సాక్షి, నెట్‌వర్క్/అమరావతి: ‘ఆడుదాం ఆంధ్ర’ క్రీడా పోటీలు రాష్ట్రవ్యాప్తంగా రసవత్తరంగా జరుగుతున్నాయి. యువకులు రెట్టించిన ఉత్సాహంలో పోటీల్లో పాల్గొంటున్నారు. దీంతో రాష్ట్రానికి సంక్రాంతి ముందే వచ్చిందా అన్నట్లు ఉత్సాహంగా ఉంది. యువత బ్యాటు, బంతి పట్టుకుని మైదానాల వైపు పరుగులు పెడుతున్నారు. ఎన్నడూలేని విధంగా ప్రభుత్వం క్రీడల పట్ట ప్రత్యేక శ్రద్ధ చూపించడంతో క్రీడా రంగం పట్ల ఎక్కువ ఆసక్తి ఉన్న వారంతా మ్యాచ్‌లు తిలకించేందుకు మైదానాలకు క్యూ కడుతున్నారు.
ఐదో రోజు శనివారం 6,386 గ్రామ వార్డు సచివాలయాల్లో షెడ్యూల్ ప్రకారం పోటీలు నిర్వహించాల్సి ఉండగా 6373 సచివాలయాల్లో పోటీలు జరిగాయి. 3,23,781 మంది ప్రేక్షకులు ఆటల పోటీలను తిలకించారు. మొత్తంగా 15 వేల గ్రామ వార్డు సచివాలయాలకుగానూ 14,690 చోట్ల క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి. అనంతపురం విశాఖపట్నం అనకాపల్లి ప్రకాశం శ్రీ సత్యసాయి జిల్లాల్లో అన్ని గ్రామ వార్డు సచివాలయాల్లో పోటీలు నిర్వహిస్తున్నారు. ఆదివారం ’ఆడుదాం ఆంధ్ర’ కు సెలవు అయినప్పటికీ కొన్నిచోట్ల రీ షెడ్యూల్ మ్యాచ్‌లు పూర్తి చేయనున్నారు.
ఉల్లాసంగా.. ఉత్సాహంగా..
తిరుపతి జిల్లాలో క్రీడాకారులు పోటాపోటీగా తలపడ్డారు. కబడ్డి, క్రికెట్, ఖోఖో, బ్యాడ్మింటన్ పోటీల్లో ఉల్లాసంగా పాల్గొన్నారు. జిల్లాలోని గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని కార్వేటినగరం, పెనుమూరు మండలాల్లో బ్యాడ్మింటన్ పోటీలు ముగిసాయి. నగరి, పుంగనూరు, కుప్పం, చిత్తూరు, పూతలపట్టు నియోజకవర్గాల్లో క్రీడలు హోరాహోరీగా సాగుతున్నాయి. ఈ క్రీడలను మండల అధికారులు, మండల ప్రజాప్రతినిధులు పర్యవేక్షిస్తున్నారు.
చిత్తూరు జిల్లాలోని 283 గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో 467 మైదానాల్లో క్రీడాపోటీలు జరిగాయి. జిల్లాలో 791 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో 10,151 మంది క్రీడాకారులు క్రీడల్లో పాల్గొనగా, 33,639 మంది ప్రేక్షకులు పోటీలను వీక్షించారు. 719 మంది ప్రజాప్రతినిధులు పోటీలను ప్రారంభించారు. తిరుపతి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఆడుదాం ఆంధ్ర క్రీడలను నిర్వహించారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని అన్ని సచివాలయాల పరిధిలో పోటీలు చురుగ్గా జరుగుతున్నాయి. కాకినాడ జిల్లా రాజా కళాశాల మైదానంలో జరుగుతున్న క్రీడలను శాప్ ఎండి ధ్యాన్‌చంద్ పరిశీలించారు.
కడపలో మైదానాల వైపు క్యూ..
మెగా క్రీడా టోర్నమెంట్‌లో భాగంగా కడపలో క్రీడా పోటీలు ఉత్సాహంగా సాగాయి. క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్, క్రికెట్, ఖోఖో క్రీడాంశాల్లో నిర్వహించిన గ్రామ/వార్డు సచివాలయ పోటీల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న క్రీడాకారులు పోటీల్లో పాల్గొన్నారు. ఒంటిమిట్ట మండలం కొత్త మాధవరంలో నిర్వహించిన పోటీలను స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి బ్యాడ్మింటన్ అంతర్జాతీయ అంపైర్ ఎస్.జిలానీబాషా ప్రారంభించారు.
వివిధ మండలాల్లో పోటీలను ఎంపీడీఓలు, స్థానిక ప్రజాప్రతినిధులు, ఫిజికల్ డైరెక్టర్లు పర్యవేక్షించారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఉత్సాహపూరిత వాతావరణంలో క్రీడలు కొనసాగుతున్నాయి. జిల్లాలోని 535 సచివాలయాల పరిధిలో శనివారం 864 మ్యాచ్‌లు నిర్వహించగా 10 వేల మందికి పైగా క్రీడాకారులు పాల్గొన్నారు. క్రీడలను తిలకించడానికి ప్రేక్షకులు ఆసక్తి చూపించారు. జిల్లాలోని అనేక ప్రాంతాల్లో దాదాపు 25 వేల మంది వరకు క్రీడలను తిలకించినట్టు జిల్లా చీఫ్ కోచ్ డి.దుర్గారావు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment