other parties
-
రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చడానికి... రూ.6,300 కోట్లు వెచ్చించింది
న్యూఢిల్లీ: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మరోసారి విరుచుకుపడ్డారు. బీజేపీయేతర రాష్ట్రాల్లో ప్రభుత్వాలను పడగొట్టేందుకు ఏకంగా రూ.6,300 కోట్లు వెచ్చించిందని శనివారం తీవ్ర ఆరోపణలు చేశారు. ‘‘బీజేపీ ఆ పని చేయకపోతే ఆహార పదార్థాలపై జీఎస్టీ విధించే అవసరమే ఉండేది కాదు. ప్రజలకు ధరాఘాతం తప్పేది’’ అని ఢిల్లీ అసెంబ్లీలో మాట్లాడుతూ నిప్పులు చెరిగారు. ‘‘పెట్రోల్, డీజిల్‌పై పన్నులు, జీఎస్టీ సొమ్ములను ఎమ్మెల్యేలను కొనేందుకు బీజేపీ వెచ్చిస్తోంది. ప్రజా సమస్యలను పక్కన పెట్టి పడుతుంటే ఇతర పార్టీల ప్రభుత్వాలను కూలదోయడంలో బిజీగా ఉంది’’ అన్నారు. బీజేపీలో చేరాలంటూ రూ.20 కోట్లు చొప్పున ఆశ చూపారని ఆప్ ఎమ్మెల్యేలు ఇటీవల ఆరోపించడం తెలిసిందే. అస్సాం సీఎం, కేజ్రీవాల్ ట్విట్టర్ వార్ కేజ్రీవాల్, అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ మధ్య ట్విట్టర్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో, అస్సాంలో సర్కారీ స్కూళ్ల పరిశీలనకు ఎప్పుడు రమ్మంటారని కేజ్రీవాల్ ప్రశ్నించారు. మరోవైపు, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌తోనూ కేజ్రీవాల్‌కు విభేదాలు ముదురుతున్నాయి. కేజ్రీవాల్ సంతకాలు లేవంటూ 47 ఫైళ్లను ఎల్జీ తిప్పిపంపారు. -
ప్రతిపక్ష ఎంపీలపై బీజేపీ వల!
న్యూఢిల్లీ: రాజ్యసభలో సంఖ్యాపరంగా ప్రతిపక్షం కంటే వెనుకబడిన అధికార బీజేపీ బలం పెంచుకునే ప్రయత్నాల్లో పడింది. ఇందుకోసం గత కొన్ని రోజులుగా ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎంపీలను మచ్చిక చేసుకుంటోంది. దీని ఫలితంగానే రాజ్యసభలో తెలుగుదేశం పార్టీకి ఉన్న ఆరుగురు సభ్యుల్లో నలుగురితోపాటు సమాజ్‌వాదీ పార్టీ సభ్యుడు, మాజీ ప్రధాని చంద్రశేఖర్ కొడుకు నీరజ్ శేఖర్ ఇటీవల కాషాయ కండువా కప్పుకున్నారు. సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ వైఖరితో తీవ్ర అసంతృప్తితో ఉన్న మరి కొందరు కూడా త్వరలో బీజేపీలో చేరనున్నట్లు నీరజ్ శేఖర్ అంటున్నారు. ప్రతిపక్షాలకు చెందిన ఇంకొందరు కూడా ‘కాషాయ’బాటలో నడిచేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఊహాగానాలు వస్తున్నాయి. 245 మంది సభ్యులున్న రాజ్యసభలో ప్రస్తుతం బీజేపీ బలం 78కి చేరుకుంది. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలతో వచ్చే ఏడాది కల్లా రాజ్యసభలో అధికార ఎన్డీఏకి మెజారిటీ దక్కే అవకాశముంది. తాజా పరిణామాల నేపథ్యంలో ఆలోగానే బీజేపీకి రాజ్యసభలో పైచేయి సాధించే అవకాశాలున్నాయంటున్నారు. అయితే, ఎన్డీఏలోని జేడీయూ వంటి పార్టీలు బీజేపీ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ట్రిపుల్ తలాక్, పౌరసత్వ బిల్లు వంటి కీలక అంశాలపై ప్రభుత్వానికి మద్దతు ఇవ్వకపోయే అవకాశాలున్నాయి. ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకే బలం పెంచుకునేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నామని బీజేపీ నేత ఒకరు అన్నారు. ఇందులో భాగంగానే ఒడిశాలోని మూడు రాజ్యసభ సీట్లలో ఒకటి కైవసం చేసుకునేందుకు ఆ రాష్ట్ర సీఎం, బీజేడీ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్‌తో ప్రధాని మోదీ సహా పలువురు కీలక నేతలు మంతనాలు సాగిస్తున్నారు. -
ఎన్డీయేయేతర పార్టీలకు సోనియా ఆహ్వానం!
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: తమకు 300 పైచిలుకు సీట్లు వస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా చెబుతున్నప్పటికీ.. కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన మెజారిటీ బీజేపీకి రాకపోవచ్చని కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు అంచనా వేస్తున్నాయి. కాషాయ పార్టీని అధికారానికి దూరంగా ఉంచే లక్ష్యంతో పావులు కదుపుతున్నాయి. ఈ క్రమంలోనే యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ ఈ నెల 23న ఎన్డీయేయేతర పార్టీలు, ఇతర భావసారూప్య పార్టీలతో సమావేశం నిర్వహించనున్నారు. పలు ప్రధాన ప్రాంతీయ పార్టీలతో సహా 20కి పైగా ప్రతిపక్ష పార్టీలతో ఇప్పటికే చర్చలు ప్రారంభమైనట్లు తెలుస్తోంది. 23న లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడనున్న సంగతి విదితమే. ఈ నేపథ్యంలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్, డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్‌లతో పాటు ఆర్జేడీ, టీఎంసీ వంటి లౌకిక, తటస్థ పార్టీల నేతలను సోనియా ఈ సమావేశానికి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ప్రతిపక్ష పార్టీల నేతలు అందుబాటులో ఉండటాన్ని బట్టి ఈ సమావేశం 21 లేదా 22వ తేదీన కూడా జరిగే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఈ అంశంలో సమన్వయం కోసం నలుగురు కాంగ్రెస్ నేతలతో ఒక బృందం ఏర్పాటైనట్లు విశ్వసనీయవర్గాలు వెల్లడించాయి. సీనియర్ నేతలు అహ్మద్ పటేల్, పి.చిదంబరం, గులాం నబీ ఆజాద్, అశోక్ గెహ్లోత్‌లతో కూడిన బృందం.. భావసారూప్య పార్టీలతో ఎన్నికల అనంతర పొత్తు అవకాశాలపై కసరత్తు చేస్తున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి. ఫ్రంట్ ఏర్పాటు యోచన బీజేపీకి మెజారిటీ రాదని కాంగ్రెస్ విశ్వసిస్తోందని, ఒకవేళ హంగ్ పార్లమెంట్ ఏర్పడిన నేపథ్యంలో బీజేపీకి ఎలాంటి అవకాశం చిక్కకుండా చేసే క్రమంలో ఓ ఫ్రంట్‌ను ముందుకు తేవాలని ఆ పార్టీ భావిస్తున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి. ప్రధానమంత్రి పదవిపై కాంగ్రెస్‌కు ఆసక్తి లేదని ఆజాద్ ఇప్పటికే ప్రకటించడంతో ఆ అంశం ఇందుకు ఆటంకం కాబోదని వివరించాయి. కర్ణాటకలో తమకు 78 మంది ఎమ్మెల్యేలున్నా, కేవలం 37 సీట్లున్న జేడీఎస్ నేత కుమారస్వామి ముఖ్యమంత్రి పదవి చేపట్టేందుకు మద్దతు పలికిన విషయం గుర్తు చేశాయి. పరిస్థితిని బట్టి వీలైతే ప్రతిపక్ష పార్టీల ప్రతినిధి బృందం 23నే రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలసి కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి పూర్తి రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాల్సిందిగా కోరాలని నిర్ణయించుకున్నట్లు వివరించాయి. -
మహబూబ్‌నగర్‌లో కాంగ్రెస్ ఖాళీ
ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి దెబ్బమీద దెబ్బ పడుతోంది. ఇప్పటికే అసెంబ్లీ ఫలితాలతో నిస్తేజంలో ఉన్న హస్తానికి వలసల గుబులు పట్టుకుంది. రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో ప్రారంభమైన వలసల సంస్కృతి ఇప్పుడు పాలమూరుకు వ్యాపించింది. ఇన్నాళ్లు పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న డీకే అరుణతో పాటు ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డి కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పారు. వీరితో పాటు పలువురు మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు, డీసీసీ అధ్యక్షులు, జెడ్పీటీసీ సభ్యులు సైతం టీఆర్ఎస్, బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. సోమవారం అర్ధరాత్రి సీనియర్ నేత, మాజీ మంత్రి డీకే అరుణ కాంగ్రెస్‌ను వీడి కమలం గూటికి చేరగా.. మరుసటి రోజే కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. ఇరువురి అనుచరులు సైతం వీరితో పాటు ఆయా పార్టీల్లో చేరేందుకు సిద్ధమవుతున్నారు. మరో వారం రోజుల్లో ఉమ్మడి పాలమూరు జిల్లాలో కాంగ్రెస్ నుంచి పెద్ద ఎత్తున వలసలు ఉంటాయని తెలుస్తోంది. అయితే ఇరువురు నేతలతో ఎవరెవరు పార్టీని వీడుతారో అనే చర్చ జిల్లాలో హాట్‌టాపిక్‌గా మారింది. ఒకవేళ ఇదే జరిగితే.. కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న పాలమూరులో రానున్న రోజుల్లో పార్టీకి గడ్డుకాలం రాబోతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ‘చే’జారుతోన్న క్యాడర్‌ను కాపాడుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. వలస వెళ్లిన ఇరువురు నేతల అనుచరులు పార్టీని వీడకుండా చర్యలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. జేజమ్మ వెంటే.. పాలమూరులో కాంగ్రెస్‌కు పెద్ద దిక్కుగా ఉన్న మాజీ మంత్రి డీకే అరుణ పార్టీ వీడడం వెనక చాలా కారణాలున్నాయి. ఉమ్మడి జిల్లా కాంగ్రెస్‌లో కేంద్ర మాజీ మంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి, మాజీ మంత్రి చిన్నారెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్, మాజీ ఎంపీ, టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లురవి, మాజీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి, నాగం జనార్దన్‌రెడ్డితో పాటు మాజీ మంత్రి డీకే అరుణ వంటి సీనియర్లు ఉన్నారు. వీరిలో పలువురు సీనియర్లకు, అరుణకు మధ్య వర్గ విభేదాలున్నాయి. తన క్యాడర్‌కు టికెట్లు, పార్టీ పోస్టులు ఇప్పించుకోవడంలో అరుణ సీనియర్లతో పోటీ పడేవారు. ముఖ్యంగా ఆమెకు జైపాల్‌రెడ్డికి మధ్య తీవ్రమైన పోటీ ఉండేది. పలు సందర్భాల్లో ఏఐసీసీ, టీపీసీసీ అరుణ ప్రతిపాదించిన వారిని కాదని ఇతరులకు టికెట్లు కేటాయించడంతో ఆమె నిరాశకు లోనయ్యారు. ముఖ్యంగా తాజాగా కాంగ్రెస్ ప్రకటించిన లోక్‌సభ అభ్యర్థుల గురించి తనతో చర్చించలేదని తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆమె పార్టీకి గుడ్‌బై చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఉమ్మడి జిల్లాలో దేవరకద్ర నుంచి వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిన డోకూరు పవన్‌కుమార్, మహబూబ్‌నగర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఎర్రశేఖర్, నారాయణపేట నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన కుంభం శివకుమార్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, జోగులాంబ గద్వాల జిల్లా డీసీసీ అధ్యక్షుడు పటేల్ ప్రభాకర్‌రెడ్డి, టీపీసీసీ సభ్యుడు గడ్డం కృష్ణారెడ్డి, ఆ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు బండల పద్మావతి, గద్వాల మున్సిపల్ చైర్పర్సన్ కృష్ణవేణి తదితరులు అరుణతో కలిసి కమల దళంలో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. ‘బీరం’తో పాటు ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు నాగర్‌కర్నూల్ జిల్లాకు సంబంధించి కాంగ్రెస్ తరఫున పోటీచేసి గెలుపొందిన కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి బుధవారం హైదరాబాద్‌లో గులాబీ కండువా కప్పుకున్నారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న కొల్లాపూర్–సిద్ధేశ్వరం వంతెన, శ్రీశైలం ముంపు బాధితులను ఆదుకుంటామని కేసీఆర్ హామీ ఇవ్వడంతోనే ఆయన కాంగ్రెస్‌ను వీడినట్లు ప్రకటించారు. బీరం హర్షవర్ధన్‌రెడ్డితో పాటే ఇంకొందరు నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా నాగరకర్నూల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు చిక్కిడు వంశీకృష్ణ కూడా వలస వెళ్లే వారి జాబితాలో ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం వంశీకృష్ణ భార్య అనురాధ అమ్రాబాద్ జెడ్పీటీసీగా ఉన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి అమ్రాబాద్ మండలం ఎస్సీ జనరల్‌కు రిజర్వ్ కావడం, జెడ్పీ చైర్మన్ కూడా ఎస్సీ జనరల్‌కు రిజర్వ్ కావడంతో ఈ పదవి కోసం వంశీకృష్ణ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అనుకున్నట్లు ముఖ్యమంత్రి నుంచి హామీ వస్తే హర్షవర్ధన్‌తో పాటు పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. ఎస్సీ సామాజిక వర్గం నుంచి పెద్దగా పేరున్న నాయకుడు లేకపోవడం, ఎమ్మెల్యేగా చేసిన అనుభవం ఉండడం వంశీకృష్ణకు కలిసొచ్చే అంశాలుగా చెప్పవచ్చు. మరోవైపు షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే ప్రతాప్‌రెడ్డితో పాటు పారిశ్రామికవేత్త అనిరుధ్‌రెడ్డి కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పేందుకు నిర్ణయించినట్లు తెలుస్తోంది. అనిరుధ్‌రెడ్డికి మహబూబ్‌నగర్ జెడ్పీ చైర్మన్ పదవి ఇచ్చేందుకు కేటీఆర్ అంగీకరించినట్లు సమాచారం. -
డిపాజిట్లు గల్లంతు కావాలి
వర్గల్(గజ్వేల్): ప్రత్యర్థుల డిపాజిట్లు గల్లంతు చేసి కేసీఆర్‌ను భారీ మెజారిటీతో గెలిపించడం ద్వారా గజ్వేల్ పేరును ఢిల్లీలో మారుమోగేలా చేయాలని మంత్రి హరీశ్‌రావు టీఆర్ఎస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బుధవారం సిద్దిపేట జిల్లా వర్గల్లో జరిగిన మండల టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశానికి ఆయన ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డితో కలసి హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ ‘చంటి పోరన్ని అడిగినా, పండు ముసలమ్మను అడిగినా ఈ రాష్ట్రంలో, గజ్వేల్ లో కారు గుర్తు, కేసీఆర్ గెలుస్తడని చెబుతున్నారు’అని అన్నారు. మనకు కావలసింది గెలుపొక్కటే కాదని, ప్రత్యర్థుల డిపాజిట్లు గల్లంతు చేయాలని అన్నారు. కాంగ్రెస్ పాలనలో ‘వానపడితే పోలీస్ స్టేషన్ల కాడ ఎరువుల బస్తాల కోసం రాత్రీ, పగలూ క్యూకట్టిన విషయం రైతన్నలు మరచిపోవద్దు’అని మంత్రి గుర్తు చేశారు. రైతు బిడ్డగా కేసీఆర్ చేపట్టిన పథకాలు, కార్యక్రమాలతో ఆ కష్టాలన్నీ దూరమయ్యాయన్నారు. 2 పంటలు పండేలా గోదావరి జలాలు మన ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసే రోజు ఎంతో దూరంలో లేదన్నారు. ఏ ఎండకు ఆ గొడుగు అన్నట్లు రాత్రికి రాత్రే కండువాలు మార్చే అవకాశవాద నాయకులను నమ్మొద్దని పరోక్షంగా ప్రతాప్‌రెడ్డిని ఉద్దేశిస్తూ విమర్శించారు. కాంగ్రెస్ వాళ్లు ఇచ్చే క్వార్టర్ సీసాలు ముఖ్యమా? ఇంటింటికి వచ్చే నల్లా నీళ్లు ముఖ్యమా ఆలోచించుకోవాలన్నారు. కాంగ్రెస్, బీజేపీలు తమకు పోటీయే కాదని, టీఆర్ఎస్కు మెజారిటీ విషయంలో ఒక మండలానికి, మండలానికి మధ్య పోటీ ఉందని అన్నారు. చేసిన అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లి ఓటు వేయాలంటూ అభ్యర్థించాలని ఈ సందర్భంగా హరీశ్‌రావు టీఆర్ఎస్ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. బీజేపీ ప్రభుత్వం రైతులకు క్షమాపణ చెప్పాలి సమస్యలు చెప్పుకునేందుకు ఢిల్లీకి వచ్చిన రైతులపై కేంద్రం వాటర్ కేనన్లతో దాడిచేసి అవమానించిందని మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు. రైతులను అవమానించిన బీజేపీ పాలకులు తక్షణమే వారికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమం లో పలువురు కాంగ్రెస్, టీడీపీ కార్యకర్తలు మంత్రి సమక్షంలో టీఆర్ఎస్ కండువాలు కప్పుకున్నారు. కార్యక్రమంలో టూరిజం విభాగం చైర్మన్ పన్యాల భూపతిరెడ్డి, ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ గంగుమల్ల ఎలక్షన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ముందస్తుకు సంకేతమా?
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: విపక్షాలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై చర్చ చేపట్టడానికి కేంద్రం అంగీకరించడంతో ముందస్తు ఎన్నికలపై ఊహాగానాలు మరోసారి ఊపందుకున్నాయి. లోక్‌సభ ఎన్నికలను ముందుకు జరిపే విశేష అధికారం ప్రధానికే ఉన్నా, చివరి నిమిషం లెక్కలను బేరీజు వేసుకుని ఆ దిశగా అడుగేసే అవకాశాలున్నాయి. 2019 సాధారణ ఎన్నికలకు ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించడానికి ఇంకా 7–8 నెలల సమయమే మిగిలి ఉన్న నేపథ్యంలో మోదీ ఆలోచన ఏంటో ఊహించడం కష్టమని, ఏదైనా జరగొచ్చని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) సభ్యుడు ఒకరు వెల్లడించారు. మరోవైపు, రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లతో పాటే లోక్‌సభ ఎన్నికలు జరుగుతాయన్న ఊహాగానాలను బీజేపీ వర్గాలు తోసిపుచ్చాయి. ఈ పార్లమెంట్ సమావేశాల్లో కొన్ని కీలక బిల్లులపై చర్చ తప్ప, ముందస్తు ఎన్నికలపై ఆలోచించడం లేదని కేంద్ర మంత్రి ఒకరు తెలిపారు. జాగ్రత్తగా పరిశీలిస్తున్న కాంగ్రెస్, లెఫ్ట్.. ఇటీవల ప్రధాని మోదీ వరుసగా యూపీలో పర్యటించిన సంగతిని విపక్షాలు జాగ్రత్తగా పరిశీలిస్తున్నాయి. ముందస్తు ఎన్నికలకు బీజేపీ అన్ని అవకాశాలను సిద్ధం చేసుకుంటోందా? అని కాంగ్రెస్, లెఫ్ట్‌లో అంతర్మథనం మొదలైనట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రచారం, ప్రచారకర్తకు ఎదురయ్యే సమస్యలు ముందుగానే తెలుస్తాయని లెఫ్ట్ నాయకుడు ఒకరు వ్యాఖ్యానించారు. బీజేపీకి తగిన రాజకీయ అస్త్రాలు ఉన్నట్లయితే ఇతర పార్టీలు స్పందించేందుకూ అవకాశం ఇచ్చేదని, కానీ ఇప్పుడా పరిస్థితి లేదని అన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా దేశవ్యాప్తంగా పర్యటిస్తూ ‘సంపర్క్ కే సమర్థన్’ పేరిట ప్రముఖులతో సమావేశమై ఎన్డీయే ప్రభుత్వ విజయాలను వివరిస్తున్నారు. సుమారు 100 మంది సిట్టింగ్ ఎంపీలు ఈసారి అవకాశం కోల్పోవచ్చని అమిత్ షా పర్యటనల్లో తెలిసినట్లు బీజేపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మరోవైపు, మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో బీజేపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని ఆరెస్సెస్ ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. -
కొత్తగా పార్టీలోకి వచ్చినోళ్లకూ బీజేపీ టికెట్లు
బెంగళూరు: కర్ణాటకలో శాసనసభ ఎన్నికలు దగ్గరికొస్తున్న తరుణంలో ఇటీవలే ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరిన అనేక మందికి ఆ పార్టీ టికెట్లు కేటాయించింది. కర్ణాటకలో మొత్తం 224 అసెంబ్లీ స్థానాలుండగా 72 మంది అభ్యర్థుల జాబితాను తొలి విడతగా బీజేపీ ఆదివారం విడుదలచేయడం తెల్సిందే. వీరిలో 11 మంది ఇతర పార్టీల నుంచి ఇటీవల బీజేపీలోకొచ్చినవారే. వీరిలో చాలా మంది శాసనసభ సభ్యులే. కొంత మంది గతంలో మంత్రులుగా చేశారు. బీజేపీ తొలి విడత అభ్యర్థుల జాబితాలో పేర్లున్నవారిలో దాదాపు అందరూ ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్న వారే. బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి బీఎస్ యడ్యూరప్ప షికారిపుర నుంచి పోటీ చేయనున్నారు. 72 మంది అభ్యర్థుల్లో మహిళలు ముగ్గురే ఉన్నారు. -
వాళ్లకూ వీళ్లకూ 'ఓ' ఒకటే తేడా అట...
న్యూఢిల్లీ: విదేశీ వ్యవహారాల శాఖ సహాయమంత్రి జనరల్ వీకే సింగ్ తన వ్యాఖ్యలతో మరో వివాదానికి తెర లేపారు. మీడియా నుద్దేశించి ప్రెస్టిస్ట్యూట్స్ అంటూ ట్విట్టర్లో కామెంట్ పోస్ట్ చేశారు. ''presstitutes నుంచి మనం ఇంకేం ఆశించగలం.. అయినా అర్ణబ్ ఇంతకుముందు E స్థానంలో Oని ఊహించుకుంటున్నారు'' అంటూ.. మీడియాని ఉద్దేశించి వ్యాఖ్యానించడంతో పెద్ద దుమారం రేగుతోంది. ప్రతిపక్షాలు, మీడియా సంస్థలు కేంద్రమంత్రిపై తీవ్రస్ధాయిలో ధ్వజమెత్తాయి. బ్రాడ్కాస్ట్ ఎడిటర్స్ అసోసియేషన్ మంత్రి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది. ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేలా ఉన్న మంత్రి వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎన్‌కె సింగ్ చెప్పారు. కేంద్రమంత్రివర్గ సభ్యుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. మరోవైపు కాంగ్రెస్ నాయకులు మనీష్ తివారీ, షకీల్ అహ్మద్ మంత్రి వ్యాఖ్యలకు ప్రధాని బాధ్యత వహించాలంటూ మోదీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. తక్షణమే వీకేసింగ్ను మంత్రి పదవి నుంచి తొలగించాలని వారు డిమాండ్ చేశారు. ఎన్సీపీ నాయకుడు తారిఖ్ అన్వర్ దీనిపై స్పందిస్తూ మీడియాపై ఇలాంటి వ్యాఖ్యలు మంత్రికి తగవన్నారు. ఇప్పటికైనా ప్రధాని స్పందించాలన్నారు. తరచూ ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వివాదం సృష్టిస్తున్న మంత్రిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నైతికతను మంటగలిపేలా వీకే సింగ్ వ్యాఖ్యలు ఉన్నాయని ఎన్సీపీ, ప్రజాస్వామ్యపు విలువను కనీసం అర్థచేసుకోలేని వ్యక్తి అని సమాజ్‌వాదీ పార్టీ, బాధ్యతారహితమైన వ్యాఖ్యలని జేడీయూ పార్టీ తీవ్రంగా విమర్శించాయి. యెమెన్‌లో చిక్కుకున్న భారతీయులను తరలించడానికి జరుగుతున్న ఏర్పాట్లను పర్యవేక్షించడానికి వీకే సింగ్ జిబౌటీ వెళ్లిన సంగతి తెలిసిందే. పాకిస్ధానీ డే సెలబ్రేషన్స్‌కు హాజరవడంపై మీడియాలో పలు కథనాలు రావడంతో మీడియాను ఉద్దేశించి వీకే సింగ్ పైవ్యాఖ్యలు చేశారని సమాచారం. Friends what do you you expect from presstitutes. Last time Arnab thought there was 'O' in place of 'E' #TimesNowDisaster — Vijay Kumar Singh (@Gen_VKSingh) April 7, 2015 -
వాళ్లు టీఆర్ఎస్లో చేరింది అందుకే!