
వివాహిత దారుణ హత్య
నగరం (మామిడికుదురు) :కట్నదాహం ఓ వివాహితను బలిగొంది. భార్యపై అనుమానం పెంచుకోవడమే కాకుండా కట్నం కోసం ఆమెను భర్త దారుణంగా హతమార్చాడు. ‘అమ్మను నాన్న కొట్టి చంపేశాడు’ అంటూ ఆమె నాలుగేళ్ల కుమార్తె చెబుతున్న మాటలు అక్కడి వారి గుండెలను ద్రవింపజేశాయి. నగరం పంచాయతీలోని మొల్లేటివారిపాలేనికి చెందిన కట్టా సుమలత(22) హత్యకు గురైంది. పోలీసులు, ఆమె బంధువులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
అమలాపురం రూరల్ మండలం బండారులంకకు చెందిన సుమలతకు, నగరం గ్రామానికి చెందిన కట్టా కృష్ణతో ఐదేళ్ల క్రితం వివాహమైంది. అప్పట్లో కట్నం రూపేణా రూ.మూడు లక్షల నగదు ఇవ్వగా, ఇంకా రూ.30 వేలు తర్వాత ఇస్తామని సుమలత తల్లిదండ్రులు చెప్పారు. పెళ్లయిన అనంతరం నగరంలోనే కృష్ణ, సుమలత కాపురం ఉన్నారు. ఏడాదికే వారికి కుమార్తె మోహన కల్యాణి పుట్టింది. పాపను ఆడపడుచు వద్ద ఉంచి, నాలుగేళ్ల క్రితం భార్యాభర్తలిద్దరూ కువైట్‌లో ఉపాధికి వెళ్లిపోయారు. అక్కడ వేర్వేరుచోట్ల వారు పనులు చేస్తున్నారు. ఇలాఉండగా పెళ్లయినప్పటి నుంచి కృష్ణ తన భార్యపై అనుమానం పెంచుకోవడమే కాకుండా, కట్నం బాకీ కోసం వేధించేవాడు. ఇక్కడ ఉన్నప్పుడూ భర్తతో పాటు ఆడపడుచులు కూడా వేధించేవారు.
రెండు నెలల క్రితం వచ్చి..
కాగా సుమలత రెండు నెలల క్రితమే కువైట్ నుంచి అత్తవారింటికి వచ్చింది. తోపుడు బండిపై పండ్ల వ్యాపారం చేసే ఈమె మావయ్య కట్టా నాగేశ్వరరావు వారం రోజుల క్రితం చనిపోయాడు. దీంతో అదే రోజు కృష్ణ కూడా కువైట్ నుంచి ఇక్కడకు వచ్చాడు. ఈ క్రమం లో కట్నం డబ్బు ఇవ్వకపోతే సుమలతను చంపుతానని ఆమె తమ్ముడు ధనశేఖర్‌ను కృష్ణ హెచ్చరించాడు. మావయ్య దినకార్యం అయ్యాక ఆ విషయాలు మాట్లాడదామని ధనశేఖర్ అతడికి నచ్చజెప్పాడు. ఏమైందో ఏమో శనివారం ఉదయానికి సుమలత మృతదేహం కాలిపోయిన పరిస్థితిలో అత్తవారింట్లో పడి ఉంది. సంఘటన స్థలాన్ని అమలాపురం డీఎస్పీ ఎం.వీరారెడ్డి పరిశీలించారు. ఆమెను శుక్రవారం అర్ధరాత్రి దాటాక హతమార్చి, అనంతరం కిరోసిన్ పోసి నిప్పంటించి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. సుమలత తమ్ముడు గుత్తుల ధనశేఖర్ ఫిర్యాదు మేరకు వరకట్నం వేధింపులు, హత్య కేసు నమోదు చేశారు. మృతదేహానికి తహశీల్దార్ టీజే సుధాకర్‌రాజు శవపంచనామా నిర్వహించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం రాజోలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. రాజోలు సీఐ ఎన్.మధుసూధనరావు ఆధ్వర్యంలో ఎస్సై బి.సంపత్ కుమార్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
భర్తే చంపేశాడు
త్వరతోనే కట్నం విషయం మాట్లాడదామని బావతో చెప్పానని, ఇంతలోనే అక్కను చంపేశాడని ధనశేఖర్ విలపిం చాడు. నాన్న అమ్మను కొట్టాడని, అమ్మ ను చంపేశాడని సుమలత కుమార్తె మో హనకల్యాణి చెప్పింది. సుమలత భర్త, ఆడపడుచులు, అత్తను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. సుమలతను అత్తింటివారే హతమార్చారని, వారిని కఠినంగా శిక్షించాలని ఆమె బంధువులు డిమాండ్ చేశారు.