School Games
-
అదరగొట్టిన కడప బాలికలు
కడప: మైదుకూరులో జరిగిన రాష్ట్ర స్థాయి అండర్–17 బాలుర, బాలికల వాలీబాల్ పోటీల్లో కడప, విజయనగరం జట్లు అదరగొట్టాయి. మైదుకూరు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మూడు రోజులుగా జరిగిన ఈ పోటీలు సోమవారం ఫైనల్ మ్యాచ్‌లతో ఘనంగా ముగిశాయి. స్థానిక మేథా డిఫెన్స్ అకాడమి మైదానంలో ఒకటో కోర్టులో సోమవారం బాలుర విభాగంలో విజయనగరం – పశ్చిమగోదావరి జిల్లాల మధ్య ఫైనల్ మ్యాచ్ జరగగా విజయనగరం విజేతగా నిలిచింది. రెండో కోర్టులో బాలికల విభాగంలో కడప– గుంటూరు జిల్లాల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో కడప జట్టు ఘన విజయం సాధించింది. బాలుర విభాగంలో సెమీ ఫైనల్లో విజయనగరం జట్టు చేతిలో ఓడిపోయిన శ్రీకాకుళం, బాలికల విభాగంలో సెమీ ఫైనల్లో గుంటూరు జట్టుతో ఓడిపోయిన ప్రకాశం మూడో స్థానంలో సరిపెట్టుకున్నాయి. క్రీడా స్ఫూర్తితో పోటీలు జరగడం హర్షణీయం రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలు మైదుకూరులో క్రీడా స్ఫూర్తితో జరగడం హర్షణీయమని ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి తనయుడు, వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త శెట్టిపల్లె నాగిరెడ్డి తెలిపారు. వాలీబాల్ టోర్నమెంట్ ముగింపు సమావేశంలో ఆయన అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి పోటీలు మైదుకూరులో నిర్వహించడం నియోజకవర్గానికి ప్రతిష్టగా నిలిచిందన్నారు. టోర్నమెంట్ ప్రారంభ వేడుకల్లో ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ఇచ్చిన హామీ మేరకు ఆయన తనయుడు నాగిరెడ్డి సోమవారం పోటీల్లో విజేతలుగా నిలిచిన జట్లకు నగదు బహుమతులను అందజేశారు. బాలికల, బాలుర విభాగంలో విజేతలుగా నిలిచిన కడప, విజయనగరం జట్లకు రూ.20 వేల చొప్పున, రెండో స్థానంలో నిలిచిన పశి్చమగోదావరి, గుంటూరు జట్లకు రూ.10 వేల చొప్పున నగదు బహుమతులను ఆయా జట్ల కెపె్టన్, కోచ్ మేనేజర్లకు అందజేశారు. మూడో స్థానంలో నిలిచిన శ్రీకాకుళం, ప్రకాశం జిల్లాల జట్లకు రూ.5 వేల నగదును అందించారు. మైదుకూరు మున్సిపల్ వై.రంగస్వామి మాట్లాడుతూ పోటీల్లో గెలుపోటములు సహజమేనని అన్నారు. మైదుకూరులో వాలీబాల్ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కూడా ప్రతిభ చూపి రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తేవాలని సూచించారు. శెట్టిపల్లె నాగిరెడ్డి, మున్సిపల్ కమిషనర్‌తోపాటు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ వైఎస్సార్, అన్నమయ్య జిల్లాల కార్యనిర్వాహక కార్యదర్శులు అరుణకుమారి, వసంత, మేధా డిఫెన్స్ అకాడమి చైర్మన్ సి.నరసింహులు, వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం రాష్ట్ర నాయకులు విజేతలుగా నిలిచిన జట్లలోని క్రీడాకారులకు గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ మెడల్స్ బహూకరించారు. కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాల సంఘం నాయకులు సాజిద్, రమేష్ యాదవ్, నిత్య ప్రభాకర్, ప్రవీణ్ కుమార్, కిరణ్, శ్రీకాంత్, రమేష్ బాబు, గణేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర జట్లకు ఎంపిక శ్రీనగర్‌లో వచ్చే నెలలో జరిగే జాతీయ స్థాయి అండర్–17 బాలుర, బాలికల వాలీబాల్ పోటీల్లో పాల్గొనే రాష్ట్ర జట్లను ఎంపిక చేశారు. అండర్–17 బాలుర, బాలికల వాలీబాల్ టోర్నమెంట్ ముగిసిన అనంతరం రాష్ట్ర బాలుర, బాలికల జట్లను ఎంపిక చేశారు. బాలికల జట్టు : జి.ప్రవల్లిక (విశాఖపట్నం), ఎం.విజయలక్ష్మి (విజయనగరం), వి.కుసుమప్రియ, పావని (కడప), సోని, ఎం.సుమశ్రీ(గుంటూరు), పి.జశి్వత(అనంతపురం), ఇ.షణ్ముఖ ప్రియ (చిత్తూరు), కె.ప్రీతి (తూర్పుగోదావరి), ఎస్.పూజిత (ప్రకాశం), సీహెచ్ శ్రీపద్మజ(కృష్ణ), స్టాండ్ బైగా డి.కీర్తన (గుంటూరు), ఎస్.మానస (అనంతపురం), ఎం.వెంకటలక్ష్మి (నెల్లూరు), ఎస్.ఉన్నత సత్యశ్రీ(కృష్ణ), డి.సమైక్య (ప్రకాశం). బాలుర జట్టు : ఎ.ప్రేమ్ కుమార్, ఎస్.తోషన్ రాము (శ్రీకాకుళం), టి.రాహుల్, ఎన్.మౌర్య (విశాఖపట్నం), బి.రంజిత్ (విజయనగరం), వి.రాజు (పశ్చిమ గోదావరి), టి.సు«దీర్ (అనంతపురం), కె.డేవిడ్ రాజు (గుంటూరు), పి.కిరణ్‌బాబు (ప్రకాశం), ఎన్.అజయ్‌కుమార్ (కడప), స్టాండ్‌బైగా ఎస్.భరత్ (కృష్ణ), వై.రోహిత్(కడప), ఎం.ఆర్యన్ (నెల్లూరు), బి.కార్తీక్(అనంతపురం), వై.రాంబాబు (తూర్పుగోదావరి), కె.రాము (పశ్చిమ గోదావరి). -
నేషనల్ గేమ్స్‌కు ఆంధ్ర ప్రదేశ్ నుండి 609 మంది విద్యార్థుల ఎంపిక
సాక్షి, విజయవాడ: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరిగే 66వ నేషనల్ స్కూల్ గేమ్స్ కు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం నుండి 609 మంది విద్యార్థులు ఎంపికయ్యారని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి జి. భానుమూర్తి రాజు ఒక ప్రకటనలో తెలిపారు. ఢిల్లీ, భోపాల్, గ్వాలియర్ నగరాల్లో జూన్ 6 నుండి 12 వరకు జరిగే ఈ పోటీల్లో అండర్ 19 బాలురు, బాలికలు 21 క్రీడా అంశాల్లో పోటీపడతారని ఆయన పేర్కొన్నారు. మన రాష్ట్రం నుండి 306 మంది బాలురు, 303 మంది బాలికలు, 49 మంది కోచ్‌లు, 45 మంది మేనేజర్లు, నలుగురు హెడ్ అఫ్ ది డెలిగేట్లతో కలిపి మొత్తం 707 మంది పాల్గొననున్నారని తెలిపారు. పాఠశాల విద్యా శాఖ కమిషనర్ ఎస్. సురేష్ కుమార్ ఆదేశాల మేరకు రాష్ట్ర స్థాయి, అంతర్ జిల్లాల స్థాయిలో పోటీలు నిర్వహించి ప్రతిభావంతులైన క్రీడాకారులను రాష్ట్ర జట్టుకు ఎంపిక చేయడమైందని వివరించారు. జాతీయ స్థాయి క్రీడల్లో పాల్గొనే క్రీడాకారుల రిజిస్ట్రేషన్ ఫీజు, ప్రయాణ ఖర్చులు, రోజువారీ కరువు భత్యం (డిఏ), స్పోర్ట్స్ కిట్స్ కొరకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని వెల్లడించారు. రాష్ట్రం నుండి పాల్గొననున్న క్రీడాకారులు అథ్లెటిక్స్, బాక్సింగ్, ఫుట్ బాల్, జూడో, వాలీ బాల్, టేబుల్ టెన్నిస్, హాకీ, బ్యాడ్మింటన్, స్విమ్మింగ్, బాస్కెట్ బాల్, కుస్తీ, వెయిట్ లిఫ్టింగ్, తైక్వాండో, యోగా, ఖో ఖో, కబడ్డీ, చెస్, టెన్నిస్, హ్యాండ్ బాల్, షూటింగ్, జిమ్నాస్టిక్స్ వంటి 21 క్రీడాంశాల్లో పాల్గొంటారని భానుమూర్తి ప్రకటించారు. -
ఆటల్లేని.. చదువులు..!
ఆట, పాటలతో ఆనందంగా కొనసాగాల్సిన విద్యార్థుల చదువు.. జీవితం తరగతి గోడలకే పరిమితమవుతోంది. మైదానాలు ఉంటే వ్యాయామ ఉపాధ్యాయులు ఉండరు.. వ్యాయామ ఉపాధ్యాయులు ఉంటే మైదానాలూ ఉండవు. ఇవి రెండూ లేని పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కోకొల్లలు. మంచిర్యాలసిటీ: అత్తెసరు వ్యాయామ ఉపాధ్యాయులతో అరకొర మైదానాలతో జిల్లాలోని విద్యార్థులు ఆటలకు దూరమై.. కేవలం చదువుకే పరిమితమవుతున్నారు. మానసిక ప్రశాంతత కొరవడి చదువుకు కూడా దూరమవుతున్న వారు అనేకమంది విద్యార్థులు జిల్లాల్లో ఉండటం గమనార్హం. ఆటలంటే ఇష్టమున్న విద్యార్థులు మానసికంగా ఆందోళనకు గురవుతున్నారు. దీంతో చదువుకు, ఆటలకు దూరమై విలువైన జీవితాన్ని కోల్పోతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్, డిగ్రీ, కళాశాలలు 523 ఉండగా.. 338 విద్యాలయాల్లో వ్యాయామ ఉపాధ్యాయుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కేవలం 185 విద్యాసంస్థల్లో మాత్రమే వ్యాయామ ఉపాధ్యాయులు ఉన్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. 36 శాతం విద్యాలయాల్లో మాత్రమే విద్యార్థులకు క్రీడలు అందుబాటులో ఉండగా.. 64 శాతం సంస్థల్లో విద్యార్థులు క్రీడలకు దూరమవుతున్నారు. మైదానాల పరిస్థితి ఉమ్మడి జిల్లాలో 466 ఉన్నత పాఠశాలలకుగాను సుమారు 150 పాఠశాలలకు మైదానాలు లేవు. 46 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉండగా.. 20కి పైగా కళాశాలలకు మైదానాలు లేవు. 11 డిగ్రీ కళాశాలలకు మైదానాలు ఉన్నా.. తొమ్మిది కళాశాలలకు వ్యాయామ అధ్యాపకులు లేరు. అవసరమైన స్థలం అన్ని రకాల ఆటలను విద్యార్థులతో ఆడించేందుకు కొలతల ప్రకారం స్థలం అవసరం ఉంటుంది. ప్రాథమిక పాఠశాలలకు ఒకటిన్నర ఎకరం, ప్రాథమికోన్నత పాఠశాలలకు మూడెకరాలు, ఉన్నత పాఠశాలలకు ఐదెకరాల స్థలం ఉంటే విద్యార్థులకు సౌకర్యంగా ఉంటుంది. జూనియర్ కళాశాలలకు ఐదు, డిగ్రీ కళాశాలలకు పదెకరాల స్థలం ఉండాలి. పోస్టులు భర్తీ చేయాలి విద్యాసంస్థల్లో ఖాళీగా ఉన్న వ్యాయామ ఉపాధ్యాయ, అధ్యాపక పోస్టులను భర్తీ చేయాలి. పీఈటీలకు పీడీలుగా పదోన్నతులు ఇవ్వకపోవడంతో అనేక పాఠశాలల్లో పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. పీడీలకు పదోన్నతులు ఇచ్చిన నేపథ్యంలో జూనియర్, డిగ్రీ కళాశాలల్లో విద్యార్థులకు ఆటలు ఆడించడానికి అవకాశం ఉండేది. ఖాళీల ప్రభావంతోనే విద్యాసంస్థల్లో విద్యార్థులకు ఆటలు దూరమై, కేవలం చదువుకే పరిమితమవుతున్నారు. – బెల్లం శ్రీనివాస్, వ్యాయామ ఉపాధ్యాయుడు, తాండూర్ మండలం -
పరుగెత్తడమూ విద్యే..
వరంగల్ స్పోర్ట్స్ : ‘విద్య అంటే చదవడం, రాయడం.. ర్యాంకుల కోసం వెంపర్లాడడం కాదు.. ఉదయం, సాయంత్రం మైదానాల్లో పరుగెత్తడం.. ఇష్టమైన ఆటల్లో శిక్షణ పొందడమూ విద్యే’ అని బ్యాడ్మింటన్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి, భారత జట్టు కోచ్ పుల్లెల గోపిచంద్ అన్నారు. ఆదివారం హన్మకొండ అశోకా కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన తెలంగాణ రాష్ట్ర బ్యాడ్మింటన్ అసోసియేషన్ జనరల్ బాడీ సమావేశానికి హాజరైన ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ఇష్టమైన ఆటల్లో శిక్షణ ఇప్పించాలి తల్లిదండ్రులు వారి ఆలోచనలను పిల్లలపై బలవంతంగా రుద్దుతూ తరగతి గదులకే పరిమితం చేసే ప్రయత్నం చేస్తున్నారు. విద్యార్థులకు మైదానాలను పరిచ యం చేసి వారికి ఇష్టమైన ఆటల్లో శిక్షణ ఇప్పించాలి. అలా చేయడం వల్ల క్రీడల్లో గెలుపు ఓటములను సమానంగా స్వీకరించే మనస్తత్వం అలవడుతుంది. విద్యార్థులకు ఫిజికల్ ఎడ్యుకేషన్ తప్పనిసరి. ప్రతిభకు కొదువలేదు.. తెలంగాణలో ప్రతిభ గల క్రీడాకారులకు కొదువలేదు. పట్టణ, గ్రామీణ ప్రాంత క్రీడాకారులను ప్రోత్సహించేందుకు అసోసియేషన్ పాటుపడుతోంది. క్రీడలు, క్రీడాకారుల అభ్యున్నతికి సీఎం కేసీఆర్, కేటీఆర్‌లు ప్రత్యేకంగా చొరవ తీసుకుంటున్నారు. ప్రతిభ ఉండి ఆర్థికంగా, ఇతర కారణాలతో వెనుకబడిన క్రీడాకారుల వివరాలను మా దృష్టికి తీసుకొస్తే తప్పనిసరిగా వారికి మెరుగైన శిక్షణ అందజేస్తాం. ఫిట్నెస్ పెంపునకు ఒప్పందం టోర్నమెంట్ల సమయంలో క్రీడాకారులకు తెలియకుండా చిన్న చిన్న ఒత్తిళ్లు వారి మెదడులోకి చొచ్చుకుపోతుం టాయి. తద్వారా క్రీడలపై దృష్టి పెట్టలేక చాంపియన్‌షిప్‌లో ప్రతిభ కనబరచలేని పరిస్థితులు ఉన్నాయి. క్రీడాకారుల్లో సైకాలజికల్‌గా ఫిట్నెస్ పెంపొందించేందుకు ఖరగ్‌పూర్ ఐఐటీతో ఒప్పందం కుదుర్చుకున్నాం. మెరికల్లాంటి కోచ్‌లను తయారు చేస్తాం.. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో కోచ్‌ల కొరత ఉంది. కోచ్‌లు ఉన్న కొన్ని చోట్ల నైపుణ్యం కలిగిన వారు తక్కువగా ఉన్నట్లు గుర్తించాం. అందుకే రానున్న రోజుల్లో క్రీడాకారులనే కాదు మెరికల్లాంటి కోచ్‌లను తయారు చేయాలని సిద్ధమవుతున్నాం. అందుకోసం జూలై 1 నుంచి ప్రత్యేక శిక్షణ తరగుతులు నిర్వహించనున్నాం. ఇప్పడికే కోచ్‌లుగా కొనసాగుతున్న వారితోపాటు కొత్త వారికి ప్రత్యేక శిక్షణ అందించడమే తమ లక్ష్యం. వరంగల్‌లో త్వరలో బ్యాడ్మింటన్ అకాడమీ.. హైదరాబాద్‌లో మాదిరిగా రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో బ్యాడ్మింటన్ అకాడమీ ఏర్పాటు చేయాలన్న ఆకాంక్షను క్రీడాకారులు మా ముందుకు తీసుకొస్తున్నారు. అయితే అకాడమీ ఏర్పాటు చేయడం అంత సులువు కాదు. సాంకేతిక ఇతర కారణాలు అనేకం అడ్డొస్తుంటాయి. వరంగల్ కేంద్రంగా త్వరలోనే అకాడమీ ఏర్పాటు చేసేందుకు పలువురి సలహాలు, సూచనలు తీసుకుంటున్నాం. వీలైనంత త్వరలోనే ఏర్పాటుకు కృషి చేస్తున్నాను. -
సీఎం కప్పు..చేయించింది అప్పు..!
సాక్షి, రాయవరం (మండపేట): స్కూల్ గేమ్స్‌ను సీఎం కప్‌గా నామకరణం చేసి క్రీడా పోటీలు నిర్వహించారు. పేరు మారినా..తీరు మారలేదు. నిధులు మంజూరు చేస్తాం..క్రీడలు ఆడించండంటూ అధికారులు చెప్పడంతో పాఠశాలల్లో పనిచేసే పీఈటీలు, ఫిజికల్ డైరెక్టర్లు (పీడీ) జేబులో డబ్బులు తీసి ఖర్చు పెట్టారు. స్కూల్ గేమ్స్‌ను పూర్తి చేసి నెలలు గడుస్తున్నా..నేటికీ పైసా విడుదల కాకపోవడంతో అప్పులు చేసి తెచ్చిన డబ్బులకు వడ్డీలు కట్టాల్సి వస్తోందని తలలు పట్టుకుంటున్నారు. డిసెంబరుతో ముగిసిన పోటీలు... విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాలను వెలికి తీసేందుకు ప్రభుత్వం సీఎం కప్ పేరుతో క్రీడా పోటీలను నిర్వహించింది. సెప్టెంబరు 24వ తేదీ నుంచి జిల్లాలో ఎస్జీఎఫ్ పోటీలు ప్రారంభించారు. తొలుత మండల స్థాయి, అనంతరం నియోజకవర్గ స్థాయి, తదనంతరం జిల్లా స్థాయిలో పోటీలు నిర్వహించారు. జిల్లా స్థాయి పోటీలు నవంబరులో జరిగాయి. జిల్లా స్థాయిలో విజేతలుగా నిలిచిన వారిని రాష్ట్ర స్థాయి, రాష్ట్ర స్థాయిలో విజేతలుగా నిలిచిన వారిని జాతీయ స్థాయిలో ఆడించారు. జాతీయ స్థాయి పోటీలు డిసెంబర్లో ముగిశాయి. బాలురు, బాలికలకు వేర్వేరుగా సీఎం కప్ క్రీడా పోటీలు అండర్–14, అండర్–17 విభాగాల్లో మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో పోటీలను నిర్వహించారు. ఆరో తరగతి నుంచి పదో తరగతి అండర్–14, అండర్–17 పోటీలు నిర్వహించారు. ఇంటర్ విద్యార్థులకు అండర్–19 పోటీలు నిర్వహించారు. ఆడించే ఆటలివే మండల స్థాయిలో వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, హ్యాండ్‌బాల్, త్రోబాల్, బాల్‌బాడ్మింటన్, టెన్నికాయిట్, అథ్లెటిక్స్, యోగా పోటీలను నిర్వహించగా, జిల్లా స్థాయిలో ఫుట్‌బాల్, హాకీ, క్రికెట్, సాఫ్ట్‌బాల్, బేస్‌బాల్, బాస్కెట్‌బాల్, నెట్‌బాల్, టేబుల్ టెన్నిస్, లాన్ టెన్నిస్, షటిల్ బ్యాడ్మింటన్, బాక్సింగ్, కత్తి సాము, వెయిట్ లిఫ్టింగ్, స్విమ్మింగ్ తదితర 41 క్రీడలను ఆడించారు. తలకు మించిన భారంగా మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడా పోటీలు పూర్తయి ఇంత వరకూ ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. క్రీడల్లో పాల్గొనే ప్రతి విద్యార్థికీ టీఏ రూ.30, డీఏ రూ.30ల వంతున మంజూరు చేయాల్సి ఉంది. దీని ప్రకారం మండలానికి రూ.50 వేలు, నియోజకవర్గ స్థాయి పోటీలకు రూ.50 వేలు విడుదల చేయాల్సి ఉంది. జిల్లా స్థాయిలో నిర్వహించే పోటీలకు ఒక్కో విద్యార్థికి టీఏ రూ.50, డీఏ రూ.50ల వంతున మంజూరు చేయాల్సి ఉంది. మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి పోటీల నిమిత్తం జిల్లాకు రూ.40.5 లక్షలు, జిల్లా స్థాయి పోటీలకు రూ.2 లక్షలు విడుదల కావాల్సి ఉంది. జిల్లాలోని జి.మామిడాడలో వెయిట్‌లిఫ్టింగ్, కాకినాడలో జిమ్నాస్టిక్స్, అనపర్తిలో రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలు నిర్వహించారు. రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీల నిర్వహణ, జాతీయ స్థాయి పోటీలకు విద్యార్థులను సన్నద్ధం చేయడం, వారిని జాతీయ స్థాయి పోటీలకు గౌహతి, అగర్తల, జామ్‌నగర్‌కు పంపించారు. కోసం దాదాపు రూ.15 లక్షలు మంజూరు కావాల్సి ఉంది. ఈ విధంగా జిల్లాకు రూ.60 లక్షలు విడుదల కావాల్సి ఉండగా, నేటి వరకు ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదు. ఇచ్చేదే అరకొర... క్రీడా పోటీల నిర్వహణకు ప్రభుత్వం కంటితుడుపు చర్యగా, అరకొరగా నిధులు కేటాయిస్తోంది. ఆ అరకొర నిధులు కూడా క్రీడాపోటీలు ముగిసి మూడు నెలలవుతున్నా నేటికీ ఒక్క రూ పాయి విడుదల కాలేదు. చాలా మంది పీఈటీలు, పీడీలు వడ్డీ కి అప్పులు తీసుకుని వచ్చి, పెట్టుబడి పెట్టారు. ఓ వైపు తెచ్చి న డబ్బులకు రోజు రోజుకూ వడ్డీలు పెరుగుతుంటే, వీరికి తలకు మించిన భారంగా మారుతోందని వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఎస్జీఎఫ్ నిధులు విడుదల చేయాలని పీఈటీలు, పీడీలు డిమాండ్ చేస్తున్నారు. ఇలా అయితే మెరుగైన క్రీడాకారులను ఎలా తయారు చేయగలమని పలువురు వ్యాయామ ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిధులు విడుదల కాకపోవడం వాస్తవమే... సీఎం కప్ క్రీడా పోటీలకు ఇప్పటి వరకు నిధులు విడుదల కాని విషయం వాస్తవమే. మండల స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు పోటీలు పూర్తి చేసినా డబ్బులు విడుదల కాలేదు. పెట్టుబడి పెట్టిన డబ్బులకు వడ్డీలు పెరగడంతో పీఈటీలు, పీడీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. – రాజశేఖర్, జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు, పీఈటీ, పీడీ అసోసియేషన్, కాకినాడ -
‘క్రీడా’క్రమణ
ఒంగోలు టౌన్: దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలన్న సామెతను ఎంచక్కా అనుసరిస్తున్నారు అధికార పార్టీ నేతలు. జిల్లా కేంద్రం ఒంగోలు నగరంలో కోట్లాది రూపాయల విలువైన స్థలంపై కన్నేసిన టీడీపీ నాయకుడు అధికారం ఉండగానే దానిని సొంతం చేసుకోవాలకున్నాడు. ఆలోచన వచ్చిందే తడవుగా దానికొక క్రీడా శిక్షణ పేరు పెట్టారు. క్రీడల కోసం ఆ స్థలాన్ని కేటాయించాలంటూ నగర పాలక సంస్థకు ‘అధికార’పార్టీ హోదాలో దరఖాస్తు చేసుకున్నాడు. దానికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ రాకమునుపే ఏకంగా ‘క్రీడా’క్రమణకు పాల్పడ్డాడు. నగరంలో విలువైన స్థలాన్ని క్రీడా శిక్షణ పేరుతో తన అధీనంలోకి తెచ్చుకున్నాడు. మునిసిపల్ స్థలం చుట్టూ సరిహద్దులు ఏర్పాటు చేశాడు. మట్టిని తరలించి చదును చేసుకొనే పనిలో నిమగ్నమయ్యాడు. నగరపాలక సంస్థ నుంచి అనుమతి రాకపోయినప్పటికీ అధికార పార్టీ అండతో ఆ స్థలంలో తాను అనుకున్న క్రీడా శిక్షణకు తుదిరూపు ఇచ్చాడు. ఇక్కడ శిక్షణ ఇస్తామంటూ ఏకంగా బోర్డు కూడా పెట్టేసుకున్నాడు. దానిని నియంత్రించాల్సిన నగర పాలక సంస్థ అధికారులు ‘జీ హుజూర్’ అన్నట్టు వ్యవహరిçస్తుండటంతో ఆ క్రీడా శిక్షకుడు హద్దులు గీసుకొని కోట్లాది రూపాయల విలువైన స్థలాన్ని తన ఆధీనంలోకి తెచ్చేసుకున్నాడు. ఆచ్చి బూచ్చి ఒంగోలు నగరంలోని ఒక వ్యక్తికి ఆచ్చి అనేది నిక్ నేమ్. తన పేరుకు ముందు ఆ పేరుతో పిలిపించుకుంటాడు. షటిల్ ఆటలో తన ప్రావీణ్యాన్ని శిక్షణ రూపంలోకి తీసుకువచ్చి ఆదాయ మార్గంగా మలుచుకున్నాడు. ఇంతవరకు బాగానే ఉంది. ఆ క్రీడా శిక్షకుడు ఎంచుకున్న స్థలాలే వివాదాస్పదం అవుతున్నాయి. కలెక్టరేట్లో టెన్నిస్ కోర్టు ఉంది. ఆ టెన్నిస్ కోర్టుకు సంబంధించిన స్థలాన్ని ఆచ్చి పరం చేసేశారు. జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, జిల్లా రెవెన్యూ అధికారి కార్యాలయాలు ఉండే కలెక్టరేట్ ఆవరణలోని స్థలాన్నే అధికార పార్టీని అడ్డం పెట్టుకొని తన గుప్పెట్లోకి తెచ్చుకున్నాడు. దీనిని మరువకముందే మరో మునిసిపల్ స్థలంపై ఆ శిక్షకుడి కన్ను పడింది. ఒంగోలు నగర నడిబొడ్డున ఊరచెరువులో ఖాళీగా ఉన్న కోట్లాది రూపాయల విలువైన స్థలాన్ని తన అధీనంలోకి తెచ్చుకునేందుకు క్రీడా శిక్షణను తెరపైకి తీసుకువచ్చాడు. అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి సిఫార్సుతో తన అధీనంలోకి తెచ్చుకున్నాడు. ఊర చెరువులోని షాదీఖానాకు వెనుకవైపు ఉన్న నగర పాలక సంస్థ అధీనంలోని స్థలానికి సరిహద్దులు వేసుకొన్నాడు. స్కేటింగ్ రింక్ పేరుతో బోర్డు ఏర్పాటు చేసి ఆ స్థలాన్ని అనధికారికంగా తన చేతుల్లోకి తెచ్చుకున్నాడు. పేదలకో న్యాయం పెద్దలకు మరో న్యాయం.. ఒంగోలు నగరంలో పేదలు ఇళ్ల స్థలాలు లేక ఎక్కడైనా నగర పాలక సంస్థకు చెందిన స్థలంలో చిన్న గుడిసె వేసుకుంటే నగర పాలక యంత్రాంగం పోలీసు బలగంతో అక్కడకు చేరుకొని దానిని తొలగించే వరకు అక్కడ నుంచి కదిలేదుకాదు. కోట్ల విలువైన స్థలాన్ని చేతుల్లోకి తీసుకున్న వారిని మాత్రం పల్లెత్తు మాట అనే సాహసం నగర పాలక సంస్థ అధికారులు చేయడం లేదు. అందుకు కారణం సదరు వ్యక్తికి అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి ఆశీస్సులు ఉండటమే. పరిశీలనలో ఉంది: కార్పొరేషన్ కమిషనర్ ఒంగోలు నగరంలోని ఊరచెరువు స్థలంలో క్రీడాశిక్షణకు సంబంధించి అసోసియేషన్ తరపున స్థలం కేటాయించమని తన కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారని కమిషనర్ వెంకటకృష్ణ చెప్పారు. ఆ స్థలాన్ని ఎవరికీ కేటాయించలేదని, పరిశీలనలోనే ఉందన్నారు. ఈ విషయమై విచారించిన తరువాత అనుమతి ఇచ్చేందుకు నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారి అయిన జిల్లా కలెక్టర్‌కు నోట్ ఫైల్ పెడతామని తెలిపారు. -
తెలంగాణ జట్టుకు టైటిల్
సాక్షి, హైదరాబాద్: స్కూల్ గేమ్స్ సమాఖ్య ఆధ్వర్యంలో జరిగిన జాతీయ క్రికెట్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ జట్టు సత్తా చాటింది. చెన్నై వేదికగా జరిగిన ఈ టోర్నీలో విజేతగా నిలిచి టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన తమిళనాడు నిర్ణీత 10 ఓవర్లలో 89 పరుగులు చేసింది. అరవింద్ (53) అర్ధసెంచరీతో జట్టుకు మంచి స్కోరును అందించాడు. హైదరాబాద్ బౌలర్లలో శశాంక్ యాదవ్, పరిమళ్ చెరో వికెట్ పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్‌లో మురళీ (42) రాణించడంతో తెలంగాణ 4 వికెట్లు కోల్పోయి 95 పరుగులు చేసి గెలిచింది. ప్రత్యర్థి బౌలర్లలో సుదర్శన్ 2 వికెట్లు దక్కించుకున్నాడు. -
విష్ణువర్ధన్ జంటకు స్వర్ణం
సాక్షి, హైదరాబాద్: ఖేలో ఇండియా నేషనల్ స్కూల్ గేమ్స్‌లో తెలంగాణ క్రీడాకారులు ఆకట్టుకున్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఈ టోర్నీ బ్యాడ్మింటన్ ఈవెంట్లో స్వర్ణాన్ని కైవసం చేసుకున్నారు. టోర్నీ చివరిరోజు గురువారం జరిగిన బ్యాడ్మింటన్ బాలుర డబుల్స్‌లో రాష్ట్రానికి చెందిన విష్ణువర్ధన్– నవనీత్ జంట విజేతగా నిలిచింది. ఫైనల్లో విష్ణు వర్ధన్– నవనీత్ (తెలంగాణ) జంట 23–21, 21–16తో అడ్వీస్– అరవింద్ (కేరళ) జోడీపై గెలుపొందింది. సింగిల్స్ విభాగంలో తెలంగాణకే చెందిన సాయిచంద్ కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. కాంస్య పతక పోరులో సాయిచంద్ 21–13, 21–17తో రోహన్ (మహారాష్ట్ర)పై విజయం సాధించాడు. మరోవైపు అథ్లెటిక్స్‌లోనూ తెలంగాణకు పతకం లభించింది. 400 మీ. పరుగులో శ్రీకాంత్ ద్వితీయ స్థానంలో నిలిచి రజతాన్ని సొంతం చేసుకున్నాడు. ఈ టోర్నీలో తెలంగాణకు మొత్తం 5 పతకాలు లభించాయి. ఈ సందర్భంగా జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన బ్యాడ్మింటన్ క్రీడాకారులను శాట్స్ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్ రెడ్డి, ఎండీ ఎ. దినకర్ బాబు అభినందించారు. -
స్వర్ణాలతో మెరిసిన కార్తీక్, సాయి
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న ‘ఖేలో ఇండియా స్కూల్ గేమ్స్’లో తెలంగాణ క్రీడాకారులు మెరిశారు. న్యూఢిల్లీలో జరుగుతోన్న ఈ మెగా ఈవెంట్లో హకీంపేట్‌లోని తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ స్కూల్ (టీఎస్‌ఎస్‌ఎస్) విద్యార్థులు రెండు స్వర్ణాలను కైవసం చేసుకున్నారు. వెయిట్‌లిఫ్టింగ్‌లో హెచ్. కార్తీక్, ఆర్. శివలింగేశ్వర సాయి విజేతలుగా నిలిచారు. 85 కేజీల విభాగంలో కార్తీక్, 69 కేజీల విభాగంలో శివలింగేశ్వర సాయి చాంపియన్‌షిప్‌ను సొంతం చేసుకున్నారు. జాతీయ స్థాయిలో సత్తా చాటిన విద్యార్థులను శాట్స్ ఎండీ ఎ. దినకర్‌బాబు బుధవారం అభినందించారు. ఈ సందర్భంగా పతకాలు సాధించిన వెయిట్ లిఫ్టర్లతో పాటు, రాష్ట్ర జూడో, బాస్కెట్‌బాల్, ఖో–ఖో బృందాలను కలిశారు. అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని ఆయన క్రీడాకారులను కోరారు. -
స్పీడ్‌బాల్ అండర్–19 రాష్ట్ర జట్ల ఎంపిక
నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): స్కూల్‌గేమ్స్ అండర్–19 స్పీడ్‌బాల్ రాష్ట్ర బాలబాలికల జట్ల ఎంపికలను బుధవారం నిర్వహించారు. స్థానిక ఏసీ సుబ్బారెడ్డి స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో నిర్వహించిన అంతర్‌జిల్లాల పోటీల్లో బాలబాలికల జట్లను ఎంపిక చేసినట్లు స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి పాటూరు వేణుగోపాలరెడ్డి తెలిపారు. ఎంపికైన క్రీడాకారులు ఈ నెల 15నుంచి హిమాచల్‌ప్రదేశ్‌లో నిర్వహించనున్న జాతీయపోటీల్లో రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తారన్నారు. గుంటూరు ఆర్జేడీ వై.పరం«ధామయ్య, డీవీఈఓ బీమా వెంకయ్య, ఆర్ఐఓ బాబూజాకబ్, రాష్ట్ర పరిశీలకులు పుల్లయ్య, స్పీడ్‌బాల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు విద్యార్థులను అభినందించారు. -
శ్రీకాంత్, జ్యోతికలకు స్వర్ణాలు
సాక్షి, హైదరాబాద్: జాతీయ స్కూల్ గేమ్స్ అథ్లెటిక్స్ అండర్–19 చాంపియన్‌షిప్‌లో తెలుగు క్రీడాకారులు సత్తా చాటారు. హరియాణాలోని రోహ్తక్లో జరిగిన ఈ టోర్నీలో రెండు స్వర్ణాలను కైవసం చేసుకున్నారు. బాలుర 400మీ. పరుగులో తెలంగాణకు చెందిన డి. శ్రీకాంత్ విజేతగా నిలిచాడు. అతను లక్ష్యాన్ని 48.83 సెకన్లలో పూర్తిచేశాడు. బాలికల విభాగంలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రాతినిధ్యం వహించిన డి. జ్యోతిక శ్రీ 56.23 సెకన్లలో పరుగును పూర్తి చేసి పసిడి పతకాన్ని సాధించింది. -
తెలంగాణ లిఫ్టర్లకు 4 పతకాలు
సాక్షి, హైదరాబాద్: జాతీయ స్కూల్‌గేమ్స్ అండర్–19 వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ క్రీడాకారులు ఆకట్టుకున్నారు. తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ స్కూల్ వేదికగా జరుగుతోన్న ఈ టోర్నీలో స్వర్ణం, రజతం, 2 కాంస్యాలతో కలిపి మొత్తం 4 పతకాలను సాధించింది. బాలుర 69 కేజీల విభాగంలో ఆర్ఎస్ఎల్ సాయి (తెలంగాణ) చాంపియన్‌గా నిలిచాడు. అతను ఫైనల్లో 235 కేజీలు (102 స్నాచ్+133 క్లీన్ అండ్ జర్క్) బరువునెత్తి పసిడి పతకాన్ని గెలుచుకున్నాడు. 62 కేజీల విభాగంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బి. కృష్ణ (222 కేజీలు) రజతాన్ని, ఏవీ యశ్వంత్ (తెలంగాణ, 205 కేజీలు) కాంస్యాన్ని సాధించారు. 77 కేజీల విభాగంలో ఎంహెచ్ నిహాల్ రాజ్ (తెలంగాణ, 256 కేజీలు), ఎ.శివరామకృష్ణ (ఆంధ్రప్రదేశ్, 254 కేజీలు) వరుసగా రెండు, మూడు స్థానాలను సాధించగా... బాలికల 63 కేజీల విభాగంలో వేముల సాహితి (123 కేజీలు) కాంస్యాన్ని దక్కించుకుంది. -
బెల్గాంలో రాష్ట్ర విద్యార్థుల అవస్థలు
సాక్షి, హైదరాబాద్: జాతీయ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో బెల్గాంలో జరుగుతున్న 63వ నేషనల్ గేమ్స్‌లో పాల్గొనేందుకు వెళ్ళిన తెలంగాణ విద్యార్థులు ఇబ్బందుల్లో పడ్డారు. ఈవెంట్లు, గేమ్స్ కేటగిరీల్లో తప్పులు దొర్లడంతో నేషనల్ గేమ్స్ యాజమాన్యం వారికి ప్రవేశం ఇవ్వడం లేదు. నెలల పాటు కసరత్తు పూర్తి చేసిన ఆయా విద్యార్థులు చివరకు పోటీలో పాల్గొనే అవకాశం దక్కకపోవడంతో గందరగోళంలో పడ్డారు. రాష్ట్రం నుంచి 31 మంది ఈ గేమ్స్‌కు ఎంపికవగా... రెండ్రోజుల క్రితం ఆయా విద్యార్థులు తల్లిదండ్రులతో కలసి బెల్గాం చేరుకున్నారు. ఆన్లైన్లో వివరాలు నమోదు చేసే సమయంలో పొరపాట్లు దొర్లడంతో ఈ పరిస్థితి తలెత్తింది. విద్యాశాఖ ఉన్నతాధికారులు జోక్యం చేసుకుంటే పలువురు విద్యార్థులు పోటీల్లో పాల్గొనే అవకాశం ఉంది. కానీ శని, ఆదివారాలు సెలవుదినాలు కావడంతో అధికారులు అందుబాటులోకి రాలేదు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. -
యశ్ వర్మకు స్వర్ణం
సాక్షి, హైదరాబాద్: జాతీయ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన స్విమ్మింగ్ చాంపియన్‌షిప్‌లో సికింద్రాబాద్ రైల్వే జూనియర్ కాలేజికి చెందిన యశ్ వర్మ సత్తా చాటాడు. ఢిల్లీలో జరిగిన ఈ టోర్నమెంట్లో రెండు పతకాలతో ఆకట్టుకున్నాడు. పురుషుల వ్యక్తిగత 400 మీటర్ల మెడ్లే విభాగంలో స్వర్ణంతో పాటు, 200 మీటర్ల బటర్‌ఫ్లయ్ కేటగిరీలో యశ్ కాంస్యాన్ని గెలుచుకున్నాడు. -
జాతీయ పోటీలకు తేజస్విని
సాక్షి, హైదరాబాద్: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్జీఎఫ్) రాష్ట్ర స్థాయి స్కేటింగ్ చాంపియన్‌షిప్‌లో రెయిన్బో ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థిని జీఎస్టీ తేజస్విని సత్తా చాటింది. ఇందిరాపార్క్‌లో ఆదివారం జరిగిన ఈ టోర్నమెంట్లో రెండు స్వర్ణ పతకాలను కైవసం చేసుకుంది. ఈ గెలుపుతో బెల్గామ్‌లో జరిగే జాతీయ స్థాయి స్కేటింగ్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే రాష్ట్ర జట్టుకు ఎంపికైంది. -
ఇకపై ఏటా ‘ఖేలో ఇండియా స్కూల్ గేమ్స్’
న్యూఢిల్లీ: జాతీయ క్రీడల్లాగే ఇకపై ‘ఖేలో ఇండియా’ స్కూల్, కాలేజ్ గేమ్స్ నిర్వహిస్తామని కేంద్ర క్రీడాశాఖ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ వెల్లడించారు. ఈనెల 6 నుంచి జరుగనున్న ఫిఫా అండర్–17 ప్రపంచకప్‌లో పాల్గొనే భారత ఫుట్‌బాల్ జట్టును మంగళవారమిక్కడ సన్మానిం చారు. ఈ సందర్భంగా రాథోడ్ మాట్లా డుతూ ‘దేశ క్రీడల ముఖచిత్రాన్ని మార్చనున్నాం. అందరి సహకారంతో క్రీడల్లో భారత్‌ను మరో దశకు తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నాం. కుర్రాళ్లు చిరు ప్రాయంలోనే క్రీడలను కెరీర్‌గా ఎంచుకునేందుకు చక్కని ప్లాట్‌ఫామ్‌ను ఏర్పాటు చేస్తున్నాం. ఇందులో భాగంగా తొలిసారిగా ఈ ఏడాది ‘ఖేలో ఇండియా’ జాతీయ స్కూల్ గేమ్స్‌ను ఈ డిసెంబర్లో నిర్వహిస్తాం. అలాగే కాలేజ్ గేమ్స్‌ను వచ్చే జనవరిలో నిర్వహిస్తాం. ఇకపై క్రమం తప్పకుండా ప్రతిఏటా ఈ గేమ్స్ నిర్వహణకు చర్యలు తీసుకుంటాం. తద్వారా పాఠశాల, కళాశాల స్థాయిలో ప్రతిభగల క్రీడాకారులను వెలుగులోకి తెస్తాం’ అని అన్నారు. ఆసియా గేమ్స్, పాన్ అమెరికా గేమ్స్‌లా ఈ ఈవెంట్లను ఘనంగా నిర్వహిస్తామని ఆయన చెప్పుకొచ్చారు. పలు కార్పొరేట్ సంస్థల సౌజన్యంతో అట్టహాసంగా నిర్వహించే ఈ క్రీడలను ప్రత్యక్ష ప్రసారం చేస్తామన్నారు. ప్రతి సంవత్సరం 1000 మంది విద్యార్థులను ఎంపిక చేసి తదుపరి ఉత్తమ శిక్షణకు రూ. 5 లక్షలు చొప్పున ఎనిమిదేళ్ల పాటు ఇస్తామన్నారు. భారత ఫుట్‌బాలర్లను ఉద్దేశించి ‘మైదానంలోకి దిగాక మీరు ఈ మ్యాచే మీ కెరీర్ చివరిదన్నట్లు పోరాడండి. మీరు ఈ స్థాయికి రావడానికి పడిన కష్టాలను గుర్తుకుతెచ్చుకోండి. అప్పుడే అసాధారణ ఫలితాలు సాధిస్తారు’ అని ఉత్తేజపరిచారు. -
కోచ్‌కు 105 ఏళ్ల జైలు శిక్ష
వాషింగ్టన్: చిన్నారులను లైంగికంగా వేధించిన కేసులో కాలిఫోర్నియా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ప్రాధమిక పాఠశాలలో ఏడుగురు చిన్నారి బాలికలను లైంగిక వేధింపులకు గురిచేసిన కోచ్ రోనీ లీ రోమన్‌కు (44) కు ఏకంగా 105 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. జిన్హువా వార్తా సంస్థ అందించిన సమాచారం ప్రకారం లాస్ఏంజిల్స్ కౌంటీ సుపీరియర్ కోర్టు మంగళవారం ఈ తీర్పు వెలువరించింది. రోమన్‌పై మైనర్ బాలికలను వేధించిన ఘటనలకు సంబంధించి మొత్తం 7కేసుల్లో కోర్టు దోషిగా నిర్ధారించింది. పాఠశాల ఆవరణలో ఆరుగురికిపైనా, ఏడవది బాధిత బాలిక ఇంట్లో జరిగిందని విచారణలో తేలింది. 8నుంచి 11సంవత్సరాల వయసున్న బాలికలపై అతడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. జిల్లా అటార్నీ కార్యాలయం ప్రకారం కొలరావులోని కాహువేన్ ఎలిమెంటరీ స్కూల్లో, హాలీవుడ్‌లోని వైన్ ఎలిమెంటరీ పాఠశాలల్లో పనిచేసిన కాలంలో రోమన్ ఈ దారుణాలకు పాల్పడ్డాడు. ఈ ఏడాది జూన్ 7న ప్రాసిక్యూషన్ అతణ్ని దోషిగా నిర్ధారించడంతోకోర్టు కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. -
పాఠశాల కొనసాగించాలని ఎమ్మార్సీకి తాళం
గుడిబండ (మడకశిర) : తమ గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ మండల పరిధిలోని ముత్తుకూరు గ్రామస్తులు మంగళవారం గుడిబండ ఎమ్మార్సీ కార్యాలయానికి తాళం వేసి నిరసన తెలిపారు. వివరాల్లోకి వెళితే.. ఆ పాఠశాల ప్రభుత్వ రేషనలైజేషన్‌లో మూసివేశారు. అయితే పాఠశాల కొనసాగించాలంటే 30మంది విద్యార్థులు ఉండాలి. కానీ ఈ పాఠశాలకు 6,7వ తరగతులకు సంబంధించి కేవలం 25మందే ఉన్నారు. దీంతో పాఠశాల మూసివేస్తే తమ పిల్లలు సమీపంలోని పాఠశాలకు దాదాపు 2కిలోమీటర్లు నడిచి వెళ్లాల్సి వస్తుందని గ్రామస్తులు మండిపడ్డారు. కనుక పాఠశాలను కొనసాగించాలని కోరారు. ఎంఈఓ అందుబాటులో లేకపోవడంతో ఎంపీడీఓకు వినతిపత్రం ఇచ్చారు. ఇందుకు ఎంపీడీఓ సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో శీనానాయక్, భీమారెడ్డి, కరిబసయ్య, నగేష్, భీమరాజు, బసవరాజు, నరసయ్య, హనుమంతు, శీను తదితరులు పాల్గొన్నారు. -
జాతీయ స్థాయి రగ్బీ పోటీలకు ఏపీ జట్టు
వెంకటేశ్వరపురం(నంద్యాల రూరల్): ఈనెల 22 నుంచి 24 వరకు ఒరిస్సాలోని భువనేశ్వర్‌లో జరిగే 62వ జాతీయ స్థాయి స్కూల్‌గేమ్స్ అండర్–17 బాలబాలికల రగ్బీ పోటీల్లో పాల్గొనే రాష్ట్ర క్రీడాకారులను ఎంపిక చేసినట్లు రగ్బీ రాష్ట్ర సంఘం ప్రధాన కార్యదర్శి రామాంజనేయులు తెలిపారు. మంగళవారం నంద్యాల సమీపంలోని వెంకటేశ్వరపురం వద్ద ఉన్న ఎస్డీఆర్ వరల్డ్ స్కూల్లో రాష్ట్ర జట్టు క్రీడాకారులతో స్కూల్ చైర్మన్ కొండారెడ్డి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలికల జట్టు కర్నూలు శ్రీలక్ష్మిప్రియ, గురురుషిక, చిట్టెమ్మ, శ్రీవల్లి, భారతి, అనూష, శివాణి, నెల్లూరుకు చెందిన శిల్పా, సాయివిహారిక, చిత్తూరుకు చెందిన జాహ్నవి, కడపకు చెందిన భవ్య నందిని, బాలుర విభాగంలో కర్నూలుకు చెందిన దివాకర్, సురేంద్ర, సందీప్, నెల్లూరుకు చెందిన షబ్బీర్, నవీన్, అబ్దుల్లా, శ్రీకాంత్, గుంటూరుకు చెందిన సాయిరంజిత్, గురుకృష్ణ, చిత్తూరుకు చెందిన శంకర్, మోహన్, కడపకు చెందిన ప్రవీణ్‌కుమార్‌లు ఎంపికయ్యారని వివరించారు. -
‘దేవాస్’ ఘటనపై ఇద్దరు సస్పెన్షన్
సాక్షి కథనంపై కదిలిన యంత్రాంగం సాక్షి, అమరావతి: జాతీయ ఖోఖో పోటీలకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మర్చిపోయిన ఇద్దరు అధికారులపై వేటుపడింది. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఏస్జీఎఫ్‌ఐ) రాష్ట్ర కార్యదర్శి, అనంతపురం జిల్లా కార్యదర్శిలను విద్యాశాఖ సస్పెండ్ చేసింది. రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆదేశాల మేరకు పాఠశాల విద్యాశాఖ ఇన్చార్జి కమిషనర్ జి.శ్రీనివాసులు బాధ్యులను సస్పెండ్ చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. జాతీయ ఖోఖో పోటీలకు రాష్ట్రంనుంచి 24 మంది విద్యార్థులను మధ్యప్రదేశ్‌లోని దేవాస్‌కు పంపి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేయకపోవడంతో ఆ విద్యార్థులు పోటీలకు అవకాశం కోల్పోవడం, దేవాస్‌లో ఇబ్బందులకు గురైన వైనంపై ‘సాక్షి’లో కథనం వెలువడిన సంగతి తెలిసిందే. -
రగ్బీ విజేత కర్నూలు
వెంకటేశ్వరపురం (నంద్యాలరూరల్): రాష్ట్రస్థాయి 62వ స్కూల్‌గేమ్స్ అండర్–17 బాల బాలికల రగ్బీ పోటీల్లో కర్నూలు బాలికల జట్టు విజయకేతనం ఎగుర వేసింది. బాలుర విభాగంలో గుంటూరు జట్టు ప్రథమ స్థానంలో నిలిచింది. బాలికల విభాగంలో నెల్లూరు జట్టు రజితం, చిత్తూరు జట్టు కాంస్య పతకాలు, బాలుర విభాగంలో నెల్లూరు జట్టు రజితం, కడప జట్టు కాంస్య పతకాలు సాధించాయి. మంగళవారం ఎస్డీఆర్ వరల్డ్ స్కూల్ ఆవరణలో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర స్కూల్ గేమ్స్ రగ్బీ సంఘ ప్రధాన కార్యదర్శి రామాంజనేయులు మాట్లాడుతూ..పోటీల్లో 8 జిల్లాల జట్లు పాల్గొని తమ ప్రతిభను చాటాయన్నారు. స్కూల్ చైర్మన్ కొండారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా రగ్బీ అసోసియేషన్ అధ్యక్షుడు సురేందర్, జిల్లా స్కూల్ గేమ్ సెక్రటరీ లక్ష్మినర్సయ్య తదితరులు పాల్గొన్నారు. -
3 నుంచి రెజ్లింగ్ టోర్నీ
సాక్షి, హైదరాబాద్: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో డిసెంబర్ 3 నుంచి రాష్ట్ర స్థాయి రెజ్లింగ్ చాంపియన్‌షిప్ జరుగనుంది. పురానాపూల్‌లోని జీహెచ్ఎంసీ ప్లేగ్రౌండ్‌లో మూడు రోజుల పాటు ఈ టోర్నీ జరుగుతుంది. అండర్-17 బాలికలకు ఫ్రీస్టయిల్, అండర్-17, 19 బాలురకు ఫ్రీస్టయిల్, గ్రీకో రోమన్ విభాగంలో పోటీలు నిర్వహిస్తారు. ఇందులో రాణించిన రెజ్లర్లు తెలంగాణ రాష్ట్ర జట్టుకు ఎంపికవుతారు. ఈ జట్టు జనవరి 2 నుంచి 7 వరకు ఢిల్లీలో జరిగే జాతీయ స్థాయి స్కూల్ గేమ్స్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో పాల్గొంటుంది. మరిన్ని వివరాల కోసం హెచ్‌డీఎస్‌జీఎఫ్ అండర్-17 ఆర్గనైజింగ్ సెక్రటరీ సుధాకర్ రెడ్డి (7075462287), అండర్-19 జూనియర్ కాలేజ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ బి. లక్ష్మ య్య 9290049752), రెజ్లింగ్ సెక్షన్ సెక్రటరీ శ్రీనివాస్ (9652828811)లను ఫోనులో సంప్రదించవచ్చు. -
ఓవరాల్ చాంప్ రంగారెడ్డి
అంతర్ జిల్లా స్కేటింగ్ చాంపియన్‌షిప్ సాక్షి, హైదరాబాద్: అంతర్ జిల్లా స్కేటింగ్ చాంపియన్‌షిప్‌లో రంగారెడ్డి జిల్లా ఓవరాల్ చాంపియన్‌గా నిలిచింది. హైదరాబాద్ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఇందిరాపార్క్‌లోని జీహెచ్ఎంసీ స్కేటింగ్ రింక్‌పై జరిగిన ఈ టోర్నీలో మొత్తం 18 పతకాలను సాధించి అగ్రస్థానంలో నిలిచింది. క్వాడ్ ఈవెంట్ విజేతల వివరాలు అండర్-11 బాలురు: 1. సాయి సాహస్ (హైదరాబాద్), 2. తనీశ్ (రంగారెడ్డి), 3. ప్రద్యుమ్న (హైదరాబాద్). బాలికలు: 1. తిష్య (రంగారెడ్డి), 2. తేజశ్వరీ (మెదక్), 3. ఇషా (రంగారెడ్డి). అండర్-14 బాలురు: 1. రితేశ్ (రంగారెడ్డి), 2. సాయి రామ్ (రంగారెడ్డి), 3. నీరజ్ (వరంగల్). బాలికలు: 1. నిత్య (హైదరాబాద్), 2. చరిత (రంగారెడ్డి), 3. కావ్య (హైదరాబాద్). అండర్-17 బాలురు: 1. మణికంఠ (రంగారెడ్డి), 2. యశ్వంత్ (రంగారెడ్డి), 3. శ్రీకృష్ణ (హైదరాబాద్). బాలికలు: 1. విజేత (రంగారెడ్డి). ఇన్ లైన్ ఈవెంట్ విజేతల వివరాలు అండర్-11 బాలురు: 1. ధర్నేశ్ (రంగారెడ్డి), 2. సాయి కృష్ణ (రంగారెడ్డి), 3. హేమంగ్ (హైదరాబాద్). బాలికలు: 1. స్మృతి (రంగారెడ్డి), 2. అభిజిత (రంగారెడ్డి), 3. కుల్సమ్ బాను అండర్-14 బాలురు: 1. ప్రణవ్ (మెదక్), 2. భువనేశ్ (హైదరాబాద్), 3. సిద్ధార్థ్ (హైదరాబాద్). బాలికలు: 1. లిఖిత (రంగారెడ్డి), 2. సంజన (రంగారెడ్డి), 3. విరిండా సైనీ (హైదరాబాద్). అండర్-17 బాలురు: 1. తోషినందన్ (హైదరాబాద్), 2. రోహన్ (హైదరాబాద్), 3. రియాన్ (రంగారెడ్డి) -
ఇశ్విమతాయ్కి స్వర్ణం
భూపాలపల్లి: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ రాష్ట్రస్థారుు స్విమ్మింగ్ పోటీల్లో ఇశ్వి మతాయ్ స్వర్ణం సాధించింది. అండర్-14 విభాగం 50మీ. బ్యాక్ో్టక్ల్రో తను 40.07 సెకన్లలో గమ్యం చేరి విజేతగా నిలిచింది. తద్వారా ఇశ్వి మతాయ్ జాతీయస్థారుు పోటీలకు ఎంపికైంది. ఈ విభాగంలో సంజన, అంజలి రెండు మూడు స్థానాల్లో నిలిచారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో రెండు రోజుల పాటు జరిగిన స్విమ్మింగ్ పోటీలలో మొత్తం 354 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. అండర్-14, 17, 19 విభాగాల్లో ఫ్రీ స్టరుుల్, బ్యాక్ ో్టక్,్ర బటర్‌ఫ్లయ్, బ్రెస్ట్‌ో్టక్,్ర వ్యక్తిగత మెడ్లె విభాగాల్లో పోటీలు జరిగారుు. 116 మంది జాతీయ స్థారుు పోటీలకు ఎంపికయ్యారు. -
నేడు క్రికెట్ సెలక్షన్స్
సాక్షి, హైదరాబాద్: త్వరలో జరగబోయే అంతర్ జిల్లా అండర్-19 బాలుర క్రికెట్ టోర్నమెంట్ కోసం నేడు (శనివారం) సెలక్షన్స జరుగనున్నాయి. హైదరాబాద్ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (హెచ్‌డీఎస్‌జీఎఫ్) ఆధ్వర్యంలో సైనిక్‌పురిలోని భవన్స జూనియర్ కాలేజ్ వేదికగా ఈ ఎంపిక పోటీలు జరుగుతారుు. ఇందులో రాణించిన క్రీడాకారులు మహబూబ్‌నగర్‌లో ఈనెల 12 నుంచి 16 వరకు జరిగే అంతర్ జిల్లా క్రికెట్ టోర్నీకి ఎంపికవుతారు. మరిన్ని వివరాల కోసం రాజేంద్ర ప్రసాద్ (9299459335)ను సంప్రదించవచ్చు.