ట్రాఫిక్ కష్టాల్ని దాటుకుని వన్.. టూ.. త్రీ.. రన్ అంటూ పది నిమిషాల్లో కస్టమర్లకు కావాల్సిన వస్తువుల్ని డెలివరీ చేసే ఉద్యోగులు బ్లింకిట్‌కు భారీ షాకిచ్చారు. వారం రోజుల పాటు డెలివరీ ఉద్యోగులు చేసిన స్ట్రైక్ దెబ్బకు సంస్థ స‍్పందించకపోవడంతో ఇతర సంస్థల్లో చేరినట్లు తెలుస్తోంది.
గతంలో కస్టమర్లకు కావాల్సిన వస్తువుల్ని గంటల్లో డెలివరీ చేస్తాం’ అంటూ సంస్థలు ప్రచారం చేసేవి. కానీ ఇప్పుడు అలాంటి మాటలు వినిపించడం లేదు. ఆర్డర్ పెట్టడం ఆలస్యం పదే పదినిమిషాల్లో మీ కాలింగ్ బెల్ కొట్టేస్తాం.. అంటున్నాయి క్విక్ కామర్స్ సంస్థలు. ఆ కోవకే చెందుతుంది జొమాటోకి చెందిన బ్లింకిట్ అనే గ్రోసరీ యాప్.
స్విగ్గీ, ఇన్‌స్టామార్ట్, జెప్టో, బిగ్‌బాస్కెట్‌కు పోటీగా బ్లింకిట్ క్విక్ కామర్స్ సేవల్ని అందిస్తుంది. పది నిమిషాల్లో ఆర్డర్స్‌ను డెలివరీ చేయడంలో మంచి పేరు సంపాదించింది. కానీ ఆర్డర్ తీసుకొని బయలుదేరిన మరుక్షణం నుంచి సరుకును చేరవేసే వరకూ.. ప్రతిక్షణం ఒత్తిడికి గురయ్యే డెలివరీ ఉద్యోగులకు శ్రమకు తగ్గ వేతనాలు ఇవ్వడం లేదనే కారణంతో ఉద్యోగులు సమ్మెబాట పట్టారు.
ఇదివరకు డెలివరీపై రూ.50 ఉండే చార్జీని రూ.25కు తగ్గించిందని, ఇప్పుడు దాన్ని ఏకంగా రూ.15 చేయడం వల్ల తమ ఆదాయం చాలా తగ్గిపోతోందని, న్యాయం చేయాలని కోరుతూ ఢిల్లీ - ఎన్‌సీఆర్ ప్రాంతాల్లో కార్యకలాపాల్ని నిలిపి వేశారు. దీంతో బ్లింకిట్ ఆయా స్టోర్ల కార్యకలాపాల్ని నిలిపి వేసింది.
ఈ తరుణంలో నోయిడా, గ్రేటర్ నోయిడా, ఢిల్లీ గురుగావ్, గజియాబాద్, ఫరీదాబాద్‌లలో ఆందోళన చేస్తున్న ఉద్యోగులు ఇతర కంపెనీల్లో చేరారు. ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం.. బ్లింకిట్‌కు చెందిన ఢిల్లీ -ఎన్‌సీఆర్‌లలో దాదాపు వందల స్టోర్‌లు మూత పడ్డాయి. సమ్మెకు ముందు బ్లింకిట్ తన ప్లాట్‌ఫారమ్‌లో ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో దాదాపు 3,000 మంది డెలివరీ ఎగ్జిక్యూటివ్‌లు ఉండగా.. వారిలో మూడింట ఒక వంతు మంది ఇతర ఫ్లాట్‌ఫారమ్‌లలో కార్యకలాపాలకు ఉపక్రమించారు.
బ్లింకిట్‌లో పని చేసే ఉద్యోగులు తక్కువ వేతనం కారణంగా ఇతర సంస్థల్లో చేరాల్సి వచ్చింది. వేతనం విషయంలో బ్లింకిట్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటుందని ఉద్యోగులకు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఉద్యోగులకు స్ట్రైక్‌తో బ్లింకిట్ భారీగా నష్టపోవడంతో కొత్త చెల్లింపు పద్దతిని అమలు చేయనున్నట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలు హైలెట్ చేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment