ఖేల్ ఇండియా షెడ్యూల్ విడుదల
ఖేల్ ఇండియా షెడ్యూల్ విడుదల
Published Wed, Nov 16 2016 1:20 AM | Last Updated on Mon, Sep 4 2017 8:10 PM
ఏలూరు రూరల్ : క్రీడాకారుల్లో నైపుణ్యానికి పదును పెట్టేందుకు ఖేల్ ఇండియా ఆటల పోటీలు ఎంతో ఉపయోగపడతాయని అసిస్టెంట్ జాయింట్ కలెక్టర్, జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ నోడల్ అధికారి ఎంహెచ్ షరీఫ్ అన్నారు. మంగళవారం ఏలూరు బిశ్వనాథ్ భర్తియా స్విమ్మింగ్ పూల్ ఆవరణలో వ్యాయామ ఉపాధ్యాయులకు ఖేల్ ఇండియా అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా షరీఫ్ మాట్లాడుతూ క్రీడాకారులే కాకుండా ఆటలు తిలకించే పిల్లలు సైతం స్ఫూర్తి పొంది ఆటలు సాధన చేసేలా పోటీలు నిర్వహించాలన్నారు. 14, 17 ఏళ్ల విభాగంలో నిర్వహించే ఈ పోటీలను విజయవంతం చేయాలన్నారు. గ్రామస్థాయిలో పోటీలు నిర్వహించేందుకు ప్రధానోపాధ్యాయులు పిల్లలకు అవకాశం ఇవ్వడం లేదని పలువురు పీఈటీలు ఏజేసీకి వివరించారు. డీఈవో ద్వారా ఆదేశాలు జారీ చేసేలా చర్యల తీసుకోవాలన్నారు. మండల స్థాయి పోటీలకు మంజూరైన నిధులు ఎంపీడీవోలు సక్రమంగా ఖర్చు చేసేలా చూడాలన్నారు. గత ప్రభుత్వం విజేతలకు ప్రకటించిన నగదు బహుమతులు నేటికీ అందలేదని పలువురు వాపోయారు. దీనిపై స్పందించిన షరీఫ్ అక్రమాలకు పాల్పడే వారిపై కలెక్టర్ సీరియస్‌గా వ్యవహరిస్తారని హెచ్చరించారు. డీఎస్‌డీవో ఎస్‌ఏ అజీజ్ మాట్లాడుతూ ఈ నెల 21, 22 తేదీల్లో మండలస్థాయి చేపట్టాలన్నారు. ఇందులో 3 క్రీడాంశాలు, 2 వ్యక్తిగత అంశాలు ఉండాలన్నారు. దీనికి ముందు ప్రతి గ్రామంలో పోటీలు నిర్వహించి ఒక్కొక్క గ్రామం నుంచి 15 బాలురు, 15 మంది బాలికలను మండల స్థాయి పోటీలకు తీసుకురావాలన్నారు. ఈ పోటీల నిర్వహణ కోసం ఒక్కొక్క మండలానికి రూ.30 వేల మంజూరు చేశామన్నారు. మండలంలో ప్రతిభ చాటిన 120 బాలురు, 120 మంది బాలికలను నియోజకవర్గ స్థాయి పోటీలకు తీసుకురావాలన్నారు. అలాగే 25, 26న జిల్లా స్థాయి పోటీలు నిర్వహించాలన్నారు. 10 క్రీడాంశాల్లో(ఆర్చరీ, అథ్లెటిక్స్, బాక్సింగ్, తైక్వాండ్, వెయిట్ లిఫ్టింగ్, కబడ్డీ, ఖోఖో, ఫుట్‌బాల్, హాకీ, వాలీబాల్)జిల్లా క్రీడాప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ పోటీల్లో ప్రతిభ చాటిన వారిని రాష్ట్ర, జాతీయస్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్టు చెప్పారు. 31–12–2016 నాటికి 14, 17 ఏళ్లు నిండని వారే ఈ పోటీలో పాల్గొనేందుకు అర్హులన్నారు. ఈ సమావేశంలో సాయ్ సెంటర్ ఇన్ చార్జి కె.కొండలరావు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement