‘కూలి’పోతున్నారు!
నిప్పులవాన కురుస్తున్నట్లు మండుటెండ..సేద తీరుదామంటే కనుచూపు మేర లేని నీడ..తడారిపోయినా గొంతు తడుపుకునేందుకు కరువైన నీరు..ధారాళంగా కారుతున్న స్వేదం..కొలిమిలో కాల్చినట్లు ముట్టుకుంటే మండిపోయే పనిముట్లు..ఉపాధి కూలీలకు నిత్యం ఎదురవుతున్న సవాళ్లివి. పనిచేసే చోట కనీస వసతులు లేక వడదెబ్బకు గురైన ఆ బడుగు జీవులు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.
పొట్టకూటి కోసం ఆరాటపడే పేదలు వాళ్లు. 40 డిగ్రీలకుపైగా ఎండ మండిపోతున్నా..పనిచేయలేక నీరసం వచ్చినా మట్టిపనిని వదలకుండా చేస్తుంటారు. ఇచ్చిన పని పూర్తిచేస్తేనే ఆ రోజు మస్టర్. లేకుంటే అరకొర కూలితో ఇంటిముఖం పట్టాల్సిందే. ఇదీ..ఉపాధి హామీ పథకం కింద పనిచేసే కూలీల పరిస్థితి. వలసలు నియంత్రించి, పనిలేని కూలీలకు ఉపాధి కల్పించేందుకు పనులు చేయిస్తున్నామన్న అధికార యంత్రాంగం వారిని మనుషుల్లా చూడటం లేదు.
ఉపాధి పనులు చేసే చోటఉండాల్సిన వసతులివీ...
ఎండలో నిర్విరామంగా ఉపాధి కూలీలు సేదతీరేందుకు పనిచేసే ప్రదేశానికి సమీపంలో షామియానాలు ఏర్పాటు చేయాలి.పనిప్రదేశంలో కూలీలకు సరిపడా మంచినీరు అందుబాటులో ఉంచాలి.పనిచేసేటప్పుడు ఎవరైనా గాయపడితే..తక్షణం వారికి ప్రథమ చికిత్స చేసేందుకు అవసరమైన దూది, బ్యాండేజ్, మందులు ఉండేలా ప్రథమ చికిత్స పెట్టెలు ఉంచాలి.కూలికి వచ్చిన మహిళల్లో ఐదుగురికి పసిపిల్లలు ఉంటే..వారి ఆలనాపాలనా చూసేందుకు కూలీలలో ఒకరిని ఆయాగా నియమించి వారికి మస్టర్ వేయాలి.
జరుగుతోందిదీ..
నిబంధనల ప్రకారం ఉపాధి కూలీలకు కల్పించాల్సిన వసతులేవీ అందుబాటులో ఉండటం లేదు. సౌకర్యాల కల్పన పేరుతో లక్షలు ఖర్చు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నా..వాస్తవానికి అవేవీ కూలీల దరిచేరడం లేదు. ఎక్కడా పనిచేసే చోట షామియానాలు ఏర్పాటు చేయడం లేదు. ప్రథమ చికిత్స కిట్లు, మంచినీరూ అందుబాటులో ఉంచడం లేదు. దీంతో కనీస వసతులు లేక కూలీలు నానా అవస్థలు పడుతున్నారు.
చీరాల మండలంలోని 8 పంచాయతీల్లో పంట కాలువల పూడికతీత పనులకు సాంకేతిక అనుమతి లభించింది. చీరాలనగర్, బుర్లవారిపాలెం, తోటవారిపాలెం, పిట్టువారిపాలెం, ఈపూరుపాలెం, కావూరివారిపాలెం, గవినివారిపాలెం, దేవినూతల గ్రామాల్లో ఎన్‌ఆర్‌ఈజీఎస్ పథకం కింద 1100 మంది ఉపాధి కూలీలు పనిచేస్తున్నారు. ప్రస్తుతం వ్యవసాయ సీజన్ ప్రారంభమవుతున్న తరుణంలో రైతులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు పంటకాల్వల పూడిక తీత పనులను చేపట్టారు. ఎక్కడా వారికి కావాల్సిన వసతులు కల్పించడం లేదు. పలుచోట్ల మహిళా కూలీలు మండుటెండలకు నీరసించి సొమ్మసిల్లుతున్నారు. వడదెబ్బకు గురై ప్రాణాలు కోల్పోయిన సంఘటనలూ జిల్లాలో అక్కడక్కడా చోటుచేసుకున్నాయి.ఉపాధి కూలీలు రోజూ ఉదయం 6.30 గంటల నుంచి 11.30 గంటల వరకు పనిచేస్తే రూ.149 కూలీగా చెల్లిస్తున్నారు. వసతులు కల్పించని చోట తాగునీరు కూలీలే తెచ్చుకోవాలంటూ అందుకోసం ఒక్కో కూలీకి రూ.5, షామియానాకు రూ.5 అందిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. కానీ వాస్తవానికి ఒక్కో కూలీకి వేతనంతో పాటు ఈ అలవెన్స్‌లు ఇవ్వడం లేదు. కూలీల సొమ్మును కూడా అధికారులే పంచుకుంటున్నారు. దీంతో కూలీలు కనీస వసతులు లేకుండానే పనిచేస్తూ అష్టకష్టాలు పడుతున్నారు.