ఇల్లే సేవా కేంద్రం | Free employment training programs by krishnaveni | Sakshi
Sakshi News home page

ఇల్లే సేవా కేంద్రం

Published Thu, Feb 23 2023 1:21 AM | Last Updated on Thu, Feb 23 2023 1:21 AM

Free employment training programs by krishnaveni - Sakshi

కావల్సినన్ని వనరులు సమకూరినప్పుడు కూర్చుని సేద తీరుదామనుకుంటారు చాలామంది. తమ చుట్టూ ఉన్న నలుగురికైనా వారి స్వశక్తిని నమ్ముకునేలా  చేయూతనిద్దాం అనుకుంటారు అతి కొద్దిమంది. అలాంటివారిలో కొత్తమాసు కృష్ణవేణి ఒకరు.  సికింద్రాబాద్‌లోని టెలికాం కాలనీ, కానాజీగూడలో ఉంటున్న ఈ గృహిణి తన ఇంటినే సేవాకేంద్రంగా మలిచి పదేళ్లుగా మహిళలకు ఉపాధి శిక్షణా కార్యక్రమాలను ఉచితంగా అందిస్తున్నారు. 

మహిళలకు శిక్షణ ఇస్తూ బిజీగా ఉన్న కృష్ణవేణిని కలిసినప్పుడు, ఆమె సేవామార్గం వివరాలను ఇలా పంచుకున్నారు.. 

‘‘పదిహేనేళ్ల క్రితం మావారు రంగారావు సత్యసాయి సేవాకార్యక్రమాలలో పాల్గొనేవారు. నేనూ ఆ కార్యక్రమాలకు వారి వెంట వెళ్లేదాన్ని. ఆ సమయంలోనే గ్రామాలలోని మహిళలకు స్వయం ఉపాధికి పనికి వచ్చే కార్యక్రమాలు చేస్తే బాగుంటుందనుకున్నాను. అప్పుడే మల్లాపూర్‌ గ్రామంలో మొట్ట మొదటిసారిగా నాకు వచ్చిన కుట్టు పనులను అక్కడి మహిళలకు నేర్పించి, వారికి ఆదాయ మార్గం  చూపటం సంతృప్తినిచ్చింది.

ఇంటి వద్ద నుంచి.. 
సేవా కార్యక్రమాలు ఎలా చేయచ్చో ఆ ఆడుగులు ఎలాగూ నేర్పించాయి. ఇంట్లో మా వారికి చెప్పి పైన ఓ గదిని ఏర్పాటు చేశాను. ఇంట్లోనే ఉంటాను కాబట్టి మహిళలకు టైలరింగ్, సాయంకాలాలు పేద పిల్లలకు ట్యూషన్లు చెప్పేదాన్ని. ఇక్కడ ఒక్కచోటే సేవ చేస్తూ ఉంటే కాదు, మరికొందరికి ఉపాధిని అందిస్తే బాగుంటుందనే ఉద్దేశ్యంతో గ్రామాలకి వెళ్లడం ్రపారంభించాను.

వెళ్లిన ఊళ్లో ముందుగా అక్కడ అనువైన స్థలం చూసుకొని, ఒక టీచర్‌ని ఏర్పాటు చేసి, నేర్చుకునేవారిని ఎంపిక చేసేదాన్ని. సాయిసంస్థ ద్వారానే రెండు నెలల పాటు 200 మందిని 10 బృందాలుగా చేసి, స్వయంగా శిక్షణ ఇచ్చాను.  గృహిణిగా ఇంటి పనులు చేసుకుంటూ ఉండే నేను అలా ఒక్కో ఏడాది దాటుతూ సేవాకార్యక్రమాల్లో  తీరికలేకుండా అయిపోవడం ఎంతో సంతృప్తినిచ్చింది.

స్వచ్ఛంద సంస్థలతో కలిసి.. 
ఈ 10 ఏళ్లలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలలోని 300 గ్రామాలలో దాదాపు çపన్నెండు వేల మంది గ్రామీణ మహిళలకు కుట్టు మిషను, మెహెందీ, ఫ్యాషన్‌ డిజైనింగ్, ఎంబ్రాయిడరీ, మగ్గం వర్క్, పేపర్‌ వర్క్, ఫ్యాషన్‌ జ్యువెలరీ తయారీ, బ్యూటీషియన్‌ .. వంటి శిక్షణా కార్యక్రమాలను ఉచితంగా నిర్వహించాం.

ఆ తర్వాత ఈ సేవామార్గంలో కొన్ని స్వచ్ఛంద సంస్థల వాళ్లు పరిచయమయ్యారు. అలా మేధా చారిటీ, అభయ ఫౌండేషన్‌ స్వచ్ఛంద సంస్థలతోనూ కలిసి గ్రామీణ మహిళలకు ఎనిమిది వేల కుట్టుమిషన్లు, ఇతర ఉపాధులకు అవసరమయ్యే పని ముట్లను ఏర్పాటు చేశాం.

పిల్లలకు  ఫ్రీ ట్యూషన్లు
కరోనా తర్వాత పిల్లలకు చదువులు బాగా తగ్గిపోయాయి. డల్‌గా ఉన్న స్టూడెంట్స్‌ మరీ వెనకబడిపోకుండా ఆర్థిక స్తోమత లేని విద్యార్థులకు ఫ్రీ ట్యూషన్స్‌ ఏర్పాటు చేశాం. ఇందుకు ప్రభుత్వ స్కూల్‌ విద్యార్థులనే ఎంచుకుంటాం. 

ఉపాధికి దారులు
అపార్ట్‌మెంట్లు, గేటెడ్‌ కమ్యూనిటీలలో తెలిసినవారి నుంచి ఇక్కడి మహిళలకు ఆర్డర్‌ మీద వర్క్స్‌ ఇప్పిస్తుంటాను. ఈ ఆర్డర్లు తెచ్చుకోవడానికి ఈ బృందంలోని వారి నుంచి కొందరిని నియమిస్తాను. అమెరికాలో, దూర్రపాంతాల్లో తెలిసినవారుంటే వారికి మావాళ్లు చేసిన వర్క్స్‌ ఫోన్ల ద్వారా చూపించి, ఆర్డర్స్‌ తెప్పిస్తుంటాం. వారికి కొరియర్‌ ద్వారా పంపిస్తుంటాం. దీని ద్వారా ఈ మహిళలకు కొంత ఆదాయం లభిస్తుంది. కోర్సు తర్వాత వారి ఇంటి వద్దనే నేర్చుకున్న పనిని కొనసాగించేలా కూడా చూస్తున్నాం’’ అని కృష్ణవేణి వివరించారు.

– నిర్మలారెడ్డి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement