drowned on sea
-
లండన్‌లో హైదరాబాద్ యువతి మృతి
సాక్షి, హైదరాబాద్: ఫస్ట్ టర్మ్ అయిపోయింది.. సెలవు తీసుకుని ఇంటికొస్తానని చెప్పిన ఆ యువతి శాశ్వతంగా సెలవు తీసుకుంది. హైదరాబాద్ యువతి సాయి తేజస్వి కొమ్మారెడ్డి (24) లండన్‌లో దుర్మరణం చెందింది. ఒక్కగానొక్క బిడ్డ మృతి చెందడం, మృతదేహం రావడానికి సమయం పడుతుండటంతో నగరంలోని ఆమె కుటుంబం కన్నీరుమున్నీరవుతోంది. యాదాద్రి జిల్లా మోటకొండూరుకు చెందిన కొమ్మారెడ్డి శశిధర్ రెడ్డి, జ్యోతి దంపతులు నగరంలోని ఐఎస్‌సదన్ డివిజన్ లక్ష్మీనగర్ కాలనీలో ఉంటున్నారు. వీరి కుమార్తె తేజస్వి సైదాబాద్‌లో ఇంజనీరింగ్ (సీఎస్ఈ) పూర్తి చేశారు. లండన్‌లోని క్రాన్ ఫీల్డ్ యూనివర్సిటీలో మాస్టర్స్ చేయడానికి గతేడాది సెప్టెంబర్‌లో వెళ్లారు. ఈ నెల 11న తన స్నేహితులతో కలిసి అక్కడి బ్రైటన్ బీచ్‌లో విహారయాత్రకు వెళ్లి సముద్రంలో కొట్టుకుపోయారు. వెంట ఉన్న సహ విద్యార్థులు ఎమర్జెన్సీ రెస్పాన్స్‌కు సమాచారం ఇచ్చారు. అక్కడి బలగాలు గాలించి తేజస్వి మృతదేహాన్ని గుర్తించి ససెక్స్ కౌంటీ హాస్పిటల్‌కు తరలించారు. ఆమె అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఆమె మృతదేహాన్ని హైదరాబాద్‌కు తరలించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ విషయంపై కేటీఆర్‌కు ట్వీట్ చేసిన తేజస్వి బంధువులు మృతదేహం ఇక్కడకు తరలించడానికి సహకరించాలని కోరారు. బుధవారం మృతురాలి ఇంటికి వెళ్లిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో ఫోన్లో మాట్లాడించారు. మృతదేహం శుక్రవారం నాటికి నగరానికి చేరుకుంటుందని ఆమె కుటుంబీకులకు సమాచారం అందింది. ‘‘చనిపోవడానికి ముందు రోజు తేజస్వి తల్లిదండ్రులతో వీడియోకాల్‌లో మాట్లాడింది. ఫస్ట్ టర్మ్ పూర్తయిన విషయం చెప్పింది. వీలుంటే వారం లేదా పది రోజులు సెలవు తీసుకుని రమ్మని వాళ్లు చెప్పారు. ఆరేడు నెలల్లో గ్రాడ్యుయేషన్ కూడా ఉండటంతోసెర్మనీకి వెళ్లడానికి తల్లిదండ్రులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈలోపు ఇలా జరిగింది’’అని తేజస్వి బంధువులు తెలిపారు. చదవండి: ఎంసెట్‌లో ఇంటర్ మార్కుల వెయిటేజ్ ఎత్తివేత -
అమెరికాలో హనుమకొండవాసి మృతి
వరంగల్ క్రైం: ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన హనుమకొండ నక్కలగుట్టకు చెందిన కుంటా ఉత్తేజ్(27) నీటిలో మునిగిపోతున్న స్నేహితుడిని కాపాడబోయి మృతిచెందాడు. దీంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. ఉత్తేజ్ గత ఆగస్టు ఒకటిన అమెరికాలో ఎంఎస్ చదవడానికి వెళ్లాడు. మిస్సౌరిలోని సెయింట్ లూయిస్ కాలేజీలో ఎంఎస్ చదువుతున్న ఉత్తేజ్ అమెరికా కాలమాన ప్రకారం ఈ నెల 26న మధ్యాహ్నం నలుగురు స్నేహితులతో కలిసి ఓజార్క్ సరస్సుకు వెళ్లారు. తనతోపాటు హైదరాబాద్‌లోని పానానియా డెంటల్ కళాశాలలో బీడీఎస్ చదివిన తాండూరుకు చెందిన శివదత్తు అనే విద్యార్థి సరస్సులో దిగి మునిగిపోతుండటంతో కాపాడటానికి దిగిన ఉత్తేజ్ కూడా గల్లంతయ్యాడు. గట్టుపై ఉన్న మరో ఇద్దరు స్నేహితులు అక్కడి పోలీసులకు సమాచారం అందించడంతో అమెరికా రెస్క్యూ టీం గాలింపు చేపట్టి ఆదివారంరాత్రి ఉత్తేజ్ మృతదేహాన్ని బయటకు తీశారు. మృతదేహం బుధవారం అర్ధరాత్రి హనుమకొండకు చేరనుందని కుటుంబసభ్యులు తెలిపారు. ఉత్తేజ్ పదవ తరగతి వరకు నక్కలగుట్టలోని విజ్ఞాన్ పాఠశాలలో, ఇంటర్మీడియెట్ విజయవాడలోని శ్రీచైతన్య కళాశాలలో, బీడీఎస్ హైదరాబాద్‌లోని పానానియా డెంటల్ కళాశాలలో చదివాడు. ఉత్తేజ్ తండ్రి జనార్దన్ ఎల్కతుర్తి మండలం గోపాల్పూర్ ప్రా«థమిక ఆరోగ్య కేంద్రంలో ల్యాబ్ టెక్నీషియన్. తల్లి ఝాన్సీలక్ష్మి గృహిణి. ఉత్తేజ్‌కు సోదరుడు ఉజ్వల్, సోదరి సాయిసేవికా ఉన్నారు. -
తీరంలో విషాదం! ముగ్గురి మృతదేహాలు లభ్యం, కొనసాగుతున్న గాలింపు
Update: విశాఖ ఆర్కే బీచ్‌లో గల్లంతైన వారిలో ముగ్గురి మృతదేహాలు లభించాయి. మరొక మృతదేహం కోసం నేవీ హెలిక్యాప్టర్‌తో ప్రత్యేక గాలింపు చర్యలు చేపట్టారు. అలాగే సముద్రపు అంతర్భాగంలో రాళ్ళ మధ్య చిక్కుకునే అవకాశాలు ఉండడంతో అక్కడ కూడా గాలింపు కొనసాగించారు. నిన్న సముద్రంలో స్నానానికి దిగి నలుగురు గల్లంతయ్యారు. పెదవాల్తేరు/బీచ్‌రోడ్డు(విశాఖ తూర్పు): ఆర్.కె.బీచ్‌లో ఘోరం జరిగింది. విశాఖలో సరదాగా గడుపుదామని వచ్చిన వారి కుటుంబాల్లో సముద్రస్నానం తీవ్ర విషాదం నింపింది. పెద్దగా వచ్చిన కెరటాలకు నలుగురు గల్లంతవగా.. ఇద్దరి మృతదేహాలు ఒడ్డుకు కొట్టుకొచ్చాయి. మరో ఇద్దరి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మృతి చెందిన వారిలో ఓ యువతి ఉంది. రెండు వేర్వేరు రాష్ట్రాల నుంచి వచ్చిన వీరి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మూడవ పట్టణ పోలీసులు తెలిపిన వివరాలివీ.. ►నూతన సంవత్సర వేడుకులు జరుపుకునేందుకు హైదరాబాద్ బేగంపేటకు చెందిన బ్యాంకు ఉద్యోగి శివకుమార్ (24), డిగ్రీ విద్యార్థులు కోట శివ (20), ఎండీ అజిష్ (20) సహా ఎనిమిది మంది స్నేహితులు గత నెల 30న విశాఖ వచ్చారు. వీరు ఆదివారం తిరుగు ప్రయాణానికి ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఆర్.కె.బీచ్‌లో స్నానాలకు దిగారు. ఇంతలో పెద్ద కెరటం రావడంతో బ్యాంక్ ఉద్యోగి శివ కుమార్, శివ, అజిష్ గల్లంతయ్యారు. మిగిలిన వారు సురక్షితంగా బయటపడ్డారు. కొంతసేపటికి శివకుమార్ మృతదేహం ఒడ్డుకు కొట్టుకొచ్చింది. కోట శివ, అజిష్‌ల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం లేకపోయింది. దీంతో పోలీసులు కోస్టుగార్డు, నేవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. శివకుమార్ మృతదేహం వద్ద సహచరులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ►ఒడిశాలోని కటక్‌కు చెందిన ముగ్గురు యువకులు, ఇద్దరు యువతులు ఆదివారం మధ్యాహ్నం ఆర్.కె.బీచ్‌లోని పాండురంగాపురం వద్ద స్నానాలకు దిగారు. వీరిలో సుమిత్ర త్రిపాఠి (21) సముద్రంలో కొట్టుకుపోవడంతో కమ్యూనిటీ గార్డులు రక్షించారు. కొన ఊపిరితో ఉన్న ఆమెను కేజీహెచ్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. మిగిలిన నలుగురు సురక్షితంగా బయటపడ్డారు. రెండు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. సంఘటన స్థలానికి ఈస్ట్ ఏసీపీ హర్షిత చంద్ర, త్రీటౌన్ సీఐ కోరాడ రామారావు చేరుకుని.. సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించారు. సీఐ రామారావు పర్యవేక్షణలో ఎస్ఐ హరీష్ ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: కాపురంలో మద్యం పెట్టిన చిచ్చు! చక్కగా ముస్తాబై భర్తకోసం ఎదురు చూస్తుంటే.. -
ఆర్కే బీచ్‌లో ఇద్దరి మృతి
పెదవాల్తేరు (విశాఖ తూర్పు): కొత్త సంవత్సరం సందర్భంగా విశాఖ బీచ్‌లో సంతోషంగా గడుపుదామని వచ్చిన రెండు బృందాల్లో విషాదం నెలకొంది. ఆదివారం సముద్రంలో మునిగి ఇద్దరు మృతిచెందగా ఇద్దరు గల్లంతయ్యారు. మూడో పట్టణ పోలీసులు తెలిపిన మేరకు.. హైదరాబాద్ బేగంపేటకు చెందిన బ్యాంకు ఉద్యోగి శివకుమార్ (24), డిగ్రీ విద్యార్థులు శివ (20), అజిష్ (20) సహా ఎనిమిదిమంది స్నేహితులు గతనెల 30న విశాఖ వచ్చారు. ఆదివారం హైదరాబాద్ బయలుదేరుతూ ముందుగా మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఆర్కే బీచ్‌లో స్నానాలకు దిగారు. వీరిలో బ్యాంకు ఉద్యోగి శివకుమార్ పెద్ద కెరటం రావడంతో కొట్టుకుపోయి మృతిచెందాడు. అతడి మృతదేహం ఒడ్డుకు కొట్టుకొచ్చింది. శివ, అజిష్ సముద్రంలో గల్లంతయ్యారు. వారికోసం గాలిస్తున్నారు. ఒడిశా నుంచి వచ్చిన ఒక కుటుంబలోని ఐదుగురు ఆర్కేబీచ్లో స్నానాలకు దిగారు. వీరిలో సుమిత్ర త్రిపాఠి (21) సముద్రంలో కొట్టుకుపోతుండగా కమ్యూనిటీగార్డులు రక్షించారు. ఆమెను కేజీహెచ్‌కి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతిచెందింది. ఘటనాస్థలాన్ని ఈస్ట్ ఏసీపీ హర్షిత, త్రీటౌన్ సీఐ కోరాడ రామారావు పరిశీలించారు. -
కడుపుకోత మిగిల్చి వెళ్తారా.. మాకు దిక్కెవరు..
స్నేహం గుండె బలం.. మనసుకు ధైర్యం.. త్యాగానికి ప్రతిఫలం.. జీవితం తుది ఘడియలోనూ దాని విలువ ఆణిముత్యం. ముగ్గురు స్నేహితులు ఇప్పుడు అమరులయ్యారు. బతికుండగానే కాదు చావు కూడా మమ్మల్ని వేరు చేయలేదని నిరూపించారు. వారి పేర్లు స్నేహానికి గుర్తుగా ఎప్పటికీ నిలిచి ఉంటాయి. చీరాల టౌన్: ఎదురు చూపులు నిరాశను మిగిల్చాయి. బతికి వస్తారునుకున్న కన్నవారి నమ్మకం మోడిబారింది. ముగ్గురు స్నేహితులు మృతదేహాలను చూసిన గవినివారిపాలెం శోకసంద్రంలో మునిగిపోయింది. మూడురోజల క్రితం యువకులు బాపట్ల కొత్త ఓడరేవు తీరంలో గల్లంతు కాగా సురేష్ (23) మృతదేహం శనివారం సాయంత్రం బాపట్ల తీరానికి కొట్టుకొచ్చింది. ఆర్మీ జవాన్ రామకృష్ణ (24), వల్లు బ్రహ్మయ్య (23) మృతదేహాలు ఆదివారం బాపట్ల రూరల్ పరిధిలోని కొత్త ఓడరేవు తీరానికి చేరాయి. బాపట్ల రూరల్ పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం బాపట్ల ఏరియా వైద్యశాలకు తరలించారు. మిన్నంటిన రోదనలు ప్రాణ మిత్రులు రామకృష్ణ, బ్రహ్మయ్య, సురేష్‌ల మరణం మూడు కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. మృతదేహాలను పోస్టుమార్టం అనంతరం స్వగ్రామం గవినివారిపాలెంకు తీసుకువచ్చారు. ఆర్మీ జవాను రామకృష్ణకు నెల క్రితమే వివాహం జరగ్గా సెలవుల అనంతరం ఆదివారం విధుల్లో చేరాల్సి ఉంది. కానీ విగతజీవిగా పడి ఉండటంతో తనను ఒంటరి చేసి వెళ్లిపోయావా అంటూ రామకృష్ణ భార్య గాయత్రి గుండెలవిసేలా రోదించింది. అండగా ఉంటాడనుకున్న కుమారులు అర్ధాంతరంగా చనిపోవడంతో ఇక తమకు దిక్కెవరు.. మాకు కడుపుకోత మిగిల్చి వెళ్తారా...అంటూ బ్రహ్మయ్య, సురేష్ కుటుంబ సుభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. మృతదేహాలు దెబ్బతినడంతో అంత్రక్రియలను త్వరగా పూర్తి చేశారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, గ్రామస్తులు కన్నీటి వీడ్కోలు పలికారు. అండగా ఉంటాం ముగ్గురు ఒకేసారి తనువు చాలించడం బాధాకరమని శాసన సభ్యుడు కరణం బలరామకృష్ణమూర్తి అన్నారు. బాపట్ల ఏరియా వైద్యశాల వద్ద మృతదేహాలను పరిశీలించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అధైర్యపడవద్దని అండగా ఉంటామని హామీ ఇచ్చారు. సంఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. మాజీమంత్రి పాలేటి రామారావు, నాయకులు నివాళులర్పించారు. -
ట్యునీషియా తీరంలో బోటు మునక: 50 మంది గల్లంతు
ట్యునిస్: ఉత్తర ఆఫ్రికా దేశం ట్యునీషియా తీరంలో వలసదారులతో వస్తున్న పడవ మునిగిపోవడంతో అందులోని సుమారు 50 మంది గల్లంతయ్యారు. మరో 33 మందిని సమీపంలోని చమురు సంస్థ సిబ్బంది కాపాడారు. ఎస్‌ఫాక్స్ తీరంలో ఈ ఘటన చోటు చేసుకుందని ట్యునీషియా రక్షణ శాఖ తెలిపింది. సురక్షితంగా బయటపడిన వారంతా బంగ్లాదేశీయులేనని అంతర్జాతీయ వలసదారుల సంస్థ పేర్కొంది. లిబియాలోని జవారా రేవు నుంచి బయలుదేరిన ఈ పడవలో 90 మంది వరకు ఉంటారని తెలిసిందని ప్రకటించింది. యూరప్ వెళ్లాలనుకునే వలసదారులు లిబియా మీదుగా ప్రమాదకరమైన ఈ మధ్యదరా సముద్ర మార్గాన్ని ఎంచుకుంటున్నారు. చదవండి: ఇజ్రాయెల్, హమాస్ మధ్య దాడులు, ప్రతిదాడులు -
తమిళనాడులో విషాదం
సాక్షి, చెన్నై : సముద్రంలో ఈతకొడుతూ ఐదుగురు మృతిచెందిన సంఘటన తమిళనాడులో మంగళవారం చోటుచేసుకుంది. నాగపట్టణం జిల్లా వేదారణ్యం సమీపంలోని ఆరుకాట్టుతురై తీరంలో ఈత కొట్టేందుకు ఎనిమిది మంది యువకులు వెళ్ళారు. వేదారణ్యంకు చెందిన ప్రవీణ్‌కుమార్, భరత్, కనిష్కర్, రాజమాణిక్యం, యుగేంద్రన్ సముద్రంలో ఈదుతూ లోతుకు వెళ్లడంతో నీటిలో మునిగిపోయారు. మురో ముగ్గురిని స్థానికులు కాపాడి ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న తీరప్రాంత గస్తీ పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. సముద్రంలో మునిగిపోయిన ఐదుగురి మృతదేహాల కోసం గాలింపుచర్యలు చేపట్టారు. -
మృత్యు కెరటం
ఇరగవరం/మొగల్తూరు : సముద్ర స్నానానికి వెళ్లిన ఆ బావ, బావమరుదులను కెరటాల రూపంలో వచ్చిన మృత్యువు కబళించింది. ఈ విషాదఘటన మొగల్తూరు మండలం పేరుపాలెం బీచ్‌లో ఆదివారం చోటుచేసుకుంది. మృతులిద్దరూ ఇరగవరం మండలం పేకేరువాసులు కావడంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. మృతుల కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన నూకపేయి సూర్యప్రకాష్, దాసరి కిరణ్‌సుందర్, రాజ్‌కుమార్ ఆదివారం సెలవు రోజు కావడంతో వారి కుటుంబ సభ్యులతో కలిసి పేరుపాలెం బీచ్ వద్ద ఉన్న వేళంకణి మాత ఆలయానికి మొక్కులు తీర్చుకునేందుకు వెళ్లారు. వేళంకణి మాత ఆలయంలో మొక్కులు తీర్చుకున్న తర్వాత వారు సముద్రస్నానం కోసం బీచ్‌కు వెళ్లారు. వారు చీచ్‌లో స్నానం చేస్తుండగా పెద్ద కెరటం వచ్చి సూర్యప్రకాశ్ (23)ను లాక్కెళ్లింది. ఈ క్రమంలో అతనిని కాపాడేందుకు యత్నించిన కిరణ్‌సుందర్ (30)కూడా కెరటాల మధ్యలో చిక్కుకుపోయాడు. దీంతో ఇద్దరూ సముద్రంలో కొట్టుకుపోయారు. స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించినా ఫలితం లేకపోయింది. కిరణ్సుందర్ను కొందరు యువకులు రక్షించేందుకు యత్నించారు. అతనిని పట్టుకుని ఒడ్డుకు తీసుకురాగా, అప్పటికే అతను విగతజీవిగా మారాడు. సూర్యప్రకాష్ మృతదేహం రెండు గంటల అనంతరం మోళ్ళపర్రు బీచ్ ప్రాంతంలో ఒడ్డుకు కొట్టుకువచ్చింది. మొక్క తీర్చుకునేందుకు వెళ్లి.. ఇరగవరం మండలం పేకేరు గ్రామంలో నివసిస్తున్న దాసరి కిరణ్ సుందర్ స్వగ్రామం బుట్టాయిగూడెం. ఆయన తణుకు ఏఎస్ఆర్ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేస్తున్నారు. కిరణ్‌కు పేకేరు గ్రామానికి చెందిన కటికితల విజయకుమార్, ఆలీసమ్మ దంపతుల పెద్దకుమార్తె ప్రసన్నతో గత ఏడాది వివాహమైంది. తణుకులో ఉద్యోగం చేస్తున్న కిరణ్ దగ్గరగా ఉంటుందనే ఉద్దేశంతో పేకేరులోనే స్థిరపడ్డారు. ఇటీవలే ఆయనకు మగ బిడ్డ జన్మించాడు. ఈసందర్బంగా మొక్కును తీర్చుకునేందుకు పేరుపాలెం వెళ్లారు. మరో పదిరోజుల్లో కుమారుని అన్నప్రాశనకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో భార్య, బిడ్డతో కలిసి సముద్రంలో సెల్ఫీదిగుతుండగా, వారితో వెళ్లిన సూర్యప్రకాష్ సముద్రంలో కొట్టుకుపోతుండడంతో అతనిని కాపాడేందుకు యత్నించి కిరణ్ కూడా విగతజీవిగా మారాడు. కళ్లెదుటే భర్త కొట్టుకుపోవడంతో అతని భార్య ప్రసన్న తీవ్రంగా రోదిస్తున్నారు. సరదాగా వెళ్లి.. సూర్యప్రకాశ్ ఇటీవల హోటల్ మేనేజ్మెంట్ కోర్సును పూర్తి చేసి భీమవరంలోని త్రీస్టార్ హోటల్లో సూపర్వైజర్గా పని చేస్తున్నారు. అతని తండ్రి సంజీవరావు, తల్లి పార్వతి వ్యవసాయ కూలీలు. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. వీరిలో సూర్యప్రకాశ్ అందరికంటే చిన్న. సూర్యప్రకాశ్, కిరణ్‌సుందర్ వరుసకు బావాబావమరుదులు. సరదాగా వారి వెంట సముద్రస్నానానికి వెళ్లాడు. కెరటానికి బలయ్యాడు. వృద్ధాప్యంలో ఉన్న సూర్యప్రకాశ్ తల్లిదండ్రులు తమ కొడుకు సముద్రస్నానానికి వెళ్లి మృతి చెండడం తట్టుకోలేక విలపిస్తున్నారు. తమకు తోడుగా ఉంటాడనుకుంటే ఇలా జరిగిందని రోదిస్తున్నారు. రక్షణ చర్యలు లేకే.. పేరుపాలెం బీచ్‌లో రక్షణ చర్యలు లేవు. అందుకే ఇక్కడ తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇక్కడ పర్యాటకులను నియంత్రించడానికి.. అవసరమైన సమయంలో గాలింపునకు గజ ఈతగాళ్లు, సిబ్బంది లేరు ఆదివారాలు, సెలవు, పండగ రోజుల్లో మాత్రం ఇక్కడ ఒకరిద్దరిని నియమించినా.. వారు పర్యాటకులందరినీ నిలువరించడం సాధ్యం కావడం లేదు. దీంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. నరసాపురం మండలంలో రెండు బీచ్‌లు ఉన్నాయి. వీటిల్లో ఒకటి కేపీపాలెం కాగా, ఇంకోటి పేరుపాలెం. ఈ రెండు బీచ్‌లలోనూ ఇదే దుస్థితి నెలకొంది. దీంతో గత ఏడాది ఇక్కడ సముద్ర తీరంలో పదిమంది ప్రాణాలు కోల్పోగా.. ఈ ఏడాది ఇప్పటివరకూ ఆరుగురు బలయ్యారు. అయినా అధికారులు రక్షణ చర్యలు తీసుకోవడం లేదు. వీరిలో ఎక్కువ మంది యువకులే ఉన్నారు. సముద్రస్నానానికి వచ్చిన యువకులు ప్రమాదమని తెలిసినా.. ఎగసిపడుతున్న అలలతో సమానంగా తామూ ఎగసిపడాలనే ఉత్సాహంతో సముద్రం లోపలకు వెళ్తున్నారు. ఇదే ప్రాణాలమీదకు తెస్తోందని పోలీసులు చెబుతున్నారు. కేపీపాలెం బీచ్ ఉన్నా.. ఇది స్నానానికి ఏమాత్రం అనువుగా ఉండదు. ఈ ప్రాంతంలో అలలు వచ్చిన సమయంలో కాలు కింద గొయ్యి ఏర్పడుతోంది. ఈ విషయం గమనించక పర్యాటకులు కిందపడి కొట్టుకుపోతున్నారు. ఈ ప్రాంతాల్లో ఇప్పటికైనా పటిష్ట మైన చర్యలు చేపట్టాలని, పర్యాటకుల ప్రాణాలు కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.