Under Tunnel
-
వేగంగా గ్యాస్ ఆధారిత ‘భూగర్భ విద్యుత్కేంద్రం’
పెద్దపల్లి: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మాణమవుతున్న ప్యాకేజీ–6 మేడారం అండర్ టన్నెల్ వద్ద భూగర్భంలో గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రాన్ని నెల రోజుల్లోనే పూర్తి చేస్తామని భారీ నీటిపారుదల మంత్రి టి.హరీశ్‌రావు తెలిపారు. గురువారం పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం మేడారం వద్ద అండర్ టన్నెల్ పనులను ఆయన పరిశీలించారు. విద్యుత్ కేంద్ర పనులపై సంతృప్తి వ్యక్తం చేశారు. రూ.450 కోట్లతో 400 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఆరు నెలల్లో పూర్తి కావాల్సిన విద్యుత్ కేంద్రాన్ని నెల రోజుల్లోనే ఏర్పాటు చేయడం సరికొత్త రికార్డు అని చెప్పారు. భూమిపైన ఇలాంటి విద్యుత్ కేం ద్రాన్ని నిర్మించేందుకు 65 ఎకరాల స్థలం అవసరం ఉంటుందన్నారు. భూగర్భంలో కేవలం ఎకరం స్థలంలోనే విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం మరో రికార్డుగా పేర్కొన్నారు. 400 మెగావాట్ల గ్యాస్ విద్యుత్‌తో ఏడు పంపులకు సరిపడా కరెంటు సరఫరా అవుతుందన్నారు. త్వరలోనే మేడారం ప్రాజెక్టుకు 1.2 టీఎంసీల నీటిని విడుదల చేస్తామన్నారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టులోని సుందిల్ల, మేడిగడ్డ, అన్నారం పంప్‌హౌజ్, బ్యారేజీ పనులను త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు. ప్రపంచమంతా ఇప్పుడు కాళేశ్వరం వైపు చూస్తోందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేయడం ద్వారా కోటి ఎకరాల బంగారు పంటల లక్ష్యానికి చేరువవుతామన్నారు. ఇలాంటి ప్రాజెక్టు ఇక్కడ నిర్మించడం దేశానికే గర్వ కారణంగా నిలుస్తుందన్నారు. ప్రాజె క్టు నిర్మాణంతోపాటు అండర్ గ్రౌండ్ లో గ్యాస్ ఇన్స్టాలేషన్ విద్యుత్ ఉత్పత్తిని సవాల్‌గా తీసుకొని నెల రోజుల్లోనే పూర్తి చేయడానికి కృషి చేస్తున్న ఉద్యోగులను, సిబ్బందిని మంత్రి అభినందించారు. -
బ్లాస్టింగ్ జరగకుండానే ప్రమాదం
రాక్‌బౌల్టింగ్ ఉన్నా కూలిపడటం దురదృష్టకరం: హరీశ్‌రావు ► దుర్ఘటనపై ఉన్నతాధికారులు, నిపుణులతో కమిటీ ► ఇలాంటివి మళ్లీ ఎక్కడా జరగకుండా చర్యలు చేపడతాం ► కార్మికుల కుటుంబాలకు అండగా నిలుస్తామని హామీ ► ప్రమాద స్థలాన్ని పరిశీలించిన మంత్రి సాక్షి ప్రతినిధి, కరీంనగర్: కాళేశ్వరం ప్రాజెక్టు 10 ప్యాకేజీలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం తిప్పాపూర్ శివారులో జరుగుతున్న సొరంగం (అండర్ టన్నెల్) పనుల్లో జరిగిన ప్రమాదం దురదృష్టకరమని భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పేర్కొన్నారు. దుర్ఘటన జరిగిన తీరుపై ఇంజనీర్లతో మాట్లాడామని.. ఎలాంటి బ్లాస్టింగ్ జరగకుండానే బండరాయి కూలిపడి ప్రమాదం జరిగిందని తెలిపారు. గురువారం జిల్లా కలెక్టర్ భాస్కర్, ఎస్పీ విశ్వజిత్, ఇంజనీరింగ్ అధికారులతో కలసి హరీశ్‌రావు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. అనంతరం అక్కడే విలేకరులతో మాట్లాడారు. సొరంగం నిర్మాణంలో రక్షణ చర్యల్లో భాగంగా రెండు, మూడు టన్నుల బరువుండే రాళ్లు కూడా పడకుండా రాక్‌బౌల్టును ఏర్పాటు చేశారని.. బుధవారం పడిపోయిన రాయికి కూడా రాక్‌బౌల్టింగ్ వేశారని వివరించారు. కానీ ఊహించని విధంగా రాక్‌బౌల్టింగ్‌తో సహా రాయి పడిపోయినట్లు స్పష్టంగా కనబడుతోందని చెప్పారు. మృతుల కుటుంబాలను ఆదుకోవడంపై ఏజెన్సీతో మాట్లాడామని, ఒక్కో కుటుంబానికి రూ.20 లక్షలు ఎక్స్‌గ్రేషియాగా ప్రకటించామని హరీశ్ తెలిపారు. హైదరాబాద్‌లో సాగునీటి శాఖ ఉన్నతాధికారులు ఈ ఘటనపై చర్చించారని, విచారణకు ఒక కమిటీని వేశారని ఆయన వెల్లడించారు. నలుగురు అధికారులతో కమిటీ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా రిటైర్డ్ డైరెక్టర్ జనరల్ ఎం.రాజు, సీనియర్ జియాలజిస్టు రవీంద్రనాథ్, ఈఎస్సీలు అనిల్, నాగేందర్ సభ్యులుగా కమిటీ వేశామని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. డైరెక్టర్ జనరల్ ఎం.రాజుకు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పనిచేసిన అనుభవం ఉన్నందున ఈ బాధ్యతలు అప్పగించామన్నారు. దుర్ఘటనపై పూర్తిస్థాయి అధ్యయనం జరిపి 15 రోజుల్లో నివేదిక ఇవ్వాల్సిందిగా సూచించినట్లు తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా పూర్తిస్థాయిలో చేపట్టాల్సిన జాగ్రత్తలు, చర్యలపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని కమిటీని కోరామన్నారు. దురదృష్టవశాత్తు మరణించిన ఏడుగురి కుటుంబాలను ఆదుకుంటామన్నారు. అదే విధంగా రాష్ట్రంలో జరిగే అన్ని టన్నెల్ పనుల వద్ద కూడా జాగ్రత్తలు తీసుకునేలా చర్యలు చేపడతామని తెలిపారు. ప్రాజెక్టుల పేరుతో ప్రాణాలు తీస్తున్నారు: లక్ష్మణ్ కూలిన సొరంగాన్ని పరిశీలించిన విపక్ష నేతలు ఇల్లంతకుంట (మానకొండూర్): ప్రాజెక్టుల పేరుతో రాష్ట్ర ప్రభు త్వం కూలీల ప్రాణాలు తీస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ఆరోపించారు. ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలను కాంట్రాక్టర్లకు ధారాదత్తం చేస్తోందని, కమీషన్ల కోసమే రీడిజైనింగ్ చేపట్టిందన్నారు. అసలు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి పర్యావరణ అనుమతులే రాలేదని, అయినా అవసరం లేని చోట ప్రభుత్వం ప్రాజెక్టులు కడుతోం దన్నారు. తిప్పాపూర్ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టు సొరంగంలో జరిగిన ప్రమాద ప్రాంతాన్ని లక్ష్మణ్ సహా పలువురు బీజేపీ, కాంగ్రెస్ నేతలు వేర్వేరుగా పరిశీలించారు. ప్రమాదం జరిగిన సొరంగం ప్రాంతానికి వెళ్లకుండా విపక్ష నేతలు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. కొంతసేపు వా గ్వాదం తర్వాత ఒక్కో పార్టీ నుంచి కొంత మందిని మాత్రమే వేర్వేరుగా పరిశీలనకు అనుమతించారు. ప్రమాద స్థలాన్ని పరిశీలించిన అనంతరం లక్ష్మణ్ మాట్లాడారు. సొరంగం ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రాక్ మెకానిజం పర్యవేక్షణలో సొరం గం పనులు చేయాల్సి ఉండగా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని, కాంట్రాక్టు కంపెనీ ఇష్టారీతిగా పనులు చేస్తోందని ఆరోపించారు. అందువల్లే ప్రమాదం జరిగిందని.. వారికి రూ.20 లక్షల చొప్పున ఇచ్చి చేతులు దులుపుకొనేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. మృతుల కుటుంబాలకు మైనింగ్ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టులో మైనింగ్ చట్టం ప్రకారం పనులు చేపట్టకనే ప్రమాదం జరిగిందని.. ఈ ఘటనపై మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తామని కాంగ్రెస్ నేత ఆరెపల్లి మోహన్ తెలిపారు. -
అండర్ టన్నెల్ వివరాలివ్వండి
కాళేశ్వరంపై రాష్ట్రానికి ఎన్జీటీ ఆదేశం సాక్షి, న్యూఢిల్లీ: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న సొరంగ మార్గం (అండర్ టన్నెల్) వివరాలను అఫిడవిట్ రూపంలో దాఖలు చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఆదేశించింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాన్ని సవాల్ చేస్తూ ఎన్జీటీలో దాఖలైన పిటిషన్‌ను జస్టిస్ జావేద్ రహీం నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం గురువారం విచారించింది. ఈ ప్రాజెక్టు పూర్తిగా తాగునీటి ప్రాజెక్టని, దీని నిర్మాణానికి అనుమతులు అవ సరం లేదని రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదించారు. ఈ ప్రాజెక్టు ద్వారా అవసరమైతే పక్క రాష్ట్రాలకూ తాగునీటిని అందిస్తామని వెల్లడించారు. ఈ ప్రాజెక్టుకు పూర్తి అనుమతులు వచ్చాక వీలైతే సాగునీటి అవసరాలకు వినియోగిస్తాము తప్ప ప్రస్తుతానికి ఇది తాగునీటి ప్రాజెక్టేనని వాదించారు. దీన్ని అటవీ భూముల్లో నిర్మిస్తున్నారని, సొరంగ మార్గ నిర్మాణం కూడా అక్కడే జరుగు తోందని పిటిషనర్ల తరఫు న్యాయవాది సంజయ్ ఉపాధ్యాయ వాదించారు. సొరంగం నిర్మించే క్రమంలో బుధవారం పైకప్పు కూలి ఏడుగురు మృతి చెందారని ట్రిబ్యునల్ దృష్టికి తీసుకొచ్చారు. పూర్తి అనుమతులు వచ్చే దాకా ప్రాజెక్టు నిర్మాణంపై స్టే విధించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. సొరంగ మార్గం నిర్మాణంపై పూర్తి వివరాలను అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం తెలియజేయడంతో ట్రిబ్యునల్ అందుకు అంగీకరించింది. తదుపరి విచారణను అక్టోబర్ 3కు వాయిదా వేసింది. -
గండి పూడ్చివేతకు మరో రెండు రోజులు!
సీతారామపురం(నూజివీడు) : మండలంలోని సీతారామపురం సమీపంలోని రామిలేరుపై ఉన్న పోలవరం అండర్‌టన్నెల్‌కు పడిన గండి పనులు ఎట్టకేలకు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈ నెల ఒకటోతేదీ తెల్లవారుజామున గండి పడినప్పటి నుంచి గండిని పూడ్చటానికి ఇంజినీరింగ్ ఉన్నతాధికారులు అక్కడే మకాం వేశారు. గోదావరి జలాల ప్రవాహం తగ్గడానికి రెండు రోజులు పట్టిన తరువాత గండి వద్ద రింగ్‌బండ్ ఏర్పాటు చేయడానికే మరో రెండు రోజులు సమయం తీసుకోవడంతో ఇప్పటివరకు గండిపూడ్చివేత పనులు ప్రారంభమవ్వలేదు. కాంక్రీట్ వేసే యంత్రాలు గురువారం సాయంత్రానికి గండి పడిన ప్రదేశానికి చేరుకోగా శుక్రవారం నుంచి కాంక్రీట్ పనులను చేపట్టారు. ముందుగా కాలువ లోపలిభాగంలో అండర్ టన్నెల్ స్లాబుతో పాటు ఉన్న అప్రాన్‌లో కాంక్రీటు నింపుతున్నారు. ఇది పూర్తయిన వెంటనే గండిని కూడా కాంక్రీట్‌తో పూడ్చుతామని ఇంజనీర్లు చెప్పారు. ఈ పనులు ఏడో తేదీ నాటికి పూర్తవుతాయని భావిస్తున్నారు. పనులను జలవనరులశాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్ కుమార్ పరిశీలించి వెళ్ళారు. నాణ్యతలో రాజీవద్దు: మంత్రి ఉమా గండి పూడ్చివేత పనుల్లో రాజీపడకూడదని జలవనరుల మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు. అప్రాన్, గండి పూడ్చివేత పనులను ఎలాంటి హడావుడి లేకుండా పూర్తిచేయాలన్నారు. మంత్రితో పాటు జలవనరులశాఖ అపెక్స్ కమిటీ సభ్యులు ఆళ్ల గోపాలకృష్ణ, తూర్పు డెల్టా ప్రాజెక్టు కమిటీ చైర్మన్ గుత్తా శివరామకృష్ణ, ఈఎన్సీ ఎం వెంకటేశ్వరరావు తదితరులున్నారు. -
50 కిలోమీటర్లకో చెక్‌పోస్టు
జాతీయ రహదారులపై ప్రతి 50 కిలో మీటర్లకూ టాస్క్‌ఫోర్స్ పోలీసులతో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేస్తామని ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప వెల్లడించారు. జాతీయ రహదారులకు దగ్గరగా ఉన్న గ్రామాల వద్ద రోడ్డు దాటుతూ ఎక్కువ మంది ప్రమాదాల బారిన పడుతున్నారని.. ప్రజలు ఇష్టానుసారంగా రోడ్డు దాటకుండా ఇరువైపులా పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నామని, రద్దీ ఎక్కువగా ఉన్నచోట అండర్ టన్నెల్స్ నిర్మిస్తామని చెప్పారు. ప్రయాణికులను రవాణా చేసే వాణిజ్య వాహనాలపై ప్రత్యేక నిఘా పెడుతున్నామని, అలాంటి డ్రైవర్ల లెసైన్సులు రద్దు చేస్తామని చెప్పారు. ఏకాభ్రిపాయంతోనే విద్యపై నిర్ణయం.. ప్రస్తుతం రాష్ట్రంలో అమలుచేస్తున్న నాన్ డిటెన్షన్ విధానాన్ని డిటెన్షన్ విధానంగా మార్చాలా వద్దా అన్నదానిపై ఏకాభ్రిపాయంతోనే నిర్ణయం తీసుకుంటామని రాజప్ప చెప్పారు. దీనిపై జిల్లా కేంద్రాల్లో మంగళవారం నిర్వహించే సమావేశాల్లో వ్యక్తమయ్యే అభిప్రాయాలను బట్టి ముఖ్యమంత్రి త్వరలో నిర్ణయాన్ని ప్రకటిస్తారన్నారు. సిలబస్‌ను కూడా మార్చే విషయమై మంత్రి వర్గం చర్చించనుందన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చి ఉద్యోగావకాశాలు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. -
ముంపు ముప్పు
కారంచేడు: వర్షాకాలం వచ్చిందంటే చాలు..చీరాల పట్టణం, కారంచేడు గ్రామాలతో పాటు వేల ఎకరాలు నీట మునిగే ప్రమాదం పొంచి ఉంటోంది. కారంచేడులోని అండర్ టన్నెల్ శిథిలావస్థకు చేరింది. మూడు దశాబ్దాల క్రితం నిర్మించిన ఈ అండర్ టన్నెల్ గోడలు పెద్దపెద్ద పగుళ్లతో కూలేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఈ టన్నెల్గుండా వెలుపలికి వచ్చే వరదనీరు రొంపేరు కుడి, ఎడమ కాలువల ద్వారా సముద్రంలో కలవాలి. ఏ క్షణమైనా ఆ అండర్ టన్నెల్ కూలేందుకు సిద్ధంగా ఉండటంతో వేల క్యూసెక్కుల నీరు కొమ్మమూరు కాలువలోకి చొచ్చుకొచ్చే ప్రమాదం పొంచి ఉంది. = కొమ్మమూరు కాలువ జిల్లాలో కారంచేడు, పర్చూరు, చినగంజాం, చీరాల, వేటపాలెం, నాగులుప్పలపాడు మండలాల్లో సుమారు లక్ష ఎకరాలకు సాగునీరందిస్తుంది. = ఈ కాలువ పరిధిలో అనేక ప్రాంతాల్లో అండర్ టన్నెల్స్ (యూటీ)ను నిర్మించారు. వీటిగుండా ఎగువ ప్రాంతం నుంచి వచ్చే వరద, మురుగునీరు...సాగు, తాగునీటిని సరఫరా చేసే కొమ్మమూరు కాలువలో కలవకుండా రొంపేరు ద్వారా సముద్రంలో కలుస్తుంది. = కారంచేడు యూటీ వద్ద రొంపేరు రెండు కెనాల్స్‌గా విడిపోతుంది. లెఫ్ట్ కెనాల్ ఈపూరుపాలెం స్ట్రయిట్‌కట్ ద్వారా సముద్రంలో కలుస్తుంది. రైట్ కెనాల్ వేటపాలెం స్ట్రయిట్‌కట్ ద్వారా సముద్రంలో కలుస్తుంది. = అయితే దశాబ్దాల క్రితం నిర్మించిన ఈ టన్నెల్స్ ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకున్నాయి. ఈ టన్నెల్స్ అన్నంటిలో ప్రధానమైంది కారంచేడు-కుంకలమర్రు మధ్యలో ఉంది. దీనిగుండా సంతమాగులూరు, యద్దనపూడి, పర్చూరు మండలాల్లోని మురుగు, వరదనీరు ప్రవహిస్తుంది. దాన్ని నాటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అంచనావేసి నిర్మించారు. అయితే ప్రస్తుతం ఎన్నో రెట్లు అధికంగా నీరు ప్రవహిస్తోంది. అండర్ టన్నెల్స్ వైశాల్యం సరిపోక మురుగునీరు పొలాలపైకి మళ్లుతోంది. = ఫలితంగా కారంచేడు, పర్చూరు, చీరాల మండలాల పరిధిలో వేల ఎకరాలు ఏటా ముంపునకు గురవుతూనే ఉన్నాయి. = అధికంగా వచ్చిన వరదనీటి వల్ల యూటీలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఎక్కడికక్కడ బీటలు వారాయి. ఏ క్షణాన అయినా కూలే ప్రమాదముంది. నిపుణుల అంచనాల ప్రకారం కారంచేడు టన్నెల్‌కు 2-3 టీఎంసీల నీరు వస్తుంది. బీటలు వారిన గోడలు కూలీనట్లయితే ఈ రెండు, మూడు టీఎంసీల వరద నీరు కొమ్మమూరు కాలువలో కలుస్తుందని రైతులు వాపోతున్నారు. = ఇదే జరిగితే కాలువ పూర్తిగా చిన్నాభిన్నమవడమే కాకుండా సమీపంలోని చీరాల, కారంచేడు ప్రాంతాలు సైతం మునిగిపోయే ప్రమాదముంది. = ఈ పెను విపత్తు అధికారులకు అర్థమవుతున్నా ముందస్తు చర్యలు తీసుకుంటున్న ఆనవాళ్లు కూడా కనిపించడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. = గత ఏడాది అక్టోబరులో వచ్చిన భారీ వరదలతో యూటీల వద్ద గోడలపైకి నీరు ప్రవహించింది. ఇంత వరకు ఇలాంటి పరిస్థితి చూడలేదని వృద్ధ రైతులు చెబుతున్నారు. = గోడలపైకి ప్రవహించిన వరదనీరు కొమ్మమూరు కాలువలోకి వచ్చాయి. ఈ ప్రవాహానికి కాలువకు పలుచోట్ల గండ్లు పడ్డాయి. ఇదే ప్రాంతంలో ఉన్న యూటీ గోడలు కూలిపోతే ప్రమాదం ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఈ విపత్తులను నివారించాలంటే అధికారులు వెంటనే తగు జాగ్రత్తలు పాటించాలని రైతులు కోరుతున్నారు. తొలగని అవరోధాలు.. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వరద ముంపు ప్రాంతాలను పరిశీలించేందుకు వచ్చినపుడు అప్పటి స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు, రైతులు కొమ్మమూరు కాలువ ఆధునికీకరణ పనులు చేపట్టాలని వేడుకున్నారు. దీంతో స్పందించిన వైఎస్ రూ.196 కోట్లు మంజూరు చేశారు. కానీ తరువాత వచ్చిన ప్రభుత్వం, పనులు నిర్వహించాల్సిన కాంట్రాక్టర్లు నిర్లక్ష్యం వహించడంతో పనులకు అవరోధం ఏర్పడింది. ఏడు సంవత్సరాలు పూర్తవుతున్నా ఆధునికీకరణ పనులు అటకెక్కాయి. యూటీల నూతన నిర్మాణం కలగానే ఉంది. ప్రమాదాలు మాత్రం రాకెట్ వేగంతో దూసుకొస్తున్నాయి. దీనికి అధికారులు, ప్రజాప్రతినిధులు ఏ మార్గం అన్వేషిస్తారో అని అన్నదాతలు ఆశగా ఎదురు చూస్తున్నారు.