
బ్రాందీషాపు వద్దు
పి.గన్నవరం, మామిడికుదురు :ఉభయ గోదావరి జిల్లాల సరిహద్దులోని కనకాయలంకలో బ్రాందీషాపు ఏర్పాటుపై స్థానికులు ఆందోళనకు దిగారు. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం కనకాయలంక గ్రామంలోని కాజ్‌వే వద్ద ఆదివారం గ్రామస్తులు ధర్నా చేశారు. పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని బ్రాందీ షాపు ఏర్పాటుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇదిలా ఉంటేపి.గన్నవరం మండల పరిధి చాకలిపాలానికి చేరుకుని కనకాయలంక గ్రామం ఉంది. అక్కడ ధర్నా జరుగుతున్న సమయంలో కొందరు స్థానికులు దీని వెనుక తూర్పుగోదావరి జిల్లాకు చెందిన బ్రాందీ షాపు యజమానుల పాత్ర ఉందని ఆరోపిస్తూ వారు కూడా ధర్నాకు దిగడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ధర్నా చేస్తున్న రెండు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఈ నేపథ్యంలో పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలకు సర్దిచెబుతుండగా ధర్నాలో పాల్గొన్న మహిళలపై కొందరు చేయి చేసుకోవడంతో వివాదం తీవ్రమైంది. దీంతో రెచ్చి పోయిన మహిళలు బ్రాందీషాపు ఏర్పాటు చేసేందుకు నిర్మిస్తున్న షెడ్డుపై దాడి చేశారు.
స్థానికుడితో మహిళల వాగ్వివాదం
మహిళల దాడితో షెడ్డు నిర్మాణ పనుల్లో ఉన్న తాపీమేస్త్రీలు, కూలీలు పరారయ్యారు. ధర్నా చేస్తున్న మహిళలు, పురుషులు అక్కడ ఉన్న సెంట్రింగ్ కర్రలతో షెడ్డు గోడలు కూల్చివేశారు. పక్కనే ఉన్న చెక్క బడ్డీని ధ్వంసం చేసి, బడ్డీ చెక్కలకు, రేకులకు నిప్పు పెట్టారు. ఆ సమయంలో స్థానికుడు చిట్టిబాబు మ హిళలతో వాగ్వివాదానికి దిగి, మహిళపై చేయిచేసుకోవడంతో గ్రామస్తులు అతడిపై దాడికి యత్నించారు. ఎస్సై శ్రీనివాస్ జోక్యం చేసుకుని చిట్టిబాబు ను అక్కడి నుంచి తప్పించారు. దీంతో చిట్టిబాబు క్షమాపణ చెప్పాలంటూ మహిళలు ధర్నాకు ఉపక్రమించారు. అయితే అదే సమయంలో చిట్టిబాబు మరోసారి సంఘటన స్థలానికి రాగా, మహిళలు అతడిని అడ్డుకున్నారు. అయితే పోలీసులు జోక్యం చేసుకుని అతడిని వేరొకచోటకి పంపారు. చిట్టిబాబుకు వత్తాసు పలుకుతున్నారంటూ మహిళలు ఎస్సై శ్రీనివాస్‌పై ధ్వజమెత్తారు. ఈ సమయంలో సంఘటన స్థలానికి చేరుకున్న పాలకొల్లు సీఐ ఎ.చంద్రశేఖర్ కలుగజేసుకుని మహిళలను శాంతింపజేశారు. అక్కడి నుంచి మళ్లీ ధర్నా ప్రదేశానికి వచ్చి గ్రామ సర్పంచ్ కడలి సత్యనారాయణ, ఎంపీటీసీ సభ్యుడు వలవల నాగేశ్వరరావు సమక్షంలో సీఐ విచారణ జరిపారు.
ఏర్పాటు యవద్దని తీర్మానం..
సర్పంచ్ కడలి సత్యనారాయణ మాట్లాడుతూ బ్రాందీషాపు పెట్టేందుకు వ్యా పారులు ముందుగా తనను సంప్రదిం చారని, గ్రామస్తులతో చర్చించి చెబుతానని చెప్పానన్నారు. తమ ప్రమే యం లేకుండానే విజయదశమి రోజున బడ్డీ పెట్టి అమ్మకాలు ప్రారంభించారన్నారు. బ్రాందీషాపు ఏర్పాటు చేయరాదంటూ గ్రామసభలో తీర్మానం చేశామన్నారు. ఆ కాపీలను కలెక్టర్, ఆర్డీఓ, రెవెన్యూ, పోలీసు, ఎక్సైజ్ అధికారులకు పంపించామన్నారు. అయినా వారి నుంచి స్పందన రాకపోవడంతో శనివారం పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడును కలిసి సమస్యను విన్నవించామని చెప్పారు.
రాత్రి వేళల్లో ఇబ్బందులు రాకుండా
కనకాయలంక రావడానికి కాజ్‌వే ఒక్కటే మార్గమని, ఆ ప్రాంతంలో ఇప్పటికే రాత్రి సమయంలో తాగుబోతులు హల్‌చల్ చేస్తున్నారని మహిళలు వాపోయారు. ఈ నేపథ్యంలో ఇక్కడ బ్రాందీ షాపు పెడితే మహిళలకు రక్షణ లేకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. సీఐ చంద్రశేఖర్ స్పందిస్తూ మీ ఆమోదం, మా అనుమతి లేకుండా ఇక్కడ బ్రాందీషాపు ఏర్పాటు చేసేందుకు అనుమతించేది లేదని చెప్పారు. మహిళపై దాడి చేసిన చిట్టిబాబుతో పాటు, షెడ్డు కూల్చిన వారిపైనా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ఆందోళనలో వందలాది మంది డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు.