సమ్మె అయినా గ్యాస్‌ సిలిండర్‌ల సరఫరా ఆగదు | LPG supply wont interrupted omcs assure amidst strike | Sakshi
Sakshi News home page

సమ్మె అయినా గ్యాస్‌ సిలిండర్‌ల సరఫరా ఆగదు

Published Fri, Mar 28 2025 9:32 PM | Last Updated on Fri, Mar 28 2025 9:37 PM

LPG supply wont interrupted omcs assure amidst strike

హైదరాబాద్: సదరన్ రీజియన్ బల్క్ ఎల్‌పీజీ ట్రాన్స్‌పోర్ట్ ఓనర్స్ అసోసియేషన్‌కు చెందిన బల్క్ ఎల్‌పీజీ రవాణాదారుల సమ్మె నేపథ్యంలో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (ఐఓసీఎల్, బీపీసీఎల్, హెచ్పీసీఎల్) తమ ఎల్‌పీజీ వినియోగదారులకు తగినంత సిలిండర్ సరఫరా అందుబాటులో ఉంటుందని హామీ ఇచ్చాయి. ఈ విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

ప్రస్తుతం ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల బాట్లింగ్ ప్లాంట్లలో బల్క్ ఎల్పీజీ నిల్వలు తగినంత ఉన్నాయన్నారు. ఎల్పీజీ పంపిణీ కేంద్రాలు యథావిధిగా పని చేస్తాయని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన రవాణా టెండర్‌ను అన్ని ప్రాంతాల ట్రాన్స్‌పోర్టర్లతో విస్తృత చర్చల తర్వాత తుది రూపం ఇచ్చారన్నారు. ఈ ప్రక్రియలో రవాణాదారుల వివిధ అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకుని ముఖ్యమైన సందేహాలను నివృత్తి చేసేందుకు వివరణలు ఇచ్చారన్నారు.

చెన్నై, ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, గువాహటి నగరాల్లో నిర్వహించిన ప్రీ-బిడ్ సమావేశాల ద్వారా వారి అభిప్రాయాలను కూడా కలుపుకున్నారన్నారు. ఈ టెండర్ నిబంధనలను ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలు, కేంద్ర విజిలెన్స్ మార్గదర్శకాలను పాటిస్తూ పూర్తిగా పారదర్శకంగా రూపొందించారని పేర్కొన్నారు. ఈ నిబంధనలు పీఈఎస్ఓ, పీఎన్జీఆర్బీ, ఓఐఎస్డీ వంటి చట్టబద్ధ సంస్థల మార్గదర్శకాలకు అనుగుణంగా రూపొందాయన్నారు. ఎల్పీజీ రవాణా భద్రత, సామర్థ్యాన్ని పెంపొందించేందుకు మా ప్రయత్నాల్లో భాగంగా ఈ కొత్త టెండర్ నిబంధనలను తీసుకు వచ్చామన్నారు.

ఈ చర్యలు తీసుకున్నప్పటికి కొంతమంది రవాణాదారులు సమ్మెకు పిలుపునిచ్చారన్నారు. ప్రధానంగా భద్రతా ఉల్లంఘనలకు సంబంధించిన శిక్షా నిబంధనలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారని పేర్కొన్నారు. అయితే, ఈ భద్రతా సంబంధిత చర్యలు ట్యాంకర్ యజమానులు, డ్రైవర్లు, వినియోగదారులు సహా అన్ని స్టేక్‌హోల్డర్లకు లాభదాయకంగా ఉంటాయని తెలిపారు. అవి మరింత భద్రతా ప్రమాణాలు కలిగిన, విశ్వసనీయమైన ఎల్పీజీ రవాణా వ్యవస్థను ఏర్పాటు చేయడంలో సహాయపడతాయని పేర్కొన్నారు.

మా స్టేక్‌హోల్డర్ల నుంచి బాధ్యతాయుతమైన చర్యలు, అవగాహనను ఆశిస్తున్నామన్నారు. తద్వారా అవసరమైన భద్రతా ప్రోటోకాల్స్‌ను పాటిస్తూ ఎల్పీజీ సిలిండర్ల నిరంతర సరఫరాను నిర్ధారించవచ్చన్నారు. రవాణాదారులకు సమ్మెను విరమించాలని, అత్యవసరమైన ఎల్పీజీ సరఫరా నిల్వలను ప్రభావితం చేసే చర్యలకు దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. తద్వారా ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూడవచ్చన్నారు.

ఓఎంసీలు ప్రధాన రవాణాదారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతుందన్నారు. త్వరలో సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. బాధ్యతాయుతమైన ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలుగా గృహ అవసరాలు, వాణిజ్య అవసరాలు తీర్చేందుకు ఎల్పీజీ సరఫరాను కొనసాగించేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. వినియోగదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఎందుకంటే ఎల్పీజీ సరఫరా నిరంతరంగా కొనసాగేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement