ఆటకు అందలం | Andhra Pradesh gears up for Adudam Andhra programme | Sakshi
Sakshi News home page

ఆటకు అందలం

Published Mon, Nov 27 2023 5:06 AM | Last Updated on Mon, Nov 27 2023 2:53 PM

Andhra Pradesh gears up for Adudam Andhra programme - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ‘ఆడుదాం–ఆంధ్ర’ క్రీడా పోటీల విజేతలకు ప్రభుత్వం భారీగా నగదు బహుమతులు ప్రకటించింది. గ్రామ/వార్డు సచివాలయ స్థాయి నుంచి ఐదు దశల్లో పోటీలను నిర్వహించనుంది. ప్రతి దశలోనూ క్రీడాకారుల ప్రతిభను వెలికితీయడంతో పాటుగా విజేతలను సర్టిఫికెట్స్, మెమెంటోలు, నగదు పురస్కారాలతో సత్కరించనుంది.

క్రీడా చరిత్రలో కనివిని ఎరుగని రీతిలో 15ఏళ్లు పైబడిన వయస్కులు (మెన్, ఉమెన్‌) అందరూ పోటీల్లో భాగస్వాములయ్యేలా ‘ఓపెన్‌ మీట్‌’ను చేపడుతున్నది. యువతలో క్రీడా­స్ఫూర్తిని పెంపొందించేందుకు ఐదు క్రీడా విభా­గాలైన.. క్రికెట్, వాలీబాల్, ఖోఖో, కబడ్డీ, బ్యాడ్మింటన్‌ డబుల్స్‌లో విజేతలకు నగదు బహుమతులు ఇవ్వనుంది. మరోవైపు ఆరోగ్యకర సమాజాన్ని కాంక్షిస్తూ సాంప్రదాయ యోగా, టెన్నీకాయిట్, మారథాన్‌ పోటీలను ఏర్పాటు చేస్తోంది. 

2.99లక్షల మ్యాచ్‌లు.. 52.31లక్షల క్రీడాకారులు
తొలి దశలో భాగంగా 15,004 గ్రామ/వార్డు సచివాలయాల పరిధిలో మొత్తం 1.50లక్షల మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఇక్కడి విజేతలు అనంతరం మండల స్థాయిలో పోటీపడతారు. అంటే 680 మండలాల్లో మొత్తం 1.42లక్షల మ్యాచ్‌లు ఉంటాయి. ఈ దశలో గెలుపొందిన జట్లను నియోజవకర్గ పోటీలకు పంపిస్తారు. 175 నియోజకవర్గాల్లో 5,250 మ్యాచ్‌లలో పోటీలు నిర్వహిస్తారు.

వీటిల్లో సత్తా చాటిన వారు జిల్లా స్థాయికి ఆడాల్సి ఉండగా.. 26 జిల్లాల్లో 312 మ్యాచ్‌లు నిర్వహిస్తారు. జిల్లా స్థాయి విజేతలతో రాష్ట్ర స్థాయిలో 250 మ్యాచ్‌ల్లో పోటీపడేలా షెడ్యూల్‌ రూపొందిస్తున్నారు. గ్రామ/వార్డు సచివాలయ స్థాయిలో 34.20లక్షల మంది, మండల స్థాయిలో 17.10లక్షల మంది, నియోజకవర్గ పోటీల్లో 77,520 మంది, జిల్లా స్థాయిలో 19,950 మంది, రాష్ట్ర స్థాయిలో 2,964 మంది ‘ఆడుదాం–ఆంధ్ర’ క్రీడల్లో ప్రాతినిధ్యం వహించనున్నారు. వివిధ దశల్లో కలిపి మొత్తం 52.31లక్షల మంది ఒకే వేదికపై 50 రోజుల పాటు క్రీడా మహోత్సవంలో సందడి చేయనున్నారు.

నేటి నుంచి రిజిస్ట్రేషన్‌
రాష్ట్రంలో  ‘ఆడుదాం–ఆంధ్ర’ క్రీడా పోటీల రిజిస్ట్రేషన్‌ సోమవారం నుంచి ప్రారంభిస్తున్నట్టు శాప్‌ ఎండీ ధ్యాన్‌చంద్ర ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. డిసెంబరు 13 వరకు రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చన్నారు. 15 ఏళ్లకు పైబడిన క్రీడాకారులు (మెన్, ఉమెన్‌) సమీపంలోని గ్రామ లేదా వార్డు సచివాలయంలో, వాలంటీర్ల ద్వారా, ఆన్‌లైన్‌లో aadudamandhra.ap.gov. in వెబ్‌సైట్‌ ద్వారా, 1902కి ఫోన్‌ చేసి వివరాలు నమోదు చేసుకోవచ్చని చెప్పారు.

ఐదు క్రీడాంశాల్లో గ్రామ/వార్డు సచివాలయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పోటీలు నిర్వహిస్తామన్నారు. 15,004 గ్రామ/వార్డు సచివాలయాల పరిధిలో డిసెంబర్‌ 15 నుంచి ఫిబ్రవరి 3 వరకు క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్‌ డబుల్స్, కబడ్డీ, ఖోఖోతో పాటు సంప్రదాయ యోగ, టెన్నీకాయిట్, మారథాన్‌ అంశాల్లో పోటీలు జరుగుతాయన్నారు.

ఇప్పటికే క్రీడా సామగ్రిని జిల్లాలకు తరలించామన్నారు. పోటీల్లో విజేతలకు సర్టీఫికెట్లు, ట్రోఫీలు, పతకాలు అందజేస్తామని చెప్పారు. నియోజవకర్గం, జిల్లా, రాష్ట్ర స్థాయి విజేతలకు ప్రత్యేక నగదు బహుమతులు అందజేస్తామన్నారు. ఫైనల్స్‌ను విశాఖలో నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement