Mandal level
-
ఏటా 2 లక్షల మంది యువతకు ఉపాధి శిక్షణ
మాదాపూర్ (హైదరాబాద్): రాష్ట్రవ్యాప్తంగా స్కిల్‌డెవలప్‌మెంట్ సెంటర్లను అభివృద్ధి చేయనున్నట్టు రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. మాదాపూర్‌లోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (న్యాక్)లో శుక్రవారం ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి న్యాక్ ప్రతినిధులతో కలసి సంస్థలో కార్యకలాపాలను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ హైదరాబాద్‌లో స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్టు తెలిపారు. ప్రతి సంవత్సరం 2 లక్షల మంది యువతకు శిక్షణ ఇచ్చి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించే కార్యక్రమాలను చేపట్టనున్నట్టు వివరించారు. మండల, జిల్లా స్థాయిలో ఒక్కో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాలలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ప్రయోగాత్మకంగా మొదలుపెట్టి అనంతరం వాటిని విస్తరిస్తామని వివరించారు. ఈ సందర్భంగా నూతన సంవత్సరానికి సంబంధించిన న్యాక్ డైరీని ఆవిష్కరించారు. కార్యక్రమంలో న్యాక్ డైరెక్టర్ జనరల్ కె.భిక్షపతి, న్యాక్ వైస్ చైర్మన్ శాంతికుమారి తదితరులు పాల్గొన్నారు. -
‘ఆడుదాం ఆంధ్రా’ తొలిదశ అదుర్స్
సాక్షి, అమరావతి: దేశ చరిత్రలో మునుపెన్నడూ తలపెట్టని మెగాక్రీడాటోర్నికి క్రీడాభిమానం వెల్లువెత్తుతోంది. రాష్ట్రంలోని క్రీడాకారుల్లో ప్రతిభకు ‘ఆడుదాం ఆంధ్రా’ అద్దం పడుతోంది. తొలి దశలో భాగంగా 15,004 గ్రామ/వార్డు సచివాలయాల (జీఎస్‌డబ్ల్యూఎస్) పరిధిలో క్రీడా పోటీలు దిగ్విజయంగా ముగిశాయి. ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌కు (9వ తేదీ కంటే) ఒక రోజు ముందుగానే సచివాలయాల స్థాయిలో పోటీలు విజయవంతంగా పూర్తి చేశారు. 15 ఏళ్లకు పైబడిన మహిళలు, పురుషులు క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్ క్రీడల్లో తమ సత్తా చాటారు. ఐదు క్రీడాంశాల్లో మొత్తం 1.68 లక్షల మ్యాచ్‌లను వంద శాతం సమర్థవంతంగా నిర్వహించారు. రేపటి నుంచి మండల స్థాయి.. జనవరి 10వ తేదీ నుంచి మండలాలు, మున్సిపాల్టిలు కలిపి 753 మండల స్థాయి పోటీలు నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. జీఎస్‌డబ్ల్యూఎస్ పరిధిలో ‘పెర్ఫార్మెన్స్ టాలెంట్ హంట్’ ఆధారంగా క్రీడాకారులతో మండల స్థాయి పోటీలకు జట్లు ఎంపిక చేశారు. వీరికి 10వ తేదీ నుంచి సంక్రాంతిలోగా పోటీలు పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. అనంతరం నియోజవకర్గ స్థాయి పోటీలకు వెళ్లే వారికి ప్రాక్టీస్‌కు ఎక్కువ సమయం ఇచ్చేలా శాప్ అధికారులు వేగంగా అడుగులు వేస్తున్నారు. వాస్తవానికి ఈనెల 10 నుంచి 23 వరకు మండల, జనవరి 24 నుంచి 30 వరకు నియోజకవర్గ స్థాయి, జనవరి 31 నుంచి ఫిబ్రవరి 5వ తేదీ వరకు జిల్లా, ఫిబ్రవరి 6 నుంచి 10వ తేదీ వరకు రాష్ట్ర స్థాయి పోటీలకు షెడ్యూల్ ఇచ్చారు. ప్రతి మండలంలో ఎంపిక చేసిన 2/3 క్రీడామైదానాల్లో సకల వసతుల మధ్య పోటీ నిర్వహించనున్నారు. జీఎస్‌డబ్ల్యూఎస్ స్థాయిలో విజేతల్లో ఉత్సాహాన్ని నింపేలా స్వాగత తోరణాలు, మస్కట్ లోగోలు, కామెంట్రీ, గ్యాలరీలు ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం 1.49 లక్షల మంది స్పోర్ట్స్ వలంటీర్లు స్కోరర్లుగా, అంపైర్లుగా సేవలందిస్తున్నారు. విజేతలకు టీషర్టులు.. ఐదు క్రీడాంశాల్లో 9,478 క్రీడా ప్రాంగణాల్లో డిసెంబర్ 26వ తేదీ నుంచి జనవరి 8వ తేదీ వరకు జరిగి న పోటీలు వీక్షించేందుకు ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి క్రీడాకారులకు మద్దతుగా నిలిచారు. జీఎస్‌డబ్ల్యూఎస్ దశలో మొత్తం 3.30 లక్షల జట్లను ఎంపిక చేశారు. ఇందులో 2.08 లక్షలు పురుషులు, 1.22 లక్షల మహిళల జట్లు ఉన్నాయి. వీరితో సమానంగా 14 రోజుల పాటు ఏకంగా 34.04 లక్షలకుపైగా వీక్షకులు పోటీలను ప్రత్యక్షంగా తిలకించారు. జీఎస్‌డబ్ల్యూఎస్ పరిధిలో పోటీలు ముగించుకుని మండల స్థాయి వేదికపై ప్రతిభ చాటేందుకు వెళ్లే జట్లకు సంబంధించి 34.20 లక్షల ప్రొఫెషనల్ టీషర్టులు, టోపీలను అందజేస్తున్నారు. ఇప్పటికే 15,004 గాను 9వేలకుపైగా సచివాలయాల్లో ముగింపు వేడుకలను నిర్వహించగా మంగళవారం (నేడు) మిగిలిన వాటిల్లో గెలుపొందిన జట్లకు టీషర్టులను బహూకరించనున్నారు. అనంతరం నియోజకవర్గ స్థాయి పోటీలకు ప్రొఫెషనల్ స్పోర్ట్స్ కిట్లను అందించనున్నారు. ఇప్పటికే వాటి తరలింపు పూర్తి చేశారు. ఆన్లైన్లోనే మ్యాచ్‌ల డ్రా ఆడుదాం ఆంధ్రా క్రీడా పోటీలు తొలి దశలో సమర్థవంతంగా నిర్వహించాం. 10వ తేదీ నుంచి మండల స్థాయి పోటీలకు సన్నద్ధమవుతున్నాం. గ్రామ/వార్డు సచివాలయ స్థాయిలో పోటీలు అనంతరం తుది జట్లను ఎంపిక పూర్తి చేస్తున్నాం. మండల స్థాయిలో తలపడే జట్లకు ఆన్లైన్లోనే డ్రా నిర్వహిస్తున్నాం. ఈ దశ పోటీలను సమీపంలోని పెద్ద మైదానాలు, స్టేడియాల్లో నిర్వహించేలా ఆదేశించాం. ఇక్కడ ప్రతి క్రీడాకారుడు ఆడుదాం ఆంధ్రా జెర్సీలు, టోపీలు ధరించి పోటీల్లో పాల్గొంటారు. వీటిని అన్ని సచివాలయాలకు తరలించాం. నేటితో అక్కడ ముగింపు వేడుకలు నిర్వహించి టీషర్టులను అందజేస్తారు. – ధ్యాన్‌చంద్ర, ఎండీ, ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ -
ఖేల్ ఇండియా షెడ్యూల్ విడుదల
ఏలూరు రూరల్ : క్రీడాకారుల్లో నైపుణ్యానికి పదును పెట్టేందుకు ఖేల్ ఇండియా ఆటల పోటీలు ఎంతో ఉపయోగపడతాయని అసిస్టెంట్ జాయింట్ కలెక్టర్, జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ నోడల్ అధికారి ఎంహెచ్ షరీఫ్ అన్నారు. మంగళవారం ఏలూరు బిశ్వనాథ్ భర్తియా స్విమ్మింగ్ పూల్ ఆవరణలో వ్యాయామ ఉపాధ్యాయులకు ఖేల్ ఇండియా అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా షరీఫ్ మాట్లాడుతూ క్రీడాకారులే కాకుండా ఆటలు తిలకించే పిల్లలు సైతం స్ఫూర్తి పొంది ఆటలు సాధన చేసేలా పోటీలు నిర్వహించాలన్నారు. 14, 17 ఏళ్ల విభాగంలో నిర్వహించే ఈ పోటీలను విజయవంతం చేయాలన్నారు. గ్రామస్థాయిలో పోటీలు నిర్వహించేందుకు ప్రధానోపాధ్యాయులు పిల్లలకు అవకాశం ఇవ్వడం లేదని పలువురు పీఈటీలు ఏజేసీకి వివరించారు. డీఈవో ద్వారా ఆదేశాలు జారీ చేసేలా చర్యల తీసుకోవాలన్నారు. మండల స్థాయి పోటీలకు మంజూరైన నిధులు ఎంపీడీవోలు సక్రమంగా ఖర్చు చేసేలా చూడాలన్నారు. గత ప్రభుత్వం విజేతలకు ప్రకటించిన నగదు బహుమతులు నేటికీ అందలేదని పలువురు వాపోయారు. దీనిపై స్పందించిన షరీఫ్ అక్రమాలకు పాల్పడే వారిపై కలెక్టర్ సీరియస్‌గా వ్యవహరిస్తారని హెచ్చరించారు. డీఎస్డీవో ఎస్ఏ అజీజ్ మాట్లాడుతూ ఈ నెల 21, 22 తేదీల్లో మండలస్థాయి చేపట్టాలన్నారు. ఇందులో 3 క్రీడాంశాలు, 2 వ్యక్తిగత అంశాలు ఉండాలన్నారు. దీనికి ముందు ప్రతి గ్రామంలో పోటీలు నిర్వహించి ఒక్కొక్క గ్రామం నుంచి 15 బాలురు, 15 మంది బాలికలను మండల స్థాయి పోటీలకు తీసుకురావాలన్నారు. ఈ పోటీల నిర్వహణ కోసం ఒక్కొక్క మండలానికి రూ.30 వేల మంజూరు చేశామన్నారు. మండలంలో ప్రతిభ చాటిన 120 బాలురు, 120 మంది బాలికలను నియోజకవర్గ స్థాయి పోటీలకు తీసుకురావాలన్నారు. అలాగే 25, 26న జిల్లా స్థాయి పోటీలు నిర్వహించాలన్నారు. 10 క్రీడాంశాల్లో(ఆర్చరీ, అథ్లెటిక్స్, బాక్సింగ్, తైక్వాండ్, వెయిట్ లిఫ్టింగ్, కబడ్డీ, ఖోఖో, ఫుట్‌బాల్, హాకీ, వాలీబాల్)జిల్లా క్రీడాప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ పోటీల్లో ప్రతిభ చాటిన వారిని రాష్ట్ర, జాతీయస్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్టు చెప్పారు. 31–12–2016 నాటికి 14, 17 ఏళ్లు నిండని వారే ఈ పోటీలో పాల్గొనేందుకు అర్హులన్నారు. ఈ సమావేశంలో సాయ్ సెంటర్ ఇన్ చార్జి కె.కొండలరావు తదితరులు పాల్గొన్నారు. -
క్రీ‘డల్’ !
ప్రభుత్వ పాఠశాలలో ఆటలకు స్థలం కరువు ప్రయివేటు స్కూళ్లకు మైదానాల కొరత బాన్సువాడ: ర్యాంకుల వేటలో బాల్యం బలైపోతోంది. క్రీడలకు ప్రాధాన్యం తగ్గిపోతోంది. ప్రభుత్వం కోట్ల నిధులు ఖర్చు చేస్తున్నానని చెబుతున్నా క్రీడలు మాత్రం చతకిలబడ్డాయి. ప్రభుత్వ స్కూళ్లకు నిధుల కొరత వేధిస్తుంటే, ప్రైవేటు స్కూళ్లకు మైదానాలు కరువయ్యాయి. ‘ఆగస్టు చివరి వారంలో మండల స్థాయి క్రీడా పోటీలను నిర్వహించాలి’.. ఇది 2016–17 విద్యా సంవత్సరం క్యాలెండర్లో పేర్కొన్న ప్రణాళిక. కానీ ఒకటి, రెండు తప్ప మిగతా మండలాల్లో ఎక్కడా పోటీలు ప్రారంభం కాలేదు. దీన్ని బట్టి చూస్తే ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో క్రీడా పోటీలకు ఇస్తున్న ప్రాధాన్యమేమిటో, అధికారుల నిర్లక్ష్యం ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. ఇటీవల ప్రభుత్వం క్రీడలకు సమయం తగ్గించాలని నిర్ణయించడంపై అసంతృప్తి్త వ్యక్తమవుతోంది. జిల్లాలో 417 ఉన్నత పాఠశాలలు, 618 ప్రాథమికోన్నత పాఠశాలలు, 1,747 ప్రాథమిక పాఠశాలల్లో సుమారు 2 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరిలో కొందరు క్రీడల్లో రాణిస్తున్నా తగిన ప్రోత్సాహం లభించట్లేదు. ప్రస్తుతం జిల్లాలో వ్యాయామ ఉపాధ్యాయల కొరత తీవ్రంగా ఉంది. క్రీడలకు సమయం కరువు విద్యార్థులకు క్రీడల కోసం కేటాయించే సమయం తగ్గిపోతోంది. చాలా ప్రైవేటు స్కూళ్లలో అసలు క్రీడల మాటే లేదు. ప్రభుత్వ బడుల్లో నిత్యం ఖోఖో, వాటీబాల్, కబడ్డీ, క్రీకెట్, బాల్‌బ్యాడ్మింటన్, త్రోబాల్‌తో పాటు అథ్లెటిక్స్ విభాగంలో రన్నింగ్, హైజంప్ నేర్పించాల్సి ఉంటుంది. వీటిలో ఏ ఒక్కదానిలో విద్యార్థులు రాణించినా మంచి భవిష్యత్తు ఉంటుంది. అయితే ఉన్నత పాఠశాలల్లో ఒక్కో తరగతికి వారానికి కేవలం మూడు పీరియడ్లు మాత్రమే క్రీడలకు కేటాయిస్తున్నారు. అయితే, టెన్త్ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలనే ఉద్దేశ్యంతో వారికి క్రీడలకు సమయమే ఇవ్వట్లేదు. క్రీడా పరికరాల కొరత.. జిల్లా వ్యాప్తంగా అనేక పాఠశాలల్లో క్రీడా పరికరాల జాడే లేదు. వ్యాయామ ఉపాధ్యాయుడు లేకపోవడంతో తాత్కాలిక బోధకుల్ని నియమించకున్నారు. కొందరు ఉత్సాహంగా విద్యార్థులకు క్రీడాంశాల్లో శిక్షణ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా క్రీడా పరికరాల కొరతతో ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. ఉమ్మడి రాష్ట్రంలో పదేళ్లుగా పాఠశాలల్లో క్రీడల అభివృద్ధి, పరికరాల కొనుగోలుకు ఏటా రూ.15వేల నిధులను మంజూరు చేసేవారు. ప్రస్తుతం ఆ నిధులకు సైతం మంగళం పాడేశారు. దీంతో క్రీడా పరికరాలు అందుబాటులో లేకుండా పోయాయి. ప్రైవేటు బడుల్లో మరీ ఘోరం.. నిబంధనల ప్రకారం ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలకు తప్పనిసరిగా క్రీడా మైదానాలు ఉండాలి. కానీ ఇప్పటికే ఉన్న, కొత్తగా పుట్టుకొస్తున్న ప్రైవేట్ బడులకు మైదానాలే లేవు. చిన్న ఇండోర్ స్టేడియం ఉన్నా పాఠశాలలకు అనుమతి ఇవ్వొచ్చని ప్రభుత్వం నిబంధనలు మార్చడం ప్రైవేటు స్కూళ్లకు కలిసొచ్చింది. అయితే, చాలా పాఠశాలల్లో ఇండోర్ స్టేడియాలు కూడా లేవు. ఇవన్నీ అధికారులు చూసీ చూడనట్టు వదిలేస్తున్నారు. ‘ధ్యాన్‌చంద్’ పేరిట క్రీడా దినోత్సవం ప్రముఖ హాకీ క్రీడాకారుడు ధ్యాన్‌చంద్ జన్మించిన రోజునే జాతీయ క్రీడా దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. 1905 ఆగస్టు 29న ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్‌లో జన్మించిన ఆయన.. హాకీలో భారత్‌కు చిరస్మరణీయ విజయాలు అందించాడు. ఒలింపిక్స్‌లో వరుసగా మూడుసార్లు గోల్డ్ మెడల్స్‌ను సాధించి పెట్టాడు. ఆయన సేవలను గుర్తించిన ప్రభుత్వం ధ్యాన్‌చంద్ పుట్టిన రోజును జాతీయ క్రీడా దినోత్సవంగా ప్రకటించింది. -
రేపు మండల స్థాయి పోటీలు
అనంతపురం ఎడ్యుకేషన్ : కృష్ణా పుష్కరాల సందర్భంగా పాఠశాల స్థాయిలో నిర్వహించిన వ్యాస రచన, వక్తృత్వ పోటీల్లో విజేతలైన విద్యార్థులకు ఈనెల 21 మండలస్థాయి పోటీలు నిర్వహించాలని జిల్లా విద్యాశాఖ అధికారి అంజయ్య సూచించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. పాఠశాల స్థాయిలో నిర్వహించిన 12 అంశాలపై ఈ పోటీలు నిర్వహించాలని, ప్రతి అంశం నుంచి ముగ్గురు చొప్పున తెలుగు, ఇంగ్లిష్ మీడియంలలో వేర్వేరుగా విజేతలను ఎంపిక చేయాలని సూచించారు. 23న జిల్లాస్థాయిలో అనంతపురంలోని సైన్స్ సెంటర్లో నిర్వహించే పోటీలకు పంపాలని ఆదేశించారు. జిల్లాస్థాయిలో పై అంశాలతో పాటు ‘కృష్ణా పుష్కరాలు’ అనే అంశంపై ప్రత్యేకంగా వ్యాసరచన, వక్తృత్వ పోటీలు ఉంటాయని వెల్లడించారు. -
మమ్మల్ని ఇబ్బంది పెట్టడమే మీ లక్ష్యమా..!
జి.సిగడాం, న్యూస్‌లైన్ : జిల్లా అధికారులు, మండల స్థాయి అధికారులు పలు అభివృద్ధి కార్యక్రమాలు అంటూ సర్పంచ్‌లను ఇబ్బంది చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారని పలువురు సర్పంచ్‌లు ధ్వజమెత్తారు. ఆదివారం మండల పరిషత్ కార్యాలయంలో పారిశుద్ధ్య వారోత్సవాల సందర్బంగా సర్పంచ్‌లకు, మండల స్థాయి అధికారులకు సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా పలు గ్రామాలకు చెందిన సర్పంచ్‌లు మాట్లాడుతూ పారిశుద్ధ్య సమావేశాలు నిర్వహించాలని ఇప్పటికిప్పుడే సమాచారం అందించి కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించడం మంచి పద్దతి కాదన్నారు. పంచాయతీల్లో నిధులు లేక డ్రెయిన్లలో పూడికలు కూడా తీయలేని పరిస్థితి నెలకొందన్నారు. సర్పంచ్ తమ సొంత సొమ్ములతో వాటిని నిర్వహిస్తే 50 వేల వరకు ఖర్చు అయితే రికార్డుల్లో మాత్రం 5వేలకు మించి అధికారులు నమోదు చేయడంలేదని ఆవేధన వ్యక్తం చేశారు. దవలపేట, దేవరవలస, జగన్నాథవలస, బాతువ, మెట్టవలస, పెంట సర్పంచ్‌లు కంచరాన సూరన్నాయుడు, పంచిరెడ్డి బంగారునాయుడు, తనుబుద్ది దాలినాయుడు, కామోదుల సీతారాం, తిరుమరెడ్డి గౌరీశంకరరావు, మక్క సాయిబాబునాయుడు మాట్లాడుతూ పారిశుధ్య వారోత్సవాల కోసం సర్పంచ్‌లు సమావేశానికి హాజరైనా పూర్తిస్థాయిలో అధికారులు హాజరవ్వకపోవడంపై నిరసన తెలిపారు. ప్రజా ప్రతినిధులు అంటే మీకొక అలుసా, ఎప్పటికప్పుడు సమావేశాలు ఏర్పాటు చేసినప్పటికి మేము వస్తున్నాం, మీ అధికారులు మాత్రం సమావేశానికి హాజరు కావడం లేదంటూ ఎంపీడీవో వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. పారిశుధ్య వారోత్సవాలలో భాగంగా జిల్లా అధికారులు స్పందించి గ్రామాలకు ప్రత్యేక నిధులు కేటాయించినప్పుడే వారోత్సవాలకు భాగస్వాములు అవుతారని పేర్కొన్నారు. దీనిపై ఎంపీడీవో స్పందిస్తూ మీరు వ్యక్తం చేసిన అభిప్రాయాలను ఉన్నతాధికారులకు నివేదిస్తామన్నారు. కార్యక్రమంలో ఆర్ఐ బి. హనుమంతురావులతో పాటు సర్పంచ్‌లు బత్తుల సన్యాసిరావు, పొగిరి అక్కలనాయుడు, పల్లంటి సురేష్, గోపాలకృష్ణరాజు, వాన ప్రమీల, మర్రిబందల లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.