జాతీయ రహదారులపై ప్రతి 50 కిలో మీటర్లకూ టాస్క్‌ఫోర్స్ పోలీసులతో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేస్తామని ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప వెల్లడించారు.
జాతీయ రహదారులకు దగ్గరగా ఉన్న గ్రామాల వద్ద రోడ్డు దాటుతూ ఎక్కువ మంది ప్రమాదాల బారిన పడుతున్నారని.. ప్రజలు ఇష్టానుసారంగా రోడ్డు దాటకుండా ఇరువైపులా పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నామని, రద్దీ ఎక్కువగా ఉన్నచోట అండర్ టన్నెల్స్ నిర్మిస్తామని చెప్పారు. ప్రయాణికులను రవాణా చేసే వాణిజ్య వాహనాలపై ప్రత్యేక నిఘా పెడుతున్నామని, అలాంటి డ్రైవర్ల లెసైన్సులు రద్దు చేస్తామని చెప్పారు.
ఏకాభ్రిపాయంతోనే విద్యపై నిర్ణయం..
ప్రస్తుతం రాష్ట్రంలో అమలుచేస్తున్న నాన్ డిటెన్షన్ విధానాన్ని డిటెన్షన్ విధానంగా మార్చాలా వద్దా అన్నదానిపై ఏకాభ్రిపాయంతోనే నిర్ణయం తీసుకుంటామని రాజప్ప చెప్పారు.
దీనిపై జిల్లా కేంద్రాల్లో మంగళవారం నిర్వహించే సమావేశాల్లో వ్యక్తమయ్యే అభిప్రాయాలను బట్టి ముఖ్యమంత్రి త్వరలో నిర్ణయాన్ని ప్రకటిస్తారన్నారు. సిలబస్‌ను కూడా మార్చే విషయమై మంత్రి వర్గం చర్చించనుందన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చి ఉద్యోగావకాశాలు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.