sports competitions
-
రసవత్తరం..రెట్టించిన ఉత్సాహం
సాక్షి, నెట్వర్క్/అమరావతి: ‘ఆడుదాం ఆంధ్ర’ క్రీడా పోటీలు రాష్ట్రవ్యాప్తంగా రసవత్తరంగా జరుగుతున్నాయి. యువకులు రెట్టించిన ఉత్సాహంలో పోటీల్లో పాల్గొంటున్నారు. దీంతో రాష్ట్రానికి సంక్రాంతి ముందే వచ్చిందా అన్నట్లు ఉత్సాహంగా ఉంది. యువత బ్యాటు, బంతి పట్టుకుని మైదానాల వైపు పరుగులు పెడుతున్నారు. ఎన్నడూలేని విధంగా ప్రభుత్వం క్రీడల పట్ట ప్రత్యేక శ్రద్ధ చూపించడంతో క్రీడా రంగం పట్ల ఎక్కువ ఆసక్తి ఉన్న వారంతా మ్యాచ్‌లు తిలకించేందుకు మైదానాలకు క్యూ కడుతున్నారు. ఐదో రోజు శనివారం 6,386 గ్రామ వార్డు సచివాలయాల్లో షెడ్యూల్ ప్రకారం పోటీలు నిర్వహించాల్సి ఉండగా 6373 సచివాలయాల్లో పోటీలు జరిగాయి. 3,23,781 మంది ప్రేక్షకులు ఆటల పోటీలను తిలకించారు. మొత్తంగా 15 వేల గ్రామ వార్డు సచివాలయాలకుగానూ 14,690 చోట్ల క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి. అనంతపురం విశాఖపట్నం అనకాపల్లి ప్రకాశం శ్రీ సత్యసాయి జిల్లాల్లో అన్ని గ్రామ వార్డు సచివాలయాల్లో పోటీలు నిర్వహిస్తున్నారు. ఆదివారం ’ఆడుదాం ఆంధ్ర’ కు సెలవు అయినప్పటికీ కొన్నిచోట్ల రీ షెడ్యూల్ మ్యాచ్‌లు పూర్తి చేయనున్నారు. ఉల్లాసంగా.. ఉత్సాహంగా.. తిరుపతి జిల్లాలో క్రీడాకారులు పోటాపోటీగా తలపడ్డారు. కబడ్డి, క్రికెట్, ఖోఖో, బ్యాడ్మింటన్ పోటీల్లో ఉల్లాసంగా పాల్గొన్నారు. జిల్లాలోని గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని కార్వేటినగరం, పెనుమూరు మండలాల్లో బ్యాడ్మింటన్ పోటీలు ముగిసాయి. నగరి, పుంగనూరు, కుప్పం, చిత్తూరు, పూతలపట్టు నియోజకవర్గాల్లో క్రీడలు హోరాహోరీగా సాగుతున్నాయి. ఈ క్రీడలను మండల అధికారులు, మండల ప్రజాప్రతినిధులు పర్యవేక్షిస్తున్నారు. చిత్తూరు జిల్లాలోని 283 గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో 467 మైదానాల్లో క్రీడాపోటీలు జరిగాయి. జిల్లాలో 791 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో 10,151 మంది క్రీడాకారులు క్రీడల్లో పాల్గొనగా, 33,639 మంది ప్రేక్షకులు పోటీలను వీక్షించారు. 719 మంది ప్రజాప్రతినిధులు పోటీలను ప్రారంభించారు. తిరుపతి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఆడుదాం ఆంధ్ర క్రీడలను నిర్వహించారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని అన్ని సచివాలయాల పరిధిలో పోటీలు చురుగ్గా జరుగుతున్నాయి. కాకినాడ జిల్లా రాజా కళాశాల మైదానంలో జరుగుతున్న క్రీడలను శాప్ ఎండి ధ్యాన్‌చంద్ పరిశీలించారు. కడపలో మైదానాల వైపు క్యూ.. మెగా క్రీడా టోర్నమెంట్లో భాగంగా కడపలో క్రీడా పోటీలు ఉత్సాహంగా సాగాయి. క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్, క్రికెట్, ఖోఖో క్రీడాంశాల్లో నిర్వహించిన గ్రామ/వార్డు సచివాలయ పోటీల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న క్రీడాకారులు పోటీల్లో పాల్గొన్నారు. ఒంటిమిట్ట మండలం కొత్త మాధవరంలో నిర్వహించిన పోటీలను స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి బ్యాడ్మింటన్ అంతర్జాతీయ అంపైర్ ఎస్.జిలానీబాషా ప్రారంభించారు. వివిధ మండలాల్లో పోటీలను ఎంపీడీఓలు, స్థానిక ప్రజాప్రతినిధులు, ఫిజికల్ డైరెక్టర్లు పర్యవేక్షించారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఉత్సాహపూరిత వాతావరణంలో క్రీడలు కొనసాగుతున్నాయి. జిల్లాలోని 535 సచివాలయాల పరిధిలో శనివారం 864 మ్యాచ్‌లు నిర్వహించగా 10 వేల మందికి పైగా క్రీడాకారులు పాల్గొన్నారు. క్రీడలను తిలకించడానికి ప్రేక్షకులు ఆసక్తి చూపించారు. జిల్లాలోని అనేక ప్రాంతాల్లో దాదాపు 25 వేల మంది వరకు క్రీడలను తిలకించినట్టు జిల్లా చీఫ్ కోచ్ డి.దుర్గారావు చెప్పారు. -
కూత కుదిరింది.. ఆట అదిరింది
సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్: రాష్ట్రంలో క్రీడా రంగానికి మహర్దశ వచ్చింది. గ్రామీణ, పట్టణ యువతను క్రీడల వైపు ప్రోత్సహించేందుకు.. మాణిక్యాల్లాంటి క్రీడాకారులను వెలికితీసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ‘ఆడుదాం ఆంధ్రా’ పేరిట ఐదు క్రీడాంశాల్లో టోర్నమెంట్లు నిర్వహిస్తోంది. యువత ఆరోగ్యాన్ని పెంపొందించే.. క్రీడా స్ఫూర్తి నింపే లక్ష్యంతో వాలీబాల్, క్రికెట్, ఖోఖో, కబడ్డీ, బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహిస్తున్నారు. రెండో రోజైన బుధవారం రాష్ట్రవ్యాప్తంగా అన్నిచోట్లా క్రీడాకారులు నువ్వా.. నేనా అన్నట్టుగా తలపడ్డారు. ఆయా క్రీడాంశాల్లో వేలాది జట్లు దుమ్ములేపాయి. యువతులు సైతం పోటీల్లో పాల్గొని సత్తా చాటారు. షెడ్యూల్ ప్రకారం 26 జిల్లాల్లోని 8,549 గ్రామ, వార్డు సచివాలయాల్లో పోటీలు నిర్వహించారు. దాదాపు 18 జిల్లాల్లో 50 శాతం నుంచి 73.85 శాతం సచివాలయాల్లో పోటీలు ఊపందుకున్నాయి. 9,774 పోటీలను నిర్దేశిస్తే 8,594 పోటీలను దిగ్విజయంగా పూర్తి చేశారు. కొన్నిచోట్ల సమయాభావంతో పోటీలు మరుసటి రోజు షెడ్యూల్లోకి మార్చారు. అత్యధికంగా విశాఖపట్నంలో 95.37 శాతం, పశ్చిమ గోదావరిలో 94.95 శాతం, తూర్పు గోదావరిలో 92.93 శాతం, అనకాపల్లి, అంబేడ్కర్ కోనసీమ, చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో 90 శాతానికిపైగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం మ్యాచ్‌లు జరిపించారు. క్రీడాకారులు చెలరేగి ఆడుతుంటే.. రెట్టించిన ఉత్సాహంతో ప్రేక్షకులు క్రీడాకారులను ప్రోత్సహించడం విశేషం. తొలిరోజు కంటే అత్యధికంగా 7.02 లక్షల మంది వీక్షకుల సంఖ్య నమోదయ్యింది. ఇందులో 4.80 లక్షల మంది పురుషులు, 2.20 లక్షల మంది మహిళలు పోటీలను నేరుగా తిలకించారు. మొత్తంగా 31,169 మ్యాచ్‌లలో 70 శాతం మ్యాచ్‌లు అనుకున్న సమయానికి పూర్తి చేశారు. ఉత్తరాంధ్రలో ఉవ్వెత్తున శ్రీకాకుళం జిల్లావ్యాప్తంగా రెండో రోజూ ఉత్సాహంగా ఆడుదాం ఆంధ్రా టోర్నీలు కొనసాగాయి. పాతపట్నం నియోజకవర్గంలో ఎమ్మెల్యే రెడ్డి శాంతి కాసేపు క్రికెట్ ఆడి సందడి చేశారు. ఎచ్చెర్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్ యువకులతో కబడ్డీ ఆడి అలరించారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో బుధవారం వివిధ టోర్నమెంట్లు హోరాహోరీగా సాగాయి. సచివాలయ స్థాయిలో ఐదు క్రీడాంశాల్లో జరుగుతున్న పోటీల్లో క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. రెండు జిల్లాల్లోని 976 సచివాలయాల పరిధిలోని 485 మైదానాల్లో ఆటల పోటీలు సాగాయి. విశాఖ జిల్లా పశ్చిమ నియోజకవర్గంలోని సింహాచలం సచివాలయాల పరిధిలో క్రికెట్ పోటీలు ప్రారంభమయ్యాయి. తూర్పు నియోజకవర్గ పరిధిలోని ఏయూ ఇంజినీరింగ్ మైదానంలో కబడ్డీ, క్రికెట్, ఖోఖో పోటీలు జరగ్గా.. చినవాల్తేరు జిమ్నాజియం గ్రౌండ్లో షటిల్ బ్యాడ్మింటన్, క్రికెట్ పోటీలు ఉత్సాహంగా జరిగాయి. గాజువాక నియోజకవర్గ పరిధిలోని భెల్ (హెచ్‌పీవీపీ) క్రీడా మైదానంలో 8 జట్ల మధ్య సచివాలయ స్థాయి క్రికెట్ పోటీలు జరిగాయి. భీమిలి నియోజకవర్గంలోని ఆనందపురంలో క్రికెట్, ఖోఖో, వాలీబాల్, కబడ్డీ, బ్యాడ్మింటన్ పోటీల్లో యువ జట్లు ఉత్సాహంగా తమ ప్రతిభ చాటాయి. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని 515 సచివాలయాల్లో ఆడుదాం ఆంధ్రా రెండో రోజు పోటీలు ఉత్సాహంగా జరిగాయి. మామిడికుదురు మండలం మొగిలికుదురులో పోటీలను పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు పరిశీలించారు. తూర్పు గోదావరి జిల్లాలోని 511 సచివాలయాల పరిధిలో క్రీడాకారులు ఉల్లాసంగా పాల్గొన్నారు. కాకినాడ జిల్లాలోని 400 మైదానాల్లో జరిగిన పోటీల్లో క్రీడాకారులు చురుగ్గా పాల్గొన్నారు. రాయలసీమలో రసవత్తరంగా.. రాయలసీమలో ఆడుదాం ఆంధ్రా పోటీలు రసవత్తరంగా జరుగుతున్నాయి. చిత్తూరులో పోటీలను కలెక్టర్ షణ్మోహన్, జేసీ శ్రీనివాసులు పర్యవేక్షించారు. పీవీకేఎన్ మైదానంలో పోటీలను జెడ్పీ సీఈవో ప్రభాకర్‌రెడ్డి పరిశీలించారు. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా బుధవారం 507 సచివాలయాల పరిధిలో 492 క్రీడా మైదానాల్లో పోటీలు నిర్వహించారు. షెడ్యూల్ ప్రకారం రెండు రోజుల్లో 2,602 మ్యాచ్‌లు నిర్వహించాల్సి ఉండగా.. 2,365 మ్యాచ్‌లు జరిగాయి. తిరుపతి జిల్లా పరిధిలో రెండో రోజు 1,552 మ్యాచ్‌లు జరగాల్సి ఉండగా.. 1,151 మ్యాచ్‌లు జరిగాయి. పోటీలను తిరుపతి కలెక్టర్ వెంకటరమణారెడ్డి పర్యవేక్షించారు. కర్నూలు జిల్లా పరిధిలోని 672 సచివాలయాల్లో పోటీలు కొనసాగుతున్నాయి. కోడుమూరు మండలం పెంచికలపాడులో ఎమ్మెల్యే డాక్టర్ జరదొడ్డి సుధాకర్ రిబ్బన్ కట్ చేసి కబడ్డీ పోటీలను ప్రారంభించారు. ఒక్క కర్నూలు నగరంలోనే 30 క్రీడా మైదానాల్లో క్రికెట్, కబడ్డీ పోటీలు ఉత్సాహంగా సాగుతున్నాయి. వైఎస్సార్, అన్నమయ్య జిల్లాల్లో క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్, కబడ్డీ, ఖోఖో పోటీల్లో క్రీడాకారులు ఉత్సాహంగా తలపడ్డారు. కడప డీఎస్ఏ క్రీడా మైదానంలో పోటీలను డీఎస్డీవో కె.జగన్నాథరెడ్డి ప్రారంభించారు. సత్తా చాటుతున్న సెంట్రల్ ఆంధ్రా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఆడుదాం ఆంధ్రా క్రీడాపోటీలు కోలాహలంగా సాగుగుతున్నాయి. ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాలో షెడ్యూల్ ప్రకారం మ్యాచ్‌లు నిర్వహిస్తున్నారు. ఆచంట నియోజకవర్గ పరిధిలోని మార్టేరు, పెనుమంట్ర మండలాల్లో ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజు బుధవారం పోటీలను ప్రారంభించారు. మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో స్థానిక ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో పోటీలు జరిగాయి. ఏలూరు జిల్లాలో 1,250 మ్యాచ్‌లు, పశ్చిమగోదావరి జిల్లాలోని 537 సచివాలయ పరిధిలో 880 మ్యాచ్‌లు నిర్వహించారు. క్రీడా ప్రాంగణాల్లో వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. విజయవాడ కృష్ణలంకలోని ఏపీ ఎస్ఆర్ఎంసీ హైస్కూల్ మైదానంలో రెండో రోజు పోటీలు ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయి. కలెక్టర్ ఎస్.ఢిల్లీరావు, వైఎస్సార్సీపీ తూర్పు నియోజకవర్గ ఇన్చార్జి దేవినేని అవినాష్ క్రీడా పోటీలను ప్రారంభించారు. ఫిబ్రవరి 10 వరకు జరిగే ఈ మెగా ఈవెంట్లో ఎన్టీఆర్ జిల్లాకు చెందిన 1.20 లక్షల మంది భాగస్వాములవుతున్నారని కలెక్టర్ తెలిపారు. కృష్ణాజిల్లాలో మచిలీపట్నం, అవనిగడ్డ, పెడన, గన్నవరం, పెనమలూరు నియోజకవర్గాల్లో ఆడుదాం ఆంధ్రా పోటీలకు విశేష స్పందన లభిస్తోంది. పల్నాడు జిల్లాలోని అన్ని మండలాల్లో పోటీలు నిర్వహించారు. గురజాలలోని జయంతి పాఠశాలలో క్రికెట్ పోటీలను ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి ప్రారంభించారు. ప్రకాశం జిల్లా క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. కనిగిరి జూనియర్ కళాశాలలో ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ ప్రారంభించారు. తర్లుపాడు మండలంలో పోటీలను ఎమ్మెల్యే కేపీ నాగార్జునరెడ్డి ప్రారంభించారు. క్రీడాకారులతో కలిసి వాలీబాల్, క్రికెట్ ఆడారు. ఈనాడు కథనం పచ్చి అబద్ధం పీసీ పల్లి: ప్రకాశం జిల్లా పీసీ పల్లి పంచాయతీలో ఆడుదాం ఆంధ్రా పోటీలకు స్థానిక మహిళలు లేక రుణాలు తీసుకునేందుకు బ్యాంక్‌కు వచ్చిన అయ్యవారిపల్లికి చెందిన పొదుపు మహిళలతో టెన్నికాయిట్ ఆడించారంటూ ‘ఈనాడు’ ప్రచురించిన కథనాన్ని వెంకటేశ్వర డ్వాక్రా గ్రూప్ మహిళలు తీవ్రంగా ఖండించారు. ఈనాడులో ప్రచురించిన కథనమంతా అబద్ధమని మహిళలు తెలిపారు. పీసీపల్లి మండలం మురుగమ్మి పంచాయతీకి చెందిన వెంకటేశ్వర డ్వాక్రా గ్రూపునకు తామంతా రుణాల కోసం కమ్యూనిటీ కో–ఆర్డినేటర్ చిలకమ్మ కలిసి మంగళవారం పీసీ పల్లిలోని బ్యాంక్‌కు వెళ్లామన్నారు. బ్యాంక్‌లో రుణ ప్రక్రియ ఆలస్యం అవుతుందనడంతో సమీపంలోని పాఠశాలకు వెళ్లి ‘ఆడుదాం ఆంధ్రా’ తిలకించామన్నారు. అక్కడ పోటీల్లో పీసీ పల్లికి చెందిన తమ స్నేహితులు ఆటలాడుతుండటంతో విరామ సమయంలో వారితో ముచ్చటిస్తూ వారి చేతిలో ఉన్న ఆట వస్తువులను తీసుకుని సరదాగా వారితో కలసి ఆడామని చెప్పారు. అనంతరం బ్యాంకుకు వెళుతుంటే ఈనాడు విలేకరి వచ్చి మీది ఏ గ్రామం, ఏ పనిమీద వచ్చారని అడిగి ఫొటోలు తీసుకువెళ్లినట్టు చెప్పారు. గ్రూప్ లీడర్ సులోచన మాట్లాడుతూ.. రుణాల కోసం పీసీ పల్లి బ్యాంక్‌కు వెళ్లామని.. రుణ ప్రక్రియ ఆలస్యం అవుతుందనడంతో స్కూల్లో జరిగే ఆటల పోటీలకు చూడటానికి వెళ్లామని చెప్పారు. తాము పోటీల్లో పాల్గొనలేదని.. కావాలనే పార్టీల మీద అక్కసుతో తమ ఫొటోలు తీసి తప్పుడు కథనం ప్రచురించారని తెలిపారు. -
ఆరోగ్యానికి 'ఆట' బాట
సాక్షి, అమరావతి: క్రీడా రంగంలో ‘ఆడుదాం ఆంధ్ర’ కార్యక్రమాన్ని బెంచ్ మార్క్‌లా ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచించారు. దీనిద్వారా గ్రామాల్లో ఆరోగ్యకర జీవనాన్ని పెంపొందించడంలో భాగంగా వ్యాయామం, క్రీడలను ప్రోత్సహించడం ఒక ప్రధాన కారణమైతే.. మట్టిలోని మాణిక్యాల ప్రతిభను వెలికితీసి ప్రపంచ వేదికలపై నిలబెట్టే మహోన్నత ఉద్దేశంతో ఐదు రకాల క్రీడలను ప్రమోట్ చేస్తున్నామన్నారు. ఈ రెండు ప్రధానాంశాలే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మెగా క్రీడాటోర్నీకి శ్రీకారం చుట్టామని తెలిపారు. ఏటా డిసెంబరులో ‘ఆడుదాం ఆంధ్ర’ను నిర్వహించేలా ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. ఈనెల 26వ తేదీ నుంచి ఫిబ్రవరి 10 వరకు 47 రోజుల పాటు పండుగ వాతావరణంలో క్రీడా పోటీలు చేపట్టాలని నిర్దేశించారు. 15 వేల గ్రామ/వార్డు సచివాలయాల పరిధిలో ఆడుదాం ఆంధ్రకు అన్ని రకాలుగా సన్నద్ధమవ్వాలని సూచించారు. ఈమేరకు సచివాలయం, మండలం, నియోజకవర్గం, జిల్లా, రాష్ట్ర స్థాయి వరకు వివిధ దశల్లో ప్రత్యేక ఎస్‌వోపీలను రూపొందించి అమలు చేయాలన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులతో ఆయా విభాగాల అధికారులు సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలన్నారు. బుధవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లతో ముఖ్యమంత్రి జగన్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే.. సంకల్ప బలంతో.. అంచనాలకు మించి నాడు– నేడు ద్వారా 45 వేల ప్రభుత్వ పాఠశాలలను సమూలంగా మార్పు చేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టినప్పుడు ఎన్నో ప్రశ్నలు ఎదురయ్యాయి. అలాగే 15 వేల సచివాలయాలను స్థ్ధాపించగలుగుతామా? ప్రతి సచివాలయం పరిధిలో విలేజ్ క్లినిక్ పెట్టగలుగుతామా? 1.30 లక్షల మందిని అతి తక్కువ కాలంలో సచివాలయాల్లో నియమించగలుగతామా? అన్నవి కూడా గతంలో ప్రశ్నార్థకాలుగా ఉన్నవే. ప్రజలకు మంచి చేయాలనే మన సంకల్పమే వీటన్నింటినీ విజయవంతంగా పూర్తి చేసింది. సచివాలయాల దగ్గర నుంచి నేడు ఆరోగ్య సురక్ష వరకు ప్రతి కార్యక్రమాన్నీ ఒక చాలెంజ్‌గానే చేపట్టాం. ప్రతి అడుగులోనూ అంచనాలకు మించి పని చేశాం. అందులో భాగమే ‘ఆడుదాం ఆంధ్ర’ తలపెట్టాం. ఐదు రకాల క్రీడలు.. ప్రజారోగ్య సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాం. విలేజ్ క్లినిక్స్ ద్వారా ప్రివెంటివ్ కేర్‌పై దృష్టి పెట్టాం. ప్రివెంటివ్ కేర్ మరింత సమర్థంగా పని చేయాలంటే నిత్యం వ్యాయామం అవసరం. ఆరోగ్య సురక్ష ద్వారా డయాబెటిక్, బీపీ కేసులు బయటపడ్డాయి. ప్రివెంటివ్ కేర్‌లో భాగంగా ప్రతి ఇంటిలో ఫిజికల్ యాక్టివిటీస్ పెరిగితే భవిష్యత్తులో అవన్నీ తగ్గుతాయి. అందుకే ఆడుదాం ఆంధ్రను ప్రాముఖ్యత ఉన్న అంశంగా గుర్తించాలి. గ్రామీణ క్రీడాకారులకు సరైన గుర్తింపు కల్పిస్తే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రాతినిధ్యం వహించే అవకాశం దక్కుతుంది. ఇందులో భాగంగానే ఐదు రకాల క్రీడలు.. క్రికెట్, బ్యాడ్మింటన్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో ప్రమోట్ చేయాలి. ప్రతిభగల క్రీడాకారులకు ఉన్నతస్థాయి శిక్షణ అందించే దిశగా అడుగులు వేయాలి. పోటీల ప్రారంభానికి ముందే అన్ని స్థాయిల్లో పెద్ద ఎత్తున పండుగ వాతావరణంలో సన్నాహక కార్యక్రమాలు చేపట్టాలి. 3 కిలోమీటర్ల మారథాన్ లాంటి కార్యక్రమాలు జిల్లా స్ధాయిలో నిర్వహించాలి. దీనిద్వారా ఆడుదాం ఆంధ్రకు సరికొత్త ఉత్సాహాన్ని తీసుకురాగలుగుతాం. మైదానాలు మెరవాలి.. ఆడుదాం ఆంధ్రలో భాగంగా 14,997 గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో 9,043 క్రీడా మైదానాలను గుర్తించారు. క్రీడల నిర్వహణ కోసం మైదానాలు పూర్తి స్థాయిలో సిద్ధం చేయడంపై నిరంతరం పర్యవేక్షించాలి. ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీ మైదానాలు, యూనివర్సిటీ గ్రౌండ్స్, మున్సిపల్ స్టేడియాలు, జిల్లా స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లు క్రీడలతో మెరిసేలా వినియోగంలోకి తేవాలి. ఇకపై ఏటా గ్రామ స్థాయి నుంచి మట్టిలోని క్రీడా రత్నాలను వెతికి పట్టుకుందాం. అప్పుడే పీవీ సింధు, జ్యోతి సురేఖ, రాయుడు, శ్రీకాంత్, సాకేత్ లాంటి మరింత మంది అంతర్జాతీయ క్రీడాకారులను చూడగలుగుతాం. సచివాలయాల్లో పోస్టర్లు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంపై అవగాహన కల్పించేలా వెంటనే సచివాలయం పరిధిలో పోస్టర్లను ప్రదర్శించాలి. వలంటీర్లు తమ పరిధిలోని కుటుంబాలకు ఈ టోర్నీ విశిష్టతను వివరించాలి. 15 ఏళ్లు పైబడిన వారిని, ప్రధానంగా గ్రామాల్లో బాలికలను ఎక్కువగా క్రీడలవైపు నడిపించాలి. ఇప్పటికే 1.23 కోట్ల రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఇందులో ఏకంగా 34.19 లక్షల మంది క్రీడాకారులు ‘ఆడుదాం ఆంధ్ర’లో పోటీపడతారు. వీరికి నాణ్యమైన కిట్లను అందించాలి. ప్రొఫెషనల్స్ గుర్తింపు.. నియోజకవర్గ స్థాయిలో ఐదు రకాల క్రీడాంశాల్లో ప్రొఫెషనల్స్‌ను గుర్తించి వారికి చేయూతనిచ్చే గొప్ప కార్యక్రమాలన్ని తలపెడుతున్నాం. క్రికెట్లో చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే), ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ టాలెంట్ హంట్‌లో భాగస్వాములవుతాయి. బ్యాడ్మింటన్‌లో సింధు, శ్రీకాంత్ బృందాలు ప్రతిభగల క్రీడాకారులను వెలికి తీసేందుకు ముందుకొచ్చారు. వాలీబాల్‌లో ప్రైమ్ వాలీబాల్, కబడ్డీలో ప్రో కబడ్డీ ఆర్గనైజర్లు ఉత్తమ ప్రతిభను ఎంపిక చేస్తారు. క్రీడలను ప్రమోట్ చేసేందుకు 21 మంది రాష్ట్రస్థాయి అంబాసిడర్లు, 345 మంది జిల్లా స్థాయిలో ప్రతిభావంతులు ముందుకు వచ్చారు. దీంతో నియోజకవర్గం, జిల్లా, రాష్ట్ర స్థాయి వరకు పూర్తిస్థాయి ప్రొఫెషనల్స్ గేమ్స్ మొదలవుతాయి. ప్రతిభకు నగదు బహుమతి క్రికెట్, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ పోటీల్లో ప్రథమ విజేతలకు రాష్ట్రస్థాయిలో రూ.5 లక్షలు, జిల్లాలో రూ.60 వేలు, నియోజకవర్గంలో రూ.35 వేలు చొప్పున నగదు బహుమతి ఇస్తున్నాం. ఈ క్రీడలకు సంబంధించి ద్వితీయ బహుమతి కింద రాష్ట్రస్థాయిలో రూ.3 లక్షలు, జిల్లాలో రూ.30 వేలు, నియోజక వర్గంలో రూ.15 వేలు, తృతీయ బహుమతిగా రూ.2 లక్షలు, రూ.10 వేలు, రూ.5 వేలు చొప్పున అందజేస్తాం. బ్యాడ్మింటన్ డబుల్స్ విజేతలకు రాష్ట్రస్థాయి ప్రథమ బహుమతి రూ.2 లక్షలు, జిల్లాలో రూ.35 వేలు, నియోజకవర్గంలో రూ.25 వేలు, ద్వితీయ బహుమతి కింద వరుసగా రూ.లక్ష, రూ.20 వేలు, రూ.10 వేలు, తృతీయ బహుమతిగా రూ.50 వేలు, రూ.10 వేలు, రూ.5 వేల చొప్పున నగదు బహుమతులు అందచేస్తాం. ► విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, పర్యాటక, సాంస్కృతిక, క్రీడాశాఖల మంత్రి ఆర్కే రోజా, సీఎస్ డాక్టర్ కె.ఎస్. జవహర్ రెడ్డి, శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, యువజన సర్వీసుల శాఖ ముఖ్యకార్యదర్శి ప్రద్యుమ్న, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ పి.కోటేశ్వరరావు, శాప్ ఎండీ హెచ్ఎం.ధ్యానచంద్ర, అంతర్జాతీయ క్రీడాకారులు అంబటి రాయుడు, పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్, సాకేత్ మైనేని, వి.జ్యోతి సురేఖ, ఎస్కె జఫ్రీన్లతో పాటు పలువురు ఉన్నతాధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. -
ఆటకు అందలం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ‘ఆడుదాం–ఆంధ్ర’ క్రీడా పోటీల విజేతలకు ప్రభుత్వం భారీగా నగదు బహుమతులు ప్రకటించింది. గ్రామ/వార్డు సచివాలయ స్థాయి నుంచి ఐదు దశల్లో పోటీలను నిర్వహించనుంది. ప్రతి దశలోనూ క్రీడాకారుల ప్రతిభను వెలికితీయడంతో పాటుగా విజేతలను సర్టిఫికెట్స్, మెమెంటోలు, నగదు పురస్కారాలతో సత్కరించనుంది. క్రీడా చరిత్రలో కనివిని ఎరుగని రీతిలో 15ఏళ్లు పైబడిన వయస్కులు (మెన్, ఉమెన్) అందరూ పోటీల్లో భాగస్వాములయ్యేలా ‘ఓపెన్ మీట్’ను చేపడుతున్నది. యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించేందుకు ఐదు క్రీడా విభాగాలైన.. క్రికెట్, వాలీబాల్, ఖోఖో, కబడ్డీ, బ్యాడ్మింటన్ డబుల్స్‌లో విజేతలకు నగదు బహుమతులు ఇవ్వనుంది. మరోవైపు ఆరోగ్యకర సమాజాన్ని కాంక్షిస్తూ సాంప్రదాయ యోగా, టెన్నీకాయిట్, మారథాన్ పోటీలను ఏర్పాటు చేస్తోంది. 2.99లక్షల మ్యాచ్‌లు.. 52.31లక్షల క్రీడాకారులు తొలి దశలో భాగంగా 15,004 గ్రామ/వార్డు సచివాలయాల పరిధిలో మొత్తం 1.50లక్షల మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఇక్కడి విజేతలు అనంతరం మండల స్థాయిలో పోటీపడతారు. అంటే 680 మండలాల్లో మొత్తం 1.42లక్షల మ్యాచ్‌లు ఉంటాయి. ఈ దశలో గెలుపొందిన జట్లను నియోజవకర్గ పోటీలకు పంపిస్తారు. 175 నియోజకవర్గాల్లో 5,250 మ్యాచ్‌లలో పోటీలు నిర్వహిస్తారు. వీటిల్లో సత్తా చాటిన వారు జిల్లా స్థాయికి ఆడాల్సి ఉండగా.. 26 జిల్లాల్లో 312 మ్యాచ్‌లు నిర్వహిస్తారు. జిల్లా స్థాయి విజేతలతో రాష్ట్ర స్థాయిలో 250 మ్యాచ్‌ల్లో పోటీపడేలా షెడ్యూల్ రూపొందిస్తున్నారు. గ్రామ/వార్డు సచివాలయ స్థాయిలో 34.20లక్షల మంది, మండల స్థాయిలో 17.10లక్షల మంది, నియోజకవర్గ పోటీల్లో 77,520 మంది, జిల్లా స్థాయిలో 19,950 మంది, రాష్ట్ర స్థాయిలో 2,964 మంది ‘ఆడుదాం–ఆంధ్ర’ క్రీడల్లో ప్రాతినిధ్యం వహించనున్నారు. వివిధ దశల్లో కలిపి మొత్తం 52.31లక్షల మంది ఒకే వేదికపై 50 రోజుల పాటు క్రీడా మహోత్సవంలో సందడి చేయనున్నారు. నేటి నుంచి రిజిస్ట్రేషన్ రాష్ట్రంలో ‘ఆడుదాం–ఆంధ్ర’ క్రీడా పోటీల రిజిస్ట్రేషన్ సోమవారం నుంచి ప్రారంభిస్తున్నట్టు శాప్ ఎండీ ధ్యాన్‌చంద్ర ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. డిసెంబరు 13 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చన్నారు. 15 ఏళ్లకు పైబడిన క్రీడాకారులు (మెన్, ఉమెన్) సమీపంలోని గ్రామ లేదా వార్డు సచివాలయంలో, వాలంటీర్ల ద్వారా, ఆన్లైన్లో aadudamandhra.ap.gov. in వెబ్సైట్ ద్వారా, 1902కి ఫోన్ చేసి వివరాలు నమోదు చేసుకోవచ్చని చెప్పారు. ఐదు క్రీడాంశాల్లో గ్రామ/వార్డు సచివాలయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పోటీలు నిర్వహిస్తామన్నారు. 15,004 గ్రామ/వార్డు సచివాలయాల పరిధిలో డిసెంబర్ 15 నుంచి ఫిబ్రవరి 3 వరకు క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్ డబుల్స్, కబడ్డీ, ఖోఖోతో పాటు సంప్రదాయ యోగ, టెన్నీకాయిట్, మారథాన్ అంశాల్లో పోటీలు జరుగుతాయన్నారు. ఇప్పటికే క్రీడా సామగ్రిని జిల్లాలకు తరలించామన్నారు. పోటీల్లో విజేతలకు సర్టీఫికెట్లు, ట్రోఫీలు, పతకాలు అందజేస్తామని చెప్పారు. నియోజవకర్గం, జిల్లా, రాష్ట్ర స్థాయి విజేతలకు ప్రత్యేక నగదు బహుమతులు అందజేస్తామన్నారు. ఫైనల్స్‌ను విశాఖలో నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. -
‘ఆడుదాం ఆంధ్ర’కు సన్నద్ధం
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ‘ఆడుదాం ఆంధ్ర’ పేరుతో పెద్ద ఎత్తున క్రీడా పోటీలు నిర్వహించాలన్న సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు.. అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) కేఎస్ జవహర్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లకు సీఎస్ జవహర్‌రెడ్డి దిశానిర్దేశం చేశారు. గ్రామ, వార్డు సచివాలయాల నుంచి మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయి వరకు ఆడుదాం ఆంధ్ర పేరుతో క్రికెట్, బ్యాడ్మింటన్, వాలీబాల్, ఖోఖో, కబడ్డీ పోటీలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. పురుషులు, మహిళలకు అన్ని స్థాయిల్లో కలిపి మొత్తం 2.99 లక్షల మ్యాచ్‌లు నిర్వహించాల్సి ఉంటుందన్నారు. వీటితోపాటు సంప్రదాయ క్రీడల్లో కూడా పోటీలు నిర్వహించాలని సూచించారు. వీటి నిర్వహణకు అవసరమైన అన్ని క్రీడా మైదానాలను గుర్తించి సిద్ధం చేయాలని ఆదేశించారు. పోటీల నిర్వహణ కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు ఎమ్మార్వోలు, ఎంపీడీవోలు, ఎంఈవోలు, ఇంజినీర్లు, పంచాయతీరాజ్ ఈవోలకు తగిన ఆదేశాలివ్వాలని సూచించారు. పోటీల సమయంలో క్రీడాకారులకు రవాణా, ఆహారం, వసతి ఏర్పాటు చేయాలన్నారు. ప్రొటోకాల్ ప్రకారం ప్రజాప్రతినిధులను ఆహా్వనించాలని పేర్కొన్నారు. అన్ని స్థాయిల్లో పోటీల నిర్వహణకు మొత్తం 46 రోజులు పడుతుందన్నారు. అన్ని మ్యాచ్‌లు సంబంధిత చీఫ్ కోచ్ రూపొందించిన ప్రణాళిక ప్రకారమే నిర్వహించాలని స్పష్టం చేశారు. ప్రతి స్థాయిలో పోటీల నిర్వహణకు ఆర్గనైజింగ్ కమిటీలు ఏర్పాటు చేయాలని చెప్పారు. -
యువత ఐక్యతకే క్రీడా పోటీలు
తాండూరు టౌన్: యువతలో సమైక్యతా భావాలను పెంపొందించేందుకే క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామని ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు. పీఎంఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ క్రీడా పోటీలకు, ఎన్నికలకు ఎలాంటిసంబంధం లేదని తెలిపారు. తాండూరు నియోజకవర్గంలో నిర్వహించిన క్రికెట్ టోర్నీ ముగింపు సందర్భంగా బుధవారం పట్టణంలో సుమారు 6వేల మందితో పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఆయన తనయుడు రినీష్‌రెడ్డితో కలిసి విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. పట్నం ఫ్యామిలీకి క్రీడా పోటీలు నిర్వహించడం కొత్తేమీ కాదన్నారు. పీఎమ్మార్ ట్రస్టు తరఫున తన తనయుడు రినీష్‌రెడ్డి నేతృత్వంలో సామాజిక కార్యక్రమాలను మరింత విస్తరిస్తామని ప్రకటించారు. జాబ్ మేళాలు నిర్వహించి యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామని తెలిపారు. వచ్చే సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో సామూహిక వివాహాలు జరిపించనున్నట్లు చెప్పారు. యువత సన్మార్గంలో నడవాలి అనంతరం ఎమ్మెల్సీ తనయుడు రినీష్‌రెడ్డి మాట్లాడుతూ యువత దేశానికి వెన్నెముక అని, యువత తలుచుకుంటే సాధించనిదంటూ ఏదీ లేదని తెలిపారు. అలాంటి యువతను ప్రోత్సహించడంలో భాగంగానే పీఎంఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో క్రీడా పోటీలు నిర్వహించామన్నారు. తాను తక్కువ మాట్లాడుతూ.. ఎక్కువ పని చేసి చూపిస్తానన్నారు. యువత మత్తుకు బానిసలు కాకూడదని, తాండూరులో కొందరి వల్ల యువత పెడదోవ పడుతోందని తెలిపారు. యాగాలు, పూజలు జరిపించినంత మాత్రాన చేసిన తప్పులను దేవుడు క్షమించడని వ్యాఖ్యానించారు. భవిష్యత్‌లో యువతకు అండగా నిలుస్తూ సామాజిక సేవా కార్యక్రమాలను ఉధృతం చేస్తామని స్పష్టంచేశారు. అనంతరం నియోజకవర్గ స్థాయి టోర్నీ విజేతలకు రూ.2 లక్షలు, రన్నరప్స్‌కు రూ.లక్ష అందజేశారు. పట్టణం, మండల స్థాయి విజేతలకు వరుసగా రూ.50 వేలు, రూ.25 వేలతో పాటు ట్రోఫీలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ము న్సిపల్ చైర్పర్సన్ స్వప్న, బీఆర్ఎస్ నాయకులు కరణం పురుషోత్తంరావు, లక్ష్మారెడ్డి, డాక్టర్ సంపత్ కుమార్, అబ్దుల్ రవూఫ్, నర్సింహులు, రజాక్, రవిగౌడ్, పరిమళ, శోభారాణి, నీరజా బాల్‌రెడ్డి, నారాయణరెడ్డి, సిద్రాల శ్రీనివాస్,అజయ్‌ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
సరిలేరు మీకెవ్వరూ..!
శ్రీకాకుళం న్యూకాలనీ: దివ్యాంగులు సకలాంగులకు ఏమాత్రం తీసిపోరని, ప్రోత్సహిస్తే అద్భుతాలు సృష్టిస్తా రని జిల్లా కలెక్టర్ జె.నివాస్ అన్నారు. శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ (ఆర్ట్స్) కళాశాల మైదానంలో బుధవారం విభిన్న ప్రతిభావంతుల జిల్లాస్థాయి క్రీడా పోటీలు జరిగాయి. జిల్లా విభిన్నప్రతిభావంతులు, హిజ్రాలు, వయోవృద్ధుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీలను కలెక్టర్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలో సత్తాకలిగిన దివ్యాంగ క్రీడాకారులు ఎంతోమంది ఉన్నారని చెప్పారు. జాతీయ, అంతర్జాతీయ పారా ఒలింపిక్స్ పోటీ ల్లో పాల్గొని పతకాలు సాధించాలని పిలుపునిచ్చారు. ఏడీ కె.జీవన్‌బాబు మాట్లాడుతూ ఇక్క డ రాణించిన క్రీడాకారులను రాష్ట్రస్థాయి పోటీలకు పంపిస్తామన్నారు. అక్కడ రాణించి విజేతలగా నిలిస్తే జాతీయ పోటీలకు వెళ్లే అవకాశముందన్నారు.కార్యక్రమంలో జిల్లా చీఫ్ కోచ్ బి.శ్రీనివాస్‌కుమార్, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పి.సుందరరావు, పీఈటీ సంఘ జిల్లా అధ్యక్షుడు ఎం.వి.రమణ, కార్య దర్శి ఎం.సాంబమూర్తి, కార్యనిర్వహణ కార్య దర్శి ఎస్.సూరిబాబు, వై.పోలినాయుడు, దివ్యాంగ ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకులు ఎంకే మిశ్రా, జిల్లా దివ్యాంగ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బి.శ్రీనివాసరావు, విభిన్న సంస్థల నిర్వాహకులు, పీఈటీలు పాల్గొన్నారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన కలెక్టర్.. అంతకుముందు కలెక్టర్ నివాస్ జాతీయ పతాకాన్ని ఎగురువేసి గౌరవ వందనం సమర్పించారు. ఏడీ జీవన్‌బాబు క్రీడల పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం పోటీలను లాంఛనంగా ప్రారంభిస్తున్నట్టు బెలూన్లను నింగికి విడిచిపెట్టారు. 100 మీటర్ల ట్రైసైకిల్ రేస్‌ను జెండా ఊపి ప్రారంభించారు. ఈ పోటీల్లో జిల్లా నలుమూలల నుంచి సుమారు 250 మంది విభిన్నప్రతిభావంతులు హాజరయ్యారు. ఎన్సీసీ క్యాడెట్లు ఉదయం నుంచి సాయంత్రం వరకు విభిన్న ప్రతిభావంతులకు అమూల్యమైన సేవలు అందించారు. కోలాహలంగా సాగిన పోటీలు.. 6 నుంచి 15 ఏళ్లలోపు జూనియర్స్ విభాగం, 15 ఏళ్లు పైబడినవారిని సీనియర్స్ విభాగంగా బాలబాలికలకు వేర్వేరుగా పోటీలు నిర్వహించారు. టోటల్లీ బ్లైండ్, హియరింగ్, ఆర్థోపిడికల్లీ, మెంటల్లీ రిటార్డెడ్ కేటగిరీల్లో పోటీలు జరిగాయి. అథ్లెటిక్స్ ఈవెంట్స్‌లో రన్నింగ్, షాట్‌పుట్, లాంగ్‌జంప్, జావెలిన్‌త్రో, డిస్కస్‌త్రో, సాఫ్ట్బాల్త్రోలో పోటీలు నిర్వహించారు. ట్రైసైకిల్ రేస్తోపాటు చెస్, క్యారమ్స్, క్రికెట్, వాలీబాల్, సింగింగ్, నృత్యం తదితర అంశాలలో హుషారుగా పోటీల్లో పాల్గొని సత్తాచాటారు. ఒక వ్యక్తి రెండు ఈవెంట్స్లలోనే పాల్గొనాలని అధికారులు షరతు పెట్టడంతో కొంతమంది నిరాశ చెందారు. -
20 నుంచి ఐపీఎస్‌జీఎం క్రీడాపోటీలు
గుడ్లవల్లేరు : రాష్ట్ర స్థాయి ఇంటర్ పాలిటెక్నిక్ 21వ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్(ఐపీఎస్‌జీఎం)ను గుడ్లవల్లేరు ఏఏఎన్‌ఎం అండ్ వీవీఆర్‌ఎస్‌ఆర్ పాలిటెక్నిక్ కాలేజీలో ఈ నెల 20 నుంచి 22వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఈ పోటీలకు సంబంధించిన బ్రోచర్‌ను కాలేజీ ప్రిన్సిపాల్ ఎన్‌ఎస్‌ఎస్‌వీ రామాంజనేయులు శుక్రవారం రాత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గేమ్స్ విభాగంలో చెస్, వాలీబాల్, కబడ్డీ, టేబుల్ టెన్నీస్, బాల్ బాడ్మింటన్, బాడ్మింటన్, టెన్నికాయిట్, ఖోఖో పోటీలు ఉంటాయన్నారు. స్పోర్ట్స్ విభాగంలో బాలురకు 11, బాలికలకు 8 అంశాల్లో పోటీలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ పోటీలకు మొత్తం 1,200 మంది క్రీడాకారులు, 120మంది పీడీలు వస్తారన్నారు. ఈ సమావేశంలో పలు విభాగాల అధిపతులు ఎన్వీకే ప్రసాద్, వినయ్, కృష్ణప్రసాద్, శరత్ తదితరులు పాల్గొన్నారు. -
తూతూమంత్రంగా క్రీడా పోటీలు
రామచంద్రాపురం: మండలంలో తూతూ మంత్రంగా క్రీడా పోటీలను నిర్వహిస్తున్నారు. కొన్నేళ్లుగా మండల స్థాయిలో జరిగే క్రీడాపోటీలను నామమాత్రంగా జరుగుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు కావాల్సిన క్రీడాసామాగ్రిని కూడా లేకపొవడంతో కొంతమంది పీఈటీలే వాటిని కొని ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. దీనికితోడు విద్యార్థులలో క్రీడాస్ఫూర్తిని నింపడంలో పాలకులు పూర్తిగా విఫలం చెందుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రతి ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మండల స్థాయి క్రీడాపోటీలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. గత ఏడాది ఈ పోటీలను సరిగ్గా నిర్వహించలేదు. ఉపాధ్యాయులు వారి జేబుల్లో నుంచి పైసలను ఖర్చుచేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో క్రీడాపోటీలంటే మొదట ఉపాధ్యాయులే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇది కాదన్నట్లు రెండురోజులుగా మండల స్థాయి క్రీడాపోటీల కోసం భెల్‌టౌన్‌షిప్‌లోని జిల్లా పరిషత్ పాఠశాలలో క్రీడాకారుల ఎంపిక కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇందులో మండల పరిధిలోని ఆరు జిల్లా పరిషత్తు పాఠశాలకు చెందిన విద్యార్థులతో పాటు ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. బాలికల విభాగంలో ఇప్పటికే క్రీడాకారుల ఎంపిక జరిగింది. బాలుర విభాగంలో ప్రస్తుతం ఎంపిక కార్యక్రమం జరుగుతుంది. ఇది పూర్తయిన వెంటనే మండల స్థాయి క్రీడాపోటీలను నిర్వహించాల్సి ఉంటుంది. కానీ అందుకు కావాల్సిన నిధులు మాత్రం నేటికి మంజూరు కాకపోవడంతో అవి తమనేత్తిన ఎక్కడపడతాయోనని పీఈటీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులలో విద్యతోపాటు క్రీడారంగంలో కూడా ముందుండేలా చూడాల్సిన పాలకుల నిర్లక్ష్యం వల్లే వారు క్రీడలకు దూరమవుతున్నరన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైన జిల్లా ఉన్నతాధికారులు, పాలుకులు స్పందించి వెంటనే క్రీడాపోటీలకు కావాల్సిన నిధులను మంజూరు చేయాలని పలువురు కోరుతున్నారు. -
క్రీ‘డల్’ !
ప్రభుత్వ పాఠశాలలో ఆటలకు స్థలం కరువు ప్రయివేటు స్కూళ్లకు మైదానాల కొరత బాన్సువాడ: ర్యాంకుల వేటలో బాల్యం బలైపోతోంది. క్రీడలకు ప్రాధాన్యం తగ్గిపోతోంది. ప్రభుత్వం కోట్ల నిధులు ఖర్చు చేస్తున్నానని చెబుతున్నా క్రీడలు మాత్రం చతకిలబడ్డాయి. ప్రభుత్వ స్కూళ్లకు నిధుల కొరత వేధిస్తుంటే, ప్రైవేటు స్కూళ్లకు మైదానాలు కరువయ్యాయి. ‘ఆగస్టు చివరి వారంలో మండల స్థాయి క్రీడా పోటీలను నిర్వహించాలి’.. ఇది 2016–17 విద్యా సంవత్సరం క్యాలెండర్లో పేర్కొన్న ప్రణాళిక. కానీ ఒకటి, రెండు తప్ప మిగతా మండలాల్లో ఎక్కడా పోటీలు ప్రారంభం కాలేదు. దీన్ని బట్టి చూస్తే ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో క్రీడా పోటీలకు ఇస్తున్న ప్రాధాన్యమేమిటో, అధికారుల నిర్లక్ష్యం ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. ఇటీవల ప్రభుత్వం క్రీడలకు సమయం తగ్గించాలని నిర్ణయించడంపై అసంతృప్తి్త వ్యక్తమవుతోంది. జిల్లాలో 417 ఉన్నత పాఠశాలలు, 618 ప్రాథమికోన్నత పాఠశాలలు, 1,747 ప్రాథమిక పాఠశాలల్లో సుమారు 2 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరిలో కొందరు క్రీడల్లో రాణిస్తున్నా తగిన ప్రోత్సాహం లభించట్లేదు. ప్రస్తుతం జిల్లాలో వ్యాయామ ఉపాధ్యాయల కొరత తీవ్రంగా ఉంది. క్రీడలకు సమయం కరువు విద్యార్థులకు క్రీడల కోసం కేటాయించే సమయం తగ్గిపోతోంది. చాలా ప్రైవేటు స్కూళ్లలో అసలు క్రీడల మాటే లేదు. ప్రభుత్వ బడుల్లో నిత్యం ఖోఖో, వాటీబాల్, కబడ్డీ, క్రీకెట్, బాల్‌బ్యాడ్మింటన్, త్రోబాల్‌తో పాటు అథ్లెటిక్స్ విభాగంలో రన్నింగ్, హైజంప్ నేర్పించాల్సి ఉంటుంది. వీటిలో ఏ ఒక్కదానిలో విద్యార్థులు రాణించినా మంచి భవిష్యత్తు ఉంటుంది. అయితే ఉన్నత పాఠశాలల్లో ఒక్కో తరగతికి వారానికి కేవలం మూడు పీరియడ్లు మాత్రమే క్రీడలకు కేటాయిస్తున్నారు. అయితే, టెన్త్ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలనే ఉద్దేశ్యంతో వారికి క్రీడలకు సమయమే ఇవ్వట్లేదు. క్రీడా పరికరాల కొరత.. జిల్లా వ్యాప్తంగా అనేక పాఠశాలల్లో క్రీడా పరికరాల జాడే లేదు. వ్యాయామ ఉపాధ్యాయుడు లేకపోవడంతో తాత్కాలిక బోధకుల్ని నియమించకున్నారు. కొందరు ఉత్సాహంగా విద్యార్థులకు క్రీడాంశాల్లో శిక్షణ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా క్రీడా పరికరాల కొరతతో ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. ఉమ్మడి రాష్ట్రంలో పదేళ్లుగా పాఠశాలల్లో క్రీడల అభివృద్ధి, పరికరాల కొనుగోలుకు ఏటా రూ.15వేల నిధులను మంజూరు చేసేవారు. ప్రస్తుతం ఆ నిధులకు సైతం మంగళం పాడేశారు. దీంతో క్రీడా పరికరాలు అందుబాటులో లేకుండా పోయాయి. ప్రైవేటు బడుల్లో మరీ ఘోరం.. నిబంధనల ప్రకారం ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలకు తప్పనిసరిగా క్రీడా మైదానాలు ఉండాలి. కానీ ఇప్పటికే ఉన్న, కొత్తగా పుట్టుకొస్తున్న ప్రైవేట్ బడులకు మైదానాలే లేవు. చిన్న ఇండోర్ స్టేడియం ఉన్నా పాఠశాలలకు అనుమతి ఇవ్వొచ్చని ప్రభుత్వం నిబంధనలు మార్చడం ప్రైవేటు స్కూళ్లకు కలిసొచ్చింది. అయితే, చాలా పాఠశాలల్లో ఇండోర్ స్టేడియాలు కూడా లేవు. ఇవన్నీ అధికారులు చూసీ చూడనట్టు వదిలేస్తున్నారు. ‘ధ్యాన్‌చంద్’ పేరిట క్రీడా దినోత్సవం ప్రముఖ హాకీ క్రీడాకారుడు ధ్యాన్‌చంద్ జన్మించిన రోజునే జాతీయ క్రీడా దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. 1905 ఆగస్టు 29న ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్‌లో జన్మించిన ఆయన.. హాకీలో భారత్‌కు చిరస్మరణీయ విజయాలు అందించాడు. ఒలింపిక్స్‌లో వరుసగా మూడుసార్లు గోల్డ్ మెడల్స్‌ను సాధించి పెట్టాడు. ఆయన సేవలను గుర్తించిన ప్రభుత్వం ధ్యాన్‌చంద్ పుట్టిన రోజును జాతీయ క్రీడా దినోత్సవంగా ప్రకటించింది. -
‘పాలిటెక్నిక్’ క్రీడా పోటీలు ప్రారంభం
విద్యానగర్(గుంటూరు) : జిల్లా స్థాయి పాలిటెక్నిక్ కళాశాలల క్రీడాపోటీలు గుంటూరు రూరల్ మండలం నల్లపాడులోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో మంగళవారం ప్రారంభమయ్యూరుు. పోటీలను ఐటీసీ డివిజనల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సంజీవ్ రాంగ్రాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలతో విద్యార్థుల్లో నూతన ఉత్తేజం కలగటంతోపాటు స్నేహభావం పెరుగుతుందని చెప్పారు. జిల్లా క్రీడాభివృద్ధి అధికారి బి.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ క్రీడల్లో ఉత్తమ ప్రతిభ కనబరిస్తే మంచి ఉద్యోగావకాశాలు లభిస్తాయని వివరించారు. కళాశాల ప్రిన్సిపాల్ ఎన్.అరోజ్రాణి మాట్లాడుతూ రెండు రోజులు జరిగే ఈ పోటీల్లో 20 కళాశాలల నుంచి 400 మంది పాల్గొంటున్నారని చెప్పారు. జిల్లా స్థారుు పోటీలకు ఆతిథ్యం ఇవ్వటం ఆనందం కలిగిస్తోందన్నారు. తొలుత సంజీవ్ రాంగ్రాస్, ఇతర అతిథులు జ్యోతి వెలిగించి, శాంతి కపోతాలను ఎగురవేశారు. క్రీడా జ్యోతిని వెలిగించి క్రీడాకారుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. సంజీవ్ రాంగ్రాస్ వాలీబాల్ ఆడి పోటీలను ప్రారంభించారు. తొలిరోజు టెన్నిస్, షటిల్ బ్యాడ్మింటన్, కబడ్డీ, చెస్ తదితర క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించారు. చెస్ పోటీల్లో గుంటూరు మైనారిటీస్ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థి వై.హర్షసత్యదేవ్, క్రోసూరు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థి ఎం.వెంకునాయుడు విజేతలుగా నిలిచారు. నల్లపాడు పాలిటెక్నిక్ కళాశాల పీడీ సుబ్బారావు, వివిధ కళాశాలల వ్యాయామ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
మీ కొమ్మలలోచివురులు మేమై..
-
‘స్కూల్ గేమ్స్’ నిధుల పెంపునకు కృషి
టీఆర్ఎస్ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రామ్మోహన్ కీసర: సూల్క్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో యేటా నిర్వహించే క్రీడా పోటీల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం మంజూరు చేసే నిధులను వచ్చే ఏడాది నుంచి పెంచాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు విన్నవించనున్నట్లు టీఆర్ఎస్ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రామ్మోహన్ అన్నారు. మండంలోని అహ్మద్‌గూడ లీడ్ఇండియా భారతరత్న పాఠశాలలో రెండురోజులుగా నిర్వహించిన తైక్వాండో రాష్ట్రస్థాయి ఎంపికల పోటీల ముగింపు కార్యక్రమం సోమవారం జరిగింది. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రామ్మోహన్ మాట్లాడారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం ముందుంటుందన్నారు. ప్రభుత్వం నుంచి మరిన్ని నిధులు మంజూరు చేయించి వచ్చే ఏడాది స్కూల్ గేమ్స్‌ను పకడ్బందీగా నిర్వహించేందుకు కృషి చేస్తాన న్నారు. క్రీడా పోటీల ఆర్గనైజింగ్ సెక్రటరీ శేఖర్‌రెడ్డి, క్రీడల ఇన్చార్జి రమేష్‌రెడ్డిలు మాట్లాడుతూ.. రాష్ట్రస్థాయి తైక్వాండో ఎంపిక పోటీల్లో అండర్ 14, 17 విభాగాల్లో (బాలుర, బాలికలు) తెలంగాణలోని 10 జిల్లాల నుంచి 400 మంది పాల్గొన్నారన్నారు. ఇందులో 40 మంది విద్యార్థులను జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేశామన్నారు. జిల్లా ఫిజికల్ డెరైక్టర్ల అసోసియేషన్ అధ్యక్షుడు రాఘవరెడ్డి, లీడ్ ఇండియా భారతరత్న పాఠశాల చైర్మన్ సుదర్శనాచారి పాల్గొన్నారు. -
ఆటకు.. టాటా!
అనంతపురం స్పోర్ట్స్, న్యూస్‌లైన్ : ‘‘ క్రీడలు మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయి. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలి’’ - ఎక్కడ క్రీడాపోటీలు జరిగినా మన ప్రజాప్రతినిధులు చెప్పే మాటలివి. కానీ క్షేత్రస్థాయిలో విద్యార్థులు ఆడుకోలేకపోతున్నారు. పాఠశాలల్లో క్రీడామైదానాలు లేకపోవడమే ఇందుకు కారణం. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలు, నగరాల్లో క్రీడలు నామమాత్రంగానే సాగుతున్నాయి. జిల్లాలో 3178 ప్రాథమిక పాఠశాలలు, 938 ప్రాథమికోన్నత పాఠశాలలు, 909 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 80 శాతం పాఠశాలల్లో మైదానాలు లేకపోవడం గమనార్హం. ఒక్క ప్రాథమిక పాఠశాలలో కూడా మైదానాలు లేవు. 70 యూపీ స్కూళ్లలో, వందలోపు హైస్కూళ్లలో మైదానాలు ఉన్నాయి. ఇక పీఈటీలు జిల్లా వ్యాప్తంగా 491 మంది మాత్రమే ఉన్నారు. వీరు అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో మైదానాలు లేకపోవడంతో క్రీడలు కూడా నామమాత్రంగానే సాగుతున్నాయి. చాలా పాఠశాలల్లో డ్రిల్ పిరియడ్ అమలు కావడం లేదు. విద్యార్థులు స్కూల్ అయిపోయిన వెంటనే ఇళ్లకు పరుగులు తీస్తున్నారు. ప్రైవేట్ స్కూళ్లలో కన్పించని మైదానాలు జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ పాఠశాలల్లో మైదానాలు మచ్చుకైనా కన్పించడం లేదు. కార్పొరేట్ పాఠశాలల్లో అవకాశం ఉన్నా...ఇక మిగితా హై స్కూళ్లలో ఆ పరిస్థితి కన్పించదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు విద్యార్థులు పుస్తకాలతోనే మగ్గిపోతున్నారు. ఇదేమిటని అడిగితే తల్లిదండ్రులకు ఇష్టం లేదని అందుకే చదువుకే ప్రాధాన్యత ఇస్తున్నామని యాజమాన్యాలు చెబుతున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం స్కూళ్లకి మైదానాలతో పాటు ఓ పిరియడ్ క్రీడలుండాలి. అయితే అటువంటి దాఖలాలు కన్పించడం లేదు. విద్యార్థులు నాలుగు గోడల మధ్యే ఉంటూ ఆత్మస్థైర్యాన్ని కోల్పోయి ఒత్తిడికి గురవుతున్నారు.