Employment Training
-
ఏటా 2 లక్షల మంది యువతకు ఉపాధి శిక్షణ
మాదాపూర్ (హైదరాబాద్): రాష్ట్రవ్యాప్తంగా స్కిల్‌డెవలప్‌మెంట్ సెంటర్లను అభివృద్ధి చేయనున్నట్టు రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. మాదాపూర్‌లోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (న్యాక్)లో శుక్రవారం ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి న్యాక్ ప్రతినిధులతో కలసి సంస్థలో కార్యకలాపాలను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ హైదరాబాద్‌లో స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్టు తెలిపారు. ప్రతి సంవత్సరం 2 లక్షల మంది యువతకు శిక్షణ ఇచ్చి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించే కార్యక్రమాలను చేపట్టనున్నట్టు వివరించారు. మండల, జిల్లా స్థాయిలో ఒక్కో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాలలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ప్రయోగాత్మకంగా మొదలుపెట్టి అనంతరం వాటిని విస్తరిస్తామని వివరించారు. ఈ సందర్భంగా నూతన సంవత్సరానికి సంబంధించిన న్యాక్ డైరీని ఆవిష్కరించారు. కార్యక్రమంలో న్యాక్ డైరెక్టర్ జనరల్ కె.భిక్షపతి, న్యాక్ వైస్ చైర్మన్ శాంతికుమారి తదితరులు పాల్గొన్నారు. -
ఇల్లే సేవా కేంద్రం
కావల్సినన్ని వనరులు సమకూరినప్పుడు కూర్చుని సేద తీరుదామనుకుంటారు చాలామంది. తమ చుట్టూ ఉన్న నలుగురికైనా వారి స్వశక్తిని నమ్ముకునేలా చేయూతనిద్దాం అనుకుంటారు అతి కొద్దిమంది. అలాంటివారిలో కొత్తమాసు కృష్ణవేణి ఒకరు. సికింద్రాబాద్‌లోని టెలికాం కాలనీ, కానాజీగూడలో ఉంటున్న ఈ గృహిణి తన ఇంటినే సేవాకేంద్రంగా మలిచి పదేళ్లుగా మహిళలకు ఉపాధి శిక్షణా కార్యక్రమాలను ఉచితంగా అందిస్తున్నారు. మహిళలకు శిక్షణ ఇస్తూ బిజీగా ఉన్న కృష్ణవేణిని కలిసినప్పుడు, ఆమె సేవామార్గం వివరాలను ఇలా పంచుకున్నారు.. ‘‘పదిహేనేళ్ల క్రితం మావారు రంగారావు సత్యసాయి సేవాకార్యక్రమాలలో పాల్గొనేవారు. నేనూ ఆ కార్యక్రమాలకు వారి వెంట వెళ్లేదాన్ని. ఆ సమయంలోనే గ్రామాలలోని మహిళలకు స్వయం ఉపాధికి పనికి వచ్చే కార్యక్రమాలు చేస్తే బాగుంటుందనుకున్నాను. అప్పుడే మల్లాపూర్ గ్రామంలో మొట్ట మొదటిసారిగా నాకు వచ్చిన కుట్టు పనులను అక్కడి మహిళలకు నేర్పించి, వారికి ఆదాయ మార్గం చూపటం సంతృప్తినిచ్చింది. ఇంటి వద్ద నుంచి.. సేవా కార్యక్రమాలు ఎలా చేయచ్చో ఆ ఆడుగులు ఎలాగూ నేర్పించాయి. ఇంట్లో మా వారికి చెప్పి పైన ఓ గదిని ఏర్పాటు చేశాను. ఇంట్లోనే ఉంటాను కాబట్టి మహిళలకు టైలరింగ్, సాయంకాలాలు పేద పిల్లలకు ట్యూషన్లు చెప్పేదాన్ని. ఇక్కడ ఒక్కచోటే సేవ చేస్తూ ఉంటే కాదు, మరికొందరికి ఉపాధిని అందిస్తే బాగుంటుందనే ఉద్దేశ్యంతో గ్రామాలకి వెళ్లడం ్రపారంభించాను. వెళ్లిన ఊళ్లో ముందుగా అక్కడ అనువైన స్థలం చూసుకొని, ఒక టీచర్ని ఏర్పాటు చేసి, నేర్చుకునేవారిని ఎంపిక చేసేదాన్ని. సాయిసంస్థ ద్వారానే రెండు నెలల పాటు 200 మందిని 10 బృందాలుగా చేసి, స్వయంగా శిక్షణ ఇచ్చాను. గృహిణిగా ఇంటి పనులు చేసుకుంటూ ఉండే నేను అలా ఒక్కో ఏడాది దాటుతూ సేవాకార్యక్రమాల్లో తీరికలేకుండా అయిపోవడం ఎంతో సంతృప్తినిచ్చింది. స్వచ్ఛంద సంస్థలతో కలిసి.. ఈ 10 ఏళ్లలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలలోని 300 గ్రామాలలో దాదాపు çపన్నెండు వేల మంది గ్రామీణ మహిళలకు కుట్టు మిషను, మెహెందీ, ఫ్యాషన్ డిజైనింగ్, ఎంబ్రాయిడరీ, మగ్గం వర్క్, పేపర్ వర్క్, ఫ్యాషన్ జ్యువెలరీ తయారీ, బ్యూటీషియన్ .. వంటి శిక్షణా కార్యక్రమాలను ఉచితంగా నిర్వహించాం. ఆ తర్వాత ఈ సేవామార్గంలో కొన్ని స్వచ్ఛంద సంస్థల వాళ్లు పరిచయమయ్యారు. అలా మేధా చారిటీ, అభయ ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థలతోనూ కలిసి గ్రామీణ మహిళలకు ఎనిమిది వేల కుట్టుమిషన్లు, ఇతర ఉపాధులకు అవసరమయ్యే పని ముట్లను ఏర్పాటు చేశాం. పిల్లలకు ఫ్రీ ట్యూషన్లు కరోనా తర్వాత పిల్లలకు చదువులు బాగా తగ్గిపోయాయి. డల్‌గా ఉన్న స్టూడెంట్స్ మరీ వెనకబడిపోకుండా ఆర్థిక స్తోమత లేని విద్యార్థులకు ఫ్రీ ట్యూషన్స్ ఏర్పాటు చేశాం. ఇందుకు ప్రభుత్వ స్కూల్ విద్యార్థులనే ఎంచుకుంటాం. ఉపాధికి దారులు అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలలో తెలిసినవారి నుంచి ఇక్కడి మహిళలకు ఆర్డర్ మీద వర్క్స్ ఇప్పిస్తుంటాను. ఈ ఆర్డర్లు తెచ్చుకోవడానికి ఈ బృందంలోని వారి నుంచి కొందరిని నియమిస్తాను. అమెరికాలో, దూర్రపాంతాల్లో తెలిసినవారుంటే వారికి మావాళ్లు చేసిన వర్క్స్ ఫోన్ల ద్వారా చూపించి, ఆర్డర్స్ తెప్పిస్తుంటాం. వారికి కొరియర్ ద్వారా పంపిస్తుంటాం. దీని ద్వారా ఈ మహిళలకు కొంత ఆదాయం లభిస్తుంది. కోర్సు తర్వాత వారి ఇంటి వద్దనే నేర్చుకున్న పనిని కొనసాగించేలా కూడా చూస్తున్నాం’’ అని కృష్ణవేణి వివరించారు. – నిర్మలారెడ్డి -
ఎస్సీ యువతకు ఉపాధి శిక్షణ
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ నిరుద్యోగ యువతకు వివిధ ట్రేడుల్లో ఉచితంగా నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు రాష్ట్ర ఎస్సీ సహకార అభివృద్ధి సంస్థ (టీఎస్సీసీడీసీ) గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. కుటుంబ వార్షికాదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.5 లక్షలు, పట్టణాల్లో రూ.2 లక్షలు మించకుండా 18–35 ఏళ్ల వయసున్న అభ్యర్థులు ఈ శిక్షణకు అర్హులని తెలిపింది. జాతీయ పర్యాటక ఆతిథ్య నిర్వహణ సంస్థ ఆధ్వర్యంలో ఫేష్ ట్రైనింగ్, పంచకర్మ, ఆయుర్వేద స్పా, రెస్టారెంట్ సర్వీ సులో శిక్షణ ఇస్తామని, శిక్షణ సమయంలో ఉచిత భోజనం, వసతి కల్పిస్తున్నామని పేర్కొంది. ఆసక్తి గల అభ్యర్థులు హైదరాబాద్‌లోని జాతీయ, పర్యాటక ఆతిథ్య నిర్వహణ సంస్థలో కానీ జిల్లా ఎస్సీ కో ఆపరేటివ్ సంస్థను సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. -
ఉపాధికి ఊతం న్యాక్..
సిరిసిల్ల/కోరుట్ల:నిరుద్యోగులకు ఉపాధి శిక్షణతోపాటు, నైపుణ్య శిక్షణ ఇస్తూ వేలాదిమందికి ఉపాధి బాట చూపుతోంది న్యాక్ కేంద్రాలు. రాష్ట్రవ్యాప్తంగా 38 న్యాక్ కేంద్రాలు ఉన్నాయి. వివిధ వృత్తివిద్యా కోర్సుల్లో పేద యువతకు శిక్షణ ఇస్తూ భవిష్యత్‌పై బరోసా కల్పిస్తున్నాయి. న్యాక్ ఆఫర్ చేస్తున్న కోర్సులు.. వెల్డింగ్, ప్లంబింగ్, పేయింటింగ్ అండ్ డెకరేషన్ కోర్సులకు ఏడో తరగతి చదివిన అభ్యర్థులు అర్హులు. ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్, స్టిచింగ్ అండ్ కర్టెన్ మేకింగ్ కోసం పదో తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ల్యాండ్ సర్వేయర్, జనరల్ వర్క్స్ సూపర్వైజర్ కోసం ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత పొంది ఉండాలి. మూడు నెలలపాటు శిక్షణ అందిస్తారు. ఉచిత వసతి గృహం, భోజన వసతి కల్పిస్తారు. వీరు అర్హులు.. ఈ కోర్సులకు 18– 35 వయసు గల అభ్యర్థులు రేషన్ కార్డు, ఆధార్‌కార్డు, క్వాలిఫైంగ్ సర్టిఫికెట్, కుల «ధ్రువీకరణ పత్రం, బ్యాంక్ పాస్‌పుస్తకం దరఖాస్తుతో జతచేసి న్యాక్కేంద్రంలో సమర్పించాలి. నైపుణ్య శిక్షణ.. శిక్షణ పొందే అభ్యర్థులు కార్మికశాఖలో పేరు నమోదు చేసుకోవాలి. లేబర్ కార్డు ఉండాలి. తాపీమేస్త్రీ, ప్లంబింగ్, వెల్డింగ్ కోర్సులకు నైపుణ్య శిక్షణ కోసం 15 రోజులపాటు ఉచిత శిక్షణ ఇవ్వడంతోపాటు భోజన వసతి కల్పిస్తారు. నిత్యం రూ. 300 చొప్పున స్టైఫండ్ చెల్లిస్తారు. నూరుశాతం ప్లేస్మెంట్.. ఉచిత భోజన వసతి హాస్టల్ సదుపాయంతోపాటు, భోజనం, యూనిఫాం, కోర్సు మెటీరియల్స్ అందజేస్తారు. శిక్షణ అనంతరం సర్టిఫికెట్ ఇస్తారు. నూరుశాతం ప్లేస్మెంట్ కల్పిస్తారు. ఉద్యోగంలో చేరిన మూడు నెలల అనంతరం ప్రభుత్వం వారిబ్యాంకు ఖాతాలో రూ. 3,000 జమ చేస్తుంది. ఉన్నత చదువులు చదివినా ఉద్యోగం రావడంలేదనుకునేవారు కొందరు.. చదువు లేక కూలీనాలి చేసేవారు మరికొందరు.. చదువు.. ఆలోచనా శక్తి.. ప్రభుత్వ పథకాలను అందిపుచ్చుకునే నేర్పు ఉన్నవారు మరికొందరు. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా తమ కాళ్లపై తాము నిలబడి మరో పదిమందికి ఉపాధి కల్పిస్తున్నారు ఎంతోమంది. స్వయం ఉపాధిపై ఆసక్తి ఉన్నవారిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వాలు అనేక అవకాశాలు కల్పిస్తున్నాయి. వీటిని సద్వినియోగం చేసుకునేందుకు నిబంధనలనూ సరళీకృతం చేస్తున్నాయి. ఆర్థికంగా అండగా నిలిచేందుకు రుణసాయం అందిస్తున్నాయి. రాయితీ.. సబ్సిడీ.. వడ్డీ మాఫీతో స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తున్నాయి. మరికొన్ని సంస్థలు యువత వృత్తినైపుణ్యం పెంచుకునే అవకాశం కల్పిస్తున్నాయి. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్వైపు నడిపిస్తున్నాయి. స్వయం ఉపాధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాలు.. నైపుణ్య శిక్షణ పెంపొందిస్తున్న సంస్థలు.. కోర్సులు.. దరఖాస్తు విధానం.. రుణాలు పొందే అవకాశం.. తదితర వివరాలతో ఈవారం వీకెండ్. -
ఉపాధి శిక్షణ శాఖలో కుంభకోణం లేదు
డెరైక్టర్ వరప్రసాద్ వివరణ సాక్షి, అమరావతి : ఉపాధి శిక్షణ శాఖలో రూ.100 కోట్ల కుంభకోణం జరిగిందనటంలో వాస్తవం లేదని కార్మిక సంక్షేమ, ఉపాధి కల్పన శాఖ డెరైక్టర్ డి.వరప్రసాద్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉపాధి శిక్షణ శాఖ మాడ్యులర్ ఎంప్లాయ్మెంట్ పథకానికి సంబంధించి రూ. 10 కోట్లు 2015 మార్చి 23న ఎస్బీహెచ్లో డిపాజిట్ చేశారని, ఆ డిపాజిట్లు గల్లంతైన కేసులో జాయింట్ డెరైక్టర్ జి.మునివెంకటనారాయణ, అసిస్టెంట్ డెరైక్టర్ వీటీ తోడరమల్లు సీబీఐ విచారణకు వెళ్లి వచ్చారని చెప్పారు. 2015 నవంబరు 13న డిపాజిట్ చేసిన రూ.10 కోట్లు డ్రా చేసేందుకు హైదరాబాద్‌లోని నల్లకుంట బ్రాంచికి వెళ్ళగా వారు రూ. 2.50 కోట్లు మాత్రమే అప్పుడు చెల్లించారని తెలిపారు. అప్పటికే పలు ప్రభుత్వ శాఖలకు చెందిన నిధులు గల్లంతైనట్లు తెలిసిందని, దీంతోనే ఈ కేసును ఎస్బీహెచ్ సీబీఐకి అప్పగించిందని చెప్పారు. తర్వాత నల్లకుంట బ్రాంచి వారు 2016 ఫిబ్రవరి 19న రూ. 8.16 కోట్లు వడ్డీతో కలిపి ఉపాధి కల్పన శాఖకు ఇచ్చివేశారన్నారు. అయితే విచారణ సంద ర్భంగా సీబీఐ వారు పిలిచినప్పుడు హాజరు కావాల్సి ఉంటుందని చెప్పారు. అందులో భాగంగానే ఇరువురూ సీబీఐ కార్యాలయానికి వెళ్ళి రికార్డులు చూపించి వచ్చినట్లు ఆయన తెలిపారు. -
ఉపాధి శిక్షణపై చిన్నచూపు
జగిత్యాల అర్బన్ : పట్టణ ప్రాంతాల్లోని యువతకువివిధ రంగాల్లో శిక్షణ ఇచ్చి వారికి ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జాతీయ పట్టణ జీవనోపాధులుమిషన్ ద్వారా నైపుణ్యాల అభివృద్ధి పాలసీని ప్రారంభించాయి. 2009లో ప్రారంభమైన ఈ పథకం అనుకున్న లక్ష్యాన్ని చేరడంలేదు. సర్కారు సదుద్దేశంతో ప్రారంభించిన ఈ పథకం అధికారుల నిర్లక్ష్యం కారణంగా నీరుగారిపోతుంది. పట్టణాల్లో అమలు జిల్లాలోని రెండు కార్పొరేషన్లతోపాటు మున్సిపాలిటీల్లో ఈ పథకం అమలు అవుతోంది. అధికారులు లక్షకు పైగా ఉన్న జనాభా ఉన్న ప్రాంతాల్లో ఈ పథకాన్ని ప్రారంభించారు. నైపుణ్యాలు కలిగిన సంస్థలకు నిరుద్యోగులను కేటాయించి శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ అధికారులు మాత్ర ఆ దిశగా చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారు. శిక్షణపై చిన్నచూపు పట్టణంలోని పదో తరగతి పాసైన యువతీ, యువకులకు కంప్యూటర్, టైలరింగ్, బ్యూటీషియన్, బ్యూటీథెరపీ, హెయిర్‌స్టైల్‌తోపాటు సుమారు 20 రంగాల్లో శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. శిక్షణ తీసుకోవాల్సిన నిరుద్యోగులు సంబంధిత మున్సిపాలిటీలో దరఖాస్తు చేసుకోవాలి. తమకు ఏ కోర్సుల్లో శిక్షణ కావాలో ముందుగా తెలియజేయాలి. వారి అభ్యర్థన మేరకు ఆయా అంశాల్లో శిక్షణ ఇస్తారు. ప్రతి మూడు నెలలకు ఒక బ్యాచ్ చొప్పున 40మందికిశిక్షణ ఇస్తారు. కానీ మెప్మా అధికారులు పట్టణాల్లో ఎలాంటి అవగాహన కల్పించకపోవడంతో దరఖాస్తులు చేసుకునే వారే కరువయ్యారు. . నీరుగారుతున్న లక్ష్యం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన ఈ పథకం లక్ష్యం నీరుగారుతుంది. పట్టణాల్లో కంప్యూటర్ శిక్షణ సెంటర్లు యువతీ, యువకులకు శిక్షణ ఇస్తామని హైదరాబాద్‌లోని మెప్మా కార్యాలయంలో దరఖాస్తులు చేసుకుంటారు. జిల్లా అధికారులు వాటిని పరిశీలించి శిక్షణ కేంద్రాలను ఎంపిక చేయాల్సి ఉంటుంది. వీరు ఎంపిక చేసిన కేంద్రాల్లో యువతకు శిక్షణ ఇస్తారు. కంప్యూటర్ శిక్షణ ఇచ్చే సెంటర్లకు ఒక విద్యార్థికి రూ.11,500 చెల్లిస్తారు. ఒక్కో సెంటర్లో ఒక బ్యాచ్‌కు 40 మందిని కేటాయిస్తారు. ముందుగా శిక్షణ కోసంముందుగా రూ.2200 చెల్లిస్తారు. ఉపాధి లభించిన అనంతరం మిగతా మొత్తాన్ని చెల్లిస్తారు. కానీ ఇవన్ని పట్టణంలో ఎక్కడా జరగడం లేదు. విద్యార్థుల అనాసక్తి అధికారులు ఉపాధి శిక్షణపై యువతకు తెలియజేయకపోవడంతో దరఖాస్తు చేసుకునేవారు కరువయ్యా రు. తెలిసిన కొంతమంది దరఖాస్తు చేసుకున్న నామ్కేవాస్తేగా శిక్షణకు పంపిస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో విద్యార్థులు మూడు నెలల కోర్సు కు పది రోజులు మాత్రమే వెళ్లి మానేస్తున్నారు. దీంతో విద్యార్థులకు శిక్షణ లభించడం లేదు. ప్రస్తుతం ఈ శిక్ష ణ ఇచ్చే కంప్యూటర్ సెంటర్లలో బయోమెట్రిక్ సిస్టమ్ ఉంటుంది. విద్యార్థి 30 రోజుల్లో 15 రోజులు కోర్సులకు హాజరు కావాల్సి ఉంటుంది. కోర్సు చేసే విద్యార్థి కచ్చితంగా వచ్చి బయోమెట్రిక్ పాటిస్తేనే హాజరుపడుతుంది. దీంతో విద్యార్థుల హాజరు శాతం లేక కం ప్యూటర్ సెంటర్ల యజమానులు కూడా నష్టపోవాల్సి వస్తుంది. అధికారులు పూర్తిస్థాయిలో కోర్సుల గురించి అవగాహన కల్పిస్తేనే విద్యార్థుల పూర్తిచేసే అవకాశం ఉంది. -
కార్మిక శాఖకు కోతలు
సాక్షి, హైదరాబాద్: కార్మిక శాఖను ప్రభుత్వం నిరాశపరిచింది. గత బడ్జెట్‌తో పోల్చితే భారీగా కోత విధించింది. గత బడ్జెట్లో కింద రూ.70 కోట్లు ప్రకటించగా, ఈసారి 36.53 కోట్లతో సరిపెట్టింది. మొత్తం ప్రణాళిక, ప్రణాళికేతర వ్యయం కింద రూ.425.32 కోట్లు కేటాయించింది. కార్మికుల బీమా వైద్య సదుపాయాలకు ఒక్క రూపాయి కూడా ప్రకటించలేదు. ఉపాధి శిక్షణకు పెద్దపీట.. ఉన్నంతలో ఉపాధి శిక్షణ విభాగానికి కాస్త పెద్దపీట వేసింది. ఇటీవల యువతకు వివిధ రంగాల్లో ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తోంది. అలాగే విదేశాల్లో ఉపాధి అవకాశాల కోసం తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీస్ ద్వారా ఉద్యోగాలు ఇప్పించే ప్రయత్నం చేస్తోంది. జిల్లాలోని ఉపాధి కల్పన కార్యాలయాల్లో కూడా ప్రత్యేక క్యాంపస్ రిక్రూట్మెంట్లు నిర్వహిస్తోంది. దీంతో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాల కోసం ప్రభుత్వం బడ్జెట్లో రూ.26.17 కోట్లు కేటాయించింది. -
50 కిలోమీటర్లకో చెక్‌పోస్టు
జాతీయ రహదారులపై ప్రతి 50 కిలో మీటర్లకూ టాస్క్‌ఫోర్స్ పోలీసులతో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేస్తామని ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప వెల్లడించారు. జాతీయ రహదారులకు దగ్గరగా ఉన్న గ్రామాల వద్ద రోడ్డు దాటుతూ ఎక్కువ మంది ప్రమాదాల బారిన పడుతున్నారని.. ప్రజలు ఇష్టానుసారంగా రోడ్డు దాటకుండా ఇరువైపులా పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నామని, రద్దీ ఎక్కువగా ఉన్నచోట అండర్ టన్నెల్స్ నిర్మిస్తామని చెప్పారు. ప్రయాణికులను రవాణా చేసే వాణిజ్య వాహనాలపై ప్రత్యేక నిఘా పెడుతున్నామని, అలాంటి డ్రైవర్ల లెసైన్సులు రద్దు చేస్తామని చెప్పారు. ఏకాభ్రిపాయంతోనే విద్యపై నిర్ణయం.. ప్రస్తుతం రాష్ట్రంలో అమలుచేస్తున్న నాన్ డిటెన్షన్ విధానాన్ని డిటెన్షన్ విధానంగా మార్చాలా వద్దా అన్నదానిపై ఏకాభ్రిపాయంతోనే నిర్ణయం తీసుకుంటామని రాజప్ప చెప్పారు. దీనిపై జిల్లా కేంద్రాల్లో మంగళవారం నిర్వహించే సమావేశాల్లో వ్యక్తమయ్యే అభిప్రాయాలను బట్టి ముఖ్యమంత్రి త్వరలో నిర్ణయాన్ని ప్రకటిస్తారన్నారు. సిలబస్‌ను కూడా మార్చే విషయమై మంత్రి వర్గం చర్చించనుందన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చి ఉద్యోగావకాశాలు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. -
సామాజిక సేవే సత్యసాయి ట్రస్టు లక్ష్యం
తాడిపత్రి టౌన్ : సేవా ధృక్పథమే శ్రీ సత్యసాయి బాబా లక్ష్యమని, వాటికి అనుగుణంగా శ్రీసత్యసాయి సేవా సంస్థలు, సత్యసాయి ట్రస్ట్ పని చేస్తున్నాయని సత్యసాయి సేవా సమితి సెంట్రల్ ట్రస్ట్ ట్రస్టీ ఆర్జె రత్నాకర్ పేర్కొన్నారు. స్థానిక వాటర్ వర్స్స్ రోడ్డులో సత్యసాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీ సత్యసాయి లక్ష్మీనారాయణ స్వామి వృత్తి విద్యా శిక్షణా కేంద్రాన్ని గురువారం సత్యసాయి సేవా సమితి సెంట్రల్ ట్రస్ట్ ట్రస్టీ ఆర్జే రత్నాకర్ ప్రారంభించారు. అనంతరం స్థానిక సత్యసాయి సేవా సమితి ఆధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రత్నాకర్ మాట్లాడుతూ సత్యసాయి స్పూర్తిగా తీసుకుని పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. జిల్లా వ్యాప్తంగా గత 18 సంవత్సరాలు 1500 గ్రామాల్లో సత్యసాయి ట్రస్ట్ ద్వారా ప్రజలకు నీటి సదుపాయం కల్పిస్తున్నామన్నారు. సత్యసాయి సేవా ట్రస్టు ద్వారా నిరుద్యోగ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఉచిత వృత్తి విద్యా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. క్రమశిక్షణతో శిక్షణ పొందాలని నిరుద్యోగ యువకులకు ఆయన పిలుపు నిచ్చారు. సత్యసాయి సేవా ట్రస్ట్ అధ్యక్షుడు హెచ్‌జె దొర మాట్లాడుతూ ఉపాధి శిక్షణతోపాటు, ఆధ్యాత్మిక చింతన విద్యార్థులు అలవరచుకోవాలన్నారు. శ్రీ సత్యనాయి సాధన ట్రస్ట్ సభ్యుడు లక్ష్మినారాయణ, సత్యసాయి సేవా సంస్థల ఆల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ రమణి, రాష్ట్ర అధ్యక్షుడు చలం, అనంతపురం సేవా సంస్థల అధ్యక్షుడు రామాంజప్ప,స్టేట్ కో ఆర్డినేటర్ కృష్ట కుమార్, తాడిపత్రి సత్యసాయి సేవా సమితి కన్వీనర్ వెంకట్రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వృత్తి విద్యా శిక్షణ కోర్సు విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు దుస్తులు పంపిణీ చేశారు.