ముగ్గురు ప్రాణ మిత్రులు (ఫైల్)
స్నేహం గుండె బలం.. మనసుకు ధైర్యం.. త్యాగానికి ప్రతిఫలం.. జీవితం తుది ఘడియలోనూ దాని విలువ ఆణిముత్యం. ముగ్గురు స్నేహితులు ఇప్పుడు అమరులయ్యారు. బతికుండగానే కాదు చావు కూడా మమ్మల్ని వేరు చేయలేదని నిరూపించారు. వారి పేర్లు స్నేహానికి గుర్తుగా ఎప్పటికీ నిలిచి ఉంటాయి.
చీరాల టౌన్: ఎదురు చూపులు నిరాశను మిగిల్చాయి. బతికి వస్తారునుకున్న కన్నవారి నమ్మకం మోడిబారింది. ముగ్గురు స్నేహితులు మృతదేహాలను చూసిన గవినివారిపాలెం శోకసంద్రంలో మునిగిపోయింది. మూడురోజల క్రితం యువకులు బాపట్ల కొత్త ఓడరేవు తీరంలో గల్లంతు కాగా సురేష్ (23) మృతదేహం శనివారం సాయంత్రం బాపట్ల తీరానికి కొట్టుకొచ్చింది. ఆర్మీ జవాన్ రామకృష్ణ (24), వల్లు బ్రహ్మయ్య (23) మృతదేహాలు ఆదివారం బాపట్ల రూరల్ పరిధిలోని కొత్త ఓడరేవు తీరానికి చేరాయి. బాపట్ల రూరల్ పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం బాపట్ల ఏరియా వైద్యశాలకు తరలించారు.
మిన్నంటిన రోదనలు
ప్రాణ మిత్రులు రామకృష్ణ, బ్రహ్మయ్య, సురేష్‌ల మరణం మూడు కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. మృతదేహాలను పోస్టుమార్టం అనంతరం స్వగ్రామం గవినివారిపాలెంకు తీసుకువచ్చారు. ఆర్మీ జవాను రామకృష్ణకు నెల క్రితమే వివాహం జరగ్గా సెలవుల అనంతరం ఆదివారం విధుల్లో చేరాల్సి ఉంది. కానీ విగతజీవిగా పడి ఉండటంతో తనను ఒంటరి చేసి వెళ్లిపోయావా అంటూ రామకృష్ణ భార్య గాయత్రి గుండెలవిసేలా రోదించింది. అండగా ఉంటాడనుకున్న కుమారులు అర్ధాంతరంగా చనిపోవడంతో ఇక తమకు దిక్కెవరు.. మాకు కడుపుకోత మిగిల్చి వెళ్తారా...అంటూ బ్రహ్మయ్య, సురేష్ కుటుంబ సుభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. మృతదేహాలు దెబ్బతినడంతో అంత్రక్రియలను త్వరగా పూర్తి చేశారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, గ్రామస్తులు కన్నీటి వీడ్కోలు పలికారు.
అండగా ఉంటాం
ముగ్గురు ఒకేసారి తనువు చాలించడం బాధాకరమని శాసన సభ్యుడు కరణం బలరామకృష్ణమూర్తి అన్నారు. బాపట్ల ఏరియా వైద్యశాల వద్ద మృతదేహాలను పరిశీలించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అధైర్యపడవద్దని అండగా ఉంటామని హామీ ఇచ్చారు. సంఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. మాజీమంత్రి పాలేటి రామారావు, నాయకులు నివాళులర్పించారు.
Comments
Please login to add a commentAdd a comment