Chirala Town
-
కడుపుకోత మిగిల్చి వెళ్తారా.. మాకు దిక్కెవరు..
స్నేహం గుండె బలం.. మనసుకు ధైర్యం.. త్యాగానికి ప్రతిఫలం.. జీవితం తుది ఘడియలోనూ దాని విలువ ఆణిముత్యం. ముగ్గురు స్నేహితులు ఇప్పుడు అమరులయ్యారు. బతికుండగానే కాదు చావు కూడా మమ్మల్ని వేరు చేయలేదని నిరూపించారు. వారి పేర్లు స్నేహానికి గుర్తుగా ఎప్పటికీ నిలిచి ఉంటాయి. చీరాల టౌన్: ఎదురు చూపులు నిరాశను మిగిల్చాయి. బతికి వస్తారునుకున్న కన్నవారి నమ్మకం మోడిబారింది. ముగ్గురు స్నేహితులు మృతదేహాలను చూసిన గవినివారిపాలెం శోకసంద్రంలో మునిగిపోయింది. మూడురోజల క్రితం యువకులు బాపట్ల కొత్త ఓడరేవు తీరంలో గల్లంతు కాగా సురేష్ (23) మృతదేహం శనివారం సాయంత్రం బాపట్ల తీరానికి కొట్టుకొచ్చింది. ఆర్మీ జవాన్ రామకృష్ణ (24), వల్లు బ్రహ్మయ్య (23) మృతదేహాలు ఆదివారం బాపట్ల రూరల్ పరిధిలోని కొత్త ఓడరేవు తీరానికి చేరాయి. బాపట్ల రూరల్ పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం బాపట్ల ఏరియా వైద్యశాలకు తరలించారు. మిన్నంటిన రోదనలు ప్రాణ మిత్రులు రామకృష్ణ, బ్రహ్మయ్య, సురేష్‌ల మరణం మూడు కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. మృతదేహాలను పోస్టుమార్టం అనంతరం స్వగ్రామం గవినివారిపాలెంకు తీసుకువచ్చారు. ఆర్మీ జవాను రామకృష్ణకు నెల క్రితమే వివాహం జరగ్గా సెలవుల అనంతరం ఆదివారం విధుల్లో చేరాల్సి ఉంది. కానీ విగతజీవిగా పడి ఉండటంతో తనను ఒంటరి చేసి వెళ్లిపోయావా అంటూ రామకృష్ణ భార్య గాయత్రి గుండెలవిసేలా రోదించింది. అండగా ఉంటాడనుకున్న కుమారులు అర్ధాంతరంగా చనిపోవడంతో ఇక తమకు దిక్కెవరు.. మాకు కడుపుకోత మిగిల్చి వెళ్తారా...అంటూ బ్రహ్మయ్య, సురేష్ కుటుంబ సుభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. మృతదేహాలు దెబ్బతినడంతో అంత్రక్రియలను త్వరగా పూర్తి చేశారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, గ్రామస్తులు కన్నీటి వీడ్కోలు పలికారు. అండగా ఉంటాం ముగ్గురు ఒకేసారి తనువు చాలించడం బాధాకరమని శాసన సభ్యుడు కరణం బలరామకృష్ణమూర్తి అన్నారు. బాపట్ల ఏరియా వైద్యశాల వద్ద మృతదేహాలను పరిశీలించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అధైర్యపడవద్దని అండగా ఉంటామని హామీ ఇచ్చారు. సంఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. మాజీమంత్రి పాలేటి రామారావు, నాయకులు నివాళులర్పించారు. -
మహిళలు సీరియల్స్ చూసి ఆనందించాలి: లోకేష్
చీరాల: మొదటిసారి నియోజకవర్గానికి వచ్చిన మంత్రి లోకేష్ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ అభ్యర్థన మేరకు రూ.25 కోట్ల నిధులతో సీసీ రోడ్లు నిర్మానానికి నిధులు కేటాయిస్తానని హామీ ఇచ్చారు. కొత్తపేటలో జరిగిన బహిరంగ సభలో ఎమ్మెల్యే ఆమంచి మాట్లాడుతూ నియోజకవర్గంలో 225 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణాలు జరగలేదని అందులో చీరాల మండలానికి రూ.10 కోట్లు, వేటపాలెం మండలానికి రూ.15 కోట్లు కేటాయించాలని కోరారు. దీనిపై మంత్రి స్పందిస్తూ తన పర్యటన ముగింపునకు కొద్దిరోజుల క్రితమే చీరాల నియోజకవర్గానికి బీటీ రోడ్లు నిర్మాణానికి రూ. 10 కోట్లు కేటాయించానని, కొద్ది రోజుల్లో రూ.15 కోట్లు కేటాయించి 225 కిలో మీటర్ల రోడ్డు నిర్మాణాలు పూర్తి చేస్తానని లోకేష్ హామీ ఇచ్చారు. రామాపురంలో జరిగిన సభలో లోకేష్ మాట్లాడుతూ మత్య్సకారుల సంక్షేమానికే టీడీపీ ప్రభుత్వం పాటు పడుతోందని, మత్య్సకారులందరికీ డీజిల్ సబ్సిడీ అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. 150 మందికి ఇళ్ల స్థలాలు, సీసీ రోడ్లు, ముఖద్వారం ఏర్పాటు చేస్తానన్నారు. 24 గంటలు కరెంట్ ఇస్తున్నామని అందుకే సీరియల్స్ చూసి ఆనందంగా ఉండాలంటూ మహిళలకు సూచించారు. 2020 నాటికి రాష్ట్ర అబభివృద్ధిలో అగ్రభాగాన నిలిపి అంగన్ వాడీ భవనాలు, ఎల్ఈడీ భవనాలు, సీసీ రోడ్లు నిర్మించి ఇస్తామన్నారు. దిక్కులేని రాష్ట్రానికి చంద్రబాబే పెద్ద దిక్కు అని సభలో లోకేష్ వాఖ్యానించారు. రైతు రుణమాఫీకి నియోజకవర్గానికి రూ.1.30 కోట్లు విడుదల చేశామన్నారు. హార్బర్ రాదు.. ‘కేంద్రం, రాష్ట్రాన్ని మోసం చేసింది..రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా వేధించింది. మత్య్సకారుల చిరకాల వాంఛ అయిన హార్బర్ నిర్మాణానికి నిధులు ఇవ్వదు. నీతి ఆయోగ్ పథకం ఒట్టిదే’ అని మంత్రి ఆదినారాయణ రెడ్డి అన్నారు. వేటపాలెం మండలం రామాపురంలో జరిగిన మత్య్సకారుల ముఖాముఖి కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధికి సీఎం 11 గంటలు కష్టపడుతున్నారని, మత్య్సకారుల సంక్షేమానికి టీడీపీ కృషి చేస్తుందన్నారు. మత్య్సకారులకు ముఖ్యమైన హార్బర్ నిర్మాణం చేపట్టాలని ఎమ్మెల్యే ఆమంచి అడుగగా మంత్రి ఆదినారాయణ మాత్రం కేంద్రం హార్బర్ నిర్మాణానికి నిధులు ఇవ్వదు....సాగర్ మాల అంతా బూటకం అని వాఖ్యానించారు. డబ్బులు, పెట్రోల్ ఫ్రీ మొదటిసారి నియోజకవర్గ పర్యటనకు చీరాలకు వచ్చిన మంత్రి లోకేష్ పర్యటనలో తన ఓటు బ్యాంకును చూపించుకోవడానికి నియోజకవర్గ ప్రజాప్రతినిధి గ్రామాల నుంచి జన సమీకరణ చేశారు. ప్రతి గ్రామానికి 4 నుంచి 6 ప్రైవేటు స్కూళ్ల బస్సులను ఏర్పాటు చేయడంతో పాటు బైక్ ర్యాలీతో స్వాగతం పలికించారు. టూవీలర్‌కు 2 లీటర్ల పెట్రోల్, డబ్బులు, పార్ట స్టికర్లు పంపిణీ చేశారు. ఆమంచి వర్సెస్ కలెక్టర్ చీరాల: మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా ప్రారంభించాల్సిన కొత్తపేట జెడ్పీ హైస్కూల్ ప్రారంభానికి నోచుకోలేదు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే ఆమంచి మధ్య వాగ్వాదం జరిగింది. హైస్కూల్ నిర్మించిన స్థల వివాదం కోర్టులో ఉన్న నేపథ్యంలో మంత్రి లోకేష్ ప్రారంభించకుండానే వెనుదిరిగి వెళ్లారు. అసలు కొత్తపేట హైస్కూల్ ప్రారంభానికే వచ్చినప్పటికీ కలెక్టర్ సూచనల మేరకు మంత్రి లోకేష్ వెనుతిరిగారు. ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కొత్తపేటలో హైస్కూల్ నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కలెక్టర్, ఇతర అధికారుల సహకారంతో రూ.2.20 కోట్ల అంచనాలతో కేవలం 50 రోజుల్లోనే నూతన భవంతులు నిర్మించారు. ఈ స్కూల్లో బస్సు సౌకర్యం, విద్యార్థులకు సైకిళ్లు, మధ్యాహ్న భోజనం, డైనింగ్ హాల్, మినరల్ వాటర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. పగలు, రాత్రి తేడా లేకుండా స్కూల్ నిర్మాణం చేశారు. అయితే కొత్తపేట హైస్కూల్ నిర్మించిన స్థలం ది ఐఎల్టీడీ కోపరేటివ్ సొసైటీకి చెందింది. అందులో కార్మికులు కొందరికి పట్టాలు ఇచ్చి రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు. కాగా ఇదే స్థలంలో హైస్కూల్ నిర్మాణం చేపట్టడంతో కొందరు హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యవహారం కోర్టులో కేసు నడుస్తుండగా స్టే కూడా ఇచ్చారు. ఈ పరిస్థితుల్లో చీరాల పర్యటనకు వచ్చిన నారా లోకేష్ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఇంటికి అల్పాహారానికి వెళ్లారు. లోకేష్‌తో పాటుగా కొందరు ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులున్నారు. ఇక్కడ సమస్యను కలెక్టర్ వినయ్‌చంద్ లోకేష్‌కు వివరించారు. దీనిపై ఆగ్రహం చెందిన ఆమంచి.. కలెక్టర్‌తో విభేందించారు. ఉదయం 8 గంటలకే మంత్రి లోకేష్‌తో స్కూల్ విద్యార్థులు, తల్లిదండ్రులకు ముఖాముఖి అన్నారు. దీంతో విద్యార్థులు మధ్యాహ్నం వరకు వేచి చూశారు. చివరకు పాఠశాల ప్రారంభం కానీ, ముఖాముఖి లేకపోవడంతో తీవ్ర నిరాశకు లోనయ్యారు. -
హోదా పోరు చంద్రబాబుదా? : వైఎస్ జగన్
సాక్షి, చీరాల : భారతీయుల ఉక్కుపిడికిలికి జడిసిన బ్రిటిష్ వాడు.. పోతుపోతూ ‘ఇది నేనిచ్చిన స్వాతంత్ర్యం’ అంటే ఎలా ఉండేదో సరిగ్గా చంద్రబాబు నాయుడి తీరు అలా ఉందని వైఎస్ జగన్ అన్నారు. హోదా విషయంలో నాలుగేళ్లపాటు రోజుకో నాటకమాడిన ముఖ్యమంత్రి.. ఇప్పుడు ప్రజాభీష్టానికి తలొగ్గక తప్పలేదని, అయినా సరే, తానే హోదా పోరాటం చేశానని చెప్పుకోవడం ఆయన సిగ్గుమాలినతనానికి నిదర్శనమని మండిపడ్డారు. ఇప్పటికైనా హోదా మాటెత్తిన టీడీపీ.. ‘కేంద్రంపై అవిశ్వాసం తీర్మానం’లో కలిసి రావాలని పిలుపునిచ్చారు. 108వ రోజు ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా ప్రకాశం జిల్లా చీరాల పట్టణం క్లాక్‌టవర్ సెంటర్లో బహిరంగ సభను ఉద్దేశించి వైఎస్ జగన్ మాట్లాడారు. బాబుకు ఆస్కార్ అవార్డు దక్కేది : ‘‘నాలుగేళ్లుగా అన్యాయమైన పాలనే చేస్తున్నాడు. కనీసం మన రాష్ట్రానికి రావాల్సిన హక్కులు సాధించారా అంటే అదీలేదు. ప్రత్యేక హోదాను చంద్రబాబు కేంద్రం దగ్గర తాకట్టుపెట్టాడు. హోదా ఉంటేనే పరిశ్రమలు, రాయితీలు వస్తాయి.. తద్వారా పెద్ద సంఖ్యలో యువతకు ఉద్యోగాలు వస్తాయి. కానీ హోదాపై బాబువి ఎన్ని డ్రామాలో మీరంతా చూస్తున్నారు. మొన్న అరుణ్ జైట్లీ.. పాతపాటే పాడితే.. చంద్రబాబు కొత్త నాట్యం చేశారు. 2015లోనే జైట్లీ తెగేసి చెప్పినప్పుడే.. బాబు తన మంత్రులతో రాజీనామాలు చేయించి ఉంటే.. ఈ పాటికి హోదా వచ్చేఉండేది. నాలుగేళ్లపాటు మంత్రి పదవులు అనుభవించి.. ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ప్లేటు ఫిరాయించారు. సరే ఇప్పటికైనా సరిగా పోరాడతారా అంటే అదీ లేదు! మంత్రి పదవులకు రాజీనామా చేస్తారట.. ఎన్డీలో మాత్రం కొనసాగుతూనేఉంటారట!, ఇక అసెంబ్లీలోనైతే బీజేపీ-టీడీపీలు ఒకరిపై ఒకరు పొగడ్తలు కురిపించుకుంటారు. పార్లమెంట్లో అవిశ్వాసం పెడదాం రమ్మంటే మాత్రం స్పందించడు. రాష్ట్రానికి రాష్ట్రమే రాజీనామాలు చేస్తే కేంద్రంలో తప్పక కదలిక వస్తుంది. కానీ ఆ పెద్దమనిషికి చిత్తశుద్ధిలేదు. ఇటీవల ఉత్తమ నటులకు ఇటీవలే ఆస్కార్ అవార్డులు దక్కాయి. పాపం వాళ్లకు మన చంద్రబాబు కనిపించలేదు. నాలుగేళ్లుగా ఆంధ్రప్రదేశ్‌లో ఆయన ఆడుతున్న నాటకాలకు ఖచ్చితంగా ఆస్కార్ అవార్డు దక్కేది’’ అని జగన్ చమత్కరించారు. వైఎస్ జగన్ ఇంకా ఏం మాట్లాడారంటే.. బాబు పాపాల పాలన : ►పక్కనే తెలంగాణ, కర్ణాటక, తమిళనాడుల్లో పెట్రోల్ ధరలకంటే ఏపీలో రూ.7 రూపాయలు అదనంగా వసూళ్లు చేస్తున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా జనాన్ని చంద్రబాబు దోచుకుంటున్నాడు. ►అధికారంలోకి రాగానే బెల్టుషాపులు రద్దుచేస్తానన్నాడు.. ఇప్పుడేమో ఊరూరా మద్యాన్ని ఏరులై పారిస్తున్నాడు. ఫోన్ కొడితే మందు బాటిల్ తీసుకొచ్చే స్థాయిలో బాబు హైటెక్ పాలన సాగుతోంది. ►నాలుగేళ్ల కిందట కరెంటు బిల్లు మహా అయితే రూ.100 వచ్చేది. ఇప్పుడు సామాన్యుడికి కూడా షాకులిస్తున్నారు. కరెంటు బిల్లులు తగ్గిస్తానన్న ఆ పెద్దమనిషే మూడుసార్లు ధరలు పెంచారు. ►బాబుగారి హయాంలో మూడుసార్లు ఆర్టీసీ టికెట్ ధరలు పెరిగాయి. పండుగలప్పుడైతే మరీ దారుణమైన దోపిడీ. కొత్త సినిమాల మాదిరి ఆర్టీసీ టికెట్లను బ్లాక్‌లో అమ్ముకుంటోందీ ప్రభుత్వం. ►ఒకప్పుడు రేషన్ దుకాణంలో బియ్యంతోపాటు నిత్యావసరాలన్నీ రూ.185కే ప్రజలకు అందేవి. ప్రస్తుతం బాబుగారు బియ్యం తప్ప ఏమీ ఇయ్యట్లేదు. వేలిముద్రల సాకుతో చాలా మందికి అదికూడా ఇవ్వట్లేదు. ►వ్యవసాయ రుణాలు, డ్వాక్రా చెల్లెమ్మలు, చేనేత సోదరుల రుణాలు రద్దు కావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్నారు.. కానీ ఇవాళ బ్యాంకుల నుంచి నోటీసులు వస్తున్నాయి. గత ప్రభుత్వాలు బ్యాంకులకే వడ్డీలు ఇచ్చేవి.. ఇప్పుడా విధానాన్ని ఎత్తేయడంతో రుణదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ►జాబు రావాలంటే బాబు రావాలన్నారు.. ప్రతి ఇంటికీ తన సంతకంతో లేఖలు పంపారు.. ఉద్యోగం రాకుంటే నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఆయన అధికారంలోకి వచ్చి 47 నెలలు పూర్తైంది. ఆ లెక్కన ప్రతి ఇంటికీ 94 వేలదాకా పడ్డాడు. ఎప్పుడైనా చంద్రబాబు ఇటొస్తే.. మా డబ్బులేవని నిలదీయండి. ►అబద్ధాలు, మోసాలపైనే సాగిన చంద్రబాబు పాలనలో.. అవినీతి మాత్రం చాలా బాగా జరిగింది. మట్టి నుంచి ఇసుక దాకా, బొగ్గు నుంచి కరెంటు కొనుగోళ్లదాకా, రాజధాని మొదలు గుడి భూములదాకా అన్నీ కొల్లగొట్టారు. ►సంపాదించిన డబ్బులు అరగక.. వేరే పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలుచేశాడు. వాళ్లను తన పార్టీ గుర్తుపైన పోటీ చేయించే దమ్ము,ధైర్యం కూడా లేదీ పెద్దమనిషికి! ►దేశచరిత్రలోగానీ, రాష్ట్ర చరిత్రలోగానీ.. నల్లధనాన్ని ఇస్తూ అడ్డంగా దొరకిపోయిన ముఖ్యమంత్రిని ఇంతకుముందు చూశారా? ఆ ఘనత చంద్రబాబుదే. ►గవర్నమెంట్ ఉద్యోగి దగ్గర నల్లధనం దొరికితే ఉద్యోగంలోనుంచి తొలగిస్తారు. అలాంటిది ఈ పెద్ద మనిషి సీఎంగా ఉండటానికి అర్హుడా? అని ప్రశ్నిస్తున్నా. ►పైన ముఖ్యమంత్రి.. గ్రామస్తాయిలో జన్మభూమి కమిటీలు పందికొక్కుల్లా విచ్చలవిడిగా ప్రజాధనాన్ని దోచుకుంటున్నాయి. మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే.. : ►రాబోయే ఎన్నికల్లో ప్రజల ఆశీర్వాదంతో ఏర్పాటుకానున్న ప్రజా ప్రభుత్వం ఏమేమి చెయ్యబోతున్నదో ‘నవరత్నాల’ ద్వారా ఇప్పటికే ప్రకటించాం. అందులో పేద పిల్లల చదువులు, పెన్షన్ల అంశాలను మరొకసారి గుర్తుచేసుకుందాం. ►పిల్లలు ఇంజనీరింగో, మెడిసినో చదవాలంటే లక్షల ఫీజు కట్టాలి. చంద్రబాబు రూ.30 వేలిచ్చి సరిపెడుతున్నారు. అదే మన ప్రభుత్వం వస్తే పిల్లల చదువులకు అయ్యే మొత్తం ఖర్చును ప్రభుత్వమే భరిస్తుంది. ►విద్యార్థులు హాస్టళ్లలో ఉండటానికి వీలుగా మెస్‌చార్జి కింద ఏటా రూ.20 వేలు చెల్లిస్తాం ►అప్పులబారినపడి ఏ తల్లిదండ్రీ పిల్లల్ని స్కూలుకు పంపించని పరిస్థితి రావద్దు. అందుకే పిల్లల్ని బడికి పంపే ప్రతి తల్లికి నెల నెలా రూ.15 వేలు అందిస్తాం. ►అవ్వా, తాతలకు పెన్షన్‌ను రూ.2 వేలకు పెంచుతాం. ►వృత్తి పనివారు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 45 ఏళ్లకే పెన్షన్ అందించే ఏర్పాటుచేస్తాం. ఎన్నికలవేళ ఆలోచించండి.. చెడిపోయిన రాజకీయ వ్యవస్థను మార్చాలంటే.. మోసాలు చేసే, అబద్ధాలు చెప్పే చంద్రబాబులాంటి వాడిని పొరపాటున కూడా క్షమించొద్దు. ఒక నాయకుడు మైక్ పట్టుకుని ఒక మాట చెబితే, దాన్ని నిలబెట్టుకోలేని రోజున రాజీనామాలు చేసే వెళ్లిపోయే పరిస్థితి రావాలి. ఆ మార్పు నా ఒక్కడివల్లేకాదు.. మీ అందరి సహకారంతోనే సాధ్యమవుతుంది -
చీరాలలో కార్డన్‌సర్చ్
సాక్షి, చీరాల: ప్రకాశం జిల్లా చీరాల పట్టణంలో పోలీసులు సోమవారం వేకువజామున కార్డన్ సర్చ్ నిర్వహించారు. రామ్‌నగర్‌లో నిర్వహించిన తనిఖీల్లో మొత్తం 21 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే పత్రాలు లేని 14 బైకులు, 2 ఆటోలను పోలీసులు సీజ్ చేశారు. -
అనుమానమే.. పెనుభూతమై!
సాక్షి, చీరాల రూరల్: చిన్న నాటు నుంచి వారిద్దరు స్నేహితులు. ఆ తర్వాత అది ప్రేమగా మారింది. ఇంతో అనుమానం పెనుభూతమై యువతి హత్యకు దారి తీసింది. చిన్ననాటి స్నేహాన్ని సైతం మరచిన అతడు ఆమెను నమ్మించి ఇంటికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడి మంచానికి కట్టేసి అత్యంత పాశవికంగా గొంతుకోసి చంపాడు. ఈ కేసులో ప్రధాన నిందితుడితో పాటు అతనికి సహకరించిన కుటుంబ సభ్యులను వేటపాలెం పోలీసులు అరెస్టు చేశారు. శనివారం రాత్రి కొత్తపేటలోని తన కార్యాలయంలో డీఎస్పీ డాక్టర్ ప్రేమ్ కాజల్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి నిందితుల వివరాలు వెల్లడించారు. డీఎస్పీ కథనం ప్రకారం.. వేటపాలెం జీవరక్ష నగర్‌కు చెందిన వల్లెపు గోపీచంద్, పాత చీరాలకు చెందిన శవనం లక్ష్మీమణితేజ చిన్ననాటి నుంచి స్నేహితులు. ఆ పరిచయం ప్రేమగా మారింది. మణితేజ ఎంటెక్ చదువుతూ చీరాలలోని టీవీఎస్ షోరూంలో పనిచేస్తుండగా గోపిచంద్ ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆమెను అనుమానించడం ప్రారంభించాడు. ఈ క్రమంలోనే తన ఆలోచనలను తల్లిదండ్రులతో పాటు అక్క చెల్లెళ్లతో పంచుకున్నాడు. అందరూ కలిసి ఆమెను అంతమొందించాలని నిర్ణయించుకున్నారు. పథకం ప్రకారం రామానగర్‌లోని అతని మేనమామ ఇంట్లో ఆమెను హత్య చేసేందుకు పథకం పన్నాడు. ఆమెను రామానగర్ తీసుకెళ్లాడు. తొలుత ఆమెపై లైంగిక దాడి చేసి అనంతరం రెండు చేతులూ మంచానికి కట్టేసి అత్యంత పాశవికంగా పీక కోసి హతమార్చాడు. ఆమె శరీరంపై ఉన్న బంగారు చైను, ఉంగరం, గాజులతో పరారయ్యాడు. గోపిచంద్‌తో అక్కడి నుంచి తల్లిదండ్రులు జ్యోతి, శ్రీనివాసరావు, చెల్లెళ్లు లావణ్య, జ్యోత్స్నలను తీసుకుని ముందుగా బాపట్ల Ððవెళ్లాడు. అక్కడి నుంచి కర్ణాటక రాష్టంలోని బీదర్, హుబ్లీ అనేక ప్రాంతాల్లో తిరిగి పేర్లు మార్చుకుని వివిధ రకాల పనుల్లో నిమగ్నమయ్యారు. మూడు నెలలుగా పోలీసులు బృందాలుగా ఏర్పడి కేసును దర్యాప్తు చేపట్టారు. చివరకు నిందితులను అదుపులోకి తీసుకుని కేసును ఛేదించారు. మృతురాలి వద్ద తీసుకెళ్లిన బంగారు ఆభరణాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసును ఛేదించిన రూరల్ సీఐ భక్తవత్సలరెడ్డి, వేటపాలెం ఎస్ఐ వెంకట కృష్ణయ్య, ఏఎస్ఐలు శ్రీనివాసరావు, ప్రసాద్, కానిస్టేబుళ్లు, హోంగార్డులకు ఎస్పీ రివార్డులు ప్రకటించినట్లు డీఎస్పీ ప్రేమ్‌కాజల్ వివరించారు. -
ముంపు ముప్పు
కారంచేడు: వర్షాకాలం వచ్చిందంటే చాలు..చీరాల పట్టణం, కారంచేడు గ్రామాలతో పాటు వేల ఎకరాలు నీట మునిగే ప్రమాదం పొంచి ఉంటోంది. కారంచేడులోని అండర్ టన్నెల్ శిథిలావస్థకు చేరింది. మూడు దశాబ్దాల క్రితం నిర్మించిన ఈ అండర్ టన్నెల్ గోడలు పెద్దపెద్ద పగుళ్లతో కూలేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఈ టన్నెల్గుండా వెలుపలికి వచ్చే వరదనీరు రొంపేరు కుడి, ఎడమ కాలువల ద్వారా సముద్రంలో కలవాలి. ఏ క్షణమైనా ఆ అండర్ టన్నెల్ కూలేందుకు సిద్ధంగా ఉండటంతో వేల క్యూసెక్కుల నీరు కొమ్మమూరు కాలువలోకి చొచ్చుకొచ్చే ప్రమాదం పొంచి ఉంది. = కొమ్మమూరు కాలువ జిల్లాలో కారంచేడు, పర్చూరు, చినగంజాం, చీరాల, వేటపాలెం, నాగులుప్పలపాడు మండలాల్లో సుమారు లక్ష ఎకరాలకు సాగునీరందిస్తుంది. = ఈ కాలువ పరిధిలో అనేక ప్రాంతాల్లో అండర్ టన్నెల్స్ (యూటీ)ను నిర్మించారు. వీటిగుండా ఎగువ ప్రాంతం నుంచి వచ్చే వరద, మురుగునీరు...సాగు, తాగునీటిని సరఫరా చేసే కొమ్మమూరు కాలువలో కలవకుండా రొంపేరు ద్వారా సముద్రంలో కలుస్తుంది. = కారంచేడు యూటీ వద్ద రొంపేరు రెండు కెనాల్స్‌గా విడిపోతుంది. లెఫ్ట్ కెనాల్ ఈపూరుపాలెం స్ట్రయిట్‌కట్ ద్వారా సముద్రంలో కలుస్తుంది. రైట్ కెనాల్ వేటపాలెం స్ట్రయిట్‌కట్ ద్వారా సముద్రంలో కలుస్తుంది. = అయితే దశాబ్దాల క్రితం నిర్మించిన ఈ టన్నెల్స్ ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకున్నాయి. ఈ టన్నెల్స్ అన్నంటిలో ప్రధానమైంది కారంచేడు-కుంకలమర్రు మధ్యలో ఉంది. దీనిగుండా సంతమాగులూరు, యద్దనపూడి, పర్చూరు మండలాల్లోని మురుగు, వరదనీరు ప్రవహిస్తుంది. దాన్ని నాటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అంచనావేసి నిర్మించారు. అయితే ప్రస్తుతం ఎన్నో రెట్లు అధికంగా నీరు ప్రవహిస్తోంది. అండర్ టన్నెల్స్ వైశాల్యం సరిపోక మురుగునీరు పొలాలపైకి మళ్లుతోంది. = ఫలితంగా కారంచేడు, పర్చూరు, చీరాల మండలాల పరిధిలో వేల ఎకరాలు ఏటా ముంపునకు గురవుతూనే ఉన్నాయి. = అధికంగా వచ్చిన వరదనీటి వల్ల యూటీలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఎక్కడికక్కడ బీటలు వారాయి. ఏ క్షణాన అయినా కూలే ప్రమాదముంది. నిపుణుల అంచనాల ప్రకారం కారంచేడు టన్నెల్‌కు 2-3 టీఎంసీల నీరు వస్తుంది. బీటలు వారిన గోడలు కూలీనట్లయితే ఈ రెండు, మూడు టీఎంసీల వరద నీరు కొమ్మమూరు కాలువలో కలుస్తుందని రైతులు వాపోతున్నారు. = ఇదే జరిగితే కాలువ పూర్తిగా చిన్నాభిన్నమవడమే కాకుండా సమీపంలోని చీరాల, కారంచేడు ప్రాంతాలు సైతం మునిగిపోయే ప్రమాదముంది. = ఈ పెను విపత్తు అధికారులకు అర్థమవుతున్నా ముందస్తు చర్యలు తీసుకుంటున్న ఆనవాళ్లు కూడా కనిపించడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. = గత ఏడాది అక్టోబరులో వచ్చిన భారీ వరదలతో యూటీల వద్ద గోడలపైకి నీరు ప్రవహించింది. ఇంత వరకు ఇలాంటి పరిస్థితి చూడలేదని వృద్ధ రైతులు చెబుతున్నారు. = గోడలపైకి ప్రవహించిన వరదనీరు కొమ్మమూరు కాలువలోకి వచ్చాయి. ఈ ప్రవాహానికి కాలువకు పలుచోట్ల గండ్లు పడ్డాయి. ఇదే ప్రాంతంలో ఉన్న యూటీ గోడలు కూలిపోతే ప్రమాదం ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఈ విపత్తులను నివారించాలంటే అధికారులు వెంటనే తగు జాగ్రత్తలు పాటించాలని రైతులు కోరుతున్నారు. తొలగని అవరోధాలు.. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వరద ముంపు ప్రాంతాలను పరిశీలించేందుకు వచ్చినపుడు అప్పటి స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు, రైతులు కొమ్మమూరు కాలువ ఆధునికీకరణ పనులు చేపట్టాలని వేడుకున్నారు. దీంతో స్పందించిన వైఎస్ రూ.196 కోట్లు మంజూరు చేశారు. కానీ తరువాత వచ్చిన ప్రభుత్వం, పనులు నిర్వహించాల్సిన కాంట్రాక్టర్లు నిర్లక్ష్యం వహించడంతో పనులకు అవరోధం ఏర్పడింది. ఏడు సంవత్సరాలు పూర్తవుతున్నా ఆధునికీకరణ పనులు అటకెక్కాయి. యూటీల నూతన నిర్మాణం కలగానే ఉంది. ప్రమాదాలు మాత్రం రాకెట్ వేగంతో దూసుకొస్తున్నాయి. దీనికి అధికారులు, ప్రజాప్రతినిధులు ఏ మార్గం అన్వేషిస్తారో అని అన్నదాతలు ఆశగా ఎదురు చూస్తున్నారు. -
‘కూలి’పోతున్నారు!
నిప్పులవాన కురుస్తున్నట్లు మండుటెండ..సేద తీరుదామంటే కనుచూపు మేర లేని నీడ..తడారిపోయినా గొంతు తడుపుకునేందుకు కరువైన నీరు..ధారాళంగా కారుతున్న స్వేదం..కొలిమిలో కాల్చినట్లు ముట్టుకుంటే మండిపోయే పనిముట్లు..ఉపాధి కూలీలకు నిత్యం ఎదురవుతున్న సవాళ్లివి. పనిచేసే చోట కనీస వసతులు లేక వడదెబ్బకు గురైన ఆ బడుగు జీవులు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. పొట్టకూటి కోసం ఆరాటపడే పేదలు వాళ్లు. 40 డిగ్రీలకుపైగా ఎండ మండిపోతున్నా..పనిచేయలేక నీరసం వచ్చినా మట్టిపనిని వదలకుండా చేస్తుంటారు. ఇచ్చిన పని పూర్తిచేస్తేనే ఆ రోజు మస్టర్. లేకుంటే అరకొర కూలితో ఇంటిముఖం పట్టాల్సిందే. ఇదీ..ఉపాధి హామీ పథకం కింద పనిచేసే కూలీల పరిస్థితి. వలసలు నియంత్రించి, పనిలేని కూలీలకు ఉపాధి కల్పించేందుకు పనులు చేయిస్తున్నామన్న అధికార యంత్రాంగం వారిని మనుషుల్లా చూడటం లేదు. ఉపాధి పనులు చేసే చోటఉండాల్సిన వసతులివీ... ఎండలో నిర్విరామంగా ఉపాధి కూలీలు సేదతీరేందుకు పనిచేసే ప్రదేశానికి సమీపంలో షామియానాలు ఏర్పాటు చేయాలి.పనిప్రదేశంలో కూలీలకు సరిపడా మంచినీరు అందుబాటులో ఉంచాలి.పనిచేసేటప్పుడు ఎవరైనా గాయపడితే..తక్షణం వారికి ప్రథమ చికిత్స చేసేందుకు అవసరమైన దూది, బ్యాండేజ్, మందులు ఉండేలా ప్రథమ చికిత్స పెట్టెలు ఉంచాలి.కూలికి వచ్చిన మహిళల్లో ఐదుగురికి పసిపిల్లలు ఉంటే..వారి ఆలనాపాలనా చూసేందుకు కూలీలలో ఒకరిని ఆయాగా నియమించి వారికి మస్టర్ వేయాలి. జరుగుతోందిదీ.. నిబంధనల ప్రకారం ఉపాధి కూలీలకు కల్పించాల్సిన వసతులేవీ అందుబాటులో ఉండటం లేదు. సౌకర్యాల కల్పన పేరుతో లక్షలు ఖర్చు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నా..వాస్తవానికి అవేవీ కూలీల దరిచేరడం లేదు. ఎక్కడా పనిచేసే చోట షామియానాలు ఏర్పాటు చేయడం లేదు. ప్రథమ చికిత్స కిట్లు, మంచినీరూ అందుబాటులో ఉంచడం లేదు. దీంతో కనీస వసతులు లేక కూలీలు నానా అవస్థలు పడుతున్నారు. చీరాల మండలంలోని 8 పంచాయతీల్లో పంట కాలువల పూడికతీత పనులకు సాంకేతిక అనుమతి లభించింది. చీరాలనగర్, బుర్లవారిపాలెం, తోటవారిపాలెం, పిట్టువారిపాలెం, ఈపూరుపాలెం, కావూరివారిపాలెం, గవినివారిపాలెం, దేవినూతల గ్రామాల్లో ఎన్ఆర్ఈజీఎస్ పథకం కింద 1100 మంది ఉపాధి కూలీలు పనిచేస్తున్నారు. ప్రస్తుతం వ్యవసాయ సీజన్ ప్రారంభమవుతున్న తరుణంలో రైతులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు పంటకాల్వల పూడిక తీత పనులను చేపట్టారు. ఎక్కడా వారికి కావాల్సిన వసతులు కల్పించడం లేదు. పలుచోట్ల మహిళా కూలీలు మండుటెండలకు నీరసించి సొమ్మసిల్లుతున్నారు. వడదెబ్బకు గురై ప్రాణాలు కోల్పోయిన సంఘటనలూ జిల్లాలో అక్కడక్కడా చోటుచేసుకున్నాయి.ఉపాధి కూలీలు రోజూ ఉదయం 6.30 గంటల నుంచి 11.30 గంటల వరకు పనిచేస్తే రూ.149 కూలీగా చెల్లిస్తున్నారు. వసతులు కల్పించని చోట తాగునీరు కూలీలే తెచ్చుకోవాలంటూ అందుకోసం ఒక్కో కూలీకి రూ.5, షామియానాకు రూ.5 అందిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. కానీ వాస్తవానికి ఒక్కో కూలీకి వేతనంతో పాటు ఈ అలవెన్స్‌లు ఇవ్వడం లేదు. కూలీల సొమ్మును కూడా అధికారులే పంచుకుంటున్నారు. దీంతో కూలీలు కనీస వసతులు లేకుండానే పనిచేస్తూ అష్టకష్టాలు పడుతున్నారు. -
ప్రేమపేరుతో పైశాచికత్వం
చీరాల: ప్రేమపేరుతో ఓ మైనర్ బాలికను వలలో వేసుకుని ఆమెతో సన్నిహితంగా మెలిగిన దృశ్యాలను కెమెరాలో రహస్యంగా చిత్రీకరించి వాటిని ఇంటర్నెట్లో అప్లోడ్ చేయడంతో పాటు, స్నేహితుల సెల్ఫోన్లకు పంపిన మాజీ కౌన్సిలర్ పుత్రరత్నం పైశాచికత్వం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు.. గుంటూరు జిల్లా వేటపాలెం మండలంలోని గ్రామం నుంచి ఓ కుటుంబం పిల్లల చదువు నిమిత్తం చీరాల పట్టణానికి వచ్చి స్థిరపడింది. ఆ కుటుంబంలో ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న బాలిక(17)పై కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ కౌన్సిలర్ మూడో కుమారుడు జునైద్(25) కన్నుపడింది. ప్రేమపేరుతో మాయమాటలు చెప్పి బాలికను లోబరుచుకున్నాడు. ఆమెతో సన్నిహితంగా మెలిగిన దృశ్యాలను రహస్యంగా వీడియో చిత్రీకరించి ఇంటర్నెట్లో పెట్టడంతో పాటు, స్నేహితుల సెల్ఫోన్లకు సైతం పంపిచాడు. ఈ దారుణం జరిగి నెల రోజులు దాటింది. బాలిక తండ్రికి విషయం తెలియడంతో పోలీసులను ఆశ్రయించారు. చీరాల వన్‌టౌన్ పోలీసులు ఆ మృగాడిపై కేసు నమోదు చేశారు. నిందితుడు జునైద్ పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. బాలికను వైద్యపరీక్షల నిమిత్తం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. వన్‌టౌన్ సీఐ భీమానాయక్ మాట్లాడుతూ నిందితుడిపై నిర్భయ చట్టం, అత్యాచారం, సైబర్ నేరం కింద కేసులు నమోదు చేశామని, దర్యాప్తు జరుగుతోందని చెప్పారు.