Saffron Alliance
-
ప్రతిపక్ష ఎంపీలపై బీజేపీ వల!
న్యూఢిల్లీ: రాజ్యసభలో సంఖ్యాపరంగా ప్రతిపక్షం కంటే వెనుకబడిన అధికార బీజేపీ బలం పెంచుకునే ప్రయత్నాల్లో పడింది. ఇందుకోసం గత కొన్ని రోజులుగా ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎంపీలను మచ్చిక చేసుకుంటోంది. దీని ఫలితంగానే రాజ్యసభలో తెలుగుదేశం పార్టీకి ఉన్న ఆరుగురు సభ్యుల్లో నలుగురితోపాటు సమాజ్వాదీ పార్టీ సభ్యుడు, మాజీ ప్రధాని చంద్రశేఖర్ కొడుకు నీరజ్ శేఖర్ ఇటీవల కాషాయ కండువా కప్పుకున్నారు. సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ వైఖరితో తీవ్ర అసంతృప్తితో ఉన్న మరి కొందరు కూడా త్వరలో బీజేపీలో చేరనున్నట్లు నీరజ్ శేఖర్ అంటున్నారు. ప్రతిపక్షాలకు చెందిన ఇంకొందరు కూడా ‘కాషాయ’బాటలో నడిచేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఊహాగానాలు వస్తున్నాయి. 245 మంది సభ్యులున్న రాజ్యసభలో ప్రస్తుతం బీజేపీ బలం 78కి చేరుకుంది. ఇటీవలి లోక్సభ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలతో వచ్చే ఏడాది కల్లా రాజ్యసభలో అధికార ఎన్డీఏకి మెజారిటీ దక్కే అవకాశముంది. తాజా పరిణామాల నేపథ్యంలో ఆలోగానే బీజేపీకి రాజ్యసభలో పైచేయి సాధించే అవకాశాలున్నాయంటున్నారు. అయితే, ఎన్డీఏలోని జేడీయూ వంటి పార్టీలు బీజేపీ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ట్రిపుల్ తలాక్, పౌరసత్వ బిల్లు వంటి కీలక అంశాలపై ప్రభుత్వానికి మద్దతు ఇవ్వకపోయే అవకాశాలున్నాయి. ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకే బలం పెంచుకునేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నామని బీజేపీ నేత ఒకరు అన్నారు. ఇందులో భాగంగానే ఒడిశాలోని మూడు రాజ్యసభ సీట్లలో ఒకటి కైవసం చేసుకునేందుకు ఆ రాష్ట్ర సీఎం, బీజేడీ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్తో ప్రధాని మోదీ సహా పలువురు కీలక నేతలు మంతనాలు సాగిస్తున్నారు. -
శివసేన తొలిజాబితా విడుదల
సాక్షి, ముంబై: శివసేన లోకసభ అభ్యర్థుల తొలి జాబితాను శుక్రవారం ప్రకటించింది. తొలిజాబితాలో మొత్తం 15 మంది అభ్యర్థులను ప్రకటించగా వీరిలో ఊహించినట్టుగానే శివసేన సీనియర్ నాయకుడు మనోహర్ జోషీకి బదులు రాహుల్ శెవాలేను దక్షిణ మధ్య ముంబై నుంచి అభ్యర్థిగా ప్రకటించారు. దాదర్లోని శివసేన ప్రధాన కార్యాలయంలో శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే ఈ జాబితాను ప్రకటించారు. గురువారం ఎన్సీపీతోపాటు బీజేపీ తమ తొలిజాబితాను ప్రకటించిన సంగతి తెలిసిందే. వీరు ప్రకటించిన మరుసటి రోజునే శివసేన కూడా తమ అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల శంఖారావం పూరించిందని చెప్పవచ్చు. ఇదిలా ఉండగా మహాకూటమిలో మిత్రపక్షాలైన స్వాభిమానీ శేత్కారీ సంఘటన కోసం శివసేన హాతకణంగలే నియోజకవర్గం, రిపబ్లికన్ పార్టీ (ఆర్పీఐ) కోసం సాంగ్లీ నియోజకవర్గాన్ని కేటాయించింది. కాగా, మిగతా అభ్యర్థుల జాబితాను కూడా తొందర్లోనే ప్రకటిస్తామని ఉద్ధవ్ ఠాక్రే పేర్కొన్నారు. అభ్యర్థుల వివరాలివే.. బుల్డాణా : ప్రతాపరావ్ జాధవ్ రాంటెక్: కృపాల్ తుమానే అమరావతి: ఆనంద్రావ్ అడసూల్ యావత్మాల్-వాషీం: భావనా గవలీ హింగోళి : సుభాష్ వాంఖేడే పర్భణీ: సంజయ్ జాధవ్ (బండు) ఔరంగాబాద్: చంద్రకాంత్ శిందే కళ్యాణ్: శ్రీకాంత్ షిందే ఠాణే: రాజన్ విచారే వాయివ్య ముంబై : గజానన్ కీర్తికర్ దక్షిణ ముంబై: అరవింద్ సావంత్ దక్షిణమధ్య ముంబై : రాహుల్ శెవాలే రాయిగఢ్ : అనంత్ గీతే శిరూర్ : శివాజీరావ్ ఆడలరావ్- పాటిల్, రత్నగిరి-సింధుదుర్గా : వినాయక్ రావుత్