రక్షణ కల్పించకుంటే రణభేరి
నగరం (మామిడికుదురు) : ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించే వరకు చమురు సంస్థలపై వైఎస్సార్ కాంగ్రెస్ రాజీ లేని పోరాటం చేస్తుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కుడుపూడి చిట్టబ్బాయి అన్నారు. నగరంలో గత నెలలో జరిగిన గెయిల్ గ్యాస్ పైపులైన్ పేలుడులో 21 మంది మృత్యువాత పడగా 18 మంది తీవ్రంగా గాయపడిన సంగతి విదితమే. బాధిత కుటుంబాలకు పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీ మేరకు ఆదివారం పార్టీ తరఫున 39 మంది బాధితులకు రూ.25.50 ల క్షల (మృతుల కుటుంబాల రూ.లక్ష, గాయపడ్డవారికిరూ.25 వేల చొప్పున) ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో పార్టీ శాసనసభా పక్ష ఉప నాయకుడు, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ ప్రజల భాగస్వామ్యంతో ఓఎన్‌జీసీపై సమరం సాగించాల్సి ఉందన్నారు.
సీఈసీ సభ్యులు, మాజీ మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్ మాట్లాడుతూ పైపులైన్లను అంతర్జాతీయ ప్రమాణాలతో జనావాసాలకు దూరంగా ఏర్పాటు చేయాలని సూచించారు. రక్షణ చర్యల విషయంలో రాజీ పడితే క్షమించే ప్రసక్తే లేదన్నారు. ‘మన గ్యాస్ మనహక్కు’ నినాదంతో ఓఎన్‌జీసీపై పోరాడాలని సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి సూచించారు. ఓఎన్‌జీసీ, గెయిల్‌లపై పోరాటంలో ఆమరణ నిరాహారదీక్ష చేసి ప్రాణ త్యాగానికైనా సిద్ధమన్నారు. గెయిల్ అధికారులకు అధికార టీడీపీ నాయకులు వత్తాసు పలుకుతూ బాధితులకు అన్యాయం చేస్తున్నారని కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆరోపించారు. అనుక్షణం భయంతో కాలం గడుపుతున్న కోనసీమ ప్రజలకు భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రజలకు రక్షణ కల్పించే వరకు ఓఎన్‌జీసీపై పోరాడాలని ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు అన్నారు.
రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు కొల్లి నిర్మల కుమారి, మాజీ ఎమ్మెల్యే అల్లూరు కృష్ణంరాజు, రైతు విభాగం రాష్ట్ర కమిటీ సభ్యులు జక్కంపూడి తాతాజీ, పి.గన్నవరం కో ఆర్డినేటర్ కొండేటి చిట్టిబాబు, జిల్లా అధికార ప్రతినిధి పి.కె.రావు, జిల్లా కో ఆర్డినేటర్ మిండగుదిటి మోహన్, పరిశ్రమల విభాగం జిల్లా కన్వీనర్ మంతెన రవిరాజు, కో ఆర్డినేటర్ గుత్తుల సాయి, ఆర్‌వీవీఎస్‌ఎన్ చౌదరి, చెల్లుబోయిన శ్రీను, మండల కన్వీనర్లు బొలిశెట్టి భగవాన్, అడ్డగళ్ల వెంకటసాయిరామ్, యెనుముల నారాయణస్వామి, సర్పంచ్‌లు కశిరెడ్డి ఆంజనేయులు, సిర్రా శ్రీనివాస్, నేల ప్రభుదాసు, ఎంపీటీసీలు యాండ్ర వీరబాబు, జోగి వెంకటరామకృష్ణ, రేవు జ్యోతి, స్థానిక సర్పంచ్ మొల్లేటి కొండాలమ్మ, కొమ్ముల రాము, కొనుకు నాగరాజు, జక్కంపూడి వాసు, బండారు కాశీ, తెన్నేటి కిశోర్, గన్నవరపు శ్రీనివాసరావు, ఎండీవై షరీఫ్, వాకపల్లి వీరాస్వామి, కుంపట్ల బాబి పాల్గొన్నారు.