సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: తమకు 300 పైచిలుకు సీట్లు వస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా చెబుతున్నప్పటికీ.. కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన మెజారిటీ బీజేపీకి రాకపోవచ్చని కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు అంచనా వేస్తున్నాయి. కాషాయ పార్టీని అధికారానికి దూరంగా ఉంచే లక్ష్యంతో పావులు కదుపుతున్నాయి. ఈ క్రమంలోనే యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ ఈ నెల 23న ఎన్డీయేయేతర పార్టీలు, ఇతర భావసారూప్య పార్టీలతో సమావేశం నిర్వహించనున్నారు. పలు ప్రధాన ప్రాంతీయ పార్టీలతో సహా 20కి పైగా ప్రతిపక్ష పార్టీలతో ఇప్పటికే చర్చలు ప్రారంభమైనట్లు తెలుస్తోంది. 23న లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడనున్న సంగతి విదితమే.
ఈ నేపథ్యంలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్, డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్‌లతో పాటు ఆర్జేడీ, టీఎంసీ వంటి లౌకిక, తటస్థ పార్టీల నేతలను సోనియా ఈ సమావేశానికి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ప్రతిపక్ష పార్టీల నేతలు అందుబాటులో ఉండటాన్ని బట్టి ఈ సమావేశం 21 లేదా 22వ తేదీన కూడా జరిగే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఈ అంశంలో సమన్వయం కోసం నలుగురు కాంగ్రెస్ నేతలతో ఒక బృందం ఏర్పాటైనట్లు విశ్వసనీయవర్గాలు వెల్లడించాయి. సీనియర్ నేతలు అహ్మద్ పటేల్, పి.చిదంబరం, గులాం నబీ ఆజాద్, అశోక్ గెహ్లోత్‌లతో కూడిన బృందం.. భావసారూప్య పార్టీలతో ఎన్నికల అనంతర పొత్తు అవకాశాలపై కసరత్తు చేస్తున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి.
ఫ్రంట్ ఏర్పాటు యోచన
బీజేపీకి మెజారిటీ రాదని కాంగ్రెస్ విశ్వసిస్తోందని, ఒకవేళ హంగ్ పార్లమెంట్ ఏర్పడిన నేపథ్యంలో బీజేపీకి ఎలాంటి అవకాశం చిక్కకుండా చేసే క్రమంలో ఓ ఫ్రంట్‌ను ముందుకు తేవాలని ఆ పార్టీ భావిస్తున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి. ప్రధానమంత్రి పదవిపై కాంగ్రెస్‌కు ఆసక్తి లేదని ఆజాద్ ఇప్పటికే ప్రకటించడంతో ఆ అంశం ఇందుకు ఆటంకం కాబోదని వివరించాయి. కర్ణాటకలో తమకు 78 మంది ఎమ్మెల్యేలున్నా, కేవలం 37 సీట్లున్న జేడీఎస్ నేత కుమారస్వామి ముఖ్యమంత్రి పదవి చేపట్టేందుకు మద్దతు పలికిన విషయం గుర్తు చేశాయి. పరిస్థితిని బట్టి వీలైతే ప్రతిపక్ష పార్టీల ప్రతినిధి బృందం 23నే రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలసి కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి పూర్తి రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాల్సిందిగా కోరాలని నిర్ణయించుకున్నట్లు వివరించాయి.
ఎన్డీయేయేతర పార్టీలకు సోనియా ఆహ్వానం!
Published Fri, May 17 2019 4:01 AM | Last Updated on Fri, May 17 2019 4:01 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment