సాక్షి, మహబూబ్‌నగర్: ఎన్నికల సంగ్రామానికి సమయం దగ్గరపడుతున్న కొద్దీ లోక్‌సభ అభ్యర్థుల్లో ఉత్కంఠ పెరుగుతోంది. మిగిలిన రెండ్రోజుల సమయాన్ని వృథా చేయకుండా ఉరుకులు, పరుగులు పెడుతున్నారు. రంగంలో దిగిన నాటినుంచి టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ పార్లమెంటు స్ధానాల్లో అవిశ్రాంతంగా ఎన్నికల ప్రచారంలో నిమగ్నమయ్యారు. పగలు ప్రచారం.. రాత్రిపూట మంతనాలు నిర్వహిస్తున్నారు.
సామాజిక వర్గాలపై దృష్టి
ఎన్నికల్లో సామాజిక వర్గాల ఓట్లే కీలకంగా మారిన నేపథ్యంలో వారి మద్దతు కూడగట్టుకునేందుకు కుల, మత పెద్దలతో అభ్యర్థులు, ముఖ్యనేతలు రహహస్య భేటీలు నిర్వహిస్తున్నారు. నియోజకవర్గాల వారీగా ఉన్న ఓట్లలో ఎక్కువ ఓట్లు కలిగిన సామాజిక వర్గాలపై దృష్టిసారించిన అభ్యర్థులు వారిని ఆకట్టుకునేందుకు ముందస్తు హామీలు ఇస్తున్నారు. కుల, మత పెద్దలతో సమావేశం నిర్వహించిన మరుసటి రోజే వారి ప్రాంతాల్లో ప్రచారాలు చేస్తున్నారు. ఓ పక్క గెలుపు వ్యూహాలు రచిస్తూనే మరోపక్క ఇతర పార్టీ నేతలు, కార్యకర్తలను తమ పార్టీల్లో చేర్పించుకుంటున్నారు. పోలింగ్‌కు నాలుగు రోజులు మాత్రమే సమయం ఉండటంతో ఇప్పటికీ చేరికల పర్వం కొనసాగుతూనే ఉంది.
దీంతో ఆఖరి నిమిషంలో ఎవరు ఏ పార్టీలో చేరుతారు..? ఏ సామాజిక వర్గం ఎవరికి మద్దతు ఇస్తుందో తెలియక అభ్యర్థులు తలలు పట్టుకుంటున్నారు. రానున్న నాలుగు రోజులు కీలకంగా మారిన నేపథ్యంలో అన్ని పార్టీలు అప్రమత్తంగా ఉంటూ ఓట్లర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు ము మ్మరం చేశాయి. వీటితో పాటు అన్ని పార్టీలు సోషల్ మీడియాను ప్రచారస్త్రాంగా వాడుకుంటున్నా యి. వాట్సప్, యూట్యూబ్, ఫేస్‌బుక్, ట్వి ట్టర్, ఇన్‌స్ట్రాగాంలతో ప్రచారాలు నిర్వహిస్తున్నా యి. ఫోన్‌కాల్స్, ఎస్‌ఎంఎస్‌లతో నేరుగా ఓటర్లను ఆకర్శించేందుకు విశ్వప్రయత్నలు చేస్తున్నాయి.
అగ్రనేతల పర్యటనలు
ఇప్పటికే ఆయా పార్టీల అభ్యర్థులకు మద్దతుగా మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ లోక్‌సభ స్ధానాల్లో నిర్వహించిన బహిరంగ సభల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, సీఎం కేసీఆర్, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. ఎట్టి పరిస్థితుల్లో రెండు లోక్‌సభ స్ధానాలు కైవసం చేసుకోవాలని అన్ని పార్టీలూ వ్యూహప్రతివ్యూహాలు రచిస్తున్నాయి. ఉదయం, సాయంత్రం సభలు, సమావేశాలు, రోడ్‌షోలు, ఇంటింటి ప్రచారాలు నిర్వహిస్తూ ఓటర్ల మద్దతు కోరే ప్రయత్నం చేస్తున్నారు. తాము గెలిస్తే చేయబోయే అభివృద్ధి పనులు, కార్యక్రమాలను ఓటర్లకు వి వరిస్తున్నారు. అయితే రేపటితో ప్రచారపర్వానికి తెరపడనుండడంతో ఆ తర్వాత అనుసరించాల్సిన వ్యూహాలపై ఇప్పట్నుంచే దృష్టిసారించారు.
ప్రచారంలో దూసుకెళ్తున్న కారు
అధికార టీఆర్‌ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తోంది. ఉమ్మడి జిల్లాలో అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆ పార్టీ ఎమ్మెల్యేలే ఉండడం, ఇటీవల జరిగిన స్ధానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు చెందిన వాళ్లే ఎక్కువ మంది సర్పంచ్‌లుగా గెలుపొందడం ఆ పార్టీ ఎంపీ అభ్యర్థులకు కలిసొచ్చిన అంశంగా మారింది. దీంతో పాటు గత ఐదేళ్లలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలపై విస్తృత ప్రచారం చేస్తూనే తెలంగాణలో 16 ఎంపీ సీట్లు గెలుపొందడం ద్వారా కేంద్రంలో కేసీఆర్ పోషించనున్న పాత్రను మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ప్రజలకు వివరిస్తున్నారు.
ఇప్పటికే మహబూబ్‌నగర్ లోక్‌సభ స్ధానానికి రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, నాగర్‌కర్నూల్‌కు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డికి ఇన్‌చార్జ్ బాధ్యతలు అప్పగించిన కేసీఆర్ ఎమ్మెల్యేలు, మంత్రులతో కలిసి సమన్వయం పని చేసి టీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించుకోవాలని ఆదేశించారు.
అధినేత ఆదేశాల మేరకు ఎంపీ అభ్యర్థులతో, మంత్రులు, ఎమ్మెల్యేలందరూ ఒక్కస్థానం కూడా చేజారనీయకుండా తమతమ నియోజకవర్గాల్లో సభలు, సమావేశాలు, రోడ్‌షోలు, నిర్వహిస్తూ ప్రచారంలో బిజీగా గడుపుతున్నారు. ఇదే క్రమంలో నారాయణపేట అసెంబ్లీ సెగ్మెంట్లో ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డికి మద్దతుగా రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్‌అలీ నేడు ప్రచారం నిర్వహించనున్నారు.
ఔర్ ఏక్ బార్.. మోదీ సర్కార్
ఇదే నినాదంతో ముందుకెళ్తున్న బీజేపీ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ స్థానాల నుంచి ఆ పార్టీ తరుఫున బరిలో ఉన్న డీకె అరుణ, బంగారు శ్రుతి తమదైన శైలీలో ప్రచారం నిర్వహిస్తున్నారు. వారికి మద్దతుగా ఆయా పార్టీ జిల్లా నాయకులు ప్రచారంలో పాల్గొంటున్నారు. బీజేపీతోనే దేశరక్షణ, భద్రత సాధ్యమని ప్రచారంలో చేస్తున్న ప్రసంగాలిస్తున్నారు. తాము గెలిస్తే స్థానిక సమస్యలు పరిష్కరిస్తామని హామీలు ఇస్తున్నారు. అభ్యర్థులకు మద్దతుగా నాగర్‌కర్నూల్ లోక్‌సభ పరిధిలోని గద్వాలలో ఆదివారం జరిగిన ఎన్నికల ప్రచార బహిరంగ సభలో కేంద్ర వ్యవసాయ శాఖ సహాయమంత్రి పురుషోత్తం రూపాల పాల్గొన్నారు. నేడు మహబూబ్‌నగర్ పరిధిలోని దేవరకద్రలో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ పాల్గొననున్నారు.
కాంగి‘రేసు’
ఎన్నికల ప్రచార రేసులో కాంగ్రెస్ అభ్యర్థులు పరుగులు పెడుతున్నారు. మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ స్థానాల నుంచి బరిలో ఉన్న చల్లా వంశీచందర్‌రెడ్డి, మల్లురవి పార్టీ సంప్రదాయ ఓట్లపై దృష్టిసారించారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్‌ఎస్ వైఫల్యాలను ఎండగడుతూనే తమను గెలిపిస్తే పార్లమెంటు సెగ్మెంట్‌లో చేపట్టబోయే అభివృద్ధి పనులను వివరిస్తున్నారు. ముఖ్యంగా స్ధానికంగా పరిశ్రమలు ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథక పనులు, జాతీయ హోదా, న్యాయ్ పథకం పేరిట పేదలకు ఏడాదికి రూ. 72వేలు, రైతులకు రూ. 2లక్షల రుణమాఫీ వంటి అంశాలపై విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment