‘స్కూల్ గేమ్స్’ నిధుల పెంపునకు కృషి
టీఆర్‌ఎస్ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రామ్మోహన్
కీసర: సూల్క్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో యేటా నిర్వహించే క్రీడా పోటీల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం మంజూరు చేసే నిధులను వచ్చే ఏడాది నుంచి పెంచాలని ముఖ్యమంత్రి కేసీఆర్కు విన్నవించనున్నట్లు టీఆర్‌ఎస్ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రామ్మోహన్ అన్నారు. మండంలోని అహ్మద్‌గూడ లీడ్‌ఇండియా భారతరత్న పాఠశాలలో రెండురోజులుగా నిర్వహించిన తైక్వాండో రాష్ట్రస్థాయి ఎంపికల పోటీల ముగింపు కార్యక్రమం సోమవారం జరిగింది. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రామ్మోహన్ మాట్లాడారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం ముందుంటుందన్నారు.
ప్రభుత్వం నుంచి మరిన్ని నిధులు మంజూరు చేయించి వచ్చే ఏడాది స్కూల్ గేమ్స్‌ను పకడ్బందీగా నిర్వహించేందుకు కృషి చేస్తాన న్నారు. క్రీడా పోటీల ఆర్గనైజింగ్ సెక్రటరీ శేఖర్‌రెడ్డి, క్రీడల ఇన్‌చార్జి రమేష్‌రెడ్డిలు మాట్లాడుతూ.. రాష్ట్రస్థాయి తైక్వాండో ఎంపిక పోటీల్లో అండర్ 14, 17 విభాగాల్లో (బాలుర, బాలికలు) తెలంగాణలోని 10 జిల్లాల నుంచి 400 మంది పాల్గొన్నారన్నారు. ఇందులో 40 మంది విద్యార్థులను జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేశామన్నారు. జిల్లా ఫిజికల్ డెరైక్టర్ల అసోసియేషన్ అధ్యక్షుడు రాఘవరెడ్డి, లీడ్ ఇండియా భారతరత్న పాఠశాల చైర్మన్ సుదర్శనాచారి పాల్గొన్నారు.