రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాలకు, దిగ్గజ రాజకీయ నేతలకు పుట్టినిల్లుగా ఉన్న ఉమ్మడి పాలమూరు జిల్లాలో లోక్‌సభ పోరు రసవత్తరంగా మారింది. ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో కనీవినీ ఎరుగని రీతిలో విజయదుందుభి మోగించిన టీఆర్‌ఎస్ ఒకపక్క.. గతంలో ఎన్నడూ లేని మాదిరి పట్టు కోల్పోయిన కాంగ్రెస్ మరోపక్క.. కొత్త నేతల చేరికతో రేసులోకి దూసుకొచ్చిన బీజేపీ ఇంకోపక్క.. వెరసి త్రిముఖ పోరు నెలకొంది. కొత్త అభ్యర్థి మన్నె శ్రీనివాస్‌రెడ్డిని నిలబెట్టి, ఆ బాధ్యతనంతా మంత్రి, ఎమ్మెల్యేలపై పెట్టి టీఆర్‌ఎస్ ప్రచారంలో ముందుకు దూసుకుపోతుండగా, అనూçహ్య పరిణామాల మధ్య బీజేపీ తీర్థం పుచ్చుకొని పోటీలో నిలిచిన మాజీ మంత్రి డీకే అరుణ తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. నిన్నమొన్నటి వరకు గట్టి పోటీ ఇస్తుందనుకున్న కాంగ్రెస్.. నేతల వలసలు, సమన్వయ లోపంతో సతమతం అవుతోంది. ఆ పార్టీ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డి ఎదురీదుతున్నారు. ఇక్కడ కేంద్ర మాజీ మంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి ఏమాత్రం చక్రం తిప్పుతారనేది చూడాలి.- గ్రౌండ్ రిపోర్టు- సోమన్నగారి రాజశేఖర్‌రెడ్డి
మహిళా ఓటర్లే కీలకం..
మహబూబ్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గంలో మహిళా ఓటర్లదే కీలకపాత్ర. ప్రస్తుత ఎన్నికల్లో వీరే గెలుపోటములను ప్రభావితం చేయనున్నారు. ఇప్పటికే వృద్ధాప్య, వితంతు పింఛన్లు, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్ వంటి పథకాల ద్వారా మహిళా ఓటర్లను ఆకట్టుకునే పథకాలను రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాగా, కేంద్ర ప్రభుత్వ పథకాలను ముందుపెట్టి బీజేపీ, నెలకు రూ.6 వేల సాయం పథకాన్ని చూపిస్తూ కాంగ్రెస్ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి.
అప్పుడు ఒకేరోజు.. ఇప్పుడు కొద్ది తేడా
గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ, సీఎం కేసీఆర్ ఒకేరోజు (నవంబర్ 27న) మహబూబ్‌నగర్ నియోజకవర్గంలో నిర్వహించిన బహిరంగసభల్లో పాల్గొన్నారు. ఆ సభలో ముస్లిం రిజర్వేషన్లు, కేసీఆర్ కుటుంబ పాలనపై మోదీ చురకలంటించారు. దీనిపై సీఎం కేసీఆర్ సైతం ఘాటుగానే స్పందించారు. టీఆర్‌ఎస్, మజ్లి్లస్ మిత్రపక్షాలని, ఈ రెండూ కల్తీలేని తెలంగాణ పార్టీలని, కలిసిమెలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నామని ప్రకటించారు. తెలంగాణ రాగానే చంద్రబాబు, మోదీ కుట్రచేసి రాష్ట్రపతి పాలన పెట్టాలని చూశారని, ఈ సమయంలో మజ్లిస్ అధినేత ఒవైసీ తమకు మద్దతుగా నిలిచారని అన్నారు. ఈ ప్రచారంలో కేసీఆర్ నెగ్గుకురావడంతో మహబూబ్‌నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో టీఆర్‌ఎస్ గెలిచింది. తాజాగా ప్రధాని మోదీ మహబూబ్‌నగర్‌లో శుక్రవారం నిర్వహించిన బహిరంగసభలో పాల్గొన్నారు. మరోమారు కేసీఆర్‌పై విమర్శలు చేయగా, 31న సీఎం కేసీఆర్ ఇక్కడ జరిగే బహిరంగసభలో పాల్గొననున్నారు. ఆయన బీజేపీ, మోదీపై ఎలా స్పందిస్తారోననేది ఆసక్తిగా మారింది. ఇక సీఎం కేసీఆర్ సభను విజయవంతం చేసే బాధ్యతను లోక్‌సభ ఇన్‌చార్జి, రాష్ట్ర ఎక్సై జ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ నెత్తిన పెట్టుకున్నారు. కాంగ్రెస్ నుంచి జాతీయ స్థాయి నేతల పర్యటనలపై ఇంకా స్పష్టత రాలేదు. ఏప్రిల్ తొలి వారం నుంచి స్టార్ క్యాంపెయినర్లు రావచ్చని అంటున్నారు.
సాగునీరే ఎజెండా..
మహబూబ్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గంలో సాగునీరే ప్రధాన ఎజెండా కానుంది. కోయిల్‌సాగర్, బీమా ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు నీరిచ్చామని టీఆర్‌ఎస్ ఇక్కడ ప్రధానంగా ప్రచారం చేసుకుంటోంది. దీనికి తోడు పాలమూరు–ఎత్తిపోతల ద్వారా వట్టెం, కర్వెన, ఉద్ధండాపూర్ వంటి రిజర్వాయర్ల నిర్మాణం చేపట్టి సాగునీటి వసతిని పెంచనున్నట్లు ప్రచారం చేస్తున్నారు. కొత్తగా గోదావరి నీటిని కృష్ణాకు మళ్లించేలా చర్యలు మొదలయ్యాయని, దీని ద్వారా జడ్చర్ల, షాద్‌నగర్ ప్రాంతాల తాగు, సాగునీటి సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని అంటున్నారు. అయితే ఉద్ధండాపూర్, కర్వెన పరిధిలో భూ నిర్వాసితులకు పరిహారం అందకపోవడం, లక్ష్మీదేవునిపల్లి రిజర్వాయర్ పనులను ఇప్పటికీ చేపట్టకపోవడాన్ని బీజేపీ, కాంగ్రెస్ ప్రశ్నిస్తున్నాయి. నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకం మూలనపడటాన్ని ప్రతిపక్షాలు ప్రచారాస్త్రంగా మలచుకుంటున్నాయి. ఇక బీమా చివరి ఆయకట్టుకు నీరందడం లేదని, కోయిల్‌సాగర్‌లోనూ ఇదే పరిస్థితి ఉందని ప్రచారం చేస్తున్నాయి. చేనేత కార్మికులు ఎక్కువగా ఉండే నారాయణపేటలో హ్యాండ్లూమ్ పార్క్ ఏర్పాటు, దేవరకద్ర ప్రాంతంలో బీడీ కార్మికులకు ఈఎస్‌ఐ ఆస్పత్రి నిర్మాణం, నారాయణపేటలో సైనిక్ స్కూల్ నిర్మాణం, వికారాబాద్–కృష్ణా రైల్వే లైను వంటివి సైతం ఈ ఎన్నికల్లో ప్రధాన ప్రచారాస్త్రాలు కానున్నాయి.
కాంగ్రెస్ పరిస్థితి గందరగోళం
గతంలో కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న మహబూబ్‌నగర్‌లో కాంగ్రెస్ పరిస్థితి ప్రస్తుతం దీనంగా మారింది. ఇక్కడి నుంచి తిరిగి పోటీ చేసేందుకు కేంద్ర మాజీమంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి విముఖత చూపడం, పోటీకి నిలపాలని భావించిన డీకే అరుణ పార్టీ మారడంతో అనూహ్యంగా మాజీ ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి తెరపైకి వచ్చారు. గత ఎన్నికల్లో కేవలం 2,590 ఓట్లతో ఓడిన కాంగ్రెస్ ఈసారి మూడో స్థానం కోసం పోటీపడే అవకాశాలే ఎక్కువని రాజకీయ వర్గాల అంచనా. ఇప్పటికే షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే ప్రతాప్‌రెడ్డి పార్టీని వీడి టీఆర్‌ఎస్‌లో చేరారు. దేవరకద్ర నుంచి పోటీ చేసిన అభ్యర్ధి పవన్‌కుమార్‌రెడ్డి సైతం అదే బాటలో నడిచారు. మక్తల్ టికెట్‌ను గత ఎన్నికల్లో టీడీపీకి కేటాయించడంతో అసంతృప్తిగా ఉన్న కాంగ్రెస్ నేతలంతా ఇప్పుడు ఇతర పార్టీల్లోకి వెళ్లిపోయారు. నారాయణపేటలో జైపాల్‌రెడ్డి సిఫార్సుతో టికెట్ దక్కించుకున్న అభ్యర్థి నాలుగో స్థానానికే పరిమితమయ్యారు. ఇక జడ్చర్ల నుంచి పోటీ చేసిన మల్లు రవి నాగర్‌కర్నూల్ లోక్‌సభ బరిలో ఉండగా, కొడంగల్ నుంచి పోటీ చేసిన రేవంత్‌రెడ్డి మల్కాజ్‌గిరి లోక్‌సభ స్థానంలో పోటీలో ఉన్నారు. దీంతో నియోజకవర్గాల్లో క్యాడర్‌ను సమన్వయం చేసే నేతలే కరువయ్యారు. దీంతో వంశీచంద్ సమయాన్నంతా నేతలను సమన్వయం చేసేందుకే వెచ్చిస్తున్నారు. నియోజకవర్గ పరిధిలో ముస్లిం, మైనార్టీల ఓట్లు 2 లక్షలకు పైబడి ఉండటం, ఇటీవల పార్టీ అధినేత ప్రకటించిన ఏడాదికి రూ.72 వేల సాయం వంటి పథకాలు తన గెలుపునకు దోహదం చేస్తాయని ఆయన భావిస్తున్నారు.
టీఆర్‌ఎస్ గెలుపు జోష్
టీఆర్‌ఎస్ ఇక్కడ గెలుపుపై పూర్తి ధీమాతో ఉంది. 2009, తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ ఇక్కడి నుంచే పోటీచేసి గెలిచారు. అనంతరం ఆయన అసెంబ్లీకి వెళ్లగా 2014 ఎన్నికల్లో ఏకంగా కేంద్ర మంత్రి ఎస్.జైపాల్‌రెడ్డిపై జితేందర్‌రెడ్డిని అభ్యర్థిగా బరిలో నిలిపి కేసీఆర్ గెలిపించారు. ప్రస్తుత ఎన్నికల్లో శ్రీనివాస్‌రెడ్డిని పోటీకి దించి.. ఇక్కడ పార్టీ హ్యాట్రిక్ కొట్టేలా కేసీఆర్ ఇప్పటికే దిశానిర్ధేశం చేశారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఏడు నియోజకవర్గాలను భారీ మెజార్టీతో టీఆర్‌ఎస్ గెలుచుకుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొనే పార్టీ అభ్యర్థుల గెలుపునకు సహకరించలేదన్న కారణంతో ఏకంగా పార్టీ పార్లమెంటరీ నేతగా ఉన్న సిట్టింగ్ ఎంపీ జితేందర్‌రెడ్డికి లోక్‌సభ టికెట్ నిరాకరించేందుకూ సీఎం కేసీఆర్ వెనుకాడలేదు. జితేందర్‌రెడ్డిని కాదని పారిశ్రామికవేత్త మన్నె శ్రీనివాస్‌రెడ్డిని బరిలో నిలిపారు. రాజకీయ అనుభవం పెద్దగా లేకున్నా, ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో 2.30 లక్షలకు పైగా మెజార్టీతో ఎమ్మెల్యేలు గెలుపొందడం పార్టీ విజయావకాశాలపై ధీమా ఇస్తోంది. శ్రీనివాస్‌రెడ్డి ప్రచార బాధ్యతలను భుజానకెత్తుకున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఇప్పటికే అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో భేటీలు నిర్వహించి ముఖ్య కార్యకర్తలను సిద్ధం చేశారు. ప్రభుత్వం అమలు చేసిన పథకాల లబ్ధిదారులు 65 శాతానికి పైగా ఉండటం, వారంతా గత అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కే అనుకూలంగా ఓటేయడంతో ఈసారి సైతం కారు జోరు ఖాయమని ఆ పార్టీ వర్గాలు ధీమాగా ఉన్నాయి. దీనికి తోడు షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే ప్రతాప్‌రెడ్డి కాంగ్రెస్ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరడం కలిసి రానుంది. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో జడ్చర్లలో ఉద్ధండాపూర్ రిజర్వాయర్ ద్వారా నీరు, దేవరకద్రలో కర్వెన రిజర్వాయర్ నుంచి సాగునీరు అందించే పనులు కొనసాగుతుండటం, ఇప్పటికే నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల కింద సాగునీరు అందటం ఇక్కడ టీఆర్‌ఎస్‌కు కలిసొచ్చే అంశాలు.
‘కమలం’ గెలిస్తే అరుణకు అందలం!
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఈసారి ఇక్కడ పాగా వేసేందుకు వ్యూహం రచిస్తోంది. సుదీర్ఘ కసరత్తు తర్వాత లోక్‌సభ అభ్యర్థిని ఖరారు చేసిన ఆ పార్టీ.. ఎలాగైనా డీకే అరుణను గెలిపించుకునే పనిలో పడింది. మహబూబ్‌నగర్ స్థానం నుంచి 1999లో ఏపీ జితేందర్‌రెడ్డి బీజేపీ ఎంపీగా గెలుపొందారు. ఆయన ప్రస్తుతం తిరిగి బీజేపీ గూటికే చేరారు. ఆయన చేరికకు తోడు వ్యక్తిగత ఇమేజ్ ఉన్న అరుణకు, బీజేపీ బలం కూడా తోడవడంతో పాలమూరులో పాగా వేయగలుగుతామనే ధీమా ఆ పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. అరుణకు అనుచరగణం ప్రతి నియోజకవర్గంలో ఉంది. దేవరకద్ర నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి డోకూరు పవన్‌కుమార్‌రెడ్డి.. తాజాగా బీజేపీలో చేరారు. నారాయణపేట నియోజకవర్గ కాంగ్రెస్ నేత శివకుమార్‌రెడ్డి సైతం అరుణ వెంట ఉండే అవకాశాలున్నాయి. మక్తల్.. ఆమె సొంత నియోజకవర్గం కావడం, అక్కడ ఆమె వర్గం వారే ప్రధాన నేతలుగా ఉండటంతో ఆమె బలం పెరుగుతోంది. షాద్‌నగర్‌లో వీర్లపల్లి శంకర్ వర్గం, జడ్చర్లలో కాంగ్రెస్‌లోని మరో వర్గం సైతం అరుణకు అనుకూలంగా పని చేస్తున్నాయి. మహబూబ్‌నగర్ మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి తిరిగి బీజేపీలో చేరడం కొంత కలిసొచ్చే అంశం. అయితే సొంత అసెంబ్లీ నియోజకవర్గం గద్వాల ఈ లోక్‌సభ పరిధిలో లేకపోవడం, పార్టీ నేతలు, అనుబంధ సంఘాలతో మమేకమయ్యేందుకు తగిన సమయం లేకపోవడం ప్రతికూలం కానున్నాయి. అరుణ గెలిస్తే కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వంలో కేంద్ర మంత్రి కావడం ఖాయమని ఇప్పటికే బీజేపీ శ్రేణులు ప్రచారం మొదలుపెట్టాయి. దీనికి బలాన్నిస్తూ బీజేపీ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ సైతం డీకే అరుణ గెలిస్తే ఉన్నత పదవిలో ఉంటారంటూ చేసిన వ్యాఖ్యలను శ్రేణులు గుర్తు చేస్తున్నాయి.
కర్వెన పరిహారం ఇస్తే మేలు– చెన్నవెళ్లి మనెమ్మ, తాటిపత్రి
సర్వే నంబర్ 256లో రెండెకరాల భూమి కర్వెన ప్రాజెక్టు పనుల కోసం తీసుకున్నారు. 15వ ప్యాకేజీలో ఈ భూమి పోయింది. ఎమ్మార్వో, ఆర్డీవో, కలెక్టర్ వరకు పోయి ఫిర్యాదులిచ్చాను. ఇప్పటి వరకు ఎవరూ పట్టించుకోలేదు. ఇటు వ్యవసాయం చేసుకోలేక అటు డబ్బులు రాక ఇబ్బందిగా ఉంది. మాకు పరిహారం అందేలా చూడాలి.
చేనేతకు చేయూత – బండారి గోవిందు, చేనేత కార్మికుడు
20 ఏళ్లుగా నేత కార్మికుడిగా ఉన్నా. నాతో పాటు నా భార్య వృత్తీ అదే. రోజుకు ఒక్క చీర నేస్తే సేటు రూ.120 కూలీ ఇస్తడు. ఉండటానికి సొంత ఇల్లు లేదు. ఇద్దరు కుమారులు చదువుతున్నారు. మాకొచ్చే దాంతో వారిని ఎట్లా చదివించాలో ఆ దేవుడికే తెలుసు. ప్రభుత్వం చేనేత కార్మికులను అదుకోవాలి. లేదంటే మా బతుకులు మారేది కష్టమే.
సాగునీటి ప్రాజెక్టులు కావాలె.. – సూర్య నారాయణ, రైతు, కడంపల్లి, కోస్గి మండలం
బోరు బావిలో నీరు ఉండటంతో కనీసం తినడానికి గింజలొస్తాయని ఎకరంలో వరి వేశాను. రోజు రోజుకూ నీరు తగ్గిపోతోంది. పూర్తిగా నీరు రాకపోవడంతో పొట్టదశలో పొలం ఎండిపోయింది. పెట్టిన పెట్టుబడి కూడా రాకుండా వరి పంట కళ్ల ముందే ఎండిపోయింది. ఎండిన పంటను రోజు కొంత పశువులకు వేస్తున్నా.
‘సంగంబండ’ మా అండదండ – చంద్రప్ప, రైతు, రుద్రసముద్రం
బీమా ప్రాజెక్టులో భాగంగా సంగంబండ నిర్మాణం చేపట్టడంతో మాపొలాలకు సాగునీరు అందుతోంది. నాకు 3 ఎకరాల భూమి ఉంది. ఇన్నాళ్లుగా బీడుపడింది. దీంతోహైదరాబాద్‌కు కుటుంబంతో సహా వలసపోయాం. ఇప్పుడు సంగంబండ పుణ్య మాని మళ్లీ తిరిగొచ్చి సేద్యం చేసుకుంటున్నాం.
నేతన్న చీరలను ప్రభుత్వం కొనాలి – ఆడెం రత్నమ్మ, చేనేత కార్మికురాలు, నారాయణపేట
పాతికేళ్లుగా చేనేత కార్మికురాలిగా పనిచేస్తున్నా. చీర నేస్తే రూ.120 కూలి దొరుకుతుంది. మా ఆయన దత్తు కండెలను చుడతాడు. ఒక కండె చుడితే రూ.12 కూలి వస్తుంది. ఇలా రోజూ 5–6 కండెలు చుడితే కూలీపడదు..పొట్ట నిండదు. ప్రభుత్వం సబ్సిడీపై చీరలకు కావాల్సిన ముడిసరుకు ఇవ్వాలి. నేసిన చీరలను ప్రభుత్వమే ఆప్కో ద్వారా కొనుగోలు చేయాలి.
లక్ష్మీదేవునిపల్లి ప్రాజెక్టు నిర్మించాలి – గంగయ్య, రైతు, గుర్రంపల్లి, కొందుర్గు మండలం
ఎకరన్నరలో వరి, మొక్కజొన్న సాగు చేశా. బోర్లలో నీరు రాకపోవడంతో పంటలు ఎండిపోయా యి. అప్పులు చేసి పెట్టుబడి పెట్టా. పూర్తిగా నష్టం వాటిల్లింది. లక్ష్మీదేవునిపల్లి ప్రాజెక్టు నిర్మిస్తే పొలాలకు సాగు నీరం దుతుంది. భూగర్భ జలాలు పూర్తిగా అడుగం టి బోర్ల నుంచి నీరు రాకపోవడంతో పంటలను సాగు చేయలేకపోతున్నాం.
Comments
Please login to add a commentAdd a comment