ఉత్తేజ్
వరంగల్ క్రైం: ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన హనుమకొండ నక్కలగుట్టకు చెందిన కుంటా ఉత్తేజ్(27) నీటిలో మునిగిపోతున్న స్నేహితుడిని కాపాడబోయి మృతిచెందాడు. దీంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. ఉత్తేజ్ గత ఆగస్టు ఒకటిన అమెరికాలో ఎంఎస్ చదవడానికి వెళ్లాడు. మిస్సౌరిలోని సెయింట్ లూయిస్ కాలేజీలో ఎంఎస్ చదువుతున్న ఉత్తేజ్ అమెరికా కాలమాన ప్రకారం ఈ నెల 26న మధ్యాహ్నం నలుగురు స్నేహితులతో కలిసి ఓజార్క్ సరస్సుకు వెళ్లారు.
తనతోపాటు హైదరాబాద్‌లోని పానానియా డెంటల్ కళాశాలలో బీడీఎస్ చదివిన తాండూరుకు చెందిన శివదత్తు అనే విద్యార్థి సరస్సులో దిగి మునిగిపోతుండటంతో కాపాడటానికి దిగిన ఉత్తేజ్ కూడా గల్లంతయ్యాడు. గట్టుపై ఉన్న మరో ఇద్దరు స్నేహితులు అక్కడి పోలీసులకు సమాచారం అందించడంతో అమెరికా రెస్క్యూ టీం గాలింపు చేపట్టి ఆదివారంరాత్రి ఉత్తేజ్ మృతదేహాన్ని బయటకు తీశారు.
మృతదేహం బుధవారం అర్ధరాత్రి హనుమకొండకు చేరనుందని కుటుంబసభ్యులు తెలిపారు. ఉత్తేజ్ పదవ తరగతి వరకు నక్కలగుట్టలోని విజ్ఞాన్ పాఠశాలలో, ఇంటర్మీడియెట్ విజయవాడలోని శ్రీచైతన్య కళాశాలలో, బీడీఎస్ హైదరాబాద్‌లోని పానానియా డెంటల్ కళాశాలలో చదివాడు. ఉత్తేజ్ తండ్రి జనార్దన్ ఎల్కతుర్తి మండలం గోపాల్‌పూర్ ప్రా«థమిక ఆరోగ్య కేంద్రంలో ల్యాబ్ టెక్నీషియన్. తల్లి ఝాన్సీలక్ష్మి గృహిణి. ఉత్తేజ్‌కు సోదరుడు ఉజ్వల్, సోదరి సాయిసేవికా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment