
ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి దెబ్బమీద దెబ్బ పడుతోంది. ఇప్పటికే అసెంబ్లీ ఫలితాలతో నిస్తేజంలో ఉన్న హస్తానికి వలసల గుబులు పట్టుకుంది. రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో ప్రారంభమైన వలసల సంస్కృతి ఇప్పుడు పాలమూరుకు వ్యాపించింది. ఇన్నాళ్లు పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న డీకే అరుణతో పాటు ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డి కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పారు. వీరితో పాటు పలువురు మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు, డీసీసీ అధ్యక్షులు, జెడ్పీటీసీ సభ్యులు సైతం టీఆర్‌ఎస్, బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. సోమవారం అర్ధరాత్రి సీనియర్ నేత, మాజీ మంత్రి డీకే అరుణ కాంగ్రెస్‌ను వీడి కమలం గూటికి చేరగా.. మరుసటి రోజే కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. ఇరువురి అనుచరులు సైతం వీరితో పాటు ఆయా పార్టీల్లో చేరేందుకు సిద్ధమవుతున్నారు. మరో వారం రోజుల్లో ఉమ్మడి పాలమూరు జిల్లాలో కాంగ్రెస్ నుంచి పెద్ద ఎత్తున వలసలు ఉంటాయని తెలుస్తోంది. అయితే ఇరువురు నేతలతో ఎవరెవరు పార్టీని వీడుతారో అనే చర్చ జిల్లాలో హాట్‌టాపిక్‌గా మారింది.
ఒకవేళ ఇదే జరిగితే.. కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న పాలమూరులో రానున్న రోజుల్లో పార్టీకి గడ్డుకాలం రాబోతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ‘చే’జారుతోన్న క్యాడర్‌ను కాపాడుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. వలస వెళ్లిన ఇరువురు నేతల అనుచరులు పార్టీని వీడకుండా చర్యలు ప్రారంభించినట్లు తెలుస్తోంది.
జేజమ్మ వెంటే..
పాలమూరులో కాంగ్రెస్‌కు పెద్ద దిక్కుగా ఉన్న మాజీ మంత్రి డీకే అరుణ పార్టీ వీడడం వెనక చాలా కారణాలున్నాయి. ఉమ్మడి జిల్లా కాంగ్రెస్‌లో కేంద్ర మాజీ మంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి, మాజీ మంత్రి చిన్నారెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్, మాజీ ఎంపీ, టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లురవి, మాజీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి, నాగం జనార్దన్‌రెడ్డితో పాటు మాజీ మంత్రి డీకే అరుణ వంటి సీనియర్లు ఉన్నారు. వీరిలో పలువురు సీనియర్లకు, అరుణకు మధ్య వర్గ విభేదాలున్నాయి. తన క్యాడర్‌కు టికెట్లు, పార్టీ పోస్టులు ఇప్పించుకోవడంలో అరుణ సీనియర్లతో పోటీ పడేవారు. ముఖ్యంగా ఆమెకు జైపాల్‌రెడ్డికి మధ్య తీవ్రమైన పోటీ ఉండేది.
పలు సందర్భాల్లో ఏఐసీసీ, టీపీసీసీ అరుణ ప్రతిపాదించిన వారిని కాదని ఇతరులకు టికెట్లు కేటాయించడంతో ఆమె నిరాశకు లోనయ్యారు. ముఖ్యంగా తాజాగా కాంగ్రెస్ ప్రకటించిన లోక్‌సభ అభ్యర్థుల గురించి తనతో చర్చించలేదని తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆమె పార్టీకి గుడ్‌బై చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఉమ్మడి జిల్లాలో దేవరకద్ర నుంచి వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిన డోకూరు పవన్‌కుమార్, మహబూబ్‌నగర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఎర్రశేఖర్, నారాయణపేట నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన కుంభం శివకుమార్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, జోగులాంబ గద్వాల జిల్లా డీసీసీ అధ్యక్షుడు పటేల్ ప్రభాకర్‌రెడ్డి, టీపీసీసీ సభ్యుడు గడ్డం కృష్ణారెడ్డి, ఆ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు బండల పద్మావతి, గద్వాల మున్సిపల్ చైర్‌పర్సన్ కృష్ణవేణి తదితరులు అరుణతో కలిసి కమల దళంలో చేరుతారనే ప్రచారం జరుగుతోంది.
‘బీరం’తో పాటు ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు
నాగర్‌కర్నూల్ జిల్లాకు సంబంధించి కాంగ్రెస్ తరఫున పోటీచేసి గెలుపొందిన కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి బుధవారం హైదరాబాద్‌లో గులాబీ కండువా కప్పుకున్నారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న కొల్లాపూర్–సిద్ధేశ్వరం వంతెన, శ్రీశైలం ముంపు బాధితులను ఆదుకుంటామని కేసీఆర్ హామీ ఇవ్వడంతోనే ఆయన కాంగ్రెస్‌ను వీడినట్లు ప్రకటించారు. బీరం హర్షవర్ధన్‌రెడ్డితో పాటే ఇంకొందరు నాయకులు, కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ముఖ్యంగా నాగరకర్నూల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు చిక్కిడు వంశీకృష్ణ కూడా వలస వెళ్లే వారి జాబితాలో ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం వంశీకృష్ణ భార్య అనురాధ అమ్రాబాద్ జెడ్పీటీసీగా ఉన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి అమ్రాబాద్ మండలం ఎస్సీ జనరల్‌కు రిజర్వ్ కావడం, జెడ్పీ చైర్మన్ కూడా ఎస్సీ జనరల్‌కు రిజర్వ్ కావడంతో ఈ పదవి కోసం వంశీకృష్ణ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అనుకున్నట్లు ముఖ్యమంత్రి నుంచి హామీ వస్తే హర్షవర్ధన్‌తో పాటు పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు.
ఎస్సీ సామాజిక వర్గం నుంచి పెద్దగా పేరున్న నాయకుడు లేకపోవడం, ఎమ్మెల్యేగా చేసిన అనుభవం ఉండడం వంశీకృష్ణకు కలిసొచ్చే అంశాలుగా చెప్పవచ్చు. మరోవైపు షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే ప్రతాప్‌రెడ్డితో పాటు పారిశ్రామికవేత్త అనిరుధ్‌రెడ్డి కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పేందుకు నిర్ణయించినట్లు తెలుస్తోంది. అనిరుధ్‌రెడ్డికి మహబూబ్‌నగర్ జెడ్పీ చైర్మన్ పదవి ఇచ్చేందుకు కేటీఆర్ అంగీకరించినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment