాచు పాము సుమారు గంటపాటు కదలకుండా అలాగే ఉండిపోయింది. దీనిని చూసేందుకు జనాలు అధిక సంఖ్యలో గుమిగూడారు. దీంతో రోడ్డుపై ట్రాఫిక్‌కు అంతరాయ ఏర్పడింది. అనంతరం స్థానికులు కొట్టి చంపడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. (భయంకరమైన పామును ఎలా పట్టుకున్నారో చూడండి!) -
భారీ వర్షాలు..ఆందోళనలో గ్రామస్తులు
-
భారీ వర్షాలు..ఆందోళనలో గ్రామస్తులు
సాక్షి, తూర్పుగోదావరి : జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు మామిడికుదురు మండలం కరవాకలో గట్టుకు గండి పడింది. వర్షపు నీరు ఉధృతంగా ప్రవహించడంతో ఇళ్ల చుట్టూ ఉన్న ఇసుక కొట్టుకుపోయి ఇళ్ళు ఎక్కడ కూలి పోతాయోనని స్థానిక మత్స్యకారులు భయాందోళనగకు గురవుతున్నారు. కాగా ఇప్పటివరకు ఈ విషయంపై అధికారులు ఏ విధంగానూ స్పందించ పోవడం పట్ల గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. (నేడు ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన) -
శాంతిస్తున్న గోదావరి
మూడు రోజులుగా ఏజెన్సీ, కోనసీమ ప్రాంతాల్లోని ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేసిన గోదావరి వరద మంగళవారానికి కొంత శాంతించింది. నిన్నటి వరకూ వరద ఉధృతి తగ్గకపోవడంతో ఆందోళన చెందిన బాధితులకు అధికార యంత్రాంగం అందించిన చేయూత భరోసానిచ్చింది. సాక్షి, అమలాపురం : ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు ఉగ్రరూపం దాల్చి ఊళ్లను ముంచెత్తిన వరద గోదావరి తగ్గుముఖం పట్టింది. మూడు రోజులుగా ఉధృతంగా ప్రవహించి దేవీపట్నం, విలీన మండలాల్లోని దాదాపు 56 గ్రామాలను వరద నీరు చుట్టుముట్టింది. మూడు నదీపాయలతో 50కి పైగా లంక గ్రామాలతో ఉన్న కోనసీమ వరద ఉధృతికి గత మూడు రోజులుగా అతలాకుతలమవుతోంది. మంగళవారం సాయంత్రానికి భద్రాచలం వద్ద నీటిమట్టం మూడు అడుగుల మేర తగ్గడంతో జిల్లా ఏజెన్సీ ప్రజలు వరదల భయం నుంచి కాస్త ఉపశమనం పొందుతున్నారు. కోనసీమ దిగువన అంటే సముద్ర తీరంలో ఉండడంతో ఎగువన వరద నీరంతా చివరకు ఈ సీమ నుంచే సముద్రంలో కలిసే పరిస్థితి ఉండడంతో ఈ ప్రాంతంలోని 48 లంక గ్రామాలు వరద ఉధృతితో మంగళవారం రాత్రి వరకూ చిగురుటాకుల్లా అల్లాడిపోతూనే ఉన్నాయి. ప్రజలు వదర భయంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఏటిగట్లపై పాడి పశువులతో పాటు వచ్చి వాటికి కాపలాగా కంటి మీద కునుకు లేకుండా గడుపుతున్నారు. ⇔ మామిడికుదురు మండలం అప్పనపల్లి కాజ్వే, అయినవిల్లి మండలం తొగరపాయ ఎదురుబిడిం వద్ద కాజ్‌వేలు వదర నీటితో పొంగిపొర్లుతున్నాయి. రాకపోకలలు నిలిచిపోయాయి. ⇔ పి.గన్నవరం మండలం జి.పెదపూడిలంక, ఊడిమూడి లంక, ముమ్మిడివరం మండలం సలాదివారిపాలెం, కమిని తదితర 17 లంక గ్రామాల ప్రజలు వేరే దారి లేక పడవలపైనే ప్రమాదం అంచున ప్రయాణాలు చేస్తున్నారు. ⇔ ధవళేశ్వరం బ్యారేజి నుంచి మంగళవారం మధ్యాహ్నం తర్వాత 2 గంటలకు 14,59,000 క్యూసెక్కుల వరద నీరును సముద్రంలోకి వదిలితే... అదే రాత్రి 7 గంటలకు కాస్త శాంతించడంతో 11,39000 క్యూసెక్కులు నీటిని విడుదల చేశారు. ⇔ కోనసీమలో బుధవారం కూడా వరద పరవళ్లు తప్పవు. ఎందుకంటే ఎగువ వరద నీటి ప్రవాహం మంగళవారం రాత్రి నుంచి తెల్లారే దాకా కూడా దిగువకు వచ్చే అవకాశం ఉంటుంది. దీంతో వరద ప్రభావం బుధవారం కూడా అలాగే ఉండే అవకాశం ఉంది. గురు, శుక్రవారాల్లో వదర నీరు తగ్గుతూ మరో మూడు రోజుల తరువాతగానీ సాధారణ పరిస్థితికి రాదు. వరద నుంచి బయటపడుతున్న 56 ఏజెన్సీ గ్రామాలు వరదలకు ఏజెన్సీలోని దేవీపట్నం, చింతూరు మండలాల్లో తీవ్రత ఎక్కువగా కనిపించింది. దేవీపట్నం మండలం తొయ్యేరు, పూడిపల్లి, పెనికలపాడు, మంటూరు తదితర గ్రామాలను గోదావరి ముంచెత్తడంతో ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకున్నారు. మండలంలో 36 గ్రామాలు వరద తాకిడికి గురయ్యాయి. గండిపోశమ్మ ఆలయం వద్ద వరద నీరు ముంచెత్తడంతో అమ్మవారి ఆలయ ప్రాంగణం మొత్తం వరద నీటిలో మునిగింది. పూర్తిగా నీట మునిగిన అమ్మవారి విగ్రహం ఇంకా బయటపడ లేదు. అయితే మంగళవారం సాయంత్రం నుంచి తగ్గుముఖం పట్టడంతో బుధవారం నాటికి దేవీపట్నం వీధుల్లో వరద నీరు తగ్గే అవకాశం ఉంది. ఇక చింతూరు మండలంలోని 20 గ్రామాలను వదర నీరు చుట్టు్టముట్టింది. మంగళవారం తగ్గుముఖంగా అయిదు గ్రామాల నుంచి గోదావరి జలాలు వెనక్కి మళ్లడంతో ప్రజలు ఊపిరి పీల్చుకునేలా చేసింది. మిగిలిన 15 గ్రామాలు ఇంకా వరద నీటి దిగ్భంధంలోనే ఉన్నాయి. బుధవారం ఉదయానికి ఈ గ్రామాలను చుట్టుముట్టిన నీరు తగ్గే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మంత్రుల బృందం సందర్శన, పర్యవేక్షణ రాష్ట్ర మంత్రులు ఆళ్ల నాని, కురసాల కన్నబాబు, తానేటి వనిత, పినిపే విశ్వరూప్‌తోపాటు జిల్లా ఎంపీలు భరత్, అనురాధ, గీత, రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ జక్కంపూడి రాజా, పలువురు ఎమ్మెల్యేలు మంగళవారం జిల్లా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి వరద పరిస్థితులను స్వయంగా సమీక్షించారు. జిల్లా కలెక్టర్ మురళీధర్‌రెడ్డి కూడా మంత్రుల బృందంతో ఉండి జిల్లా వరద పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమీక్షించారు. కొనసాగుతున్న నిఘా గోదావరి వరద కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ జిల్లా అధికార యంత్రాంగం మాత్రం అప్రమత్తతతోనే వరద ప్రభావిత గ్రామాల్లోనే ఉండి పరిస్థితులను సమీక్షిస్తూ ఉన్నతాధికారులకు నివేదికలు, సమాచారం ఇస్తున్నారు. మండల ప్రత్యేక అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలతోపాటు పోలీసు, అగ్ని మాపక, విద్యుత్తు తదితర శాఖల అధికారులు, వీఆర్వోలు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ ప్రజలకు తగు సూచనలిస్తున్నారు. పి.గన్నవరం మండలం కె.ఏనుగుపల్లిలో నీట మునిగిన అంగన్వాడీ భవనం గండి పోశమ్మఆలయం వద్ద వరద గోదావరి -
198వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్
సాక్షి, మామిడికుదురు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర తూర్పుగోదావరి జిల్లాలో పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. 197వ రోజు ఆదివారం పి. గన్నవరం నియోజకవర్గం మామిడికుదురు మండలంలో జననేత పాదయాత్ర చేశారు. రేపు (సోమవారం) ఇదే మండలంలో ప్రజాసంకల్పయాత్ర కొనసాగనుంది. నగరం నుంచి రేపు ఉదయం 198వ రోజు పాదయాత్ర మొదలుపెడతారు. మామిడికుదురు, కికలపేట మీదురుగా అప్పనపల్లి క్రాస్ చేరుకుని మధ్యాహ్న భోజన విరామం తీసుకుంటారు. తర్వాత పాశర్లపూడి, పాశర్లపూడి బాడవ వరకు పాదయాత్ర కొనసాగుతుందని వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఒక ప్రకటనలో తెలిపారు. 197వ రోజు పాదయాత్రలో భాగంగా నగరంలో ఓఎన్జీసీ గ్యాస్ ప్రమాద బాధితులతో వైఎస్ జగన్ మాట్లాడారు. ప్రభుత్వం తమకు తగిన న్యాయం చేయలేదని బాధితులు గోడు వెళ్లబోసుకున్నారు. న్యాయం చేస్తానని జననేత వారికి హామీయిచ్చారు. వైఎస్ జగన్ ఈరోజు 8.1 కిలోమీటర్లు నడిచారు. ఇప్పటివరకు మొత్తం 2,414.2 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తిచేశారు. -
షార్ట్ సర్క్యూట్‌తో సెల్ టవర్ దగ్ధం
మామిడికుదురు : జాతీయ రహదారి పక్కన మామిడికుదురులోని ఏటీఎం సమీపంలో భవనంపై ఉన్న సెల్ టవర్ ఆదివారం అర్థరాత్రి దగ్ధమైంది. టవర్ అంతా మంటలు వ్యాపించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అసలు ఏం జరిగిందో తెలియక అటూ ఇటూ పరుగులు తీశారు. షార్ట్సరŠూక్యట్ వల్ల ఈ సంఘటన జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. టవర్ పైభాగంలో అంటుకున్న మంటలు క్రమేపీ కిందవరకూ వ్యాపించాయని స్థానికులు పేర్కొన్నారు. ఈ టవర్ ద్వారా ఐడియా, ఎయిల్టెల్, వొడాఫో¯ŒS వినియోగదారులకు సేవలందుతున్నాయి. సెల్‌టవర్ కాలిపోవడంతో ఆయా సెల్ఫోన్లకు సిగ్నల్స్ అందక వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. -
కన్నకూతురిపై ఏడాదిగా లైంగిక దాడి
- గర్భం దాల్చితే గుట్టుగా అబార్షన్ - భార్య ఫిర్యాదుతో కామాంధుడిపై కేసు మామిడికుదురు: కన్నకూతురిపైనే ఏడాదిగా లైంగిక దాడికి పాల్పడుతున్న కామాంధుడి ఉదంతం బయటపడింది. తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు మండల పరిధిలోని పెదపట్నంలంక గ్రామానికి చెందిన గెడ్డం ప్రసాద్.. వావి వరుసలు మరిచి ఈ దురాగతానికి ఒడిగట్టాడు. దీనిపై నగరం పోలీస్‌స్టేషన్‌లో శనివారం కేసు నమోదైంది. ఎస్ఐ జి.వెంకటేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం.. కూలి పనులు చేసే ప్రసాద్ భార్య అనంతకుమారి రెండున్నరేళ్లుగా ఉపాధి నిమిత్తం కువైట్‌లో ఉంటోంది. వారికి ముగ్గురు కుమార్తెలు. పెద్ద కూతురు గుంటూరులో నర్సింగ్ కోర్సు చదువుతుండగా రెండో కుమార్తెకు వివాహమైంది. పదిహేనేళ్ల మూడో కుమార్తె తండ్రితోనే ఉంటోంది. ఇటీవల పదో తరగతి పరీక్షలు రాసి ఉత్తీర్ణురాలైంది. ప్రసాద్ ఏడాదిగా మూడో కూతురిపై లైంగికదాడి చేస్తున్నాడు. ఆమె ప్రతిఘటిస్తే చంపుతానని బెదిరిస్తూ, అరవకుండా నోట్లో గుడ్డలు కుక్కి, కొట్టి తన కామం తీర్చుకుంటున్నాడు. ఈ క్రమంలో బాధితురాలు గర్భం దాల్చింది. ఆరునెలల గర్భంతో ఉన్న కూతురికి ప్రసాద్ తాటిపాకలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో గుట్టు చప్పుడు కాకుండా అబార్షన్ చేయించాడు. అదే రోజు బాధితురాలు జరిగిన దారుణాన్ని కువైట్‌లో ఉన్న తల్లికి ఫోన్లో చెప్పింది. ఆమె శుక్రవారం స్వదేశం చేరుకుని భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. లైంగికదాడి, మైనార్టీ బాలికను గర్భవతిని చేయడం, వేధించడం తదితర సెక్షన్లపై కేసు నమోదు చేశారు. కేసును అమలాపురం డీఎస్పీ ఎల్.అంకయ్య దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు ప్రసాద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. ప్రసాద్ ఘాతుకం స్థానికంగా కలకలం రేపింది. -
ఆందోళనకు గురిచేసిన గ్యాస్ లీకేజీ
మామిడికుదురు : పాశర్లపూడిలంక గ్రామంలో పాశర్లపూడి-18 బావి వద్ద శుక్రవారం సాయంత్రం ఏర్పడిన గ్యాస్ లీకేజీ సంఘటన స్థానికులను భయాందోళనకు గురి చేసింది. 15 నిమిషాల పాటు భారీశబ్ధంతో గ్యాస్ లీకవడంతో ఏం జరుగుతుందో తెలియక స్థానికులు ఆందోళన చెందారు. గ్యాస్ లీకైన ప్రాంతంలో ఆడుకుంటున్న యువకులు పరుగులు తీశారు. వెంటనే సమాచారాన్ని గ్రామస్తులు ఓఎన్జీసీ అధికారులకు, నగరం పోలీసులకు, రాజోలు అగ్నిమాపక కేంద్రం అధికారులకు అందించారు. అక్కడికి చేరుకున్న ఓఎన్జీసీ అధికారులు లీకేజీని అదుపు చేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. మూడు పైపుల నుంచి భారీశబ్ధంతో గ్యాస్‌తో పాటు కొద్దిపాటి ముడి చమురు లీకైంది. నగరం పోలీసులు, ఓఎన్జీసీకి చెందిన స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ పోలీసులు, అగ్నిమాపక కేంద్రం సిబ్బంది పరిస్థితిని సమీక్షించారు. అక్కడికి చేరుకున్న ఓఎన్జీసీ సిబ్బందిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓఎన్జీసీ బావి వద్ద కాపలాగా గార్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నా పట్టించుకోవడం లేదని స్థానిక సర్పంచ్ బొరుసు నర్సింహమూర్తి, గ్రామస్తులు ముత్యాల సత్యనారాయణ, కోలా సత్యనారాయణ, పొలమూరి సత్యనారాయణ, పితాని వెంకటేశ్వరరావు, పెదమల్లు వెంకటేశ్వరరావు, రామకృష్ణ, తెలగారెడ్డి బులినాగేశ్వరరావు ఆందోళన వ్యక్తం చేశారు. ఓఎన్జీసీ సిబ్బందిని నిర్బంధించారు. ఇది గ్యాస్ లీకేజీ కాదని, పాశర్లపూడి-18 బావి ఉత్పత్తిలో లేదని, ఐపీఎస్-8 బావిలో హైడ్రో టెస్టింగ్ పరీక్షలు చేస్తుండగా ఈ సంఘటన జరిగిందని ఓఎన్జీసీ సిబ్బంది వివరించారు. ఆ బావికి చెందిన పైప్‌నుంచి నీటితో పాటు గాలి పంపించి పరీక్షలు చేస్తుండగా అదే బావికి అనుసంధానమై ఉన్న ఈ బావి వద్ద గాలి, నీరు బయటకు ఎగజిమ్మాయని వివరించారు. ఈ విషయం ముందుగా తమకు తెలియచేయకపోవడం వల్ల ఆందోళన చెందామని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓఎన్జీసీ అధికారులు గతంలో తమకు పలు హామీలు ఇచ్చారని, వాటిని ఇంత వరకు అమలు చేయలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానికులకు ముందుగా సమాచారం అందించక పోవడం తమ పొరపాటని, ఆందోళనను ఉన్నతాధికారుల దృష్టి కి తీసుకెళ్తామనడంతో గ్రామస్తులు శాంతించారు. -
నేటికీ వెంటాడుతున్న చేదు జ్ఞాపకం
-
నేటికీ వెంటాడుతున్న చేదు జ్ఞాపకం
కలల్ని కబళించిన కీలలు నిశ్చింతతో కూడిన జీవితానికి చిరునామాగా పేరొందిన సీమ.. మృత్యుధామంగా మారి నేటికి ఏడాది. బాలసూర్యుడు తొంగి చూడడానికి ముందే.. కాలయముడు తాండవమాడి నేటికి ఏడాది. కలలు కంటున్న వారిని కీలలు కబళించి నేటికి ఏడాది. చుట్టలు చుట్టుకున్న లోహసర్పం లాంటి పైపులైన్..విస్ఫోటించి 22 నిండు ప్రాణాల్ని కాటేసి నేటికి ఏడాది. గత సంవత్సరం జూన్ 27న తూర్పుగోదావరి జిల్లా నగరం గ్రామంలో ‘గెయిల్’ పైపులైన్ పేలి విలయం సృష్టించింది. ఆ విషాదస్మృతులపై... చెవులు చిల్లులు పడే విస్ఫోటంతో.. ఉన్నట్టుండి ఒక్కసారిగా చుట్టుముట్టిన అగ్ని జ్వాలలు.. కాలిబూడిదైన పరిసరాలు, పశువులు, పక్షులు.. ఎక్కడ ఎలా ఉన్నవారు అలాగే సజీవదహనమైపోయిన మనుషులు.. తీవ్రమైన కాలిన గాయాలతో బాధితుల హాహాకారాలు, రోదనలు.. సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజున నగరం గ్రామంలో నెలకొన్న హృదయవిదారక పరిస్థితి ఇది. నాటి చేదు అనుభవాల నుంచి గ్రామం ఇంకా తేరుకోలేదు. ఆ విషాదాగ్ని రేపిన గాయాల మంటతో నగరం వాసుల గుండెలు ఇంకా రగులుతూనే ఉన్నాయి. నగరం (మామిడికుదురు) : సరిగ్గా ఏడాది క్రితం జూన్ 27 ఉదయం 5.30 గంటలు.. ఇంకా తెలవారలేదు. నగరం గ్రామమంతా గాఢంగా నిద్రిస్తున్న వేళ.. ఒక్కసారిగా భారీ శబ్దం.. గెయిల్ గ్యాస్ పైప్‌లైన్ విస్ఫోటం.. క్షణాల్లో మృత్యు జ్వాలలు గ్రామంపై విరుచుకుపడ్డాయి. ఏం జరుగుతోందో తెలిసేలోపే 16మంది ఎక్కడ ఉన్నవారు అక్కడే మృత్యుకీలలకు సజీవంగా ఆహుతైపోయారు. వీరిలో కొందరు నిద్రలోనే శాశ్వత నిద్రకు వెళ్లిపోయారు. మరో ఆరుగురు తరువాత వివిధ ఆస్పత్రుల్లో కన్నుమూశారు. మరికొందరు కాలిన గాయాలతో ప్రాణాలరచేత పట్టుకుని పరుగులు తీశారు. హాహాకారాలు, రోదనలతో ఆ ప్రాంతం మిన్నంటింది. సంఘటన జరిగిన రోజున చెట్లు చేమలు, ఇళ్లు, పశువులు, పక్షులూ అన్నీ కాలి బూడిదైపోయాయి. 17 మంది తీవ్రంగా గాయపడి జీవచ్ఛవాల్లా మిగిలారు. ఆ రోజును తలుచుకుంటే నగరం గ్రామం ఇప్పటికీ ఉలిక్కిపడుతోంది. నాటి భయంకర జ్ఞాపకాలు నేటికీ కళ్లెదుట మెదులుతున్నాయని స్థానికులు కన్నీళ్లతో చెబుతున్నారు. పచ్చగా కళకళలాడిన గ్రామం ఎండిన మోడులా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగితాలకే పరిమితమైన మోడల్ విలేజ్ హామీ ఈ ఘోర విషాదం తర్వాత నగరం గ్రామాన్ని మోడల్ విలేజ్‌గా తీర్చిదిద్దుతామంటూ పాలకులు చేసిన హామీల హంగామా కాగితాలకే పరిమితమైంది. రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ఆధ్వర్యంలో 200 మంది ఉద్యోగులు 20 రోజులు రెండు విడతలుగా ఇంటింటా సర్వే నిర్వహించారు. గ్రామస్తులకు అవసరమైన మౌలిక సదుపాయాలపై సర్వే చేసి, ఆ నివేదికను ప్రభుత్వానికి అందజేశారు. దీని ఆధారంగా గ్రామాన్ని గెయిల్ చేత అభివృద్ధి చేసి మోడల్ విలేజ్‌గా తీర్చిదిద్దుతామని ప్రభుత్వం ప్రగల్భాలు పలికింది. కానీ ఘోరకలి జరిగి ఏడాది కావస్తున్నా.. ఆ హామీ ఇంతవరకూ అమలుకు నోచుకోలేదు. విస్ఫోటంవల్ల ఏర్పడిన గొయ్యినీ పూడ్చలేదు పైప్‌లైన్ విస్ఫోటం వల్ల ఆ ప్రాంతంలో రోడ్డు మధ్యన సుమారు 10 అడుగుల లోతున పెద్ద గొయ్యి ఏర్పడింది. దీనిని ఇంతవరకూ పూడ్చలేదు. దీంతో స్థానికులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దుర్ఘటన జరిగి ఏడాది కావస్తున్నా దీనిని పూడ్చకపోవడం దారుణమని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రూ.6వేల వంతునే పరిహారం ఇచ్చారు విస్ఫోటంలో దెబ్బతిన్న 1,316 కొబ్బరి చెట్లకు రూ.8 వేల చొప్పున పరిహారం ఇస్తామని తొలుత హామీ ఇచ్చిన గెయిల్ చివరకు రూ.6 వేల చొప్పునే ఇచ్చింది. వీటితోపాటు మంటల్లో దెబ్బతిన్న 125 కొబ్బరి చెట్లకు పరిహారం ఇవ్వాలని రెండో విడత సర్వేలో నిర్ణయించారు. కానీ ఇంతవరకూ ఆ పరిహారం ఇవ్వనే లేదు. కాలిపోయిన మట్టిని తొలగించి దాని స్థానే ఉపాధి హామీ పథకంలో కొత్త మట్టి కప్పి ఇస్తామన్నారు. అదీ అమలుకు నోచుకోలేదు. మాకు జీవనోపాధి కల్పించాలి మా కుటుంబంలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. నాకు ఇది పునర్జన్మ. కాకినాడ ఆస్పత్రిలో నాలుగు నెలలు చికిత్స పొంది ఇంటికి వచ్చా. నాకు ప్లాస్టిక్ సర్జరీ చేయిస్తామంటున్నారు. చెన్నై రావాలని చెబుతున్నారు. నా కుటుంబానికి నేనే ఆధారం. ముందుగా మా కుటుంబానికి జీవనోపాధి కల్పిస్తే సర్జరీకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాను. - బోనం పెద్దిరాజు, బాధితుడు నా బిడ్డ పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది విస్ఫోటంలో నాతోపాటు నా కొడుకులు మోహన వెంకటకృష్ణ, మధుసూదన్, మావయ్య వెంకటేశ్వరరావు తీవ్రంగా గాయపడ్డాం. నా కొడుకు వెంకటకృష్ణ పరిస్థితి ఇప్పటికీ ఆందోళనకరమే. వాడికి మూడు ఆపరేషన్లు చేయించారు. మరో ఆపరేషన్ చేయాల్సి ఉంది. చిన్న వయస్సు కావడంతో ఏడాది తరువాత చేస్తామన్నారు. పిల్లలకు చదువు చెప్పించే బాధ్యత గెయిల్ తీసుకోవాలి. - వానరాశి దుర్గాదేవి, బాధితురాలు చాలా హామీలు నెరవేర్చాం బాధితులకు ఇచ్చిన హామీలను చాలావరకూ నెరవేర్చాం. నగరం ఘటనతో కేజీ బేసిన్లో పైప్‌లైన్ నెట్‌వర్క్‌ను శక్తిమంతంగా చేస్తున్నాం. మధ్యకాలిక చర్యల్లో భాగంగా రూ.419 కోట్లతో 90 కిలోమీటర్ల మేర తాటిపాక-చించినాడ పైప్‌లైన్ మార్పిడి పనులు నిర్వహిస్తున్నాం. నగరం గ్రామాన్ని మోడల్ విలేజ్‌గా అభివృద్ధి చేసేందుకు రూ.2 కోట్ల విలువ చేసే కార్యకలాపాలకు గెయిల్ ఆమోదం తెలిపింది. త్వరలో ఈ పనులు చేపడతాం. మామిడికుదురులో నిరుద్యోగుల కోసం రూ.1.35 కోట్లతో నైపుణ్య అభివృద్ధి కేంద్రం ఏర్పాటు చేశాం. ప్రభుత్వాధికారుల సిఫారసు మేరకు అర్హులకు ఉద్యోగాలు ఇస్తాం. రెవెన్యూ అధికారుల నుంచి సర్టిఫికెట్లు అందగానే మంటల్లో దెబ్బ తిన్న 125 కొబ్బరి చెట్లకు మరో రూ.2వేల పరిహారం చెల్లిస్తాం. నగరం, రాజోలు ప్రభుత్వాస్పత్రుల అభివృద్ధికి రూ.25 లక్షలు విడుదల చేశాం. మరో రూ.25 లక్షల విడుదలకు ఆమోదం తెలిపాం. రూ.36 లక్షలతో మొబైల్ మెడికల్ వ్యాన్ ఏర్పాటు చేశాం. గెయిల్ కార్యకలాపాలపై ప్రజల్లో చైతన్యం తీసుకు వచ్చేందుకు 80 గ్రామాల్లో బుర్రకథల ద్వారా ప్రచారం నిర్వహించాం. గతంలో ఉండే 11 అంకెల టోల్ ఫ్రీ నంబర్ స్థానే అయిదు అంకెలతో (15101) టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేశాం. వీటితోపాటు జిల్లాలో పలు అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాం. - ఎంవీ అయ్యర్, డీజీఎం, గెయిల్ ఏడాదైనా అసంపూర్తిగానే.. మలికిపురం/అమలాపురం టౌన్ : మామిడికుదురు మండలం నగరం గ్రామంలో గ్యాస్ పైప్‌లైన్ విస్ఫోటం జరిగి ఏడాదవుతున్నా.. అక్కడి పరిస్థితులను అటు గెయిల్ సంస్థ కానీ, ఇటు ప్రభుత్వం కానీ పూర్తిస్థాయిలో చక్కదిద్దలేదు. ఇది కొత్త పరిశ్రమల ఏర్పాటుకు గండంగా మారింది. పైప్‌లైన్ పేలుడు తరువాత ఏడాదిలోగా అన్నింటినీ పునరుద్ధరిస్తామన్న రాష్ట్ర ప్రభుత్వ హామీ నేటికీ నెరవేరలేదు. దీనికి బాధ్యత వహించాల్సిన గెయిల్ సంస్థ కూడా అధునాతన సాంకేతిక ప్రక్రియతో పైప్లైన్లు పునరుద్ధరించి, గ్యాస్ సరఫరాను పెంచి, పరిశ్రమల విస్తరణకు చేయాల్సిన కృషిని కూడా విస్మరించినట్టు కనిపిస్తోంది. దెబ్బతిన్న పైప్లైన్లను కొంతమేర ఆధునికీకరించారు. కొన్ని పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయి. విద్యుదుత్పత్తిపై పెను ప్రభావం నగరం పైప్‌లైన్ పేలుడు ప్రభావం ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో విద్యుదుత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపింది. పేలుడుకు ముందు నగరం గ్యాస్ కలెక్టింగ్ స్టేషన్ (జీసీఎస్) నుంచి ఈ మూడు జిల్లాల్లోని విద్యుదుత్పత్తి కేంద్రాలకు గ్యాస్ సరఫరా అయ్యేది. పేలుడు తరువాత గ్యాస్ సరఫరాను 50 శాతం మాత్రమే పునరుద్ధరించారు. మిగిలిన 50 శాతం నేటికీ పునరుద్ధరణ కాలేదు. ఈ ప్రభావం కొత్త పరిశ్రమల ఏర్పాటుపై తీవ్రంగా పడింది. తెలంగాణ రాష్ట్రం విడిపోవడంతో మన రాష్ట్రానికి మిగులు విద్యుత్ రావడంతో ఆ ప్రభావం రాష్ట్ర విద్యుత్ రంగంపై పెద్దగా కనిపించలేదు. అదే ఉమ్మడి రాష్ట్రంగా ఉంటే నగరం విస్ఫోటం పర్యవసానానికి విద్యుత్ పరంగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చి ఉండేది. నగరం నుంచి పూర్తిస్థాయి గ్యాస్ సరఫరాకు ఎంత సమయం పడుతుంది, ఏ మేరకు విద్యుదుత్పత్తి జరుగుతుందనేదానిపై గెయిల్ అధికారులు, విద్యుత్ ఉత్పత్తి సంస్థల యాజమాన్యాలతో ప్రభుత్వం చర్చలు జరిపింది. నష్టం ఇలా.. నగరం పేలుడు అనంతరం తొలి ఆర్నెల్లూ రోజుకు 30 లక్షల క్యూబిక్ మీటర్ల మేర గ్యాస్ సరఫరా నిలిచిపోయింది. ఇక్కడ నుంచి సరఫరా లేకపోవడంతో ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో పలు పవర్ ప్రాజెక్టులు పని చేయకుండా పోయాయి. తరువాత ఆరు నెలల్లో కేంద్రం తీసుకున్న చర్యలతో రోజుకు 16 లక్షల క్యూబిక్ మీటర్ల గ్యాస్ సరఫరాను దశలవారీగా పునరుద్ధరించగలిగారు. ఈ చర్యలతో 50 శాతం ఉత్పత్తి మెరుగు పడింది. పూర్తిస్థాయి ఉత్పత్తి జరగాలంటే రోజుకు మరో 14 లక్షల క్యూబిక్ మీటర్ల గ్యాస్ సరఫరా జరగాల్సి ఉంది. తొలి ఆర్నెల్ల కాలంలో ఓఎన్జీసీ రోజుకు రూ.2 కోట్ల చొప్పున రూ.360 కోట్ల మేర ఆదాయం కోల్పోయింది. అదే సమయంలో ఓఎన్జీసీ నుంచి గ్యాస్ కొనుగోలు చేసే గెయిల్ సంస్థ కూడా రూ.200 కోట్ల ఆదాయం కోల్పోయినట్టు ఆ వర్గాలు ద్వారా తెలుస్తోంది. తరువాతి ఆర్నెల్లలో రోజుకు రూ.కోటి చొప్పున రూ.180 కోట్ల మేర గెయిల్ ఆదాయం కోల్పోయింది. సరఫరా అవుతున్న గ్యాస్‌లో నీరు, మలినాలవల్ల పైప్లైన్లు త్వరగా పాడైపోతున్నాయని భావించి మరింత నాణ్యమైన గ్యాస్ అందించాలని ఓఎన్జీసీని గెయిల్ కోరింది. అప్పటివరకు గ్యాస్ కొనుగోలు నిలిపివేసింది. దీంతో ఓఎన్జీసీ కూడా అధునాతన మిషన్లు ఏర్పాటు చేసే పనిలో నిమగ్నమైంది. ఈ కారణంగా ఆరు నెలలుగా 14 లక్షల క్యూబిక్ మీటర్ల గ్యాస్ సరఫరా నిలిచిపోయింది. మందకొడిగా పైప్‌లైన్ మరమ్మతులు విస్ఫోటానికి కారణమైన పైప్లైన్లకు కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఆదేశాలతో మరమ్మతులు చేపట్టారు. పాత పైప్లైన్ల స్థానే కొత్తవి వేసే పనులకు గెయిల్ సంస్థ రూ.వెయ్యి కోట్లతో టెండర్లు పిలిచింది. పలు కాంట్రాక్ట్ సంస్థలకు ఆ పనులను అప్పగించింది. ఈ పైప్‌లైన్ పనులు జరుగుతున్న ఉభయ గోదావరి జిల్లాల్లోని రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో పనులకు ఆటంకం కలుగుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో కొత్త పరిశ్రమల ఏర్పాటుకు ఆటంకం కలుగుతోంది. -
మిస్డ్ కాల్‌తో లైట్స్ ‘ఆన్ అండ్ ఆఫ్’
మామిడికుదురు: ‘పట్టపగలే వెలుగుతున్న వీధి లైట్లు’ అంటూ తరచు పేపర్లో వార్తలు చూస్తుంటాం. ఇక నుంచి వీటికి ముగింపు పలికేలా వీధి లైట్ల ఆఫ్, ఆన్ విధానాన్ని సెల్‌కు అనుసంధానం చేశారు. దీనిని ప్రయోగాత్మకంగా మామిడికుదురులో ఇటీవల రెండుచోట్ల ప్రవేశ పెట్టగా ఎంతో మెరుగ్గా ఉందని పంచాయతీ ఉద్యోగులంటున్నారు. లైట్ల మీటరు ఉండే స్తంభం వద్ద ఏర్పాటు చే సిన పరికరంలో సిమ్ కార్డు అమర్చి, ఆ నెంబర్‌ను అసిస్టెంట్ లైన్‌మన్ సెల్లో రిజిస్టర్ చేశారు. ఆయన సాయంత్రమయ్యే సరికి తన నెంబర్ నుంచి మీటర్ వద్దనున్న నంబర్‌కు మిస్డ్ కాల్ చేస్తే వీధి లైట్లు వెలుగుతాయి. అలాగే ఆరిపోతారుు కూడా. విద్యుత్ సరఫరా నిలిచి పోయినా, వీధి లైట్లను వేళకు ఆన్ లేదా ఆఫ్ చేయకపోయినా అసిస్టెంట్ లైన్‌మన్ సెల్‌కు ఆటోమేటిక్‌గా మెసేజ్ వస్తుంది. ఆ వెంటనే ఆయన మిస్డ్ కాల్ చేస్తే ఆరిపోరుున లైట్లు వెలుగుతాయి. లేదా వెలుగుతున్న లైట్లు రిపోతాయి. ఈ విధానాన్ని జిల్లావ్యాప్తంగా ప్రవేశ పెట్టేందుకు పంచాయతీ అధికారులు కార్యాచరణ రూపొందిస్తున్నారు. -
టీడీపీ నేతపై నాన్ బెయిల్‌బుల్ కేసు నమోదు చేయాలి
నగరం(మామిడికుదురు) : స్థానిక యువతి విత్తనాల శేషారత్నం పట్ల అసభ్యంగా ప్రవర్తించి, దౌర్జన్యం చేసిన టీడీపీ మండల శాఖ అధ్యక్షుడు కొమ్ముల నాగబాబుపై నాన్ బెయిలబుల్ సెక్షన్‌తో కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం రాస్తారోకో నిర్వహించారు. స్థానిక మొల్లేటివారిపాలెం రామాలయం ఎదురుగా 216వ నంబర్ జాతీయ రహదారిపై రాజోలు తాలూకా శెట్టిబలిజ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో నాగబాబు వ్యవహరించిన తీరుపై తీవ్రస్థాయిలో నిరసన తెలిపారు. యువతి పట్ల సభ్య సమాజం సిగ్గు పడే రీతిలో ప్రవర్తించిన నాగబాబును అరెస్టు చేయడం, కొన్ని గంటల్లోనే అతను బయటకు రావడం వంటి సంఘటనలు తమను తీవ్ర ఆవేదనకు గురి చేశాయని రాజోలు తాలూకా శెట్టిబలిజ సంఘం అధ్యక్షుడు గుబ్బల సత్యనారాయణ(బాబ్జీ), కార్యదర్శి గుబ్బల శ్రీను ఆవేదన వ్యక్తం చేశారు. అతడిపై నాన్ బెయిల్‌బుల్ సెక్షన్లు నమోదు చేసి, మళ్లీ అతడిని అరెస్టు చేయాలని, నాగబాబును పార్టీ మండల శాఖ అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. వీటిపై స్పందించని పక్షంతో తాలూకా స్థాయిలో నాలుగు మండలాల పరిధిలోని శెట్టిబలిజ కులస్తులతో త్వరలో భారీ ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. రాస్తారోకోలో మామిడిశెట్టి సాయిబాబు, వాసంశెట్టి శంకర్రావు, చిట్టూరి బుల్లియ్య, నయినాల సత్యనారాయణ, చిట్టూరి బాలయోగి, యాండ్ర వీరబాబు, గెద్దాడ నాగరాజు, కట్టా అబ్బు, కాండ్రేగుల బాబి, కడలి రంగ, మొల్లేటి షణ్ముకరావు, కడలి రాంబాబు, మొల్లేటి సత్తిపండు, కడలి బాబూరావు, మొల్లేటి కృష్ణమూర్తి, వీరవల్లి చిట్టిబాబు, తదితరులు పాల్గొన్నారు. -
సెంటిమెంట్ ప్రాధాన్యం ఉన్న చిత్రాల్లో నటిస్తా
అప్పనపల్లి(మామిడికుదురు) : సెంటిమెంట్ ప్రాధాన్య చిత్రాల్లోనే నటిస్తానని ప్రముఖ సినీ నటి హేమ అన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి అప్పనపల్లి శ్రీ బాల బాలాజీ స్వామివారిని ఆమె మంగళవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా విలేకర్లతో మాట్లాడారు. హాస్య పాత్రలకన్నా సెంటిమెంట్ ప్రాధాన్యం ఉన్న చిత్రాల్లో నటించాలన్నది తన అభిమతమన్నారు. ప్రస్తుతం వాటికే ప్రాధాన్యం ఇస్తున్నానని చెప్పారు. ప్రముఖ దర్శకుడు బండ్రెడ్డి సుకుమార్ సొంత బ్యానర్‌పై నిర్మిస్తున్న చిత్రంతో పాటు ఆయన దర్శకత్వంలోనే రూపొందుతున్న మరో చిత్రంలో కూడా నటిస్తున్నానని హేమ తెలిపారు. దీంతోపాటు శ్రీకాంత్, అల్లరి నరేష్‌లు హీరోలుగా నిర్మిస్తున్న మరో రెండు చిత్రాల్లో కూడా నటిస్తున్నానన్నారు. తెలుగులో విజయం సాధించిన ‘జులాయి’ తమిళ రీమేక్‌తోపాటు మరో తమిళ చిత్రంలో కూడా నటిస్తున్నానని చెప్పారు. తాను నటించిన అయిదు చిత్రాలు ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉన్నాయన్నారు. ఇష్టదైవం వేంకటేశ్వరస్వామి వేంకటేశ్వరస్వామి తన ఇష్టదైవమని హేమ చెప్పారు. అప్పనపల్లి శ్రీ బాలబాలాజీ స్వామి అంటే చిన్నప్పటి నుంచీ తనకు ఎంతో నమ్మకమన్నారు. ఆరేళ్ల వయసు నుంచి క్రమం తప్పకుండా స్వామివారిని దర్శించుకుంటున్నానన్నారు. స్వామివారిని ఏం కోరుకున్నా నూరు శాతం అది నెరవేరుతుందన్నారు. స్వామివారి ఆశీస్సులతోనే తాను సినీ రంగంలో స్థిరపడ్డానన్నారు. రాజోలులో తన ఇంటికి వచ్చిన ప్రతిసారీ స్వామివారిని దర్శించుకుని వెళ్లడం అలవాటని ఆమె చెప్పారు. -
ఆమె ఏమైంది!
మామిడికుదురు :తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్‌నగర్ జిల్లా కొత్తకోట మండలం పామాపురానికి చెందిన అంతటి శిరీష(25) అదృశ్యంపై ఆమె అన్నయ్య ధనుంజయ్‌గౌడ్ నగరం పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేశాడు. ఆమెను ప్రేమ వివాహం చేసుకున్న మామిడికుదురు మండలం పాశర్లపూడికి చెందిన గెడ్డం జగదీష్.. భార్యను హతమార్చి, మృతదేహాన్ని తోటలో ఖననం చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. మూడు నెలల నుంచి తన చెల్లెలు కనిపించడం లేదని, దీనిపై ఆరా తీయగా.. జగదీష్ ఆమెను హతమార్చి తన సొంత పొలంలోనే మృతదేహాన్ని ఖననం చేసినట్లు నిర్ధారణ అయిందన్నాడు. దీనిపై విచారణ జరిపి, న్యాయం చేయాలని కోరాడు. ఈ సంఘటనపై ధనుంజయ్‌గౌడ్ ఇక్కడి విలేకరులకు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. శిరీష బీఏ చదివింది. చిన్నతనంలోనే తల్లి పుష్ప చనిపోవడంతో అమ్మమ్మ చంద్రమ్మ ఆమెను పోషించింది. శిరీషకు, జగదీష్‌తో ఏర్పడిన పరిచయం వారి పెళ్లికి దారితీసింది. 2012 డిసెంబర్ 9న రాజోలులో వీరు వివాహం చేసుకున్నారు. ఈ ఏడాది జనవరి 4న వారికి బాబు పుట్టాడు. ఇంట్లో చెప్పకుండా వెళ్లిపోయిందన్న కోపంతో శిరీష కుటుంబ సభ్యులు వారి గురించి పట్టించుకోలేదు. తర్వాత ఫోన్లో ఆమె తన పుట్టింటి వారితో మాట్లాడేది. ఒకసారి పుట్టింటికి వెళ్లింది. మూడు నెలల నుంచి ఆమె ఫోన్ రాకపోవడంతో అనుమానం వచ్చిన ధనుంజయ్‌గౌడ్ ఇక్కడకు వచ్చి ఆరా తీశాడు. స్థానికులు చెప్పిన సమాచారంతో అతడికి కొన్ని వివరాలు తెలిశాయి. మంగళవారం అతడు జగదీష్ ఇంటికి వె ళ్లి ఆరాతీయగా, జగదీష్ రాశాడంటూ అతడి తల్లి ఓ లెటర్ చూపించింది. కడుపులో కణితి వల్ల నొప్పి భరించలేక శిరీష ఉరివేసుకుందని, మృతదేహాన్ని రాజోలు నుంచి పాశర్లపూడికి తీసుకొచ్చి ఖననం చేసినట్టు, కుమారుడితో తాను ముంబై వెళ్లిపోతున్నట్టు లేఖలో రాసి ఉంది. కాగా శిరీషను హతమార్చి, దానిని ఆత్మహత్యగా చిత్రీకరించేందుకే జగదీష్ ఈ లేఖ రాశాడని ధనుంజయ్‌గౌడ్ ఆరోపించాడు. దీనిపై విచారణ జరిపించి, జగదీష్‌పై చర్యలు తీసుకోవాలని అతడు ఫిర్యాదులో కోరాడు. దీనిపై నగరం ఎస్సై బి.సంపత్‌కుమార్‌ను వివరణ కోరగా, ఇంకా తమకు ఫిర్యాదు అందలేదన్నారు. -
బ్రాందీషాపు వద్దు
పి.గన్నవరం, మామిడికుదురు :ఉభయ గోదావరి జిల్లాల సరిహద్దులోని కనకాయలంకలో బ్రాందీషాపు ఏర్పాటుపై స్థానికులు ఆందోళనకు దిగారు. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం కనకాయలంక గ్రామంలోని కాజ్వే వద్ద ఆదివారం గ్రామస్తులు ధర్నా చేశారు. పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని బ్రాందీ షాపు ఏర్పాటుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇదిలా ఉంటేపి.గన్నవరం మండల పరిధి చాకలిపాలానికి చేరుకుని కనకాయలంక గ్రామం ఉంది. అక్కడ ధర్నా జరుగుతున్న సమయంలో కొందరు స్థానికులు దీని వెనుక తూర్పుగోదావరి జిల్లాకు చెందిన బ్రాందీ షాపు యజమానుల పాత్ర ఉందని ఆరోపిస్తూ వారు కూడా ధర్నాకు దిగడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ధర్నా చేస్తున్న రెండు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఈ నేపథ్యంలో పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలకు సర్దిచెబుతుండగా ధర్నాలో పాల్గొన్న మహిళలపై కొందరు చేయి చేసుకోవడంతో వివాదం తీవ్రమైంది. దీంతో రెచ్చి పోయిన మహిళలు బ్రాందీషాపు ఏర్పాటు చేసేందుకు నిర్మిస్తున్న షెడ్డుపై దాడి చేశారు. స్థానికుడితో మహిళల వాగ్వివాదం మహిళల దాడితో షెడ్డు నిర్మాణ పనుల్లో ఉన్న తాపీమేస్త్రీలు, కూలీలు పరారయ్యారు. ధర్నా చేస్తున్న మహిళలు, పురుషులు అక్కడ ఉన్న సెంట్రింగ్ కర్రలతో షెడ్డు గోడలు కూల్చివేశారు. పక్కనే ఉన్న చెక్క బడ్డీని ధ్వంసం చేసి, బడ్డీ చెక్కలకు, రేకులకు నిప్పు పెట్టారు. ఆ సమయంలో స్థానికుడు చిట్టిబాబు మ హిళలతో వాగ్వివాదానికి దిగి, మహిళపై చేయిచేసుకోవడంతో గ్రామస్తులు అతడిపై దాడికి యత్నించారు. ఎస్సై శ్రీనివాస్ జోక్యం చేసుకుని చిట్టిబాబు ను అక్కడి నుంచి తప్పించారు. దీంతో చిట్టిబాబు క్షమాపణ చెప్పాలంటూ మహిళలు ధర్నాకు ఉపక్రమించారు. అయితే అదే సమయంలో చిట్టిబాబు మరోసారి సంఘటన స్థలానికి రాగా, మహిళలు అతడిని అడ్డుకున్నారు. అయితే పోలీసులు జోక్యం చేసుకుని అతడిని వేరొకచోటకి పంపారు. చిట్టిబాబుకు వత్తాసు పలుకుతున్నారంటూ మహిళలు ఎస్సై శ్రీనివాస్‌పై ధ్వజమెత్తారు. ఈ సమయంలో సంఘటన స్థలానికి చేరుకున్న పాలకొల్లు సీఐ ఎ.చంద్రశేఖర్ కలుగజేసుకుని మహిళలను శాంతింపజేశారు. అక్కడి నుంచి మళ్లీ ధర్నా ప్రదేశానికి వచ్చి గ్రామ సర్పంచ్ కడలి సత్యనారాయణ, ఎంపీటీసీ సభ్యుడు వలవల నాగేశ్వరరావు సమక్షంలో సీఐ విచారణ జరిపారు. ఏర్పాటు యవద్దని తీర్మానం.. సర్పంచ్ కడలి సత్యనారాయణ మాట్లాడుతూ బ్రాందీషాపు పెట్టేందుకు వ్యా పారులు ముందుగా తనను సంప్రదిం చారని, గ్రామస్తులతో చర్చించి చెబుతానని చెప్పానన్నారు. తమ ప్రమే యం లేకుండానే విజయదశమి రోజున బడ్డీ పెట్టి అమ్మకాలు ప్రారంభించారన్నారు. బ్రాందీషాపు ఏర్పాటు చేయరాదంటూ గ్రామసభలో తీర్మానం చేశామన్నారు. ఆ కాపీలను కలెక్టర్, ఆర్డీఓ, రెవెన్యూ, పోలీసు, ఎక్సైజ్ అధికారులకు పంపించామన్నారు. అయినా వారి నుంచి స్పందన రాకపోవడంతో శనివారం పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడును కలిసి సమస్యను విన్నవించామని చెప్పారు. రాత్రి వేళల్లో ఇబ్బందులు రాకుండా కనకాయలంక రావడానికి కాజ్వే ఒక్కటే మార్గమని, ఆ ప్రాంతంలో ఇప్పటికే రాత్రి సమయంలో తాగుబోతులు హల్చల్ చేస్తున్నారని మహిళలు వాపోయారు. ఈ నేపథ్యంలో ఇక్కడ బ్రాందీ షాపు పెడితే మహిళలకు రక్షణ లేకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. సీఐ చంద్రశేఖర్ స్పందిస్తూ మీ ఆమోదం, మా అనుమతి లేకుండా ఇక్కడ బ్రాందీషాపు ఏర్పాటు చేసేందుకు అనుమతించేది లేదని చెప్పారు. మహిళపై దాడి చేసిన చిట్టిబాబుతో పాటు, షెడ్డు కూల్చిన వారిపైనా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ఆందోళనలో వందలాది మంది డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు. -
వివాహిత దారుణ హత్య
నగరం (మామిడికుదురు) :కట్నదాహం ఓ వివాహితను బలిగొంది. భార్యపై అనుమానం పెంచుకోవడమే కాకుండా కట్నం కోసం ఆమెను భర్త దారుణంగా హతమార్చాడు. ‘అమ్మను నాన్న కొట్టి చంపేశాడు’ అంటూ ఆమె నాలుగేళ్ల కుమార్తె చెబుతున్న మాటలు అక్కడి వారి గుండెలను ద్రవింపజేశాయి. నగరం పంచాయతీలోని మొల్లేటివారిపాలేనికి చెందిన కట్టా సుమలత(22) హత్యకు గురైంది. పోలీసులు, ఆమె బంధువులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. అమలాపురం రూరల్ మండలం బండారులంకకు చెందిన సుమలతకు, నగరం గ్రామానికి చెందిన కట్టా కృష్ణతో ఐదేళ్ల క్రితం వివాహమైంది. అప్పట్లో కట్నం రూపేణా రూ.మూడు లక్షల నగదు ఇవ్వగా, ఇంకా రూ.30 వేలు తర్వాత ఇస్తామని సుమలత తల్లిదండ్రులు చెప్పారు. పెళ్లయిన అనంతరం నగరంలోనే కృష్ణ, సుమలత కాపురం ఉన్నారు. ఏడాదికే వారికి కుమార్తె మోహన కల్యాణి పుట్టింది. పాపను ఆడపడుచు వద్ద ఉంచి, నాలుగేళ్ల క్రితం భార్యాభర్తలిద్దరూ కువైట్‌లో ఉపాధికి వెళ్లిపోయారు. అక్కడ వేర్వేరుచోట్ల వారు పనులు చేస్తున్నారు. ఇలాఉండగా పెళ్లయినప్పటి నుంచి కృష్ణ తన భార్యపై అనుమానం పెంచుకోవడమే కాకుండా, కట్నం బాకీ కోసం వేధించేవాడు. ఇక్కడ ఉన్నప్పుడూ భర్తతో పాటు ఆడపడుచులు కూడా వేధించేవారు. రెండు నెలల క్రితం వచ్చి.. కాగా సుమలత రెండు నెలల క్రితమే కువైట్ నుంచి అత్తవారింటికి వచ్చింది. తోపుడు బండిపై పండ్ల వ్యాపారం చేసే ఈమె మావయ్య కట్టా నాగేశ్వరరావు వారం రోజుల క్రితం చనిపోయాడు. దీంతో అదే రోజు కృష్ణ కూడా కువైట్ నుంచి ఇక్కడకు వచ్చాడు. ఈ క్రమం లో కట్నం డబ్బు ఇవ్వకపోతే సుమలతను చంపుతానని ఆమె తమ్ముడు ధనశేఖర్‌ను కృష్ణ హెచ్చరించాడు. మావయ్య దినకార్యం అయ్యాక ఆ విషయాలు మాట్లాడదామని ధనశేఖర్ అతడికి నచ్చజెప్పాడు. ఏమైందో ఏమో శనివారం ఉదయానికి సుమలత మృతదేహం కాలిపోయిన పరిస్థితిలో అత్తవారింట్లో పడి ఉంది. సంఘటన స్థలాన్ని అమలాపురం డీఎస్పీ ఎం.వీరారెడ్డి పరిశీలించారు. ఆమెను శుక్రవారం అర్ధరాత్రి దాటాక హతమార్చి, అనంతరం కిరోసిన్ పోసి నిప్పంటించి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. సుమలత తమ్ముడు గుత్తుల ధనశేఖర్ ఫిర్యాదు మేరకు వరకట్నం వేధింపులు, హత్య కేసు నమోదు చేశారు. మృతదేహానికి తహశీల్దార్ టీజే సుధాకర్‌రాజు శవపంచనామా నిర్వహించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం రాజోలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. రాజోలు సీఐ ఎన్.మధుసూధనరావు ఆధ్వర్యంలో ఎస్సై బి.సంపత్ కుమార్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. భర్తే చంపేశాడు త్వరతోనే కట్నం విషయం మాట్లాడదామని బావతో చెప్పానని, ఇంతలోనే అక్కను చంపేశాడని ధనశేఖర్ విలపిం చాడు. నాన్న అమ్మను కొట్టాడని, అమ్మ ను చంపేశాడని సుమలత కుమార్తె మో హనకల్యాణి చెప్పింది. సుమలత భర్త, ఆడపడుచులు, అత్తను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. సుమలతను అత్తింటివారే హతమార్చారని, వారిని కఠినంగా శిక్షించాలని ఆమె బంధువులు డిమాండ్ చేశారు. -
చమురు సంస్థల గేట్లకు తాళాలు
నగరం (మామిడికుదురు) : గెయిల్ గ్యాస్ పైప్‌లైన్ విస్ఫోటన బాధితులు శుక్రవారం చమురు సంస్థల కార్యాలయాల గేట్లకు తాళాలు వేసి ఆందోళన నిర్వహించారు. 23 రోజులుగా తాము రిలే నిరాహార దీక్షలు చేస్తున్నప్పటికీ తమను ఎవరూ పట్టించుకోలేదంటూ మహిళలు ఆందోళనకు దిగారు. స్థానిక గ్యాస్ కలెక్టింగ్ స్టేషన్ (జీసీఎస్)తో పాటు మినీ ఆయిల్ రిఫైనరీ గేట్లకు తాళాలు వేశారు. ముందుగా దీక్షా శిబిరం నుంచి బాధితులు నినాదాలు చేస్తూ జీసీఎస్ వైపు చొచ్చుకు వెళ్లారు. ప్రధాన గేటు వద్ద నిలువరించేందుకు యత్నించిన పోలీసులను తోసుకొని జీసీఎస్ ప్రధాన గేటు వద్దకు చేరుకున్నారు. అక్కడ గేటుకు తాళం వేసి ఓఎన్జీసీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీఐఎస్ఎఫ్ సిబ్బంది మహిళ పట్ల అనుచితంగా ప్రవర్తించడంతో అతను క్షమాపణ చెప్పాలంటూ అక్కడే బైఠాయించారు. సీఐఎస్ఎఫ్ అధికారి క్షమాపణ కోరడంతో శాంతించారు. అక్కడి నుంచి గెయిల్ కార్యాలయానికి వెళ్లే గేటు వద్దకు చేరుకుని దానికి తాళాలు వేశారు. అక్కడి నుంచి ప్రదర్శనగా మినీ ఆయిల్ రిఫైనరీ గేటు వద్దకు చేరుకుని దానికి కూడా తాళం వేశారు. దాంతో చమురు ఉత్పత్తుల తరలింపు నిలిచి పోయింది. గేట్లకు బాధితులు వేసిన తాళాలు అలాగే ఉన్నాయి. వాటిని తొలగిస్తే పరిస్థితి ఉద్రిక్తం కావచ్చని పోలీసులు మిన్నకుండి పోయారు. అనంతరం రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు. క్షతగాత్రులకు చనిపోయిన వారితో సమానంగా రూ.25 లక్షలు పరిహారం చెల్లించాలని, పేలుడు ధాటికి దెబ్బతిన్న కొబ్బరి చెట్లకు రూ.25 వేలు పరిహారం చెల్లించాలని, దెబ్బతిన్న ఇళ్ల స్థానే పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని బాధితులు డిమాండ్ చేశారు. వైఎస్సార్ సీపీ కో-ఆర్డినేటర్లు కొండేటి చిట్టిబాబు, బొంతు రాజేశ్వరరావు, రైతు విభాగం రాష్ట్ర కమిటీ సభ్యుడు జక్కంపూడి తాతాజీ, ఆర్పీఐ అధ్యక్షుడు ఆర్ఎస్ రత్నాకర్, ముకరం హుస్సేన్, బొంతు మణిరాజు, జాలెం సుబ్బారావు, జక్కంపూడి వాసు, అడబాల నాగేశ్వరరావు, వానరాశి శంకర్రావు, వీరవల్లి చిట్టిబాబు, తోరం భాస్కర్, బొలిశెట్టి భగవాన్, కొమ్ముల రాము, వానరాశి త్రిమూర్తులు, మొల్లేటి కృష్ణమూర్తి, భీమాల రమామణి, వానరాశి అమ్మాజీ, లక్ష్మి, బొరుసు శ్రీదేవి, వానరాశి కనకలక్ష్మి, సూర్యసాయిభాను, సుజాత, మొల్లేటి పద్మావతి, నాగలక్ష్మి, రాధాకుమారి, అన్నపూర్ణ, కడలి అనంతలక్ష్మి, వాసంశెట్టి సరస్వతి తదితరులు పాల్గొన్నారు. -
ఎంత.. ఏమిటి .. ఎలా?
నగరం,(మామిడికుదురు) :గ్యాస్ పైపులైన్ విస్ఫోటం ఘటనపై రాష్ట్ర హైకోర్టు సూచనల మేరకు రాజోలు సీనియర్ సివిల్ జడ్జి పి.రాజేంద్రప్రసాద్ మంగళవారం విచారణ నిర్వహించారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో బాధితులు, గ్రామస్తులు, గెయిల్, రెవెన్యూ అధికారుల నుంచి వివరాలు సేకరించారు. పేలుడు వల్ల ఎంత మేర నష్టం జరిగింది, ఎంత మంది చనిపోయారు, ఎంత మంది గాయపడ్డారు, వారి ప్రస్తుత పరిస్థితి, పంట నష్టమెంత? గృహాలకు, పశువులకు జరిగిన నష్టం ఎంత? గెయిల్ అధికారులు అందించిన పరిహారంపై బాధితుల స్పందన ఎలా ఉంది? బాధితులకు పరిహారం అందించడంలో సమస్యలున్నాయా? రిలే నిరాహార దీక్షలు ఎందుకు చేస్తున్నారు? వారి డిమాండ్లు ఏంటి? తదితర అంశాలపై జడ్జి రాజేంద్రప్రసాద్ వివరాలు నమోదు చేసుకున్నారు. బుధవారం సాయంత్రానికి కల్లా నివేదిక ఇవ్వాల్సి ఉందని ఆయన వెల్లడించారు. న్యాయం జరగలేదని... కొబ్బరి చెట్లకు పరిహారం అందించే విషయంలో తమకు న్యాయం జరగడం లేదని వానరాశి శంకర్రావు, రాయుడు జనార్దన్, అక్రమ్ అలీ ఫిర్యాదు చేశారు. కొబ్బరి చెట్లు చనిపోవడం వల్ల పదేళ్ల పాటు తమకు నెలనెలా వచ్చే ఆదాయాన్ని కోల్పోవలసి వస్తోందన్నారు. క్షతగాత్రులకు ఇచ్చే మొత్తాన్ని పెంచాలని డిమాండ్ చేశారు. దీనిపై గెయిల్ అధికారులు మాట్లాడుతూ జిల్లా అధికారుల సూచన మేరకు పరిహారం చెల్లిస్తున్నామన్నారు. బాధితుల డిమాండ్లను పరిశీలిస్తామని చెప్పారు. పేలుడు వల్ల జరిగిన నష్టానికి పరిహారం చెల్లింపులో అన్యాయం జరిగితే చైర్మన్, మండల లీగల్ సర్వీసు కమిటీ, రాజోలు పేరిట తమకు దరఖాస్తు చేసుకుంటే ఉచితంగా న్యాయ సహాయం చేస్తామని జడ్జి రాజేంద్రప్రసాద్ వివరించారు. అనంతరం పేలుడు జరిగిన ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. స్థానిక సర్పంచ్ మొల్లేటి కొండాలమ్మ, గెయిల్ డీజీఎం అనూప్ గుప్తా, చీప్ మేనేజర్లు పీఎన్ రావు, పి.మోహన్కొండయ్య, రాజారావు, ఏజీపీ మైఖేల్, ఏపీపీ సుధాకర్, అడ్వకేట్ వి.లక్ష్మీపతి, ఎం.అక్కిరాజు పాల్గొన్నారు. -
రక్షణ కల్పించకుంటే రణభేరి
నగరం (మామిడికుదురు) : ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించే వరకు చమురు సంస్థలపై వైఎస్సార్ కాంగ్రెస్ రాజీ లేని పోరాటం చేస్తుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కుడుపూడి చిట్టబ్బాయి అన్నారు. నగరంలో గత నెలలో జరిగిన గెయిల్ గ్యాస్ పైపులైన్ పేలుడులో 21 మంది మృత్యువాత పడగా 18 మంది తీవ్రంగా గాయపడిన సంగతి విదితమే. బాధిత కుటుంబాలకు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీ మేరకు ఆదివారం పార్టీ తరఫున 39 మంది బాధితులకు రూ.25.50 ల క్షల (మృతుల కుటుంబాల రూ.లక్ష, గాయపడ్డవారికిరూ.25 వేల చొప్పున) ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో పార్టీ శాసనసభా పక్ష ఉప నాయకుడు, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ ప్రజల భాగస్వామ్యంతో ఓఎన్జీసీపై సమరం సాగించాల్సి ఉందన్నారు. సీఈసీ సభ్యులు, మాజీ మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్ మాట్లాడుతూ పైపులైన్లను అంతర్జాతీయ ప్రమాణాలతో జనావాసాలకు దూరంగా ఏర్పాటు చేయాలని సూచించారు. రక్షణ చర్యల విషయంలో రాజీ పడితే క్షమించే ప్రసక్తే లేదన్నారు. ‘మన గ్యాస్ మనహక్కు’ నినాదంతో ఓఎన్జీసీపై పోరాడాలని సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి సూచించారు. ఓఎన్జీసీ, గెయిల్‌లపై పోరాటంలో ఆమరణ నిరాహారదీక్ష చేసి ప్రాణ త్యాగానికైనా సిద్ధమన్నారు. గెయిల్ అధికారులకు అధికార టీడీపీ నాయకులు వత్తాసు పలుకుతూ బాధితులకు అన్యాయం చేస్తున్నారని కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆరోపించారు. అనుక్షణం భయంతో కాలం గడుపుతున్న కోనసీమ ప్రజలకు భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రజలకు రక్షణ కల్పించే వరకు ఓఎన్జీసీపై పోరాడాలని ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు అన్నారు. రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు కొల్లి నిర్మల కుమారి, మాజీ ఎమ్మెల్యే అల్లూరు కృష్ణంరాజు, రైతు విభాగం రాష్ట్ర కమిటీ సభ్యులు జక్కంపూడి తాతాజీ, పి.గన్నవరం కో ఆర్డినేటర్ కొండేటి చిట్టిబాబు, జిల్లా అధికార ప్రతినిధి పి.కె.రావు, జిల్లా కో ఆర్డినేటర్ మిండగుదిటి మోహన్, పరిశ్రమల విభాగం జిల్లా కన్వీనర్ మంతెన రవిరాజు, కో ఆర్డినేటర్ గుత్తుల సాయి, ఆర్వీవీఎస్ఎన్ చౌదరి, చెల్లుబోయిన శ్రీను, మండల కన్వీనర్లు బొలిశెట్టి భగవాన్, అడ్డగళ్ల వెంకటసాయిరామ్, యెనుముల నారాయణస్వామి, సర్పంచ్‌లు కశిరెడ్డి ఆంజనేయులు, సిర్రా శ్రీనివాస్, నేల ప్రభుదాసు, ఎంపీటీసీలు యాండ్ర వీరబాబు, జోగి వెంకటరామకృష్ణ, రేవు జ్యోతి, స్థానిక సర్పంచ్ మొల్లేటి కొండాలమ్మ, కొమ్ముల రాము, కొనుకు నాగరాజు, జక్కంపూడి వాసు, బండారు కాశీ, తెన్నేటి కిశోర్, గన్నవరపు శ్రీనివాసరావు, ఎండీవై షరీఫ్, వాకపల్లి వీరాస్వామి, కుంపట్ల బాబి పాల్గొన్నారు.