సాక్షి, హైదరాబాద్: ప్రాథమిక అభ్యసన సామర్థ్యాల సాధన (ఎఫ్‌ఎల్‌ఎన్) కార్యక్రమం కోసం విద్యాశాఖ ఏర్పాటు చేసిన ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ కమిటీని తాత్కాలికంగా నిలిపివేసినా... మరో రూపంలో తెచ్చే యోచనలోనే అధికారులున్నారు. కాకపోతే ‘టాస్క్‌ఫోర్స్’అన్న ఘాటైన పదాన్ని మాత్రమే మార్చాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలిసింది. ఉపాధ్యాయ సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకతమైనా అత్యంత వివాదాస్పదమైన ఈ నిర్ణయంపై కొంతమంది అధికారులు ఏమాత్రం వెనక్కు తగ్గొద్దన్న ధోరణిలో ఉన్నారు.
ఎఫ్‌ఎల్‌ఎన్ కార్యక్రమం ద్వారా వందకు వంద శాతం విద్యార్థుల్లో అభ్యసన మెరుగుపర్చడమే లక్ష్యమని అధికారులు చెబుతున్నారు. విద్యాశాఖ కార్యక్రమాలను ఉపాధ్యాయులు తేలికగా తీసుకుంటున్నారని, అందుకే గట్టి పర్యవేక్షణ అవసరమని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ భావిస్తున్నట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి. కొంతమంది ఉపాధ్యాయులపై వేటు పడితేనే ఎఫ్‌ఎల్‌ఎన్‌పై శ్రద్ధ పెరుగుతుందని ఆమె అన్నట్టు ఓ సీనియర్ అధికారి ఉపాధ్యాయ సంఘాలతో చెప్పారు. అయితే, టాస్క్‌ఫోర్స్ పేరుపై మంత్రి కూడా కొంతమేర అభ్యంతరాలు తెలిపినట్టు తెలిసింది. ఈ కారణంగా దీని పేరు మార్చినా విధివిధానాల్లో మార్పు ఉండే అవకాశం లేదని విద్యాశాఖ వర్గాలు అంటున్నాయి.
మరింత కఠిన నిబంధనలు
టాస్క్‌ఫోర్స్ కమిటీలో స్థానిక ఎన్‌జీవో సంస్థల భాగస్వామ్యంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. స్థానిక రాజకీయాలు ఇందులో ప్రభావం చూపే అవకాశముందని టీచర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 1–5వ తరగతి ఉండే పాఠశాలల్లో స్థానిక నేతల పెత్తనం ఉంటుందని, వారి కనుసన్నల్లోనే ఎన్‌జీవోలు ఉంటాయని, దీనివల్ల తాము నష్టపోయే ప్రమాదం ఉందని టీచర్లు చెబుతున్నారు.
పాఠశాల విద్య డైరెక్టర్ మాత్రం ఈ వాదనతో ఏకీభవించడం లేదని తెలిసింది. ఎన్‌జీవోల స్థానంలో స్థానిక సంస్థలు ప్రతిపాదించిన ఓ వ్యక్తిని కమిటీలో నియమించేందుకు సిద్ధపడుతున్నారు. అంతేకాకుండా పంచాయతీ, మున్సిపల్ పరిధిలో ఎఫ్‌ఎల్‌ఎన్ నిర్వహణపై నివేదికలు ఇచ్చేలా చర్యలు తీసుకునే వీలుందని అధికారులు అంటున్నారు. వాస్తవానికి టాస్క్‌ఫోర్స్‌లో జిల్లా విద్యాశాఖాధికారి నేతృత్వంలో ఎంఈవో, డైట్ లెక్చరర్, మండల, క్లస్టర్ రిసోర్స్ పర్సన్స్, ఎన్‌జీవో లను సభ్యులుగా చేర్చారు. విద్యార్థులకు టీచర్లు ప్రతీ వారం పరీక్షలు నిర్వహించాలి.
15 రోజులకోసారి అధికారులకు నివేదికలు పంపాలి. ప్రతీనెల ఉన్నతాధికారులు వీటిని సమీక్షిస్తారు. ఇదే క్రమంలో టాస్క్‌ఫోర్స్ కమిటీ స్కూళ్లకు వెళ్లి విద్యార్థి సామర్థ్యాన్ని, ఉపాధ్యాయుల బోధనను పరిశీలిస్తుంది. సరిగా బోధించని ఉపాధ్యాయులపై, ఫలితాలు సాధించని స్కూళ్లపై టాస్క్‌ఫోర్స్ నివేదిక ఇస్తుంది. దీని ఆధారంగా ఉన్నతాధికారులు ఉపాధ్యాయులపై చర్యలు తీసుకునే వీ లుంది. టాస్క్‌ఫోర్స్‌ను నిలిపివేయడంతో కొత్తగా ఏర్పాటు చేసే వ్యవస్థలోనూ విద్యాశాఖ అధికారుల ప్రమేయం కన్నా, స్థానిక సంస్థలకే ఎక్కువ అధికారాలు ఇచ్చే యోచనలో అధికారులున్నారు. ఇది మరో వివాదానికి తెరతీసే ఆస్కారం ఉందని ఉపాధ్యాయ వర్గాలు అంటున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment