సాక్షి, అమరావతి: దేశ చరిత్రలో మునుపెన్నడూ తలపెట్టని మెగాక్రీడాటోర్నికి క్రీడాభిమానం వెల్లువెత్తుతోంది. రాష్ట్రంలోని క్రీడాకారుల్లో ప్రతిభకు ‘ఆడుదాం ఆంధ్రా’ అద్దం పడుతోంది. తొలి దశలో భాగంగా 15,004 గ్రామ/వార్డు సచివాలయాల (జీఎస్‌డబ్ల్యూఎస్) పరిధిలో క్రీడా పోటీలు దిగ్విజయంగా ముగిశాయి.
ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌కు (9వ తేదీ కంటే) ఒక రోజు ముందుగానే సచివాలయాల స్థాయిలో పోటీలు విజయవంతంగా పూర్తి చేశారు. 15 ఏళ్లకు పైబడిన మహిళలు, పురుషులు క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్ క్రీడల్లో తమ సత్తా చాటారు. ఐదు క్రీడాంశాల్లో మొత్తం 1.68 లక్షల మ్యాచ్‌లను వంద శాతం సమర్థవంతంగా నిర్వహించారు.
రేపటి నుంచి మండల స్థాయి..
జనవరి 10వ తేదీ నుంచి మండలాలు, మున్సిపాల్టిలు కలిపి 753 మండల స్థాయి పోటీలు నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. జీఎస్‌డబ్ల్యూఎస్ పరిధిలో ‘పెర్ఫార్మెన్స్ టాలెంట్ హంట్’ ఆధారంగా క్రీడాకారులతో మండల స్థాయి పోటీలకు జట్లు ఎంపిక చేశారు. వీరికి 10వ తేదీ నుంచి సంక్రాంతిలోగా పోటీలు పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు.
అనంతరం నియోజవకర్గ స్థాయి పోటీలకు వెళ్లే వారికి ప్రాక్టీస్‌కు ఎక్కువ సమయం ఇచ్చేలా శాప్ అధికారులు వేగంగా అడుగులు వేస్తున్నారు. వాస్తవానికి ఈనెల 10 నుంచి 23 వరకు మండల, జనవరి 24 నుంచి 30 వరకు నియోజకవర్గ స్థాయి, జనవరి 31 నుంచి ఫిబ్రవరి 5వ తేదీ వరకు జిల్లా, ఫిబ్రవరి 6 నుంచి 10వ తేదీ వరకు రాష్ట్ర స్థాయి పోటీలకు షెడ్యూల్ ఇచ్చారు.
ప్రతి మండలంలో ఎంపిక చేసిన 2/3 క్రీడామైదానాల్లో సకల వసతుల మధ్య పోటీ నిర్వహించనున్నారు. జీఎస్‌డబ్ల్యూఎస్ స్థాయిలో విజేతల్లో ఉత్సాహాన్ని నింపేలా స్వాగత తోరణాలు, మస్కట్ లోగోలు, కామెంట్రీ, గ్యాలరీలు ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం 1.49 లక్షల మంది స్పోర్ట్స్ వలంటీర్లు స్కోరర్లుగా, అంపైర్లుగా సేవలందిస్తున్నారు.
విజేతలకు టీషర్టులు..
ఐదు క్రీడాంశాల్లో 9,478 క్రీడా ప్రాంగణాల్లో డిసెంబర్ 26వ తేదీ నుంచి జనవరి 8వ తేదీ వరకు జరిగి న పోటీలు వీక్షించేందుకు ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి క్రీడాకారులకు మద్దతుగా నిలిచారు. జీఎస్‌డబ్ల్యూఎస్ దశలో మొత్తం 3.30 లక్షల జట్లను ఎంపిక చేశారు. ఇందులో 2.08 లక్షలు పురుషులు, 1.22 లక్షల మహిళల జట్లు ఉన్నాయి. వీరితో సమానంగా 14 రోజుల పాటు ఏకంగా 34.04 లక్షలకుపైగా వీక్షకులు పోటీలను ప్రత్యక్షంగా తిలకించారు.
జీఎస్‌డబ్ల్యూఎస్ పరిధిలో పోటీలు ముగించుకుని మండల స్థాయి వేదికపై ప్రతిభ చాటేందుకు వెళ్లే జట్లకు సంబంధించి 34.20 లక్షల ప్రొఫెషనల్ టీషర్టులు, టోపీలను అందజేస్తున్నారు. ఇప్పటికే 15,004 గాను 9వేలకుపైగా సచివాలయాల్లో ముగింపు వేడుకలను నిర్వహించగా మంగళవారం (నేడు) మిగిలిన వాటిల్లో గెలుపొందిన జట్లకు టీషర్టులను బహూకరించనున్నారు. అనంతరం నియోజకవర్గ స్థాయి పోటీలకు ప్రొఫెషనల్ స్పోర్ట్స్ కిట్లను అందించనున్నారు. ఇప్పటికే వాటి తరలింపు పూర్తి చేశారు.
ఆన్‌లైన్‌లోనే మ్యాచ్‌ల డ్రా
ఆడుదాం ఆంధ్రా క్రీడా పోటీలు తొలి దశలో సమర్థవంతంగా నిర్వహించాం. 10వ తేదీ నుంచి మండల స్థాయి పోటీలకు సన్నద్ధమవుతున్నాం. గ్రామ/వార్డు సచివాలయ స్థాయిలో పోటీలు అనంతరం తుది జట్లను ఎంపిక పూర్తి చేస్తున్నాం. మండల స్థాయిలో తలపడే జట్లకు ఆన్‌లైన్‌లోనే డ్రా నిర్వహిస్తున్నాం.
ఈ దశ పోటీలను సమీపంలోని పెద్ద మైదానాలు, స్టేడియాల్లో నిర్వహించేలా ఆదేశించాం. ఇక్కడ ప్రతి క్రీడాకారుడు ఆడుదాం ఆంధ్రా జెర్సీలు, టోపీలు ధరించి పోటీల్లో పాల్గొంటారు. వీటిని అన్ని సచివాలయాలకు తరలించాం. నేటితో అక్కడ ముగింపు వేడుకలు నిర్వహించి టీషర్టులను అందజేస్తారు. – ధ్యాన్‌చంద్ర, ఎండీ, ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ
Comments
Please login to add a commentAdd a comment