ఖతార్ సమావేశంలో పాల్గొన్న వారు
ఆసియా-గల్ఫ్ వలసల కారిడార్ దేశాలలో వేతనాల చెల్లింపులపై ఉత్తమ ఆచరణపై ఖతార్ రాజధాని దోహాలో వలసలపై జరుగుతున్న సమావేశంలో మంగళవారం చర్చ జరిగింది. ముఖ్యంగా వేతనాల ఎగవేత, ఇతర వేతన సమస్యల పరిష్కార విధానాలపై చర్చ సాగింది. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ (ఐఓఎం), మైగ్రంట్ ఫోరం ఇన్ ఏసియా (ఎంఎఫ్ఏ) లు సంయుక్తంగా ఈనెల 13 నుంచి 15 వరకు మూడు రోజుల పాటు ఖతార్‌లో సమావేశాలు జరుగుతున్నాయి. దీనికి ఖతార్ ప్రభుత్వం అధికారిక ఆతిథ్యం ఇచ్చింది.
ఇందులో తెలంగాణ ఎమిగ్రంట్స్ వెల్ఫేర్ ఫోరం ప్రతినిధి, ప్రవాసి కార్మిక నాయకుడు స్వదేశ్ పరికిపండ్ల ఐక్యరాజ్య సమితి ప్రవాసి కార్మికులకు వేతన రక్షణ నిధి ఏర్పాటు, వలస కార్మికులను రక్షించడానికి కార్మికులను పంపే మూలస్థాన దేశాలు ఏవైనా విధానాలు, శాశ్వత పరిష్కార వ్యవస్థలను కలిగి ఉన్నాయా? అనే ప్రశ్నించారు. నష్టపోయిన కార్మికులను, విదేశాల నుంచి వాపస్ వచ్చిన వలస కార్మికుల రక్షణకోసం మూలస్థాన దేశాలు పునరావాసం, పునరేకీకరణ కోసం ఒక విధానం, శాశ్వత యంత్రాంగం కలిగి ఉండాలని స్వదేశ్ కోరారు. 32 సంవత్సరాల క్రితం 1990-91లో ఇరాక్ - కువైట్ గల్ఫ్ యుద్ధం కారణంగా లక్షలాది మంది వలసదారులు కువైట్ నుండి వారి స్వదేశాలకు తిరిగి పంపబడ్డారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అనుబంధ సంస్థ 'ది యునైటెడ్ నేషన్స్ కంపెన్సేషన్ కమిషన్' (పరిహార కమిషన్) కువైట్‌పై ఇరాక్ దాడికి సంబంధించి 52.4 బిలియన్ అమెరికన్ డాలర్ల విలువైన చెల్లింపులను పూర్తి చేసిందని స్వదేశ్ గుర్తు చేశారు.
అలాగే ప్రపంచ ఆర్థిక మాంద్యం, ఇరాక్, లిబియా, యెమెన్ లాంటి దేశాలలో యుద్ధ పరిస్థితులు, దివాళా తీసిన కంపెనీలను మూసివేయడం, ఇమ్మిగ్రేషన్ నిబంధనలు ఉల్లంఘించి, వీసా గడువు ముగిసిన వారు ఎలాంటి జరిమానా, జైలు శిక్షలు లేకుండా దేశం విడిచి వెళ్ళడానికి గల్ఫ్ దేశాల ప్రభుత్వాలు 4-5 ఏళ్లకు ఒకసారి క్షమాభిక్ష (అమ్నెస్టీ) ప్రకటించడం, కోవిడ్19 మహమ్మారి లాంటి విపత్తు వలన వలస కార్మికులను బలవంతంగా ఆయా దేశాల నుండి కట్టుబట్టలతో స్వదేశీలకు పంపించివేస్తున్నారని స్వదేశ్ పేర్కొన్నారు. ఇక ముందు కూడా ఇలా జరిగే అవకాశం ఉన్నందున ప్రభుత్వాలు తగిన రక్షణ చర్యలతో సన్నద్ధంగా ఉండాలని సూచించారు
ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖలో వేతన రక్షణ విభాగం అధినేత మహమ్మద్ సైద్ అల్ అజ్బా, ఖతార్ లోని ఫిలిప్పీన్ రాయబార కార్యాలయం కార్మిక అధికారి డాన్ ఆల్బర్ట్ ఫిలిప్ సి. పాన్‌కోగ్, ఫిలిప్పీన్ కేంద్రంగా పనిచేసే మైగ్రంట్ ఫోరం ఇన్ ఏసియా (ఎంఎఫ్ఏ) రీజనల్ కోఆర్డినేటర్ విలియం గోయిస్, ఖతార్‌లోని భారత రాయబార కార్యాలయం ఫస్ట్ సెక్రటరీ సుమన్ సొంకర్, ఖతార్‌లోని హమద్ బిన్ ఖలీఫా యూనివర్సిటీ ప్రొఫెసర్ డా.రే జురీడిని పానెల్ ప్రవాసుల వేతన సమస్యలపై ప్రసంగించారు. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (ఐఎల్ఓ) అరబ్ దేశాల వలస నిపుణుడు రిసార్డ్ చోలెవిన్స్కీ మోడరేటర్ గా వ్యవహరించారు.
వలస కార్మికుల వేతనాలపై కోవిడ్-19 ప్రభావం, దీనిక అధిగమించేందుకు తీసుకోవాల్సిన చర్యలుపై ప్యానల్ వక్తలు ప్రసంగించారు. అలాగే కోవిడ్19 మహమ్మారి సంక్షోభం కంటే ముందు గమ్యస్థాన గల్ఫ్ దేశాలు కార్మికులకు 'వేజ్ ప్రొటెక్షన్ సిస్టం' (వేతనాల భరోసా రక్షణ వ్యవస్థ) ఏర్పాటు చేయడానికి ప్రయోగాలు చేశాయి. వేతన చెల్లింపులను పర్యవేక్షించడం, అమలు చేయడం కోసం ప్రయత్నాలు చేశాయని వక్తలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment