సాక్షి, హైదరాబాద్: సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం ధర్మాజీపేట గ్రామానికి చెందిన జనగామ నర్సయ్య ఇటీవల బహ్రెయిన్‌లో మరణించారు. శనివారం బహ్రెయిన్ నుంచి హైదరాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న మృతదేహాన్ని గల్ఫ్ జేఏసీ నాయకులు, మృతుని కుటుంబ సభ్యులు కలిసి హైదరాబాద్‌లోని అమరవీరుల స్తూపం, గన్ పార్క్ వద్ద ఉంచి నివాళులు అర్పించారు.
గల్ఫ్ అమరులకు నివాళులు అర్పిస్తూ అరుణోదయ సాంస్కృతిక బృందం పాటలు పాడారు. గల్ఫ్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు గుగ్గిల్ల రవిగౌడ్, తెలంగాణ బీజేపీ గల్ఫ్ మిడిల్ ఈస్ట్ కన్వీనర్ నరేంద్ర పన్నీరు, తెలంగాణ గల్ఫ్ కాంగ్రెస్ అధ్యక్షులు సింగిరెడ్డి నరేష్ రెడ్డి, గల్ఫ్ జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగుల మురళీధర్ రెడ్డి, ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు స్వదేశ్ పరికిపండ్ల, సీఎస్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ చెన్నమనేని శ్రీనివాస రావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రసంగించిన గల్ఫ్ జేఏసీ నాయకులు రూ.500 కోట్ల వార్షిక బడ్జెట్‌తో గల్ఫ్ బోర్డుతో కూడిన సమగ్ర ప్రవాసీ విధానం ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి గత ఎనిమిది ఏళ్లలో 1,600 మంది తెలంగాణ కార్మికులు గల్ఫ్ దేశాలలో మృతి చెందారని, కేసీఆర్ ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి గల్ఫ్ మృతుని కుటుంబానికి రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు
Comments
Please login to add a commentAdd a comment