జితేందర్‌రెడ్డి,జైపాల్‌రెడ్డి
ఇప్పటి దాకా మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానానికి 16సార్లు ఎన్నికలు జరిగితే 11సార్లు కాంగ్రెస్, ఒకసారి బీజేపీ, జనతా పార్టీ, టీఆర్‌ఎస్ రెండేసి మార్లు చొప్పున గెలిచాయి. 2009 లోక్‌సభ ఎన్నికల్లో ప్రస్తుత ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు గెలుపొందగా, తదనంతరం కాంగ్రెస్ సీనియర్ నేత ఎస్.జైపాల్‌రెడ్డిపై టీఆర్‌ఎస్ తరఫున జితేందర్‌రెడ్డి గెలుపొందారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో టీఆర్‌ఎస్ విజయఢంకా మోగించింది. మరోమారు ఈ స్థానాన్ని చేజిక్కించుకునేందుకు టీఆర్‌ఎస్ కసరత్తు చేస్తోంది.
శాసించనున్న బీసీ ఓటర్లు...
మహబూబ్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఏడు శాసనసభ నియోజకవర్గాలుండగా, 15 లక్షల ఓటర్లున్నారు. వీరిలో మహిళా ఓటర్ల సంఖ్యే అధికం. కొడంగల్, నారాయణపేట, మక్తల్, దేవరకద్ర నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లే ఎక్కువ ఉన్నారు. నియోజకవర్గ పరిధిలో బీసీలు ఎటుపక్క ఉంటే పార్టీల విజయం వారినే వరించనుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొనే బీసీ నాయకుడు, ఉద్యమ, ఉద్యోగ సంఘాల నేత శ్రీనివాస్‌గౌడ్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి పదవి కట్టబెట్టారు. ఇది టీఆర్‌ఎస్‌కు అనుకూలించే అంశం. ఇక ఏడుకు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటమి పాలైన కాంగ్రెస్, పార్లమెంట్ ఎన్నికల్లో పట్టు నిలుపుకోవాలనే పట్టుదలతో ఉంది. పార్టీలో ఐక్యత కొరవడటం, పార్టీని నడిపించే సరైన నాయకత్వం లేకపోవడం, అభ్యర్థి ఎంపికలోనే అయోమయం ఆ పార్టీని బలహీనం చేస్తోంది. ఈసారి ప్రధాని నరేంద్రమోదీ హవాని ఉపయోగించుకుని సత్తా చాటాలని భాజపా ఉవ్విళ్లూరుతోంది. గత చరిత్ర చూస్తే ఈ నియోజకవర్గం ఢిల్లీ స్థాయిలో ఓ వెలుగు వెలిగిన నేతలకు చిరునామాగా నిలుస్తోంది.
గెలిస్తే ఢిల్లీలో చక్రం తిప్పుడే..
మహబూబ్‌నగర్ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించిన ఎంపీల్లో ముగ్గురు నేతలు కేంద్రంలో చక్రం తిప్పారు. కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున్ 1977లో తన సొంత పార్లమెంట్ స్థానం మెదక్‌ను మాజీ ప్రధాని ఇందిర కోసం వదులుకుని, మహబూబ్‌నగర్‌కు తొలిసారి వచ్చారు. అక్కడి నుంచే నాలుగుమార్లు పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. ఈయన ఇందిరాగాంధీ ప్రభుత్వంలో రైల్వేమంత్రిగా, రాజీవ్‌గాంధీ హయాంలో సాంఘిక సంక్షేమం, విద్యా శాఖ మంత్రిగా, పీవీ నరసింహారావు హయాంలో సమాచార, ప్రసార శాఖ మంత్రిగా పనిచేశారు. ఇదే నియోజకవర్గం నుంచి 1971, 1997 ఎన్నికల్లో జనతా పార్టీ తరఫున గెలిచిన ఎస్.జైపాల్‌రెడ్డి 1998 కాలంలో ఐకే గుజ్రాల్ ప్రభుత్వంలో సమాచార, ప్రసార శాఖ మంత్రిగా పనిచేయగా, అనంతరం 2004లో మిర్యాలగూడ, 2009లో చేవెళ్ల నుంచి గెలిచి.. మన్మోహన్‌సింగ్ ప్రభుత్వంలో అర్బన్ డెవలప్‌మెంట్, పెట్రోలియం శాఖల మంత్రిగా ఉన్నారు. ఇక 2009లో ఇదే నియోజకవర్గం నుంచి గెలిచిన ప్రస్తుత∙ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని మన్మోహన్‌సింగ్ ప్రభుత్వంలో కార్మిక శాఖ మంత్రిగా సేవలందించారు. ఇక ప్రస్తుత ఎంపీ జితేందర్‌రెడ్డి టీఆర్‌ఎస్ పార్టీ పార్లమెంటరీ నేతగా వ్యవహరించారు.
దూసుకుపోతున్న కారు..
ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో భారీ మెజార్జీతో టీఆర్‌ఎస్ అభ్యర్థులు క్లీన్‌స్వీప్ చేయడంతో అదే ఉత్సాహంతో పార్లమెంట్ ఎన్నికలకు ఆ పార్టీ సిద్ధమవుతోంది. ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో కలిపి టీఆర్‌ఎస్ అభ్యర్థులకు 2.70 లక్షలకు పైగా మెజార్టీ వచ్చింది. దీంతో ఇక్కడ తమ అభ్యర్థి గెలుపుపై పార్టీ ధీమాగా ఉంది. ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు 65 శాతానికి పైగా ఉండటం, స్థానికంగా ప్రభా వితం చేయగల ప్రతిపక్ష నాయకులు లేకపోవడం టీఆర్‌ఎస్‌కు కలిసి రానుంది. అయితే అన్ని పక్షాలకు చెందిన నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరడం, నాయకుల మధ్య సమన్వయ లోపం పార్టీకి కొంత ఇబ్బందిగా మారింది. ప్రస్తుత ఎంపీ జితేందర్‌రెడ్డికి తిరిగి టికెట్టిచ్చే అవకాశాల్లేవనే సంకేతాలున్నాయి. ఆయన అభ్యర్థిత్వాన్ని షాద్‌నగర్, మహబూబ్‌నగర్, నారాయణపేట, మక్తల్ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు వ్యతిరేకిస్తున్నట్లుగా, ఇప్పటికే అందుకు సంబంధించి లేఖలను పార్టీ అధినేతకు అందించినట్లుగా తెలుస్తోంది. దీంతో ఆయన స్థానంలో ఎంఎస్‌ఎన్ సంస్థల అధినేత ఎంఎస్ రెడ్డిని బరిలో దించుతారనే ప్రచారం సాగు తోంది. దీనిపై ఒకట్రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
కదలిక కరువైన హస్తం...
అసెంబ్లీ ఎన్నికల ఓటమితో నైరాశ్యంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో దాని ప్రభావం నుంచి తప్పించుకోలేకపోతోంది. గతంలో ఏకంగా 11మార్లు ఈ స్థానంలో విజయబావుటా ఎగురవేసిన కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం అభ్యర్థిగా ఎవరిని నిలపాలన్న దానిపైనే సందిగ్ధతలో పడింది. గత పార్లమెంట్ ఎన్నికల్లో 3 వేల ఓట్ల వ్యత్యాసంతోనే ఓటమి చవిచూసినప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల్లో తిరిగి ఇక్కడి నుంచి పోటీకి కేంద్ర మాజీ మంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి విముఖత చూపుతున్నారు. దీంతో పార్టీ సీనియర్ నేతలను ఇక్కడి నుంచి బరిలో నిలపాలని పార్టీ భావిస్తోంది. వినిపిస్తున్న పేర్లలో డీకే అరుణ, వంశీ, ప్రతాప్‌రెడ్డితో పాటు దేవరకద్ర పవన్‌కుమార్‌రెడ్డి, అనిరుధ్‌రెడ్డిలో ఒకరిని బరిలో నిలపాలని భావిస్తోంది. అయితే పార్టీ అభ్యర్థులెవరూ ఈ పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలవకపోవడం, పార్టీలో నాయకత్వ, సమన్వయ లోపాలతో పోటీపై మల్లగుల్లాలు పడుతున్నారు. అయితే డీకే, వంశీచంద్‌రెడ్డిలో ఒకరిని బరిలో నిలపొచ్చని తెలుస్తోంది.
కమలం ‘వికాస’ యత్నాలు
గత అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీ జాతీ య అధ్యక్షుడు అమిత్‌షా మహబూబ్‌నగర్ జిల్లా నుంచే ఎన్నికల శంఖారావం పూరించినా ఆశించిన ఫలితాలు రాకపోగా డిపాజిట్లు కూడా దక్కలేదు. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల్లో ఉనికిని చాటుకోవడంపైనే బీజేపీ దృష్టిపెట్టింది. కార్యకర్తల్లో ఉన్న అభిమానాన్ని అనుకూలంగా మార్చుకొని పార్టీ బలాన్ని పెంచుకునేందుకు వ్యూహరచన చేస్తోంది. అయితే ఆధిపత్య పోరు పార్టీ క్యాడర్‌ను సతమతం చేస్తోంది. ఎవరివైపు వెళ్తే తమ భవిష్యత్తు ఏ మూలకు పడిపోతుందోననే ఆందోళన పార్టీ క్యాడర్‌లో వ్యక్తమవుతోంది. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ అధిష్టానం పదేపదే సూచిస్తున్నా, అది జరగడం లేదు. రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలులో లోపాలను ఎత్తి చూపేందుకు సైతం బీజేపీ నాయకులు ముందుకు రావడం లేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఈ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పార్టీ కోశాధికారి వి.శాంతికుమార్‌ను బరిలో నిలుపుతారని ప్రచారం జరుగుతోంది. అందుకు తగినట్టుగా ఆయన అన్ని నియోజకవర్గాల ఇన్‌చార్జిలను సమన్వయం చేసుకుంటున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీపై ప్రజలకున్న నమ్మకాన్ని, ఆదరణను నమ్ము కొని ఆ పార్టీ ముందుకు సాగుతోంది.
ఎన్నికల్లో ప్రభావం చూపే అంశాలు...
♦ నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకం చేపట్టాలి
♦ చేనేతకు హ్యాండ్లూమ్ పార్క్ ఏర్పాటు
♦ పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా
♦ బీడీ కార్మికులకు ఈఎస్‌ఐ ఆస్పత్రి నిర్మాణం
♦ కేంద్రీయ విద్యాలయానికి శాశ్వత భవనాల నిర్మాణం
♦ వలసల నివారణకు పరిశ్రమల ఏర్పాటు
లోక్‌సభ ఓటర్లు
పురుషులు 7,50,289
మహిళలు 7,51,577
ఇతరులు 127
మొత్తం 15,01,993
కారు..నీరు
పూర్వ ఉమ్మడి జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులయిన కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా, కోయిల్‌సాగర్ వంటి ప్రాజెక్టుల కింద ఇప్పటికే 6.5 లక్షల ఎకరాల ఆయకట్టు సాగులోకి వచ్చింది. ఈ విషయంలో రైతులు కూడా సంతృప్తిగానే ఉన్నారు. కొన్ని ప్రాంతాల్లో పుష్కలంగా సాగునీరు అందుతున్న కారణంగా రెండు పంటలు పండిస్తున్నట్టు కూడా చెబుతున్నారు. దీంతో ఈ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితికి సాగునీటి అంశమే ప్రధాన ప్రచారాస్త్రం కానున్నది. - సోమన్నగారి రాజశేఖర్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment