గండి పూడ్చివేతకు మరో రెండు రోజులు!
గండి పూడ్చివేతకు మరో రెండు రోజులు!
Published Fri, Aug 5 2016 8:10 PM | Last Updated on Mon, Sep 4 2017 7:59 AM
సీతారామపురం(నూజివీడు) :
మండలంలోని సీతారామపురం సమీపంలోని రామిలేరుపై ఉన్న పోలవరం అండర్‌టన్నెల్‌కు పడిన గండి పనులు ఎట్టకేలకు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈ నెల ఒకటోతేదీ తెల్లవారుజామున గండి పడినప్పటి నుంచి గండిని పూడ్చటానికి ఇంజినీరింగ్ ఉన్నతాధికారులు అక్కడే మకాం వేశారు. గోదావరి జలాల ప్రవాహం తగ్గడానికి రెండు రోజులు పట్టిన తరువాత గండి వద్ద రింగ్‌బండ్ ఏర్పాటు చేయడానికే మరో రెండు రోజులు సమయం తీసుకోవడంతో ఇప్పటివరకు గండిపూడ్చివేత పనులు ప్రారంభమవ్వలేదు. కాంక్రీట్ వేసే యంత్రాలు గురువారం సాయంత్రానికి గండి పడిన ప్రదేశానికి చేరుకోగా శుక్రవారం నుంచి కాంక్రీట్ పనులను చేపట్టారు. ముందుగా కాలువ లోపలిభాగంలో అండర్ టన్నెల్ స్లాబుతో పాటు ఉన్న అప్రాన్‌లో కాంక్రీటు నింపుతున్నారు.
ఇది పూర్తయిన వెంటనే గండిని కూడా కాంక్రీట్‌తో పూడ్చుతామని ఇంజనీర్లు చెప్పారు. ఈ పనులు ఏడో తేదీ నాటికి పూర్తవుతాయని భావిస్తున్నారు. పనులను జలవనరులశాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్ కుమార్ పరిశీలించి వెళ్ళారు.
నాణ్యతలో రాజీవద్దు: మంత్రి ఉమా
గండి పూడ్చివేత పనుల్లో రాజీపడకూడదని జలవనరుల మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు. అప్రాన్, గండి పూడ్చివేత పనులను ఎలాంటి హడావుడి లేకుండా పూర్తిచేయాలన్నారు. మంత్రితో పాటు జలవనరులశాఖ అపెక్స్ కమిటీ సభ్యులు ఆళ్ల గోపాలకృష్ణ, తూర్పు డెల్టా ప్రాజెక్టు కమిటీ చైర్మన్ గుత్తా శివరామకృష్ణ, ఈఎన్‌సీ ఎం వెంకటేశ్వరరావు తదితరులున్నారు.
Advertisement