ముంపు ముప్పు
కారంచేడు: వర్షాకాలం వచ్చిందంటే చాలు..చీరాల పట్టణం, కారంచేడు గ్రామాలతో పాటు వేల ఎకరాలు నీట మునిగే ప్రమాదం పొంచి ఉంటోంది. కారంచేడులోని అండర్ టన్నెల్ శిథిలావస్థకు చేరింది. మూడు దశాబ్దాల క్రితం నిర్మించిన ఈ అండర్ టన్నెల్ గోడలు పెద్దపెద్ద పగుళ్లతో కూలేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఈ టన్నెల్‌గుండా వెలుపలికి వచ్చే వరదనీరు రొంపేరు కుడి, ఎడమ కాలువల ద్వారా సముద్రంలో కలవాలి. ఏ క్షణమైనా ఆ అండర్ టన్నెల్ కూలేందుకు సిద్ధంగా ఉండటంతో వేల క్యూసెక్కుల నీరు కొమ్మమూరు కాలువలోకి చొచ్చుకొచ్చే ప్రమాదం పొంచి ఉంది.
= కొమ్మమూరు కాలువ జిల్లాలో కారంచేడు, పర్చూరు, చినగంజాం, చీరాల, వేటపాలెం, నాగులుప్పలపాడు మండలాల్లో సుమారు లక్ష ఎకరాలకు సాగునీరందిస్తుంది.
= ఈ కాలువ పరిధిలో అనేక ప్రాంతాల్లో అండర్ టన్నెల్స్ (యూటీ)ను నిర్మించారు. వీటిగుండా ఎగువ ప్రాంతం నుంచి వచ్చే వరద, మురుగునీరు...సాగు, తాగునీటిని సరఫరా చేసే కొమ్మమూరు కాలువలో కలవకుండా రొంపేరు ద్వారా సముద్రంలో కలుస్తుంది.
= కారంచేడు యూటీ వద్ద రొంపేరు రెండు కెనాల్స్‌గా విడిపోతుంది. లెఫ్ట్ కెనాల్ ఈపూరుపాలెం స్ట్రయిట్‌కట్ ద్వారా సముద్రంలో కలుస్తుంది. రైట్ కెనాల్ వేటపాలెం స్ట్రయిట్‌కట్ ద్వారా సముద్రంలో కలుస్తుంది.
= అయితే దశాబ్దాల క్రితం నిర్మించిన ఈ టన్నెల్స్ ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకున్నాయి. ఈ టన్నెల్స్ అన్నంటిలో ప్రధానమైంది కారంచేడు-కుంకలమర్రు మధ్యలో ఉంది. దీనిగుండా సంతమాగులూరు, యద్దనపూడి, పర్చూరు మండలాల్లోని మురుగు, వరదనీరు ప్రవహిస్తుంది. దాన్ని నాటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అంచనావేసి నిర్మించారు. అయితే ప్రస్తుతం ఎన్నో రెట్లు అధికంగా నీరు ప్రవహిస్తోంది. అండర్ టన్నెల్స్ వైశాల్యం సరిపోక మురుగునీరు పొలాలపైకి మళ్లుతోంది.
= ఫలితంగా కారంచేడు, పర్చూరు, చీరాల మండలాల పరిధిలో వేల ఎకరాలు ఏటా ముంపునకు గురవుతూనే ఉన్నాయి.
= అధికంగా వచ్చిన వరదనీటి వల్ల యూటీలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఎక్కడికక్కడ బీటలు వారాయి. ఏ క్షణాన అయినా కూలే ప్రమాదముంది. నిపుణుల అంచనాల ప్రకారం కారంచేడు టన్నెల్‌కు 2-3 టీఎంసీల నీరు వస్తుంది. బీటలు వారిన గోడలు కూలీనట్లయితే ఈ రెండు, మూడు టీఎంసీల వరద నీరు కొమ్మమూరు కాలువలో కలుస్తుందని రైతులు వాపోతున్నారు.
= ఇదే జరిగితే కాలువ పూర్తిగా చిన్నాభిన్నమవడమే కాకుండా సమీపంలోని చీరాల, కారంచేడు ప్రాంతాలు సైతం మునిగిపోయే ప్రమాదముంది.
= ఈ పెను విపత్తు అధికారులకు అర్థమవుతున్నా ముందస్తు చర్యలు తీసుకుంటున్న ఆనవాళ్లు కూడా కనిపించడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.
= గత ఏడాది అక్టోబరులో వచ్చిన భారీ వరదలతో యూటీల వద్ద గోడలపైకి నీరు ప్రవహించింది. ఇంత వరకు ఇలాంటి పరిస్థితి చూడలేదని వృద్ధ రైతులు చెబుతున్నారు.
= గోడలపైకి ప్రవహించిన వరదనీరు కొమ్మమూరు కాలువలోకి వచ్చాయి. ఈ ప్రవాహానికి కాలువకు పలుచోట్ల గండ్లు పడ్డాయి. ఇదే ప్రాంతంలో ఉన్న యూటీ గోడలు కూలిపోతే ప్రమాదం ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఈ విపత్తులను నివారించాలంటే అధికారులు వెంటనే తగు జాగ్రత్తలు పాటించాలని రైతులు కోరుతున్నారు.
తొలగని అవరోధాలు..
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వరద ముంపు ప్రాంతాలను పరిశీలించేందుకు వచ్చినపుడు అప్పటి స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు, రైతులు కొమ్మమూరు కాలువ ఆధునికీకరణ పనులు చేపట్టాలని వేడుకున్నారు. దీంతో స్పందించిన వైఎస్ రూ.196 కోట్లు మంజూరు చేశారు. కానీ తరువాత వచ్చిన ప్రభుత్వం, పనులు నిర్వహించాల్సిన కాంట్రాక్టర్లు నిర్లక్ష్యం వహించడంతో పనులకు అవరోధం ఏర్పడింది. ఏడు సంవత్సరాలు పూర్తవుతున్నా ఆధునికీకరణ పనులు అటకెక్కాయి. యూటీల నూతన నిర్మాణం కలగానే ఉంది. ప్రమాదాలు మాత్రం రాకెట్ వేగంతో దూసుకొస్తున్నాయి. దీనికి అధికారులు, ప్రజాప్రతినిధులు ఏ మార్గం అన్వేషిస్తారో అని అన్నదాతలు ఆశగా ఎదురు చూస్తున్నారు.