‘ఆలస్యం విషం, వేగమే అమృతం’.. దేశంలోని ప్రముఖ డెలివరీ స్టార్టప్స్ ఇదే మంత్రాన్ని జపిస్తున్నాయి. ఉదయాన్నే వంటింట్లో నుంచి ఘుమఘుమలు ఇంటిల్లాపాదిని పలకరిస్తుంటే కూరలోకి ఉప్పు లేకపోతే.. గాభరా పడాల్సిన పన్లేదు. స్మార్ట్‌ఫోన్‌లో ఆర్డర్ చేస్తే కుతకుతమని ఉడికేలోగా లవణం లావణ్యంగా ఇంటికి వచ్చేస్తుంది. ‘మాటకు పది నిమిషాలని అంటున్నాం కానీ, మా సగటు డెలివరీ సమయం ఎనిమిది నిమిషాల పైచిలుకే’ అంటున్నాయి డెలివరీ సంస్థలు.
ఇదంతా బాగానే ఉన్నా బైక్ పంక్చర్, ట్రాఫిక్ సిగ్నల్,అన్నిటికీ మించి స్పీడ్ బ్రేకర్ల కన్నా స్పీడుగా బ్రేకులు వేయించే గుంతలతో వ్యయప్రయాసలకు ఓర్చి పది నిమిషాల్లో డెలివరీ చేసే ఉద్యోగుల కష్టానికి ప్రతిఫలం దక్కుతుందా? అంటే లేదనే అంటున్నారు జొమాటోకి చెందిన ‘బ్లింకిట్’ ఉద్యోగులు.
బ్లింకిట్ యాప్‌కు చెందిన సిబ్బంది తాము చేస్తున్న పనికి తగ్గట్లు వేతనాలు ఇవ్వాలని పెద్ద ఎత్తున సమ్మె చేస్తున్నారు. డెలివరీ చేయడం మానేశారు. దీంతో ఆ సంస్థ దేశ వ్యాప్తంగా 400 స్టోర్ల నుంచి సర్వీసుల్ని అందిస్తుండగా.. ఉద్యోగుల నిర్ణయంతో వాటిలో పదుల సంఖ్యలో స్టోర్లు మూత పడ్డాయి.
మరోవైపు సిబ్బంది ఆందోళన చేస్తున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇటీవల బ్లింకిట్ కొత్త చెల్లింపుల పద్దతిని అమలు చేసిందని, ఆ నిర్ణయం వల్ల గతంలో డెలివరీ చేసిన ఆర్డర్లకు పొందే వేతనాలు బాగా తగ్గిపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఉద్యోగులకు జొమాటో మెయిల్
కాగా,ఉద్యోగులకు జొమాటో మెయిల్ పెట్టింది. ఆ మెయిల్‌లో రైడర్‌ల కోసం కొత్త చెల్లింపుల పద్దతిని ప్రవేశపెట్టినట్లు తెలిపింది. ఈ పద్దతిలో చేసే డెలివరీల ఆధారంగా చెల్లింపులు ఉంటాయని, షట్‌డౌన్ చేసిన స్టోర్లను తిరిగి ప్రారంభించే ప్రయత్నాల్ని ముమ్మరం చేసినట్లు స్పష్టం చేసింది.
చదవండి👉 జొమాటో ‘సీక్రెట్’ బయటపడింది, ఫుడ్ డెలివరీ స్కామ్..ఇలా కూడా చేయొచ్చా!
Comments
Please login to add a commentAdd a comment