
క్విక్ కామర్స్ రంగంలో ఉన్న బ్లింకిట్ (Blinkit) 10 నిమిషాల్లో యాపిల్ (Apple) ఉత్పత్తుల డెలివరీ సేవలను ప్రారంభించింది. మ్యాక్‌బుక్ ఎయిర్, ఐప్యాడ్, ఎయిర్‌పాడ్, యాపిల్ వాచ్, యాక్సెసరీస్‌ను కస్టమర్లు బ్లింకిట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.
హైదరాబాద్‌తోపాటు ఢిల్లీ–ఎన్‌సీఆర్, ముంబై, పుణే, లక్నో, అహ్మదాబాద్, చండీగఢ్, చెన్నై, జైపూర్, బెంగళూరు, కోల్‌కతలో ఈ సేవలు అందుబాటులో ఉంటాయని కంపెనీ తెలిపింది. కాగా గత ఏడాది యాపిల్ ప్రీమియం రీసెల్లర్ యూనికార్న్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుని ఆర్డర్లు ఇచ్చిన 10 నిమిషాల్లోనే ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్ ఫోన్‌లను కస్టమర్లకు డెలివరీ చేసింది.
అంతకుముందు బ్లింకిట్ పైలట్ ప్రాజెక్టుగా గురుగ్రామ్‌లోని ఎంపిక చేసిన ప్రాంతాల్లో 10 నిమిషాల అంబులెన్స్ సేవలను ప్రారంభించింది. ఈ అంబులెన్సుల్లో ఆక్సిజన్ సిలిండర్లు, ఏఈడీ (ఆటోమేటెడ్ ఎక్స్‌టర్నల్ డీఫిబ్రిలేటర్), స్ట్రెచర్, మానిటర్, సక్షన్ మెషీన్, అత్యవసర మందులు, ఇంజెక్షన్లు వంటి అవసరమైన ప్రాణరక్షణ పరికరాలు ఉంటాయి.
జొమాటోకు చెందిన ఈ క్విక్ కామర్స్ బిజినెస్ 2024 డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో రూ.103 కోట్ల నష్టాన్ని చవిచూసింది. పెట్టుబడుల కారణంగా బ్లింకిట్ కింద క్విక్ కామర్స్ వ్యాపారంలో నష్టాలు సమీపకాలంలో కొనసాగుతాయని కంపెనీ భావిస్తోందని షేర్ హోల్డర్లకు రాసిన లేఖలో జొమాటో పేర్కొంది.