సమావేశంలో ప్రసంగిస్తున్న మంత్రి హరీశ్‌రావు
వర్గల్(గజ్వేల్): ప్రత్యర్థుల డిపాజిట్లు గల్లంతు చేసి కేసీఆర్‌ను భారీ మెజారిటీతో గెలిపించడం ద్వారా గజ్వేల్ పేరును ఢిల్లీలో మారుమోగేలా చేయాలని మంత్రి హరీశ్‌రావు టీఆర్‌ఎస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బుధవారం సిద్దిపేట జిల్లా వర్గల్‌లో జరిగిన మండల టీఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశానికి ఆయన ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డితో కలసి హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ ‘చంటి పోరన్ని అడిగినా, పండు ముసలమ్మను అడిగినా ఈ రాష్ట్రంలో, గజ్వేల్ లో కారు గుర్తు, కేసీఆర్ గెలుస్తడని చెబుతున్నారు’అని అన్నారు.
మనకు కావలసింది గెలుపొక్కటే కాదని, ప్రత్యర్థుల డిపాజిట్లు గల్లంతు చేయాలని అన్నారు. కాంగ్రెస్ పాలనలో ‘వానపడితే పోలీస్ స్టేషన్ల కాడ ఎరువుల బస్తాల కోసం రాత్రీ, పగలూ క్యూకట్టిన విషయం రైతన్నలు మరచిపోవద్దు’అని మంత్రి గుర్తు చేశారు. రైతు బిడ్డగా కేసీఆర్ చేపట్టిన పథకాలు, కార్యక్రమాలతో ఆ కష్టాలన్నీ దూరమయ్యాయన్నారు. 2 పంటలు పండేలా గోదావరి జలాలు మన ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసే రోజు ఎంతో దూరంలో లేదన్నారు.
ఏ ఎండకు ఆ గొడుగు అన్నట్లు రాత్రికి రాత్రే కండువాలు మార్చే అవకాశవాద నాయకులను నమ్మొద్దని పరోక్షంగా ప్రతాప్‌రెడ్డిని ఉద్దేశిస్తూ విమర్శించారు. కాంగ్రెస్ వాళ్లు ఇచ్చే క్వార్టర్ సీసాలు ముఖ్యమా? ఇంటింటికి వచ్చే నల్లా నీళ్లు ముఖ్యమా ఆలోచించుకోవాలన్నారు. కాంగ్రెస్, బీజేపీలు తమకు పోటీయే కాదని, టీఆర్‌ఎస్‌కు మెజారిటీ విషయంలో ఒక మండలానికి, మండలానికి మధ్య పోటీ ఉందని అన్నారు. చేసిన అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లి ఓటు వేయాలంటూ అభ్యర్థించాలని ఈ సందర్భంగా హరీశ్‌రావు టీఆర్‌ఎస్ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.
బీజేపీ ప్రభుత్వం రైతులకు క్షమాపణ చెప్పాలి
సమస్యలు చెప్పుకునేందుకు ఢిల్లీకి వచ్చిన రైతులపై కేంద్రం వాటర్ కేనన్‌లతో దాడిచేసి అవమానించిందని మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు. రైతులను అవమానించిన బీజేపీ పాలకులు తక్షణమే వారికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమం లో పలువురు కాంగ్రెస్, టీడీపీ కార్యకర్తలు మంత్రి సమక్షంలో టీఆర్‌ఎస్ కండువాలు కప్పుకున్నారు. కార్యక్రమంలో టూరిజం విభాగం చైర్మన్ పన్యాల భూపతిరెడ్డి, ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ గంగుమల్ల ఎలక్షన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment