మృత్యు కెరటం
మృత్యు కెరటం
Published Sun, Jul 31 2016 11:56 PM | Last Updated on Sat, Aug 25 2018 5:33 PM
ఇరగవరం/మొగల్తూరు : సముద్ర స్నానానికి వెళ్లిన ఆ బావ, బావమరుదులను కెరటాల రూపంలో వచ్చిన మృత్యువు కబళించింది. ఈ విషాదఘటన మొగల్తూరు మండలం పేరుపాలెం బీచ్‌లో ఆదివారం చోటుచేసుకుంది. మృతులిద్దరూ ఇరగవరం మండలం పేకేరువాసులు కావడంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. మృతుల కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. గ్రామానికి
చెందిన నూకపేయి సూర్యప్రకాష్, దాసరి కిరణ్‌సుందర్, రాజ్‌కుమార్ ఆదివారం సెలవు రోజు కావడంతో వారి కుటుంబ సభ్యులతో కలిసి పేరుపాలెం బీచ్ వద్ద ఉన్న వేళంకణి మాత ఆలయానికి మొక్కులు తీర్చుకునేందుకు వెళ్లారు. వేళంకణి మాత ఆలయంలో మొక్కులు తీర్చుకున్న తర్వాత వారు సముద్రస్నానం కోసం బీచ్‌కు వెళ్లారు. వారు చీచ్‌లో స్నానం చేస్తుండగా పెద్ద కెరటం వచ్చి సూర్యప్రకాశ్ (23)ను లాక్కెళ్లింది. ఈ క్రమంలో అతనిని కాపాడేందుకు యత్నించిన కిరణ్‌సుందర్ (30)కూడా కెరటాల మధ్యలో చిక్కుకుపోయాడు. దీంతో ఇద్దరూ సముద్రంలో కొట్టుకుపోయారు. స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించినా ఫలితం లేకపోయింది. కిరణ్‌సుందర్‌ను కొందరు యువకులు రక్షించేందుకు యత్నించారు. అతనిని పట్టుకుని ఒడ్డుకు తీసుకురాగా, అప్పటికే అతను విగతజీవిగా మారాడు. సూర్యప్రకాష్ మృతదేహం రెండు గంటల అనంతరం మోళ్ళపర్రు బీచ్ ప్రాంతంలో ఒడ్డుకు కొట్టుకువచ్చింది.
మొక్క తీర్చుకునేందుకు వెళ్లి..
ఇరగవరం మండలం పేకేరు గ్రామంలో నివసిస్తున్న దాసరి కిరణ్ సుందర్ స్వగ్రామం బుట్టాయిగూడెం. ఆయన తణుకు ఏఎస్‌ఆర్ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేస్తున్నారు. కిరణ్‌కు పేకేరు గ్రామానికి చెందిన కటికితల విజయకుమార్, ఆలీసమ్మ దంపతుల పెద్దకుమార్తె ప్రసన్నతో గత ఏడాది వివాహమైంది. తణుకులో ఉద్యోగం చేస్తున్న కిరణ్ దగ్గరగా ఉంటుందనే ఉద్దేశంతో పేకేరులోనే స్థిరపడ్డారు. ఇటీవలే ఆయనకు మగ బిడ్డ జన్మించాడు. ఈసందర్బంగా మొక్కును తీర్చుకునేందుకు పేరుపాలెం వెళ్లారు. మరో పదిరోజుల్లో కుమారుని అన్నప్రాశనకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో భార్య, బిడ్డతో కలిసి సముద్రంలో సెల్ఫీదిగుతుండగా, వారితో వెళ్లిన సూర్యప్రకాష్ సముద్రంలో కొట్టుకుపోతుండడంతో అతనిని కాపాడేందుకు యత్నించి కిరణ్ కూడా విగతజీవిగా మారాడు. కళ్లెదుటే భర్త కొట్టుకుపోవడంతో అతని భార్య ప్రసన్న తీవ్రంగా రోదిస్తున్నారు.
సరదాగా వెళ్లి..
సూర్యప్రకాశ్ ఇటీవల హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సును పూర్తి చేసి భీమవరంలోని త్రీస్టార్ హోటల్లో సూపర్‌వైజర్‌గా పని చేస్తున్నారు. అతని తండ్రి సంజీవరావు, తల్లి పార్వతి వ్యవసాయ కూలీలు. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. వీరిలో సూర్యప్రకాశ్ అందరికంటే చిన్న. సూర్యప్రకాశ్, కిరణ్‌సుందర్ వరుసకు బావాబావమరుదులు. సరదాగా వారి వెంట సముద్రస్నానానికి వెళ్లాడు. కెరటానికి బలయ్యాడు. వృద్ధాప్యంలో ఉన్న సూర్యప్రకాశ్ తల్లిదండ్రులు తమ కొడుకు సముద్రస్నానానికి వెళ్లి మృతి చెండడం తట్టుకోలేక విలపిస్తున్నారు. తమకు తోడుగా ఉంటాడనుకుంటే ఇలా జరిగిందని రోదిస్తున్నారు.
రక్షణ చర్యలు లేకే..
పేరుపాలెం బీచ్‌లో రక్షణ చర్యలు లేవు. అందుకే ఇక్కడ తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇక్కడ పర్యాటకులను నియంత్రించడానికి.. అవసరమైన సమయంలో గాలింపునకు గజ ఈతగాళ్లు, సిబ్బంది లేరు ఆదివారాలు, సెలవు, పండగ రోజుల్లో మాత్రం ఇక్కడ ఒకరిద్దరిని నియమించినా.. వారు పర్యాటకులందరినీ నిలువరించడం సాధ్యం కావడం లేదు. దీంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. నరసాపురం మండలంలో రెండు బీచ్‌లు ఉన్నాయి. వీటిల్లో ఒకటి కేపీపాలెం కాగా, ఇంకోటి పేరుపాలెం. ఈ రెండు బీచ్‌లలోనూ ఇదే దుస్థితి నెలకొంది. దీంతో గత ఏడాది ఇక్కడ సముద్ర తీరంలో పదిమంది ప్రాణాలు కోల్పోగా.. ఈ ఏడాది ఇప్పటివరకూ ఆరుగురు బలయ్యారు. అయినా అధికారులు రక్షణ చర్యలు తీసుకోవడం లేదు. వీరిలో ఎక్కువ మంది యువకులే ఉన్నారు. సముద్రస్నానానికి వచ్చిన యువకులు ప్రమాదమని తెలిసినా.. ఎగసిపడుతున్న అలలతో సమానంగా తామూ ఎగసిపడాలనే ఉత్సాహంతో సముద్రం లోపలకు వెళ్తున్నారు. ఇదే ప్రాణాలమీదకు తెస్తోందని పోలీసులు చెబుతున్నారు. కేపీపాలెం బీచ్ ఉన్నా.. ఇది స్నానానికి ఏమాత్రం అనువుగా ఉండదు. ఈ ప్రాంతంలో అలలు వచ్చిన సమయంలో కాలు కింద గొయ్యి ఏర్పడుతోంది. ఈ విషయం గమనించక పర్యాటకులు కిందపడి కొట్టుకుపోతున్నారు. ఈ ప్రాంతాల్లో ఇప్పటికైనా పటిష్ట మైన చర్యలు చేపట్టాలని, పర్యాటకుల ప్రాణాలు కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.
Advertisement