మామిడికుదురు, న్యూస్‌లైన్ : స్థానిక దీప్తి పాఠశాల పదో తరగతి విద్యార్థిని, పాశర్లపూడిబాడవకు చెందిన తుమ్మా ప్రమీల ఈ నెల 18 నుంచి గౌహతిలో జరిగే జాతీయస్థాయి బాక్సింగ్ పోటీలకు ఎంపికైంది. హైదరాబాద్‌లో ఆదివారం జరిగిన స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్-17 బాక్సింగ్ పోటీల్లో బంగారు పతకం గెలుచుకున్న ప్రమీలను జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేశారని దీప్తి విద్యా సంస్థల కరస్పాండెంట్ డీవీవీ సత్యనారాయణ, జిల్లా బాక్సింగ్ కోచ్ బొంతు మధుకుమార్ సోమవారం తెలిపారు.
రాష్ట్ర బాక్సింగ్ పోటీల్లో మరో ఇద్దరు విద్యార్థినులు కూడా పతకాలు సాధించారు. కాగా, 66 కిలోల విభాగంలో పీబీఎస్‌ఎన్‌డీ వజ్రేశ్వరి (జెడ్పీ హైస్కూల్, మామిడికుదురు) రజత, 48 కిలోల విభాగంలో అదే పాఠశాల విద్యార్థిని ఎం.విజయభూలక్ష్మి కాంస్య పతకాలు గెల్చుకున్నారని మధుకుమార్ తెలిపారు. వీరిని డీఈఓ శ్రీనివాసులురెడ్డి, డీవైఈఓ గంగాభవాని, ప్రధానోపాధ్యాయులు మైలవరపు రవీంధ్రనాథ్, జొన్నలగడ్డ గోపాలకృష్ణ, స్కూల్ గేమ్స్ కార్యదర్శి కె.శ్రీనివాసరావు, మధుకుమార్, టూర్ మేనేజర్ ఎన్‌వీవీ సత్యనారాయణ అభినందించారు.