బ్లాస్టింగ్‌ జరగకుండానే ప్రమాదం | Under Tunnel Accident | Sakshi
Sakshi News home page

బ్లాస్టింగ్‌ జరగకుండానే ప్రమాదం

Published Fri, Sep 22 2017 1:54 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM

బ్లాస్టింగ్‌ జరగకుండానే ప్రమాదం - Sakshi

బ్లాస్టింగ్‌ జరగకుండానే ప్రమాదం

రాక్‌బౌల్టింగ్‌ ఉన్నా కూలిపడటం దురదృష్టకరం: హరీశ్‌రావు
► దుర్ఘటనపై ఉన్నతాధికారులు, నిపుణులతో కమిటీ
► ఇలాంటివి మళ్లీ ఎక్కడా జరగకుండా చర్యలు చేపడతాం
► కార్మికుల కుటుంబాలకు అండగా నిలుస్తామని హామీ
► ప్రమాద స్థలాన్ని పరిశీలించిన మంత్రి


సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: కాళేశ్వరం ప్రాజెక్టు 10 ప్యాకేజీలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం తిప్పాపూర్‌ శివారులో జరుగుతున్న సొరంగం (అండర్‌ టన్నెల్‌) పనుల్లో జరిగిన ప్రమాదం దురదృష్టకరమని భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పేర్కొన్నారు. దుర్ఘటన జరిగిన తీరుపై ఇంజనీర్లతో మాట్లాడామని.. ఎలాంటి బ్లాస్టింగ్‌ జరగకుండానే బండరాయి కూలిపడి ప్రమాదం జరిగిందని తెలిపారు. గురువారం జిల్లా కలెక్టర్‌ భాస్కర్, ఎస్పీ విశ్వజిత్, ఇంజనీరింగ్‌ అధికారులతో కలసి హరీశ్‌రావు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. అనంతరం అక్కడే విలేకరులతో మాట్లాడారు.

సొరంగం నిర్మాణంలో రక్షణ చర్యల్లో భాగంగా రెండు, మూడు టన్నుల బరువుండే రాళ్లు కూడా పడకుండా రాక్‌బౌల్టును ఏర్పాటు చేశారని.. బుధవారం పడిపోయిన రాయికి కూడా రాక్‌బౌల్టింగ్‌ వేశారని వివరించారు. కానీ ఊహించని విధంగా రాక్‌బౌల్టింగ్‌తో సహా రాయి పడిపోయినట్లు స్పష్టంగా కనబడుతోందని చెప్పారు. మృతుల కుటుంబాలను ఆదుకోవడంపై ఏజెన్సీతో మాట్లాడామని, ఒక్కో కుటుంబానికి రూ.20 లక్షలు ఎక్స్‌గ్రేషియాగా ప్రకటించామని హరీశ్‌ తెలిపారు. హైదరాబాద్‌లో సాగునీటి శాఖ ఉన్నతాధికారులు ఈ ఘటనపై చర్చించారని, విచారణకు ఒక కమిటీని వేశారని ఆయన  వెల్లడించారు.

నలుగురు అధికారులతో కమిటీ
జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా రిటైర్డ్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఎం.రాజు, సీనియర్‌ జియాలజిస్టు రవీంద్రనాథ్, ఈఎస్‌సీలు అనిల్, నాగేందర్‌ సభ్యులుగా కమిటీ వేశామని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. డైరెక్టర్‌ జనరల్‌ ఎం.రాజుకు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పనిచేసిన అనుభవం ఉన్నందున ఈ బాధ్యతలు అప్పగించామన్నారు. దుర్ఘటనపై పూర్తిస్థాయి అధ్యయనం జరిపి 15 రోజుల్లో నివేదిక ఇవ్వాల్సిందిగా సూచించినట్లు తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా పూర్తిస్థాయిలో చేపట్టాల్సిన జాగ్రత్తలు, చర్యలపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని కమిటీని కోరామన్నారు. దురదృష్టవశాత్తు మరణించిన ఏడుగురి కుటుంబాలను ఆదుకుంటామన్నారు. అదే విధంగా రాష్ట్రంలో జరిగే అన్ని టన్నెల్‌ పనుల వద్ద కూడా జాగ్రత్తలు తీసుకునేలా చర్యలు చేపడతామని తెలిపారు.

ప్రాజెక్టుల పేరుతో ప్రాణాలు తీస్తున్నారు: లక్ష్మణ్‌
కూలిన సొరంగాన్ని పరిశీలించిన విపక్ష నేతలు
ఇల్లంతకుంట (మానకొండూర్‌): ప్రాజెక్టుల పేరుతో రాష్ట్ర ప్రభు త్వం కూలీల ప్రాణాలు తీస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ ఆరోపించారు. ప్రాజెక్టుల రీడిజైనింగ్‌ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలను కాంట్రాక్టర్లకు ధారాదత్తం చేస్తోందని, కమీషన్ల కోసమే రీడిజైనింగ్‌ చేపట్టిందన్నారు. అసలు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి పర్యావరణ అనుమతులే రాలేదని, అయినా అవసరం లేని చోట ప్రభుత్వం ప్రాజెక్టులు కడుతోం దన్నారు. తిప్పాపూర్‌ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టు సొరంగంలో జరిగిన ప్రమాద ప్రాంతాన్ని లక్ష్మణ్‌ సహా పలువురు బీజేపీ, కాంగ్రెస్‌ నేతలు వేర్వేరుగా పరిశీలించారు. ప్రమాదం జరిగిన సొరంగం ప్రాంతానికి వెళ్లకుండా విపక్ష నేతలు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు.

కొంతసేపు వా గ్వాదం తర్వాత ఒక్కో పార్టీ నుంచి కొంత మందిని మాత్రమే వేర్వేరుగా పరిశీలనకు అనుమతించారు. ప్రమాద స్థలాన్ని పరిశీలించిన అనంతరం లక్ష్మణ్‌ మాట్లాడారు. సొరంగం ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ రాక్‌ మెకానిజం పర్యవేక్షణలో సొరం గం పనులు చేయాల్సి ఉండగా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని, కాంట్రాక్టు కంపెనీ ఇష్టారీతిగా పనులు చేస్తోందని ఆరోపించారు. అందువల్లే ప్రమాదం జరిగిందని.. వారికి రూ.20 లక్షల చొప్పున ఇచ్చి చేతులు దులుపుకొనేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. మృతుల కుటుంబాలకు మైనింగ్‌ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టులో మైనింగ్‌ చట్టం ప్రకారం పనులు చేపట్టకనే ప్రమాదం జరిగిందని.. ఈ ఘటనపై మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తామని కాంగ్రెస్‌ నేత ఆరెపల్లి మోహన్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement