
న్యూఢిల్లీ: రాజ్యసభలో సంఖ్యాపరంగా ప్రతిపక్షం కంటే వెనుకబడిన అధికార బీజేపీ బలం పెంచుకునే ప్రయత్నాల్లో పడింది. ఇందుకోసం గత కొన్ని రోజులుగా ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎంపీలను మచ్చిక చేసుకుంటోంది. దీని ఫలితంగానే రాజ్యసభలో తెలుగుదేశం పార్టీకి ఉన్న ఆరుగురు సభ్యుల్లో నలుగురితోపాటు సమాజ్‌వాదీ పార్టీ సభ్యుడు, మాజీ ప్రధాని చంద్రశేఖర్ కొడుకు నీరజ్ శేఖర్ ఇటీవల కాషాయ కండువా కప్పుకున్నారు. సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ వైఖరితో తీవ్ర అసంతృప్తితో ఉన్న మరి కొందరు కూడా త్వరలో బీజేపీలో చేరనున్నట్లు నీరజ్ శేఖర్ అంటున్నారు. ప్రతిపక్షాలకు చెందిన ఇంకొందరు కూడా ‘కాషాయ’బాటలో నడిచేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఊహాగానాలు వస్తున్నాయి.
245 మంది సభ్యులున్న రాజ్యసభలో ప్రస్తుతం బీజేపీ బలం 78కి చేరుకుంది. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలతో వచ్చే ఏడాది కల్లా రాజ్యసభలో అధికార ఎన్‌డీఏకి మెజారిటీ దక్కే అవకాశముంది. తాజా పరిణామాల నేపథ్యంలో ఆలోగానే బీజేపీకి రాజ్యసభలో పైచేయి సాధించే అవకాశాలున్నాయంటున్నారు. అయితే, ఎన్‌డీఏలోని జేడీయూ వంటి పార్టీలు బీజేపీ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ట్రిపుల్ తలాక్, పౌరసత్వ బిల్లు వంటి కీలక అంశాలపై ప్రభుత్వానికి మద్దతు ఇవ్వకపోయే అవకాశాలున్నాయి. ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకే బలం పెంచుకునేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నామని బీజేపీ నేత ఒకరు అన్నారు. ఇందులో భాగంగానే ఒడిశాలోని మూడు రాజ్యసభ సీట్లలో ఒకటి కైవసం చేసుకునేందుకు ఆ రాష్ట్ర సీఎం, బీజేడీ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్‌తో ప్రధాని మోదీ సహా పలువురు కీలక నేతలు మంతనాలు సాగిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment