మామిడికుదురు : పాశర్లపూడిలంక గ్రామంలో పాశర్లపూడి-18 బావి వద్ద శుక్రవారం సాయంత్రం ఏర్పడిన గ్యాస్ లీకేజీ సంఘటన స్థానికులను భయాందోళనకు గురి చేసింది. 15 నిమిషాల పాటు భారీశబ్ధంతో గ్యాస్ లీకవడంతో ఏం జరుగుతుందో తెలియక స్థానికులు ఆందోళన చెందారు. గ్యాస్ లీకైన ప్రాంతంలో ఆడుకుంటున్న యువకులు పరుగులు తీశారు. వెంటనే సమాచారాన్ని గ్రామస్తులు ఓఎన్‌జీసీ అధికారులకు, నగరం పోలీసులకు, రాజోలు అగ్నిమాపక కేంద్రం అధికారులకు అందించారు. అక్కడికి చేరుకున్న ఓఎన్‌జీసీ అధికారులు లీకేజీని అదుపు చేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. మూడు పైపుల నుంచి భారీశబ్ధంతో గ్యాస్‌తో పాటు కొద్దిపాటి ముడి చమురు లీకైంది.
నగరం పోలీసులు, ఓఎన్‌జీసీకి చెందిన స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ పోలీసులు, అగ్నిమాపక కేంద్రం సిబ్బంది పరిస్థితిని సమీక్షించారు. అక్కడికి చేరుకున్న ఓఎన్‌జీసీ సిబ్బందిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓఎన్‌జీసీ బావి వద్ద కాపలాగా గార్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నా పట్టించుకోవడం లేదని స్థానిక సర్పంచ్ బొరుసు నర్సింహమూర్తి, గ్రామస్తులు ముత్యాల సత్యనారాయణ, కోలా సత్యనారాయణ, పొలమూరి సత్యనారాయణ, పితాని వెంకటేశ్వరరావు, పెదమల్లు వెంకటేశ్వరరావు, రామకృష్ణ, తెలగారెడ్డి బులినాగేశ్వరరావు ఆందోళన వ్యక్తం చేశారు. ఓఎన్‌జీసీ సిబ్బందిని నిర్బంధించారు.
ఇది గ్యాస్ లీకేజీ కాదని, పాశర్లపూడి-18 బావి ఉత్పత్తిలో లేదని, ఐపీఎస్-8 బావిలో హైడ్రో టెస్టింగ్ పరీక్షలు చేస్తుండగా ఈ సంఘటన జరిగిందని ఓఎన్‌జీసీ సిబ్బంది వివరించారు. ఆ బావికి చెందిన పైప్‌నుంచి నీటితో పాటు గాలి పంపించి పరీక్షలు చేస్తుండగా అదే బావికి అనుసంధానమై ఉన్న ఈ బావి వద్ద గాలి, నీరు బయటకు ఎగజిమ్మాయని వివరించారు. ఈ విషయం ముందుగా తమకు తెలియచేయకపోవడం వల్ల ఆందోళన చెందామని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓఎన్‌జీసీ అధికారులు గతంలో తమకు పలు హామీలు ఇచ్చారని, వాటిని ఇంత వరకు అమలు చేయలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానికులకు ముందుగా సమాచారం అందించక పోవడం తమ పొరపాటని, ఆందోళనను ఉన్నతాధికారుల దృష్టి కి తీసుకెళ్తామనడంతో గ్రామస్తులు శాంతించారు.
ఆందోళనకు గురిచేసిన గ్యాస్ లీకేజీ
Published Sat, Aug 1 2015 2:57 AM | Last Updated on Tue, Aug 21 2018 5:51 PM
Advertisement
Advertisement