
చెక్కులందుకునే వేళ..చెక్కిళ్లు కన్నీటివాగులు
తరగని సంపదను ఆర్జించిన వారైనా.. తుదకు వట్టి చేతులతోనే మట్టిలో కలిసిపోక తప్పదు. ఇంటా, బయటా గాలిలోనే బాహాటంగా నక్కి, వేయి బాహువుల మృత్యువులా విరుచుకుపడ్డ గ్యాస్ విస్ఫోటంతో విగతజీవులైన వారూ అలాగే ఖాళీ చేతులతోనే జీవితం చాలించారు. అయితే ఆ బడుగుజీవులు జీవితకాలంలో సంపాదించిన ధనం కన్నా.. పదిలంగా అల్లుకున్న అనుబంధాలే ఎక్కువ. అందుకే.. వారి మరణ పరిహారపు చెక్కులు చేతికొచ్చిన వేళ వారి ఆత్మీయుల కనులు కన్నీటి కడలులయ్యాయి. గుండెలు దుఃఖపు సుడిగుండాలయ్యాయి. ఆ చెక్కుల్లోనిఅక్షరాల్లో, అంకెల్లో తమ వారిని బలిగొన్న అగ్నికీలలు
కనిపించాయేమో.. బావురుమని విలపించారు.
నగరం (మామిడికుదురు) :‘మనవడా! మొన్నటివరకూ నువ్వు బతికుండగా బువ్వ పెట్టావు. ఇప్పుడు నన్ను విడిచి ఈ లోకం నుంచే వెళ్లినా..నా అన్నానికి లోటు రాకూడదని ఈ ఏర్పాటు చేశావా నా కన్నా!’.. ఓ వృద్ధుడి మనోవేదన ఇది! ‘కొడుకా! నీతో తలకొరివి పెట్టించుకోవలసిన వాడిని. అలాంటిది.. నాకన్నా ముందు నువ్వే బుగ్గయిపోయావు. నువ్వు లేని లోటును ఏ పరిహారం పూడుస్తుందిరా నా తండ్రీ!’ మరో వృద్ధుడి హృదయ క్షోభ ఇది! ‘అమ్మా! కంటిని రెప్పలా కాచి, మమ్మల్ని పెంచావు. రుణం తీర్చుకోవలసింది మేము కాగా..నువ్వే ఇలా తీర్చుకుంటున్నావా తల్లీ!’ ఓ మహిళ అంతరంగంలోని ఆవేదన ఇది. నగరం గ్యాస్ పైపులైన్ పేలుడులో మృత్యువాత పడ్డ వారికి గెయిల్, రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పరిహారాన్ని ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు సోమవారం వారి కుటుంబసభ్యులకు, బంధువులకు అందజేశారు. పరిహారం చెక్కులు అందుకుంటున్న సమయంలో వారు.. శాశ్వతంగా తమను వీడి వెళ్లిన ఆత్మీయుల స్మృతులతో కదిలిపోయారు. వారి చెక్కిళ్లు కన్నీటివాగులయ్యాయి.
ఏమిస్తే నావాళ్లు తిరిగొస్తారు?
దుర్ఘటనలో అయిన వారందరినీ కోల్పోయి ఒంటరిగా మిగిలిన చిరవూరి వెంకట్రావు అనే 70 ఏళ్ల వృద్ధుడు చెక్కు తీసుకుంటూ.. ‘ఈ పరిహారంతో పోయిన నా వాళ్లు తిరిగొస్తారా?’ అంటూ కుమిలికుమిలి ఏడ్చాడు. పేలుడులో అతడి కుమార్తె గటిగంటి కుమారి, మనవడు శ్రీనివాసరావు, మనవడి భార్య కోకిల, మునిమనవలు సుజిత, సాయి సజీవ దహనమయ్యారు. తడబడే అడుగులతో వచ్చి, వణికే చేతులతో చెక్కును అందుకున్న వెంక్రటావు తనవారిని తలచుకుని విలపిస్తుంటే అందరి హృదయాలూ బరువెక్కాయి. ఇద్దరు యువకులు ఆ వృద్ధుడిని సముదాయిస్తూ.. తీసుకువెళ్లారు. పేలుడులో తాటికాయల సత్యనారాయణతో పాటు అతడి కుటుంబమంతా అగ్నికి ఆహుతైంది.
దాంతో పరిహారాన్ని సత్యనారాయణ తండ్రి రామారావుకు అందజేశారు. ‘కొడుకుతో తలకొరివి పెట్టించుకోవలసిన సమయంలో నాకీ ఖర్మ ఏమిటి భగవంతుడా?’ అంటూ రామారావు రోదించాడు. ఇదే ఘోరంలో రుద్రా నాగవేణి మృత్యువాత పడగా ఆమె భర్త సూరిబాబు తీవ్రంగా గాయపడి, చికిత్స పొందుతున్నాడు. ఆ దంపతుల ముగ్గురు కుమార్తెల్లో పెద్దదైన కొమ్మూరి రామలక్ష్మికి పరిహారం అందించారు. మృత్యుజ్వాలల్లో ఆహుతైన కన్నతల్లి, విషమస్థితిలో కొట్టుమిట్టాడుతున్న తండ్రి గుర్తుకు రాగా రామలక్ష్మి వేదికపై గొల్లుమంది.
పేలుడులో వానరాశి శ్రీరామలక్ష్మి, ఆమె ఇద్దరు కుమారులు ఆదినారాయణ, నరసింహమూర్తి మరణించారు. వారి కుటుంబసభ్యులు ఎవరూ లేకపోవడంతో పరిహారాన్ని సమీపబంధువులకు అందజేశారు.జరిగిన ఘోరం, అది సృష్టించిన విషాదం మనసులను పచ్చిపుండులా సలుపుతుండగా, పరిహారం చెక్కులు అందుకున్న మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు దుఃఖతీవ్రతతో శోకించడం స్థానికులను, వేదిక మీదున్న మంత్రులను, కలెక్టర్ నీతూప్రసాద్‌ను చలింపజేసింది. వారంతా బాధితులను అనునయించడానికి ప్రయత్నించారు.