మాదాపూర్ (హైదరాబాద్): రాష్ట్రవ్యాప్తంగా స్కిల్‌డెవలప్‌మెంట్ సెంటర్లను అభివృద్ధి చేయనున్నట్టు రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. మాదాపూర్‌లోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ (న్యాక్)లో శుక్రవారం ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి న్యాక్ ప్రతినిధులతో కలసి సంస్థలో కార్యకలాపాలను పరిశీలించారు.
అనంతరం మాట్లాడుతూ హైదరాబాద్‌లో స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్టు తెలిపారు. ప్రతి సంవత్సరం 2 లక్షల మంది యువతకు శిక్షణ ఇచ్చి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించే కార్యక్రమాలను చేపట్టనున్నట్టు వివరించారు. మండల, జిల్లా స్థాయిలో ఒక్కో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాలలో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లను ప్రయోగాత్మకంగా మొదలుపెట్టి అనంతరం వాటిని విస్తరిస్తామని వివరించారు. ఈ సందర్భంగా నూతన సంవత్సరానికి సంబంధించిన న్యాక్ డైరీని ఆవిష్కరించారు. కార్యక్రమంలో న్యాక్ డైరెక్టర్ జనరల్ కె.భిక్షపతి, న్యాక్ వైస్ చైర్మన్ శాంతికుమారి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment