
వాళ్లకూ వీళ్లకూ 'ఓ' ఒకటే తేడా అట...
న్యూఢిల్లీ: విదేశీ వ్యవహారాల శాఖ సహాయమంత్రి జనరల్ వీకే సింగ్ తన వ్యాఖ్యలతో మరో వివాదానికి తెర లేపారు. మీడియా నుద్దేశించి ప్రెస్టిస్ట్యూట్స్ అంటూ ట్విట్టర్లో కామెంట్ పోస్ట్ చేశారు. ''presstitutes నుంచి మనం ఇంకేం ఆశించగలం.. అయినా అర్ణబ్ ఇంతకుముందు E స్థానంలో Oని ఊహించుకుంటున్నారు'' అంటూ.. మీడియాని ఉద్దేశించి వ్యాఖ్యానించడంతో పెద్ద దుమారం రేగుతోంది. ప్రతిపక్షాలు, మీడియా సంస్థలు కేంద్రమంత్రిపై తీవ్రస్ధాయిలో ధ్వజమెత్తాయి.
బ్రాడ్కాస్ట్ ఎడిటర్స్ అసోసియేషన్ మంత్రి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది. ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేలా ఉన్న మంత్రి వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎన్కె సింగ్ చెప్పారు. కేంద్రమంత్రివర్గ సభ్యుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. మరోవైపు కాంగ్రెస్ నాయకులు మనీష్ తివారీ, షకీల్ అహ్మద్ మంత్రి వ్యాఖ్యలకు ప్రధాని బాధ్యత వహించాలంటూ మోదీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. తక్షణమే వీకేసింగ్ను మంత్రి పదవి నుంచి తొలగించాలని వారు డిమాండ్ చేశారు.
ఎన్సీపీ నాయకుడు తారిఖ్ అన్వర్ దీనిపై స్పందిస్తూ మీడియాపై ఇలాంటి వ్యాఖ్యలు మంత్రికి తగవన్నారు. ఇప్పటికైనా ప్రధాని స్పందించాలన్నారు. తరచూ ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వివాదం సృష్టిస్తున్న మంత్రిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నైతికతను మంటగలిపేలా వీకే సింగ్ వ్యాఖ్యలు ఉన్నాయని ఎన్‌సీపీ, ప్రజాస్వామ్యపు విలువను కనీసం అర్థచేసుకోలేని వ్యక్తి అని సమాజ్‌వాదీ పార్టీ, బాధ్యతారహితమైన వ్యాఖ్యలని జేడీయూ పార్టీ తీవ్రంగా విమర్శించాయి.
యెమెన్‌లో చిక్కుకున్న భారతీయులను తరలించడానికి జరుగుతున్న ఏర్పాట్లను పర్యవేక్షించడానికి వీకే సింగ్ జిబౌటీ వెళ్లిన సంగతి తెలిసిందే. పాకిస్ధానీ డే సెలబ్రేషన్స్‌కు హాజరవడంపై మీడియాలో పలు కథనాలు రావడంతో మీడియాను ఉద్దేశించి వీకే సింగ్ పైవ్యాఖ్యలు చేశారని సమాచారం.
Friends what do you you expect from presstitutes. Last time Arnab thought there was 'O' in place of 'E' #TimesNowDisaster
— Vijay Kumar Singh (@Gen_VKSingh) April 7, 2015