నగరం (మామిడికుదురు) : గెయిల్ గ్యాస్ పైప్‌లైన్ విస్ఫోటన బాధితులు శుక్రవారం చమురు సంస్థల కార్యాలయాల గేట్లకు తాళాలు వేసి ఆందోళన నిర్వహించారు. 23 రోజులుగా తాము రిలే నిరాహార దీక్షలు చేస్తున్నప్పటికీ తమను ఎవరూ పట్టించుకోలేదంటూ మహిళలు ఆందోళనకు దిగారు. స్థానిక గ్యాస్ కలెక్టింగ్ స్టేషన్ (జీసీఎస్)తో పాటు మినీ ఆయిల్ రిఫైనరీ గేట్లకు తాళాలు వేశారు.
ముందుగా దీక్షా శిబిరం నుంచి బాధితులు నినాదాలు చేస్తూ జీసీఎస్ వైపు చొచ్చుకు వెళ్లారు. ప్రధాన గేటు వద్ద నిలువరించేందుకు యత్నించిన పోలీసులను తోసుకొని జీసీఎస్ ప్రధాన గేటు వద్దకు చేరుకున్నారు. అక్కడ గేటుకు తాళం వేసి ఓఎన్‌జీసీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది మహిళ పట్ల అనుచితంగా ప్రవర్తించడంతో అతను క్షమాపణ చెప్పాలంటూ అక్కడే బైఠాయించారు. సీఐఎస్‌ఎఫ్ అధికారి క్షమాపణ కోరడంతో శాంతించారు. అక్కడి నుంచి గెయిల్ కార్యాలయానికి వెళ్లే గేటు వద్దకు చేరుకుని దానికి తాళాలు వేశారు.
అక్కడి నుంచి ప్రదర్శనగా మినీ ఆయిల్ రిఫైనరీ గేటు వద్దకు చేరుకుని దానికి కూడా తాళం వేశారు. దాంతో చమురు ఉత్పత్తుల తరలింపు నిలిచి పోయింది. గేట్లకు బాధితులు వేసిన తాళాలు అలాగే ఉన్నాయి. వాటిని తొలగిస్తే పరిస్థితి ఉద్రిక్తం కావచ్చని పోలీసులు మిన్నకుండి పోయారు. అనంతరం రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు. క్షతగాత్రులకు చనిపోయిన వారితో సమానంగా రూ.25 లక్షలు పరిహారం చెల్లించాలని, పేలుడు ధాటికి దెబ్బతిన్న కొబ్బరి చెట్లకు రూ.25 వేలు పరిహారం చెల్లించాలని, దెబ్బతిన్న ఇళ్ల స్థానే పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని బాధితులు డిమాండ్ చేశారు.
వైఎస్సార్ సీపీ కో-ఆర్డినేటర్లు కొండేటి చిట్టిబాబు, బొంతు రాజేశ్వరరావు, రైతు విభాగం రాష్ట్ర కమిటీ సభ్యుడు జక్కంపూడి తాతాజీ, ఆర్పీఐ అధ్యక్షుడు ఆర్‌ఎస్ రత్నాకర్, ముకరం హుస్సేన్, బొంతు మణిరాజు, జాలెం సుబ్బారావు, జక్కంపూడి వాసు, అడబాల నాగేశ్వరరావు, వానరాశి శంకర్రావు, వీరవల్లి చిట్టిబాబు, తోరం భాస్కర్, బొలిశెట్టి భగవాన్, కొమ్ముల రాము, వానరాశి త్రిమూర్తులు, మొల్లేటి కృష్ణమూర్తి, భీమాల రమామణి, వానరాశి అమ్మాజీ, లక్ష్మి, బొరుసు శ్రీదేవి, వానరాశి కనకలక్ష్మి, సూర్యసాయిభాను, సుజాత, మొల్లేటి పద్మావతి, నాగలక్ష్మి, రాధాకుమారి, అన్నపూర్ణ, కడలి అనంతలక్ష్మి, వాసంశెట్టి సరస్వతి తదితరులు పాల్గొన్నారు.
చమురు సంస్థల గేట్లకు తాళాలు
Published Sat, Jul 26 2014 12:41 AM | Last Updated on Sat, Apr 6 2019 8:52 PM
Advertisement